Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasi pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

 జరిగినకథ: ఆర్మీ నుండి ‘ప్రి-మెచ్యూర్ రిటైర్మెంట్‘ తీసుకోడానికి డిసైడ్ అవుతారు చంద్రకళ నాన్నగారు. సమ్మర్ అయ్యాక అఫీషియల్ గా ఆర్మీ నుండి రిటైర్ అవుతానని, తన సివిల్ పోస్టింగ్ కూడా చెన్నైకి దగ్గరిగా వచ్చేలా ప్రయత్నాలు మొదలు పెడతానన్న  విషయం భూషణ్ గారితో చర్చిస్తారు. .‘రాగం-తానం-పల్లవి’ టెలి-ఫిలిం షూటింగ్ మొదటి రోజు, భూషణ్ గారి  స్టూడియోలోనే ప్రారంభ పూజ చేస్తారు.  ఆ షూటింగ్ జరిగిన రెండు రోజుల పాటు కోటమ్మత్త కూడా షూటింగ్ చూడ్డానికి, వస్తుంది. ఆ తరువాత...

ఇదంతా వింటున్న భూషణ్ అంకుల్ కలగజేసుకున్నారు. 

“విక్రమ్, నేను చంద్రకళ మానేజర్ ని కూడా.  వెంటనే తనకి ల్యాప్ టాప్ సెటప్ చేయిస్తాను.  త్వరలో మీతో కమ్యూనికేట్  చేసేలా చూస్తాను.  ఐ ప్రామిస్,” అన్నారు.

“డాన్స్, చదువుతో చాలా బిజీగా ఉంటుంది. చంద్రకళకి టైం ఎక్కడుంది?” అంటూ నవ్వేసింది నీరూ ఆంటి.

వాళ్ళిద్దరూ రాణి దుడుకు తనం కప్పి పుచ్చబోయారు. వాళ్ళని ఇలాగే ఇంతకు ముందు కూడా ఇబ్బంది పెట్టింది, రాణి.  అమ్మ, నాన్న, కోటమ్మత్త, వినోద్, తేజశ్విని మేడమ్ సహా, ఇదంతా గమనిస్తున్నారు.

**

పార్టీ నుండి ఇంటికొచ్చి, రాణి అన్న మాటలు తలుచుకుంటూ, బట్టలు మార్చుకున్నాను. హాల్లోకి వెళ్లి, టి.వి చూస్తున్న నాన్న పక్కనే సోఫాలో కూర్చున్నాను. 

లేట్-నైట్  న్యూస్ చూడ్డం నాన్నతో పాటు నాకూ అలవాటయింది. 

కాసేపటికి కోటమ్మత్త, అమ్మ, వినోద్ కూడా వచ్చి చుట్టూ చేరారు.

ఏదో చెప్పాలన్న ఆదుర్దా కనబడింది  కోటమ్మత్తలో....

“ఏందమ్మా!  వాళ్ళ పిల్ల భలే కుళ్ళు దానిలా ఉందే?  మన అమ్మాయి మీద బాగా ఏడుపే.  ఇంగ్లీషులో ఏమందో గాని, మన కళని అవమానించిందని, అందుకే ఆ అమెరికా అబ్బాయి తిరిగి ఆ పిల్లని కోపడ్డాడని మాత్రం అర్ధమవుతూనే వుంది,” అనేసింది కూడా అత్త.

“అవును, మీరన్నది నిజమే,” క్షణమాగింది అమ్మ.

“మన అమ్మాయంటే, ఎందుకంత అసహనం,”  అడిగింది అత్త ...

“ఏం లేదు వదినా, మన చంద్రకళ అంటే, భూషణ్ గారు ప్రేమగా ఉంటారని, డాన్స్ విషయంలో ప్రోత్సహిస్తారని, కుళ్ళుకుంటుంది.

మరి ఉంటదిగా! ఆ అమ్మాయి కూడా చిన్నదేగా!” అంది అమ్మ. 

**

సెలవులో ఉండడంతో, పాత ఫర్నిచర్ తీసేసి, కొత్తవి పెట్టించే పనిలో పడ్డారు, నాన్న.  సోఫా సెట్ నుండి, బెడ్-రూమ్స్ వరకు ఓపిగ్గా సెలెక్ట్ చేసి, నాలుగు రోజుల పాటు, అందంగా అన్నీ సర్దించారు...

ఆ పని అవుతూనే,  రెండు రోజులు కోటమ్మత్తతో పాలెం వెళ్ళొచ్చారు.

