Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

 జరిగిన కథ: మరెవర్నో ప్రతిమ  ప్రేమించిందన్న నిజాన్ని తేజా జీర్ణించుకోలేకపోతాడు. చూసిన దగ్గర్నుంచీ మనసుకెందుకో ఆమె దగ్గరనిపిస్తుంది అతనికి.  ఇవాళ ఆమెకో ఆత్మీయుడున్నాడన్న సంగతి తెలిసి మరీ మరీ కుమిలిపోతుంటాడు తేజా.. ఆ తరువాత..  

 

ఏ రోజైనా ప్రతిమ దగ్గర్నుంచి కాల్‌ వస్తుందని...ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఎన్నో ఉదయాస్తమానాలవుతున్నా...కేలండర్‌లో తేదీలు చకచకా మారి పోతున్నా...ప్రతిమని మరిచి పోలేక పోతున్నాడు తేజ. అంతే కాదు, ప్రతిమ గుర్తొచ్చినప్పుడల్లా ఆమెని ఆకట్టుకుని కనికట్టు చేసిన అజ్ఞాత ప్రేమికుడు గుర్తొచ్చి గుండె భారమవుతుంటే తట్టుకోలేక పోతున్నాడు. ఈ వేళలో ప్రతిమ ఏం చేస్తుంటుంది? తన ప్రియుడితో సెల్‌ ఫోన్‌ లో గుసగుసలాడుతుంటుందా? ఆ ఊహే భరించ లేక పోతున్నాడు.

అడపాదడపా వాగ్దేవి ప్రొడక్షన్స్‌ కి సంబంధించిన వార్తలు, విశేషాలు కర్ణా కర్ణిగా తేజాకి చేరుతూనే ఉన్నాయి. ప్రతిమ ప్రేమ వ్యవహారం కల్లోలంలో పడిందనే వార్తలు విన వచ్చాయి.

ఈ నేపధ్యంలోనే సిద్దార్ధను కలిసిన ప్రతిమ అజ్ఞాత ప్రేమికుడి గురించి అన్ని విషయాలూ చెప్పింది. ఆ అజ్ఞాత ప్రేమికుడి పేరు అభిరామ్‌ అనీ...అతడు అస్సలు ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని...కారణం తెలీడం లేదని కన్నీరు మున్నీరు పెట్టుకుంది. అంటే..అతడు ప్రతిమ నుంచి తప్పించు కోవాలనుకుంటున్నాడన్న మాట.

ప్రేమంటే విరక్తా? ప్రతిమ పట్ల ప్రేమ తగ్గిందా? తెలుసుకోవాలని కోరింది కూడా.

ఓసారి వాగ్దేవి సంస్థలో పని చేస్తున్న ఓ వ్యక్తి చానెల్‌ లో ఏదో పని మీద వచ్చినప్పుడు ఎదురు పడిన తేజాకి ‘హలో..’ చెప్పాడు.

అతడ్ని ప్రతిమ ఆఫీసులో చూసినట్లు గుర్తించిన తేజా తన క్యాబిన్‌లోకి తీసుకెళ్లి టీ తెప్పించి మరీ కబుర్లాడాడు.

అప్పుడే ప్రతిమ, పరంధామ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో చెల రేగిన వాగ్వివాదం సంగతి తేజాకి తెలిసింది.

‘ప్రియతమా...’ సక్సెస్‌ మీట్‌ తర్వాత వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయి.

ఒకే ఒరలో రెండు కత్తులుండవన్నట్లు... ఆ సంస్ధలో వారిద్దరిలో ఏ ఒక్కరు మాత్రమే ఉంటారని...జరుగుతున్న పరిణామాల్ని బట్టీ సిబ్బంది భావిస్తోంది. అంతే కాదు...తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిమే బయట నుంచి వచ్చిన ప్రతిమే బయటకు వెళ్లి పోతుందనే ఊహా గానాలు వెల్లువెత్తాయి. అయితే, సీన్‌ రివర్సయి...పరంధామ్‌ బయట కెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇంతకీ...సక్సెస్‌ మీట్‌ తర్వాత సంస్థలో ఏం జరిగిందంటే`

ఓ రోజు మధ్యాహ్నం లంచ్‌ అవర్ లో ప్రతిమ క్యాబిన్‌ లోకి పట్టరాని ఆగ్రహంతో దూసుకొచ్చాడు పరంధామ్‌.

