Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: ప్రియతమా సినిమా సక్సెస్ కార్యక్రమానికి తేజ, ప్రతిమ హాజరవుతారు. సిద్ధార్థ మాత్రం ట్రాఫిక్ కారణం గా ఆ కార్యక్రమానికి ఆలస్యంగా వస్తాడు. తేజా , సిద్ధార్థ ట్రాఫిక్ గురించి కొంతసేపు మాట్లాడుకుంటారు. ఆ తరువాత..  

 

‘‘ఔనండి.  ఈ దుర్మార్గుడు మిమ్మల్ని కూడా అనుమానించాడు. ఆ విషయం లోనే మా మధ్య కాస్త డిఫరెన్స్ ఒచ్చింది’’ మధ్యలో జోక్యం చేసుకున్న తేజ సిద్దార్థ మీద ప్రతిమకు ఫిర్యాదు చేసాడు.

‘‘ఏం చేస్తాం... మా వృత్తే అంత.  మ్యాన్‌ ఫేక్చరింగ్‌ డిఫెక్ట్‌’’ నవ్వాడు సిద్దార్థ.

‘‘అలా అయితే,  మిమ్మల్నీ అనుమానించాల్సిందే’’ అంది ప్రతిమ.

‘‘మీకు తెలీదు... కొన్ని కేసుల్లో కంప్లయింట్‌ ఇచ్చిన వాళ్లే ప్రధాన నిందితులవుతుంటారు.  కంప్లయింట్‌ ఇచ్చారన్న ఉద్ధేశంతో వాళ్లని ఇగ్నోర్‌ చేస్తే ఇంతే సంగతులు. ఎప్పటికీ కేసు ఓ  కొలిక్కి  రాదు.  ఎందుకంటే ... కేసును తప్పు దోవ పట్టించేందుకే వాళ్లు కంప్లయింట్‌ ఇచ్చారు కాబట్టి... అనుక్షణం అన్వేషణ... నిరంతరం పరిశోధన. అదే జీవితం’’ అన్నాడు సిద్దార్థ.

‘‘అయితే ... ఆ రకంగా నా మీద డౌట్‌ పడ్డారన్న మాట’’ నవ్వుతూ అడిగింది ప్రతిమ.

‘‘డౌట్‌ పడ్డమే కాదు ... మీ వెనుక విచారణ సాగింది’’ తేజా అన్నాడు.

‘‘సాగితే మాత్రం  .. నాకేం సీక్రేట్లున్నాయి?’’

‘‘మనం గమనించం కానీ ... ప్రతి ఒక్కరికీ సీక్రెట్లుంటాయి’’

‘‘ప్రతి ఒక్కరి గురించి కాదు ... నా గురించి చెప్పండి ’’ కోపంగా బుంగ మూతి పెడుతూ అడిగింది ప్రతిమ. కెమెరా కళ్లతో ఆ ఫోజును గుండె తెరపై క్లిక్‌ మనిపించాడు తేజ.

‘‘నాకిప్పుడో విషయం తెలిసింది’’ అన్నాడు సిద్దార్థ.

‘‘ఏంటో...?’’

‘‘పరంధామ్‌ అలకలో తప్పేం లేదని... మన గురించి దొంగ చాటుగా ఎవరైనా ఆరా తీస్తున్నారంటే ఒళ్లు మండదా?  సేమ్‌ సీన్‌ అక్కడ రిపీటైంది’’

‘‘పరంధామ్‌ని అనుమానించడంలో నాకు లక్ష ఆధారాలున్నాయి.  ప్రత్యేకించి ... అతడో విమనైజర్‌.  ఆ వీక్‌నెస్‌ పై విచ్చలవిడిగా అతడు ఖర్చు చేస్తాడు. అంత సొమ్మెక్కడ్నుంచి వస్తోందన్నదే నా డౌట్‌.  ఈ కేసులో అతడి ప్రమేయం లేకపోవచ్చు... కానీ,  ఏదో ఓ కేసులో అతడు దొరక్క పోడు. అప్పుడుందీ...’’ కోపంతో ఆమె కళ్లు ఎర్రగా మండుతున్నాయి.

‘‘కూల్‌... కూల్‌ ! ఇక్కడింత ఏసీ ఉన్నా ఈ సమ్మరేంటో? ఉదక మండలం లోనూ ఊష్ణ కాసారాలా?’’   అన్నాడు  తేజ  ప్రతిమని  కూల్‌ చేసే ఉద్దేశంతో.

‘‘నో ... ఇప్పుడే సిద్దార్థ చెప్పాలి నా వెనుక చేసిన విచారణేంటో?’’

‘‘ఇంత మందిలో బాగుండదు ...’’  అన్నాడు సిద్దార్థ.

‘‘ఎవరికి బాగుండదు?’’

‘‘మీకే..’’