...అక్కడ చుట్టాల వైఖరి ఇది వరకులా లేదని, అమ్మ దగ్గర బాధపడ్డారు.  నానమ్మ, తాత బాగా నీరస పడ్డారని... తన అక్కల పిల్లలు ఎదురు తిరిగి,  ఆస్తులు, పొలాలు, మిద్దెలు కూడా ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని  చెప్పుకొచ్చారు.....

మానసికంగా కూడా అలిసి పోయున్న నాన్న,  ప్రయాణంతో మరింత నీరసించి పోవడం, అమ్మని కంగారు పెట్టింది..... అందుకేనేమో, రాత్రి భోజనం వడ్డిస్తూ కూడా  ముభావంగా ఉంది.

అమ్మని  గమనిస్తూ, తినడం మొదలుపెట్టాను.

“ఇంతింత కూరలు తినలేను శారదా,”  అంటున్న నాన్న మీద చిరాకు పడింది.

“వంకలు పెట్టకుండా, వడ్డించింది తినండి.  మీరు త్వరగా కోలుకోవడం ముఖ్యం. ఈలోగా  చంద్ర డాన్స్ విషయంగా ఓ ముఖ్యమైన పని కూడా చేయాలి మనం....దాని గురించి మీతో మాట్లాడాలి," అంది అమ్మ,

తన పళ్ళెంలో వడ్డించుకుంటూ..   

**

ఆ మరునాడు, మాస్టారి గారిని కలిసి నా కూచిపూడి రంగప్రవేశం గురించి మాట్లాడింది అమ్మ. వీలయినంత త్వరగా ఆ కార్యక్రమం  జరిపించేయాలని ఆయన్ని కోరింది.

‘అమ్మ అన్ని విషయాల్లో, ఇలా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ వేస్తుంది’ అనుకున్నాను.

‘సంభవామి యుగే యుగే’ అని రంగప్రవేశ కార్యక్రమానికి టైటిల్ నిర్ధారించి, ప్రాక్టీసులు మొదలు పెట్టించేయమంది..

అమ్మ చెప్పేది విని, కాసేపు ఆలోచించారు, మాస్టారు గారు. నాట్యాంశాల ఎంపిక, కూర్పు అయ్యాక, త్వరలోనే ప్రాక్టీసులు మొదలు పెట్టుకుందామన్నారు.  

ప్రోగ్రాముకి సిద్దమవడానికి, ఎనిమిది నెలల సమయమన్నా ఉండాలన్నారు....

రాబోయే ఉగాది పండుగ సమయానికి ఏర్పాట్లు చేసుకోమన్నారు.

** 

ఆ మరునాడు నన్ను ‘యోగ’ శిక్షణలో ఎన్రోల్ చేసి, ల్యాప్ టాప్  ఆర్డర్ చేసారు నాన్న. సాయంత్రం అమ్మతో పాటు ‘టీ’ తాగుతూ,  ‘రంగప్రవేశం’  ఖర్చులు అంచనా వేయసాగారు.

“అయినా మన చంద్రకళ ఇప్పటికే గుర్తింపున్న  కళాకారిణి కదా! తన  ‘రంగప్రవేశం’  స్పాన్సర్  చేయడానికి ముందుకు వచ్చే కళా సంఘాలు ఉండవచ్చు...కాబట్టి,  నన్ను ముందు ఆ  దిశగా ప్రయత్నించనివ్వండి,”  అన్నారు సీరియస్ గా...

**

ఇదంతా ఇలా ఉంటే, ప్లాన్ ప్రకారమే  నాన్న అఫీషియల్ గా ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సివిల్ పోస్టింగ్ వచ్చేంత మటుకు,  నాన్నకి, తమ స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ మానేజర్ గా జాబ్ ఆఫర్ చేసారు అంకుల్.  నాన్న సంతోషంగా ఒప్పుకున్నారు...

క్రిస్టమస్ హాలిడేస్ ముందు,  ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకి తీసుకున్నాము. వినోద్ ఆర్మీ స్కూల్ నుండి మారి, ప్రైవేట్ స్కూల్లో చేరాడు... ఇప్పటికే, స్పోర్ట్స్ లోనే కాక చదువులో కూడా టాప్ అచీవర్  గా గుర్తింపు పొందాడు వాడు..

** 

నా ‘రంగప్రవేశం’ ప్రాక్టీసులు చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. 

లోక కల్యాణం కోసం, ఒక్కో యుగంలో - ఒక్కో రూపాన భూమిన వెలిసిన ఆ విష్ణుమూర్తికి, నీరాజనాలు పడుతూ సాగే ‘సంభవామి యుగే యుగే’ కాన్సెప్ట్  కి, నృత్యాంశాలని  చాలా అర్ధవంతంగా, అందంగా  కూర్చారు మాస్టారు.   

