Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

సెడార్ పాయింట్ 


అమెరికా లోని ఒహాయ్ రాష్ట్రంలో వున్న సెడార్ పాయింట్  సెలవు రోజున కుటుంబం మొత్తం సరదాగా గడపటానికి అనువైన అనేక రైడ్స్ వున్న అతి పెద్ద పార్కు.  వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వారూ సంతోషంగా గడపటానికి అనువుగావున్న ప్రదేశం ఇది.   ఈరీ అనే సరస్సు ఒడ్డున వున్న ఈ పార్కు.  ఒక రోజు పొద్దున్న బయల్దేరి మేమిద్దరం, మా అబ్బాయి, వాడి స్నేహితులు ఇద్దరం వెళ్ళాము కారులో.   అడుగు పెట్టగానే ముందు రోలర్ కోస్టర్స్ వగైరా రైడ్స్ చూసి, ఇది మీకు బాగుంటుందిగానీ మాకెందుకురా, అనవసరంగా డబ్బులు దండగ అన్నాను మా వాడితో.  మరి ఆ పార్కులో ప్రవేశ రుసుము మనిషికి 40 డాలర్లుట.  కొత్తగా వెళ్ళాముకదా, డాలర్లని రూపాయల్లోకి మార్చుకుని, హమ్మయ్యో ఇంత ఖర్చా అని బి.పి. పెంచేసుకునేదాన్ని.  మా పిల్లలు ఇక్కడ వున్నప్పుడు డాలర్ అంటే మన రూపాయిలాగా చూడు, డాలర్ ని రూపాయల్లోకి మారిస్తే లేని బీ.పీ. వచ్చి, ఆ వైద్యానికయ్యే ఖర్చు చూసి మళ్ళీ అమెరికా మొహం చూడవని నన్ను కొంచెం మార్చారు. 

ఇక్కడ ప్రవేశ రుసుము మనిషి ఎత్తునుబట్టి వుంటుంది.  4 అడుగులు, అంతకన్నా ఎక్కువున్నవాళ్ళకి 40 డా., 4 అ. కన్నా తక్కువ వున్న వాళ్ళకి, 62 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 15 డాలర్లు.  అయితే ఈ టికెట్ తీసుకుని లోపలకి ప్రవేశించాక, లోపల వున్న అన్ని రైడ్స్ ఉచితమే.

ఇందులో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 75 వివిధ రకాలైన రైడ్స్,  17 రోలర్ కోస్ట్స్ వున్నాయి.  ఇందులో 17 వ రోలర్ కోస్టర్ 4,450 అడుగుల ప్రయాణం చేస్తుందట గంటకి 70 మైళ్ళ స్పీడుతో.  అలాగే పవర్ టవర్ 240 అడుగుల ఎత్తుకి సూటిగా తీసుకెళ్ళి, అక్కడనుంచీ ..  అంతే మరి... ఢామ్మని కిందకి.  వీటిని ఇంకా పెంచే వుద్దేశ్యం వున్నదట.  మాతోబాటు మా అబ్బాయి, వాడి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారన్నాను కదా.  వాళ్ళు యూత్ కదా .. రైడ్స్ చూసి సంబర పడ్డారు.  ఒక రోలర్ కోస్టర్ ఎక్కారు.  చాలా ఎత్తుపైనుంచి స్పీడుగా కిందకి వచ్చి (మొదట్లో కొంత దూరం నిటారుగా వచ్చింది) తర్వాత కొంచెం ఆగినట్లు ఆగి, మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో స్పీడుగా కిందకి వచ్చింది.  ఆ కుదుపులకి మా వాళ్ళు నడుములు సర్దుకుంటూ కొంచెం రెస్టు తీసుకోవాలనుకున్నారు.  ఆ సమయంలో కనబడ్డాయి....