‘‘నా గురించి ఏమనుకుంటున్నావ్‌?’’ అడిగాడు కోపంగా.

‘‘ప్రత్యేకించి అనుకోవడానికేముంది?’’

‘‘తక్కువ అంచనా వేస్తున్నావనిపిస్తోంది’’

‘‘తక్కువో, ఎక్కువో అంచనా వేయడానికైనా ఆలోచించాలి కదా! అసలు నీ గురించే ఆలోచించడం లేదు’’

‘‘అందుకేనా...డిటెక్టివ్‌ తో కుమ్మక్కయ్యావ్‌?’’

‘‘కుమ్మక్కవడమేంటీ?’’

‘‘ఇంటర్ నెట్‌ లీక్‌ వ్యవహారంలో నన్ను దోషిని చేసేందుకేగా ఆ ఇన్విస్టిగేషన్‌’’

‘‘కాదు...దోషులెవరో నిగ్గు తేల్చడానికి. ఈ సంస్ధలో నువ్వూ మేనేజర్‌ స్థాయిలోని కీలక ఉద్యోగివే.  ఆ వ్యవహారం పై నీకు బాధ్యత లేదా?’’

‘‘అంటే..సంస్ధ బాధ్యతంతా నీదేనా?’’

‘ముమ్మాటికీ నాదే. ఈ విషయంలో నీకేమైనా డౌటుంటే చైర్ మన్‌ నే అడుగు’’

‘‘నువ్వు చెప్పే ఆ చైర్ మనే నాకు దూరపు బంధువు... ఆ విషయం నీకు తెలియాలే’’

‘‘ఎందుకు తెలీదూ...ఎక్కడో మూడు తరాల కిందట వేలు విడిచిన మేనమామకు దూరపు చుట్టం హోదా నీది. ఆ హోదాలోనే చేయాల్సిన నీచాలెన్నో చేస్తున్నావు. ఎక్స్‌ట్రా ఆర్టిస్ట్‌ ల తో కలిసి నువ్వూ ఎక్స్‌ట్రా వేషాలేస్తున్నావ్‌. ఎవరికి తెలీదు నీ బాగోతం? సీక్రెట్‌ గా నువ్వు సాగిస్తున్న ‘నీలి’ వ్యవహారాలు బయట పెడ్తే ఒక్క క్షణం ఈ ఆఫీసులో నువ్వుండ లేవు. ఫ్యామిలీతో ఉన్నావని చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటే రెచ్చి పోతున్నావ్‌’’ ఆ సమయంలో ప్రతిమ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పరంధామ్‌ కూడా వెనక్కి తగ్గ లేదు.  కల్లు తాగిన కోతిలా వీరంగం వేస్తున్నాడు.

‘‘షటప్‌...నా క్యాబిన్‌ లో ఈ న్యూసెన్స్‌ ఏంటీ? మళ్లీ ఇలాంటి సీన్‌ క్రియేట్‌ చేయకు’’ హెచ్చరించింది ప్రతిమ.

‘‘చూస్తా...నీ సంగతి చూస్తా’’ అంటూ ఉక్రోషంగా ప్రతిమ క్యాబిన్‌ నుంచి బయట పడ్డాడు. మరో అర గంటకు క్యాబిన్‌ నుంచే కాదు...ఆఫీసు నుంచే బయట పడాల్సి వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే పరంధామ్‌ ని మెడ పట్టుకుని గెంటినట్లే. ఆ తర్వాతే...పరంధామ్‌ చేస్తున్న నిర్వాకాలన్నీ వెలుగు చూసాయి. సంస్థకు సంబంధించి యాభై కోట్ల రూపాయల ఫ్రాడ్‌ లో పరంధామ్‌ హస్తం ఉందని తేలింది. బయట ఆర్టిస్ట్‌ లకు కేరెక్టర్ లిస్తానంటూ సాగించిన స్కాం ల సంగతి సరే సరి. కొంత మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌ ల తో సరస సల్లాపాలు...కొంత మంది లేడీ ఆర్టిస్ట్‌ లు మగాళ్లతో సన్నిహితంగా ఉన్న సన్నివేశాల్ని మొబైల్‌ లో చిత్రీకరించి ఇంటర్నెట్‌ లో అప్‌ లోడ్‌ చేయడం లాంటి నీచాలెన్నో పరంధామ్‌ చేసాడని సిబ్బందే స్వయంగా చెప్తున్న పరిస్థితి.