అదో అందమైన భావనతో ఒక్కో అంశానికి నృత్యం చేస్తుంటే, రాత్రింబవళ్ళు దేవుని సంకీర్తనలో, పవిత్రంగా ఉండి పోయింది మనసు... దైవానికి దగ్గరిగా ఉన్నట్టు అనిపించింది.

అమ్మవారి  స్తోత్రాలు  నాలో  నిత్యం మారుమ్రోగుతున్నాయి...

ఈ నృత్య  సాధన,  ఇంత గొప్ప  గురువు గారు,  ఇటువంటి తల్లితండ్రులు  నా పూర్వ జన్మ సుకృతమేనని పదేపదే అనిపిస్తుంది.  

**

ప్రోగ్రాముకి, ఢిల్లీ నుంచి మామయ్యా వాళ్ళు వచ్చారు.   సాంస్కృతిక, కళారంగాల నుండి  ప్రముఖలని ఆహ్వానించి, ముందుండి ప్రోగ్రాం  నడిపించారు భూషణ్ అంకుల్, నీరూ ఆంటీ.  

ఓ కలలా జరిగిన నా ‘కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమాన్ని, పూర్తి ఖర్చు భరిస్తూ,  వైభవంగా జరిపించారు ‘మైలాపూర్ ఫైన్-ఆర్ట్స్‘ వారు.  షుమారుగా రెండువేల మంది ప్రేక్షకులు ప్రోగ్రాం చూసారని తెలిసింది....

నాన్నతో కలిసి అనౌన్స్ మెన్ట్  చేస్తూ, ప్రోగ్రాంని హుందాగా నడిపించాడు జగదీష్. 

రాణి ప్రార్ధనా గీతం  పాడింది.  వినోద్, వోట్-ఆఫ్-థ్యాంక్స్  చెప్పాడు...

ఇకపోతే ,  జగదీష్ ఉన్న రెండు రోజులూ, రాణి అతన్నే అంటి పెట్టుకుని, రాసుకు పూసుకు తిరుగుతుందని కోటమ్మత్త తెగ విసుక్కుంది.  ఆ రెండు రోజులు, ఎప్పటికప్పుడు రాణి గురించి నా వద్ద ప్రస్తావించింది.  

కోపాలకి, ఈర్ష్యలకి  అతీతంగా, నేను మాత్రం నా మనస్సుని పూర్తిగా నా ప్రదర్శన మీదే ఉంచాను.. 

**

ఆ ‘రంగప్రవేశం’ ప్రోగ్రాం, ఊహించని విధంగా పెద్దెత్తున  నన్ను ఓ మేటి కళాకారిణిగా నిలబెట్టింది కూడా.  పేరున్న కళాకారుల నుండి గుర్తింపు,  మీడియా నుండి, కళా సంస్థల నుండి రకరకాల ప్రాజెక్ట్  ప్రపోజల్స్, ఆహ్వానాలు.... కొన్ని ఫిలిం ఆఫర్స్ కూడా
తరుముకుంటూ వచ్చాయి.

ఊహకందని ఈ స్పందన నాకు ఊపిరి సలపకుండా అయింది....

రెండు సినిమా ఆఫర్లు అంకుల్ ద్వారానే రావడంతో,  సంప్రదాయమైన కారెక్టర్ అయితే సినిమాల్లో చేయడానికి అభ్యంతరం లేదని నాన్న, అమ్మ అన్నారు.  నన్నడిగితే, నేను కూడా అదే అన్నాను..

**

ఓ రోజు పొద్దున్నే చేతిలో డాక్యుమెంట్స్  ఫైల్ తో వచ్చారు అంకుల్...  నా కళా జీవితానికి సంబంధించిన బాధ్యతలన్నీ, గార్డియన్ గా, ఐదేళ్ళ  పాటు ఆయన చేపట్టనున్నట్టు,  దానికి మేము అంగీకరిస్తున్నట్టు  రాసున్న లీగల్ అగ్రిమెంట్స్ తెచ్చానన్నారు.   మైనర్ ను కనుక, నాతో పాటు, నాన్న కూడా ఆ కాగితం పైన సైన్ చేయాలన్నారు అంకుల్.  

అంతా విని, క్షణమాలోచించారు నాన్న.  ఎటువంటి అగ్రిమెంట్  లేకుండానే, తమకి ఆయన పైన పూర్తి నమ్మకముందన్నారు. 