అన్నీ బొమ్మల షాపులు .. రకరకాల బొమ్మలు, రంగు రంగుల బొమ్మలు. పెద్దవీ, చిన్నవీ.  చిన్నప్పటినుంచీ నాకు బొమ్మలన్నా, బెలూన్లన్నా చాలా ఇష్టం.  అవ్వన్నీ అమ్ముతారు కాబోలనుకున్నాను.  ఆకర్షణీయంగా వున్న పెద్ద పెద్ద బొమ్మలు చూసి, వాటి ధర ఎంత వుంటుందో చూద్దామని ఉత్సాహంగా దగ్గరకి వెళ్ళాము.  దగ్గరకి వెళ్తే తెలిసిన విషయానికి ఆశ్చర్య పోయాము.  షాపులో అన్ని రకాల బొమ్మలకి రింగుల్లాంటివున్నాయి.  అక్కడ బాల్స్ ఇస్తున్నారు.  ఒక బాల్ కి 2 డాలర్లు, 3 బాల్స్ కి 5 డాలర్లు.  ఆ బాల్ తో బొమ్మకి వున్న రింగుకి బాల్ తగిలి, కింద వున్న టబ్ లో పడేటట్లు కొట్టాలి.  అలా పడితే ఆ బొమ్మ మనదే.  ఇలాంటి ఆటలు మన దగ్గర చాలా చూశాను.  నేను చూస్తుండగా ఎప్పుడూ ఎవరికీ బహుమతి రాలేదు.  ఇదీ అలాంటిదేలే అనుకున్నాను.  మీ అమ్మకి బొమ్మ తెచ్చి పెట్టరా అని మా అబ్బాయిని ఫ్రెండ్స్ ఆట పట్టిస్తున్నారు.  నేను కూడా నాకు చిన్న బొమ్మలేవీ వద్దు, ఎవరైనా సరే ఆ పెద్ద బొమ్మ తెచ్చిస్తే ఇవ్వండి అన్నా.  5 డాలర్లు పెట్టి 3 బంతులు తీసుకున్నారు మావారు, అమెరికాలో నీ అదృష్టం ఎలా వుందో చూద్దామని.  ఆయనొక బాల్ వేశారు...రాలేదు. రెండో బాల్ మా అబ్బాయి ...   తగిలింది .... ఆ పెద్ద బొమ్మ మాదయింది.  వాళ్ళ ఫ్రెండ్సే ఏమిటి .. నేను కూడా ఎగిరాను.  చూశారా మీమాట ఎలా విన్నాడో మీ అబ్బాయి .. మీరడిగిన బొమ్మ తెచ్చిచ్చాడు అని.  అది యాదృఛ్చికమే అయినా ఆ సమయంలో చాలా సంతోషంగా అనిపించింది.  పైగా అంత పెద్ద బొమ్మ.  అక్కడ వున్న రంగుల్లోంచి మనిష్టమైన రంగు తీసుకోవచ్చు.   ఆ సీజన్ లో ఫస్టు వీడికే వచ్చిందని షాపు లో మహిళ ఉవాచ. 

మేము చాలా సంతోషంగా ఆ బొమ్మ తీసుకున్నాము. (షాపులో అమ్మాయి కొంచెం బాధగా ఇచ్చిందా అని నాకో డౌట్).   దానికి వెంటనే కింగ్ కాంగ్ అనే పేరు కూడా పెట్టేశాము. మా అబ్బాయి, నేను దానిని పట్టుకు వస్తూ ఫోటో కూడా తీయించుకున్నాము.  సరే అంత పెద్దదానిని పట్టుకుని సాయంకాలందాకా తిరగలేమని కారులో పెట్టేసి వస్తామని తీసుకెళ్ళారు పిల్లలు ముగ్గురూ.  మా అమ్మాయి కారులో వచ్చాము.  అది పెద్దదే.  మేము ఇండియానుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన 4 పెద్ద సూట్ కేసులు దాన్లోనే ఇంటికి తీసుకెళ్ళాము.  కానీ మా కింగ్ కాంగ్ గారికి ఆ స్ధలం సరిపోలేదు.  అది కొంచెం ఫ్లెక్జిబుల్ గా వుందని ముగ్గురు మిత్రులూ కలిసి దానిని డిక్కీలో పడుకోబెట్టటానికి నానా అవస్తలూ పడ్డారుట.  వాళ్ళవల్ల కాలేదు.  అటుగా వెళ్తున్న ఒకాయన వీళ్ళ పాట్లు చూసి హెల్ప్ చేస్తానని వచ్చి నాలుగు పిడి గుద్దులు గుద్దాడుట ... కింగ్ కాంగ్ నండీ బాబూ.  దానితో సైలెంట్ అయిపోయి డిక్కీలో తొంగుండిపోయాడు మా కింగ్ కాంగ్.  ఇక్కడికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బొమ్మని తీసుకు రాలేక, దానితో ఫోటోలు మాత్రం తెచ్చుకున్నా.

అన్నట్లు అక్కడ అలాంటి బొమ్మల షాపులు, ఆడేవి చాలా వున్నాయి.  మా అబ్బాయి మిగిలిన బాల్ ఆడితే ఒక చిన్న బొమ్మ వచ్చింది.  చాలామంది ఆడుతున్నారు.  తిరిగేవాళ్ళ చేతుల్లో చిన్న చిన్న బొమ్మలు, బాల్స్ చాలా చూశాము.  ఆ రోజు మేమింకొక్కరి చేతిలో మాత్రమే మా కింగ్ కాంగ్ కన్నా చిన్న సైజు కింగ్ కాంగ్ చూశాము.  అందరికి బహుమతులు వస్తున్నాయంటే ఇక్కడ న్యాయంగా ఆడుతున్నారని సంతోషించాను.