‘‘అయినా ... ఫర్వాలేదు.  విచారణ చేసారన్న ప్రకటనతో ఈ ప్రస్తావన అర్ధాంతరంగా ఆపేయడం కన్నా ... అసలు నిజాలేంటో అందరికీ తెలుస్తాయి. చెప్పండి వింటాను’’ అంది ప్రతిమ.

‘‘సరే ... మీరంతగా అడిగితే చెప్పక తప్పడం లేదు’ ’అంటూ సిద్దార్థ ఏదో చెప్పబోతుండగా ... ప్రతిమ సెల్‌ రింగైంది.

‘‘ఎక్స్‌క్యూజ్‌మీ...’’ అంటూ ఆమె కాల్‌ లిఫ్ట్‌ చేయబోతుండగా...

‘‘వన్‌ సెకన్‌...’’ అంటూ అడ్డు పడ్డాడు సిద్దార్థ.

‘88690 88690.  మీకిప్పుడు కాల్‌ వచ్చింది ఈ నంబర్‌ నుంచే కదూ’ ’అడిగాడతడు.

ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ప్రతిమ.

‘‘ఆ నంబర్‌ మీకెలా తెలుసు?’’

‘‘ఇందాక మీరు స్టేజ్‌ మీద మాట్లాడుతుండగా కూడా సైలెంట్‌ మోడ్‌లో ఉన్న మీ సెల్‌కి ఇదే నంబర్‌ నుంచి మూడు సార్లు కాల్స్‌ వచ్చాయి. కావాలంటే... చెక్‌ చేసుకోండి’’ అన్నాడు.

‘‘చెక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు’’

‘‘ఔను ... ఆ అవసరం లేదు.  ఎందుకంటే ... ఆ కాల్స్‌ వచ్చిన సంగతి మీకు తెలుసు.  స్టేజ్‌ దిగగానే ... ఆ నంబర్‌కి కాల్‌ చేసి మాట్లాడిన మీరు మళ్లీ చెక్‌ చేసుకోనవసరం లేదు.  ఈ సీక్రెట్స్‌ చాలా... ఈ నంబర్‌ వెనుక కహానీ ఇంకాస్త విడమర్చి చెప్పమంటారా?’’

‘‘ఈ కాల్‌ అటెండైన తర్వాత మళ్లీ వచ్చి మాట్లాడతాను ...’’  అంటూ నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకుంది ప్రతిమ.

‘‘ఈ నంబర్ల గొడవేంటీ?’’  అడిగాడు తేజ అక్కడ జరుగుతున్నదేంటో అర్ధం కాక అయోమయంగా అతడి వైపు చూస్తూ.

‘‘ప్రతిమ విషయంలో నీకు చెప్తోంది ఇదే.  ఆ అందాల రాక్షసికి తనకంటూ ఓ ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోనే ఒకే ఒక్కరికి మాత్రమే స్ధానం ఉంది. ఆ ఒక్కరూ నువ్వెప్పటికీ కాలేవు ...’’  నక్షత్రాల్లా కళ్లు మెరుస్తుంటే తన్మయత్వానికి లోనై నవ్వుతూ మాట్లాడుతున్న ప్రతిమను అల్లంత దూరం నుంచే గమనిస్తూ అన్నాడు సిద్దార్థ.

అయిదు నిముషాల తర్వాత ప్రతిమ మళ్లీ జాయినైంది.

‘‘అప్పుడే భోజనం అయిపోయిందా?’’  అడిగింది.

‘‘పెద్దగా ఆకలి లేదు.  అయినా ... మీ ఆతిథ్యం కదా,  స్వీకరించాం’’ చెప్పాడు తేజ.

‘‘థాంక్స్‌ .. సిద్దార్థ టూ మచ్‌ ఇంటిలిజెంట్‌.  నా కోసం అనవసరంగా టైమ్‌ వేస్ట్‌ చేసారు.  ఆ సెల్‌ నంబర్‌ గురించి మీరంత తంటాలు పడాల్సిన అవసరం లేదు. మేమిద్దరం మనసిచ్చి పుచ్చుకున్నాం. త్వరలోనే ఓ ఇంటి వాళ్లం కాబోతున్నామంటూ మీకూ ఇన్విటేషన్‌ పంపిస్తాం’’ చెప్పింది నవ్వుతూ.

సెల్‌ఫోన్‌ కాల్స్‌ ... స్వీట్‌ నథింగ్స్‌ ... ఈ నవ్వుల ప్రపంచమే ముందు ముందు ప్రతిమని ప్రపంచానికే దూరం చేస్తాయని ఆ సమయంలో అక్కడెవరూ ఊహించ లేదు.