లీగల్ ఫార్మాలిటీ  కనుక తప్పదని నాన్నని ఒప్పించగలిగారు అంకుల్...

.. అమ్మ వంక చూసాను.  ‘మంచి పని’ అన్నట్టుంది ఆమె చిరునవ్వు.  నేను, నాన్న ఇద్దరం అగ్రిమెంట్ పై  సంతకాలు చేసాము.

“నాకూ, మా కుటుంబానికి మీరు చేస్తున్న మేలుకి నా ధన్యవాదాలు అంకుల్,” అంటూ చేతులు జోడించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను.

“చూడు తల్లీ నాకు రాణి ఎంతో, నీవూ అంతేనమ్మా.  నీవు నర్తకిగా ఉన్నతంగా ఎదగాలనే నా ఆశ.  అలాగే మన  రాణి  సింగర్ గా పెద్ద పేరు తెచ్చుకోవాలని కూడా,” అన్నారు అంకుల్...

“మీ ఆశీస్సులతో  చిన్నవాళ్ళిద్దరూ తప్పక వృద్దిలోకి వస్తారు,” అంది అమ్మ.

“అది సరే భూషణ్ గారు, నీరూ వెంట లేకుండా మీరు మా ఇంటికి రావడం, ఇదే మొదటిసారి.  ఆమెని చూసి కూడా కొద్ది రోజులయింది.  ఎలా ఉన్నారామె,”  అడిగింది..

“ఓ, మీకు తెలియదు కదూ.  ఇవాళ పొద్దున్నే, రాణితో పాటు నీరూని ఢిల్లీ ఫ్లైట్ కి పంపించి, ఇటు వచ్చాను... వీళ్ళ ఢిల్లీ ట్రిప్ జగదీష్ కి మాత్రమే సర్ ప్రైజ్.  అతను ఈ సమ్మర్ లో ఇటు రాలేనన్నాడట.  అందుకని, ఢిల్లీ చూసొస్తానంటూ మొండికేసి ఒకత్తే  బయలుదేరింది  రాణి...ఇంకేం చేస్తాను? సరే అమ్మని కూడా వెంట తీసుకువెళ్ళమన్నాను,” అన్నారు తాపీగా ఆయన...

**

అమ్మ ఇచ్చిన కాఫీ తాగి, అంకుల్  వెళ్ళిపోయాక,  అందరం కాసేపు  అలాగే  కూర్చుండిపోయాము...

రాణి ఢిల్లీ ట్రిప్పు సంగతి విని నేను చాలా డిస్టర్బ్ అయ్యాను... ఓ పక్క భూషణ్ అంకుల్ ప్రోత్సాహంతో మంచి భవిష్యత్తుని ఊహించుకొని సంతోషం.   మరోపక్క... నా మనసు నాకు దూరమైపోతున్నట్టు... ఏదో వెలితి....

రాణి  ఆలోచనలు, చేష్టలే దానికి కారణం.

కొద్దిపాటి మౌనం తరువాత, నాన్న నోరు విప్పారు.  “ఇప్పటివరకు  మనమైతే  వెళ్ళనే లేదు ఢిల్లీకి... వీళ్ళు చూడు..ఎంత ఫాస్ట్ గా విషయాన్ని నడుపుతున్నారో... ఇదంతా ఎలా తిరుక్కుంటుందో కదా, శారద,” అన్నారు అమ్మతో...

నాన్న అన్న ఆ మాటలతో, నేనే ముందుగా తేరుకున్నాను...”నాన్నా, మీరు లేని పోని ఆలోచనలు పెట్టుకొని హెల్త్ పాడు చేసుకోవద్దు..  అంతా బాగుంటుంది...సరేనా?  

ఉండండి, అసలివాళ అంకుల్ రావడం, ఇలా అగ్రీమెంట్ చేయడం గురించి, జగదీష్ బావకి చెబుతాను,” అంటూ అక్కడి నుండి కదిలాను. “అయితే, మీరు కూడా జగదీష్  పైన ఎక్కువగానే ప్రేమ, ఇష్టం పెంచుకున్నారని అనుకోవచ్చా,” అంటూ అమ్మ నవ్వడంతో పాటు,

“ఆ అబ్బాయిలోని ఆకర్షణ అలా ఉంది మరి,” అన్న నాన్న సంజాయిషీ కూడా వెనుక నుండి వినబడ్డాయి....

**

జగదీష్ వెంటనే నా కాల్ ఆన్సర్ చేసాడు...