లంచ్ టైమ్ అయింది.  అక్కడ బయటనుంచి తెచ్చుకున్న ఆహార పదార్ధాలను లోపలకి తీసుకెళ్ళకూడదు.  మరి వాళ్ళ బిజినెస్సో. అయితే అమెరికాలో మనకి నచ్చేవుంటాయో లేదోగానీ, ఫుడ్, రెస్టు రూమ్ లకు మాత్రం ఇబ్బంది వుండదు. సబ్ (రెండు బ్రెడ్ ముక్కల మధ్య రకరకాల కూరల ముక్కలు పెట్టి ఇస్తాడు.  ఆ కూర ముక్కలు అక్కడున్న వాటిలో మనకిష్టమైనవి వెయ్యమని అడగవచ్చు).  కోక్ తీసుకున్నాము.  అక్కడ ఆహారం ఏదైనా భారీ సైజుల్లో వుంటాయి.  కూల్ డ్రింక్ గానీ, కాఫీగానీ ఓ లీటర్ గ్లాసు.  ఒకసారి కొన్న డ్రింక్ హస్త భూషణంగా గంటలకొద్దీ తిరుగుతారు.

ఇంతా వెళ్ళినందుకు మేమూ రైడ్ ఎక్కాలిగా...పైగా ఫ్రీ కూడా ... ఒక పెద్ద చక్రం, క్లోజ్డ్ కారిడార్ లా వున్నది, దానిలో కుర్చీలున్నాయి .. ఎలాంటివారైనా ఎక్కచ్చు .. అది ఎక్కాము .. చక్కగా నెమ్మదిగా రౌండ్ గా తిరుగుతూ 365 అడుగుల పైకి వెళ్ళి, అంతే నెమ్మదిగా కిందకి దిగింది.  చుట్టూ వున్న దృశ్యాలను చక్కగా చూశాము.  ఆ పార్కు పక్కనే ఈరీ అనే సరస్సు వున్నది.  ఆ సరస్సు దృశ్యాలు పైనుంచి ఫోటో తీయగలిగాను. మావారు ఇంకా కొన్ని రైడ్స్ ఎక్కారుగానీ నేను మాత్రం చక్కగా అన్నీ చూస్తూ కూర్చున్నాను.  అన్నట్లు  చిన్న పిల్లలకి పనికి వచ్చేటట్లు స్పెషల్ రైడ్స్, స్పెషల్ ఫుడ్.  అన్నట్లు ఈ పార్కు పక్కనే వాటర్ పార్కు (వేరే ప్రవేశ రుసుము).  మా పిల్లలు వీటిలోనే చాలా రైడ్స్ ఎక్కలేదని బాధ పడ్డారు.  అందుకనే వేరేవాటికి వెళ్ళలేకపోయాము.

మనకి నచ్చే ఇంకో విషయం .. సిగరెట్ కాల్చేవాళ్ళు స్మోకింగ్ జోన్ లోకి వెళ్ళి కాల్చాలి.  ఎక్కడ పడితే అక్కడ కాలుస్తానంటే పప్పులు వుడకవు.

అన్నట్లు ఇక్కడ వుండి తీరిగ్గా అన్నీ ఎంజాయ్ చేద్దామనుకునేవాళ్ళకు వసతి సౌకర్యం కూడా వున్నది.  దాని ఖర్చులు వేరే వుంటాయనుకోండి.  అయితే వాళ్ళా ఖర్చు పెట్టుకుని అక్కడ వున్నందుకు వారికో చిన్న సౌకర్యం, పార్కు టైముకన్నా గంట ముందు వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తారు.  అంటే రైడ్ల దగ్గర క్యూలు లేకుండా జాలీగా ఎంజాయ్ చెయ్యచ్చన్నమాట.

రాత్రి 7 గం. ల దాకా అక్కడే గడిపి, తిరుగు ప్రయాణమైనాము.  దోవలో పిజ్జా తిన్నాము.  ఇక్కడిలా మనిషికో పిజ్జా అక్కరలేదు.  ఒక పిజ్జా నలుగురైదుగురు  తినవచ్చు.  సహించక కాదండీ దాని సైజు అంత వుంటుంది మరి.

ఈ వారమంతా ఆ రైడ్స్ లో తిరుగుతూ వుండండి.  వచ్చే వారం వేరే చోటికి తీసుకెళ్తానుగా.

మరిన్ని శీర్షికలు
weekly horoscope 9th october to15th october