ఉద్యోగం ఊడ గొట్టుకుని బయటకెళ్తూ వెళ్తూ...‘‘చూస్తా...నన్నీ ఆఫీసులో లేకుండా చేసావ్‌. నువ్వీ లోకంలోనే లేకుండా చేస్తాన' టూ పరంధామ్‌ తర్జని చూపిస్తూ ప్రతిమను బెదిరించాడు.

అయితే, ఆ బెదిరింపులకు భయపడడానికి ప్రతిమ సాదా సీదా క్రియేటివ్‌ హెడ్‌ కాదు. దూరపు బంధువునే దూరం పెట్టే స్థాయిలో ఉందంటే...చైర్మన్‌ తో ఆమెకున్న దగ్గరి తనమెంతో? ఆ విషయమే ఆఫీసులో అంతా చర్చిస్తున్నారు.

ఆ చర్చకు ఫుల్‌ స్టాప్‌ ఆ రోజే పడింది.

ఆ రోజు`

అత్యవసర పరిస్థితి విధించినట్లుంది ఆఫీసు. కారణం...చైర్మన్‌ ఆఫీసుకు రావడమే. సాధారణంగా ఫోన్‌ లోనే కార్యకలాపాలు చక్క బెట్టే చైర్మన్‌ హుటాహుటిన కార్యాలయానికి రావడం తుఫాను హెచ్చరిక లాగే ఉంది. ఆయన రాకతో హడలెత్తిన సిబ్బంది క్యాబిన్ లలో, కంప్యూటర్ ల లో దూరి పోయి మరింత శ్రద్ధగా పనులు చేసుకుంటున్నారు. ఫణి భూషణ రావు వాగ్దేవి ప్రొడక్షన్స్‌ చైర్ మనే కాదు...ఐటీ రంగంలోనే విఖ్యాతి గాంచిన ‘ఐటెక్‌’ సంస్థ చైర్ మన్‌ కూడా. ‘ఐటెక్‌’ సంస్థకు దేశ వ్యాప్తంగానే కాదు, ఎబ్రాడ్‌లోనూ ఎన్నో శాఖలున్నాయి. ఆ సంస్థ పర్యవేక్షణకే ఆయనకు ఇరవై నాలుగ్గంటల రోజు చాలదు. 48 గంటలుంటే బాగుండునని అప్పుడప్పుడూ ఆయన సన్నిహితుల వద్ద చమత్కరిస్తుంటారు. మార్నింగ్‌ ఇండియా, ఈవెనింగ్‌ సింగపూర్‌, మర్నాడు లండన్‌...ఇలా విమానం రెక్కలు పట్టుకుని ప్రపంచమంతా ప్రయాణించే ఫణి భూషణరావు ఆ రోజు వాగ్దేవి ఆఫీసుకు రావడమే సంచలన వార్త. అంతకు మించిన సంచలనమేదో ఉందని సిబ్బంది అంతా ఎదురు చూస్తున్న వేళలో...మధ్యాహ్నంమూడు గంటలకు ఎంప్లాయీస్‌తో కాన్ఫరెన్స్‌ హాల్లో మీటింగ్‌ సర్క్యులర్‌ జారీ అయింది. చైర్మన్‌ గారితో మీటింగ్‌...ఉద్యోగుల్లో ఆ ఊహే చెమటలు పట్టిస్తోంది. సంస్ధలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల ఫణిభూషణరావు గారు అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.  కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా రిలీజ్‌ కాకుండా ఇంటర్నెట్‌ లో హల్‌ చల్‌ చేయడం పట్ల ఆయన ఆగ్రహంగానే ఉన్నారు. ఆ తర్వాతి పరిణామాల్లో ప్రతిమకు, పరంధామ్‌ కు మధ్య తీవ్ర స్థాయిలో పొడ సూపిన వివాదాలతో సంస్థ పరువు వీధి కెక్కిందని ఆయన చిందులు తొక్కుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన ఎన్నడూ రాని ఆఫీసుకి కూడా వచ్చేసారు. క్యాబిన్‌లో ఫణి భూషణరావుతో పాటు ప్రతిమ కూడా ఉంది. ఆఫీసు బాయ్‌ లు క్యాబిన్‌ లోంచి బయటకి, బయట్నుంచీ ఆదరా బాదరాగా తిరుగుతున్నారు. చైర్మన్‌ అడిగిన ఫైళ్లు అందిస్తున్నారు.

‘‘సార్‌ సీరియస్‌గా ఉన్నారు’’ అడ్డగించి వివరాల కోసం ఆరా తీస్తున్న ఎంప్లాయితో అన్నాడు ఆఫీస్‌ బాయ్‌.

‘‘ఏం జరుగుతోంది. ఇంకేం జరగ బోతోంది?’’ క్షణ క్షణానికి సిబ్బందిలో ఆందోళన అధిక మవుతోంది.

మధ్యాహ్నం మూడు గంటలకు కాన్ఫరెన్స్‌ హాల్‌ కి చేరుకున్నారంతా. వేదిక మీద ఫణిభూషణ రావు ఒక్కరే కూచున్నారు. పక్కన మరో రెండు సీట్లున్నా కూచునేందుకు ఎవరూ సాహసించ లేదు. ప్రతిమ కూడా ముందు వరసలో ఓ కుర్చీలో కూచుంది. ఇంతలో ఓ వ్యక్తి వేదిక మీదకి వచ్చాడు.

‘‘ఆయన..ఆనంద రావు. ఫణి భూషణ రావు వ్యక్తి గత కార్యదర్శి’’ సిబ్బంది గుస గుస లాడుకున్నారు. ఆయన టేబుల్‌ పై ఉన్న మైకు అందుకుని చెప్పడం ప్రారంభించాడు.

‘‘మీ అందరికీ తెలుసు...చైర్మన్‌ గారెంత బిజీ నో. అంత బిజీ లోనూ తీరిక చేసుకుని ఈ సంస్థను సందర్శించేందుకు వచ్చారు. ఇండస్ట్రీలో ఈ సంస్థసాధించిన విజయాలు మీ అందరికీ తెలుసు. సినిమా వాతావరణానికి భిన్నంగా కార్పొరెట్‌ కార్యాలయాన్ని స్థాపించి విరామ మెరుగకుండా వరుస సినిమాలు తీస్తున్న సంస్థ ఇది. అలాగే, ఎంతో మందికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ముందుకు సాగుతోంది. ఈ సంస్థ ప్రగతి కోసం తీసుకోబోయే చర్యల్ని ఆయనే మీకు వెల్లడిస్తారు’’ అంటూ ఆనందరావు మైకుని ఫణి భూషణ రావుకి అందించాడు.

మైకందుకున్న ఫణి భూషణ రావు కాన్ఫరెన్స్‌ హాల్‌ నంతా ఒక్కసారి కలయ చూసారు. తర్వాత` ‘‘ఇక్కడున్న వాళ్లందరికీ నమస్కారం పెడదామంటే చిన్న వాళ్లు. గుడ్‌ మార్నింగ్‌ చెప్పే టైం కాదు. గుడ్‌ ఈవెనింగ్‌, గుడ్‌ నైట్‌ కూడా చెప్ప లేను...’’అన్నారు గంభీరమైన వాతావరణాన్ని తేలిక చేస్తూ.

‘‘సంస్థను స్థాపించాను కాబట్టి...నే చైర్మన్‌ ని అయ్యాను. చైర్మన్‌ ఒక్కడి వల్లే ఏ సంస్థా నడవదు. చైర్మన్‌ ని ముందుంచి సంస్థను నడిపించేది మీరే. నేను మొదట్నుంచీ ఈ సూత్రాన్నే నమ్ముతాను. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasi pattiste koti