నేను చెప్పింది విని, “వండర్ ఫుల్,  ఇలాగే జరగాలి.  ఇక నీ కెరియర్  దూసుకు పోతుంది,” అని సంతోషించాడు.  అవుననే ఒప్పుకున్నాను...

“నేను ఫ్రీగా ఉన్నాను చాంద్...కబుర్లు నువ్వన్నా చెప్పు, లేదంటే విను,” అన్నాడు. 

మొదటి సారిగా తన  చదువు, కెరియర్  విషయాలు షేర్  చెప్పసాగాడు.. 

తన బి.ఎస్.సి కంప్లీట్ అయిందని,  రెడ్-క్రాస్ వాళ్ళ హెల్త్ క్లినిక్ లో వాలంటరీ జాబ్ చేస్తూ, ఇక మెడికల్ స్కూల్ ఇంటర్వ్యూలు చేసుకుంటానన్నాడు. 

వాళ్ళ  రూరల్ హెల్త్ యూనిట్ తో, తను ఓ ఆరు నెల్లపాటు, టూర్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పాడు..

“నీ ప్లాన్స్ అన్నీ చాలా ప్రాక్టికల్  గా ఉన్నాయి... ఈజీగా అవుతాయి,” అన్నాను.

నాకై నేను మాత్రం రాణి వాళ్ళ ఢిల్లీ ట్రిప్ గురించి ఎత్తలేదు.

**

భూషణ్ అంకుల్ నన్ను ఓ కళాకారిణిగా ప్రోమోట్ చేయడానికి రంగం లోకి దిగాక, వ్యక్తిగతంగా కూడా నా లైఫ్ వేగం పుంజుకుంది.  డాన్స్ ప్రోగ్రామ్స్, టి.వి. షూట్స్ తో ఉత్సాహంగా కొనసాగుతూ  ఆర్ధికంగా కూడా బలపడుతున్నాను.

యోగా  ట్రైనింగ్ తో పాటు, జూనియర్ కాలేజీ  ఫైనల్ ఇయర్ చదువు నెగ్లెక్ట్ చేయకుండా కొనసాగుతున్నాను.....

నాన్న హెల్త్ విషయం కూడా ఎప్పటికప్పుడు అర్ధం చేసుకుంటున్నాను.  ఆయనకి  సోకిన ‘మయస్తీన గ్రావిస్’ (యస్థినీ ఘ్రవిస్) వ్యాధి గురించి తెలుసుకున్నాను. 

అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులతో బాధ పడుతుంటారాయన.. స్టూడియో మేనేజ్ మెంట్ సులువు గానే ఉండడంతో, అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకో గలుగుతున్నారు. 

కండరాల బలహీనతకి, ఆయన  వాడే మందు యొక్క డోసేజ్ తరుచుగా మార్చాల్సిన  అవసరం ఉంటుందట.   నాకు నాన్న వ్యాధి గురించి తెలుసునని అమ్మకి అర్ధమయింది... 

**

సంగీత అకాడెమీ వారి అసిస్టెంట్ డైరెక్టర్  పొజిషన్ కి వేకెన్సీ వచ్చిందని, అమ్మ చేత అప్లికేషన్ పెట్టించారు, భూషణ్ అంకుల్.  సహాయక కార్యదర్శి పొజిషన్ కి సెలెక్ట్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని  అమ్మని  ప్రోత్సహించారాయన.  

మా కుటుంబాన్ని, అమ్మని  కూడా మంచి స్థితిలో చూడాలన్న ఆయన ఆలోచనకి, భూషణ్ అంకుల్ పట్ల నాకు గౌరవం రెట్టింపయింది.. 

రాణి మాత్రం ఎప్పటిలా జగదీష్ కి, జగదీష్ కుటుంబానికి దగ్గరవ్వాలనే ఆలోచనలోనే ఉందని నాఅంచనా..  జగదీష్ నుండే, రాణి విషయాలు ఎక్కువగా తెలుస్తుంటాయి, నాకు....

**

అమ్మ అన్నట్టు, అంతా సాఫీగా, కాలం చకచకా గడిచిపోతుంది.......ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటున్నాము.

దాదాపు పదినెలల పాటు చేసిన ప్రయత్నాలు ఫలించి, నాన్నకి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా, మొదటి పోస్టింగ్ నెల్లూరులో వచ్చింది.   స్టూడియో జాబ్ వదిలి పోతున్నందుకు బాధగా ఉన్నా, నాన్న పోస్టింగ్ విషయం సంతోషంగా ఉందన్నారు అంకుల్..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery