Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

అది తెలిస్తే అంద‌రూ వెంట‌బ‌డ‌తారు!  - అనుష్క‌ 

అందానికి అభిన‌యం తోడైతే.. అనుష్క‌!
అదృష్టానికి ప్ర‌తిభ జోడిస్తే... అనుష్క!

అణ‌కువ‌, ఆలోచ‌న క‌లిసొస్తే.. అనుష్క‌!

అందుకే ప‌దేళ్ల పాటు జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. మ‌హిళా ప్రాధాన్య చిత్రాల‌కూ ప్రేక్ష‌కులు కోట్లు కుమ్మ‌రిస్తార‌ని... నిరూపించిన జేజ‌మ్మ‌... అనుష్క‌. ఇప్పుడు రూ.75 కోట్ల రుద్ర‌మ‌దేవిగా అవ‌త‌రించింది. ఎన్నో పురిటినొప్పులతో, క‌ష్ట‌న‌ష్టాల‌ను ఓర్చుకొని ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధమైంది. ఈ సంద‌ర్భంగా అనుష్క‌తో జ‌రిపిన మాటామంతి ఇదీ..


* రుద్ర‌మ‌దేవి వ‌చ్చేస్తోంది... మీ క‌ష్టాలు, క‌ల‌లు ఫ‌లించిన‌ట్టేనా?
- మా మూడేళ్ల క‌ష్టం... రుద్ర‌మ‌దేవి. మీర‌న్న‌ట్టు ఈసినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ... రేయింబ‌వ‌ళ్లూ శ్ర‌మించింది టీమ్‌. వాళ్ల క‌ష్టంతోనే  ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మా క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కితే.. అంత‌కంటే ఆనందం ఏముంది?

* మీ కెరీర్ లో అత్యం క్లిష్ట‌మైన సినిమా ఇదే అనుకోవ‌చ్చా?
- ఒక విధంగా రుద్ర‌మదేవి కోసం ఎన్నో స‌వాళ్లు ఎదుర‌య్యాయి. అయితే.. నాకు ప్ర‌తీ సినిమానీ ఛాలెంజింగ్‌గానే తీసుకొంట‌గా. ప్ర‌తీ సినిమా క్లిష్ట‌మైన‌దిగానే భావిస్తా. అలా అనుకొంటేనే మ‌రింత శ్ర‌ద్ధ‌గా ప‌నిచేయ‌గ‌లం. 

* మూడేళ్లు ఒకే సినిమా కోసం కాల్షీట్ల‌న్నీ కేటాయించారు. మూడేళ్ల పాటు ఒకే సినిమా, ఒకే పాత్ర బోర్ కొట్ట‌లేదూ..?
- లేదండీ. అలా అనుకొంటే ప‌నిని ఎంజాయ్ చేయ‌లేం. ఒకే పాత్ర అయినా రోజుకో కొత్త సీన్‌. కొత్త కొత్త ఆర్టిస్టుల‌తో ప‌నిచేయాల్సి వ‌స్తుంది. అలాంట‌ప్పుడు బోర్ ఎందుకు కొడుతుంది?  పైగా ఓ ప్యాష‌న్‌తో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ప్ర‌తిసారీ రావు. ఓ చారిత్ర‌క నేప‌థ్య‌మున్న సినిమా, ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టుల‌తో, దానికి తోడు త్రీడీ.. మూవీ. ఇన్నిప్ర‌త్యేక‌త‌లన్న చిత్రంలో న‌టిగా అవ‌కాశం రావ‌డ‌మే నా అదృష్టం.

* త్రీడీ సినిమాలో లో న‌టించ‌డం ఇదే తొలిసారి. ఇబ్బందేం అనిపించ‌లేదా?
-  ఈ సినిమా కోసం నేను ఎదుర్కొన్న అతి పెద్ద ఛాలెంజింగ్‌లో ఇదొక‌టి. త్రీడీ ఫార్మెట్‌కి అల‌వాటు ప‌డ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది.  త్రీడీ అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్‌. ఓ షాట్ తీయ‌గానే మ‌రో షాట్ తీసేయ‌డానికి వీల్లేదు. లెన్సుల‌ను మార్చుకోవ‌డానికే టైమ్ అంతా స‌రిపోతుంది. మూమూలుగా ఒక రోజులో రెండు స‌న్నివేశాలు తీస్తే... త్రీడీ ఫార్మెట్‌లో ఒక‌టే తీయ‌గ‌లం. ఓ షాట్ కీ మ‌రో షాట్ కీ మ‌ద్య గ్యాప్ వ‌చ్చేస్తుంటుంది. ఆ గ్యాప్‌లో కూడా షాట్ ని ఒకేలా పెర్‌ఫార్మ్ చేయ‌గ‌ల‌గాలి. అది కొంచెం క‌ష్ట‌మైన విష‌య‌మే.

* క‌త్తి యుద్దాలు చేసిన‌ప్పుడు దెబ్బ‌లేమైనా త‌గిలాయా?
- చిన్న చిన్న గాయాలైతే అయ్యాయి. కాక‌పోతే.. ప్ర‌తీసారీ రిహార్స‌ల్స్ ప‌క్క‌గా చేసేవాళ్లం. తీసుకోవాల్సిన ముందు జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకొనేవాళ్లం. కాబ‌ట్టి.. మేం సేఫ్‌.

* ఇన్ని క‌ష్టాలు ప‌డి తీసిన సినిమా, ఆల‌స్యం అవుతున్న కొద్దీ మీలో అసంతృప్తి క‌ల‌గ‌లేదా?
- మేం ప‌డిన క‌ష్టం కంటే.. గుణ‌శేఖ‌ర్ గారి శ్ర‌మే ఎక్కువ‌. నేను యేడాది పాటు కాల్షీట్లు ఇచ్చానేమో? ఆయ‌న తొమ్మిదేళ్లుగా ఈసినిమా గురించి క‌ల‌లు కంటూనే ఉన్నారు. బోల్డంత డ‌బ్బు పెట్టారు. ఆ డ‌బ్బుల‌న్నీ తిరిగి రావాలంటే.. స‌రైన టైమ్‌లో విడుద‌ల చేయాలి. గుణ‌శేఖ‌ర్ గారు ఏ టైమ్‌లో విడుద‌ల చేసినా.. నాకు ఓకే. ఎందుకంటే ఈ సినిమాపై పూర్తి హ‌క్కులూ ఉన్న వ్య‌క్తి ఆయ‌న‌.

* రూ.75 కోట్లు మీపై న‌మ్మ‌కంతో పెట్టుబ‌డి పెట్టారు. వంద కోట్ల వ్యాపారం మీ చుట్టూ జ‌ర‌గ‌బోతోంది. టెన్ష‌న్‌గా లేదా?
- నిజంగా చాలా టెన్ష‌న్ ప‌డుతుంటా. అంద‌రికీ వారి వారి డ‌బ్బులు తిరిగిరావాలి. అందుకోసం దేవుడికి దండం పెట్టుకొంటుంటా. నా వ‌ల్ల ఎవ్వ‌రూ న‌ష్ట‌పోకూడ‌దు.

* న‌ష్టాలొస్తే పారితోషికం త‌గ్గించుకోవ‌డానికీ, డ‌బ్బులు తిరిగిచ్చేయ‌డానికీ అనుష్క సిద్ధంగానే ఉందా?
- పారితోషికం తిరిగిచ్చేస్తాన‌న్న పెద్ద పెద్ద మాట‌లు నేను చెప్ప‌ను. నిజం చెప్పాలంటే నాకు పారితోషికం అన్న‌ది సెకండరీ. మంచి సినిమా బ‌య‌ట‌కు రావాలి. న‌న్ను న‌డిపించేది అదే. మంచి క‌థ చెబితే.. పారితోషికం లేకుండా కూడా ప‌నిచేస్తా. ఈ మాట చెబితే.. నిర్మాత‌లంతా వెంట‌బ‌డ‌తారు.. (న‌వ్వుతూ)

* ప‌దేళ్ల కెరీర్‌లో ఏం నేర్చుకొన్నారు?
- నేనేం నేర్చుకొన్నా...ప‌రిశ్ర‌లోకి అడుగుపెట్టాకే. అంత‌కు ముందు నాకు ప్ర‌పంచ‌మే తెలీదు. ప్ర‌తి ఆరు నెల‌ల‌కూ ఓ టీమ్‌తో ప‌నిచేస్తుంటాను. క‌నీసం ఓ ఇర‌వైమంది కొత్త వ్య‌క్తుల‌తో క‌లసి ప్ర‌యాణం చేయాలి. ఒకొక్క‌రిదీ ఒక్కో మెంటాలిటీ. వాళ్లంద‌రి మ‌ధ్య నెగ్గుకురావ‌డం మాట‌లు కాదు. అలా... ప్ర‌తి సినిమా, ప్ర‌తి వ్య‌క్తీ... నాకు విలువైన పాఠాలు నేర్పిన‌వాళ్లే.

* మ‌రి స్నేహితుల్ని సంపాదించుకోగ‌లిగారా?
- చాలామందిని. ప్ర‌భాస్‌, రాజ‌మౌళి ఫ్యామిలీ, రానా, నాగ్‌సార్ ఫ్యామిలీ... వీళ్లంతా నా ఆప్తులే. ఎప్పుడు ఏ టైమ్‌లో ఫోన్ చేసినా స‌రే..  మ‌రుక్ష‌ణం నా ముందుంటారు.

*  మీకెరీర్‌లో సాధించిన విజ‌యాలకు కార‌ణం అదృష్ట‌మా, లేదంటే మీ ప్ర‌తిభ‌?.
- రెండూనూ. నాకు గొప్ప అవ‌కాశాలొచ్చాయంటే కార‌ణం అదృష్టం. వాటిని నిల‌బెట్టుకొన్నానంటే అది నా ప్ర‌తిభ‌. నేనేం సాధించినా కొంతమందికి మాత్రం రుణ‌ప‌డి ఉన్నాను. నాగ్‌సార్‌, పూరిసార్‌.. వీళ్లు నాకు తొలి అవ‌కాశం ఇచ్చారు. శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి అయితే నాపై న‌మ్మ‌కంతో అరుంధ‌తి లాంటి గొప్ప సినిమా తీశారు. నా జీవితాన్ని మార్చిన సినిమా అది. అలాంటి సినిమా నాకిచ్చినందుకు ఆయ‌న్ని, ఆయ‌న గట్స్‌నీ ఎప్ప‌టికీ మ‌ర్చిపోను.

* సైజ్ జీరో ఎలా ఉండ‌బోతోంది?
- చాలా త‌మ‌షా క‌థ అది. వినోదంతో కూడిన కొత్త పాయింట్ చెబుతున్నాం. మీ అంద‌రికీ థ్రిల్ క‌లిగిస్తుంది.

* కొత్త సినిమాలొప్పుకొన్నారా?
- సింగ‌మ్ 3 చేస్తున్నా. ఇంకొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

* ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
movie review