మరెవర్నో ప్రతిమ  ప్రేమించిందన్న నిజాన్ని తేజా జీర్ణించుకోలేకపోతున్నాడు.  చూసిన దగ్గర్నుంచీ మనసుకెందుకో ఆమె దగ్గరిదనిపించింది.  ఆమె సమక్షంలో ఉంటే... వెన్నెల్లో తాజ్‌మహల్‌ చెంత ఉన్నంత థ్రిల్లింత. రోజంతా ఆమెనలాగే చూస్తుండిపోవాలని ... మౌనమైనా, మాటలైనా ఆమెతోనే పంచుకోవాలని మనసు పదేపదే వాంఛిస్తోంది. అంతకు మించి... ఇవాళ ఆమెకో ఆత్మీయుడున్నాడన్న సంగతి తెలిసి మరీ మరీ కుమిలిపోతున్నాడు.

ఆ బాధ పైకి చెప్పుకోలేనిది. అలాగని, పిడికెడు చిన్ని గుండె పట్టనంత వేదన.  అసలీ అమ్మాయిల్లో ఏముంది?  అంతగా కవ్విస్తుంటారు. చురకత్తుల్లాంటి చూపులు,  సుతిమెత్తని చిర్నవ్వుల్తో మెస్ మరైజ్‌ చేస్తారు. వంపు వంపుల్లో హంపి శిల్పాల్ని ఆవిష్కరిస్తుంటే అవాక్కయి పోవడం అబ్బాయిల వంతవుతోంది. ఆఫీసులో కూచున్నా ఏ ఎసైట్‌మెంట్‌ పూర్తిచేయలేక పోతున్నాడు.  అనుక్షణం ప్రతిమే గుర్తొస్తోంది. 

ఆమెని పరిచయం చేసుకుని తప్పు చేసానా? మధన పడుతున్నాడు.  ఇంత కాలం తనపై గొప్ప నమ్మకమే ఉండేది.  ఇప్పుడా నమ్మకం వమ్మయింది.  కాదు కాదనుకుంటూనే కాదల్‌ లో పడిపోయాడు. ప్రతిమ ఆకర్షణలో పీకల్లోతు కూరుకు పోయాడు. ఇదంతా ‘వన్‌ సైడ్‌ లవ్‌’! ఆ విషయం స్పష్టమయ్యే సరికి తట్టుకోలేక పోతున్నాడు. సరిగ్గా అప్పుడే... సెల్‌ఫోన్‌ రింగైంది.

‘‘హల్లో... నేను ప్రతిమని’’

‘‘తెలుసు...’’

‘‘థాంక్స్‌ ... ప్రోగ్రామ్‌కి వచ్చినందుకు’’

‘‘మీకూ థాంక్స్‌ ఆహ్వానించినందుకు’’

‘‘మీ చానెల్‌లో కవరేజ్‌ బాగా వస్తోంది’’

‘‘ఆ క్రెడిటంతా సినిమా రిపోర్టర్‌దే.  నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటీ?’’

‘‘స్టోరీ డిస్కషన్స్‌ సాగుతున్నాయి. బహుశా...ఈ సారీ లవ్‌స్టోరీయే కావొచ్చు’’

‘‘ఆ జోనరంటే మీకు బాగా ఇష్టమనుకుంటాను...’’

‘‘ఎవరికి ఇష్టముండదు చెప్పండి ... ప్రేమంటే ఒకే తార ఉదయించే గగనం .. ఒకే మనిషి నివసించే భువనం ... ఒకే పాట వినిపించే కావ్యం ... కాదంటారా .. చెప్పండి’’

‘‘ఇంత భావుకత ఉన్న మిమ్మల్ని ఆకట్టుకున్న వారెవరో గొప్ప అదృష్టవంతుడు’’ అన్నాడు తేజ.

‘‘ఆ అదృష్టవంతుడిని మీరూ చూస్తారు .. ప్రోగ్రాంకి వచ్చినందుకు మరోసారి థాంక్స్‌’’  చెప్పింది.

‘‘ఓహో ... పొద్దున్నే థాంక్స్‌ గివింగ్‌ ప్రోగ్రాం అన్నమాట.  థాంక్స్‌’’

ఆమె కాల్‌ కట్‌ చేయబోతుండగా ...‘‘ మిమ్మల్నోసారి కలవాలనుంది.  ఎప్పుడు కలుద్దాం?’’  అడిగాడు తేజా ఉండబట్టలేక.

‘‘ఎప్పుడైనా ... మళ్లీ కలిసేందుకు ఓ అకేషన్‌ ఉండాలి కదా!’’

‘‘అకేషనా?  అయితే,  మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను’’

‘‘తప్పకుండా ... మీ అన్ని చానెల్స్‌కి స్వయంగా నేను ఇంటర్వ్యూ ఇచ్చే రోజొకటి వస్తుంది’’

‘‘అన్ని చానెల్స్‌కీ కాదు ... ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ మా చానెల్‌కే... అదీ నాకే ఇవ్వాలి’’

‘‘ఓ.... ష్యూర్‌. అలాగే’’ అంది ప్రతిమ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్