Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

చిన్నప్పటి రోజుల్లో, ఈరోజుల్లోలాగ కాన్వెంటు స్కూళ్ళూ కిండర్ గార్టెన్లూ, ప్లేస్కూళ్ళూ, అవీ ఉండేవి కావుగా, ఏదో ఓ పాకబడీ, అందులోనే ఒకటో క్లాసునుండి, అయిదో తరగతి దాకా చదువులూ..స్కూలంతటికీ, ఒకరో ఇద్దరో ఉపాధ్యాయులూ, ఓ హెడ్మాస్టారూ.మొత్తం అంతాకలిపి, ఓ ముగ్గురూ, నలుగురూ .  ఓ పలకా, బలపంతో పనైపోయేది. ఈరోజుల్లోలాగ, బియ్యబ్బస్తాలలాగ, పుస్తకాలబ్యాగ్గూ, నీళ్ళబాటిళ్ళూ , రోజుకోరకం బట్టలూ కాదుకదా. పైగా స్కూల్లో, ఏ అల్లరిపనైనా చేసినా, ఎక్కాలూ, పద్యాలూ బట్టీపట్టకుండా వచ్చినా, బెత్తంతో దెబ్బలో, గోడకుర్చీలో తప్పేవికావు. ప్రతీదానికీ, తల్లితండ్రులు రంగంలోకి దిగి, “ మా అబ్బాయినెందుకు కొట్టారూ..” అంటూ ధర్నాలూ, దీక్షలూ ఉండేవికావు. ఓసారి స్కూలుకిపంపించేస్తే వారే పిల్లల బాగోగులు చూసుకుంటారని నమ్మకం ఉండేది.

 పిల్లల యోగక్షేమాలు చూసుకున్నందుకు, గురువులని సత్కరించే  అవకాశం, తల్లితండ్రులకి, దసరాల్లోనే వచ్చేది. దసరాల్లో, పిల్లలందరినీ, ఓ లైనులో నడిపించి, ప్రతీఇంటికీ తీసికెళ్ళి, పాటలు “ అయ్యవారికి చాలు అయిదువరహాలు, పిల్లలకి పప్పుబెల్లాలూ.. “ అంటూ పాడించేవారు. ఏ గ్రామంలోనైనా సరే, ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఉండేది. ఇంకోటేమిటంటే, సాధారణంగా, విజయదశమి రోజునే, పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేవారు.. మొదటిరోజు , స్కూలుకి తీసికెళ్ళినప్పుడు, మిగిలిన పిల్లలకికూడా, తమ స్థోమతునిబట్టి,  ఓ కొత్తపలకా, బలపం పంచిపెట్టేవారు. సరస్వతీపూజ రోజున, అసలు చదువుకోవాల్సిన అవసరం ఉండేదికాదు, కారణం—మనపుస్తకాలన్నీ, దేవుడిపక్క పెట్టి పూజ చేసేవాళ్ళం, తీసేస్తే, అమ్మవారికి కోపం రాదుమరీ ? హాయిగా ఉండేది…

ఊరంతటికీ, ఏ బజారులోనో,  చలవపందిళ్ళు వేసి, అమ్మవారి విగ్రహానికి, ప్రాణప్రతిష్ఠ చేసి, రంగురంగుల దీపాలతో అలంకరించేవారు, మరీ ఈరోజుల్లోలాగ కాకపోయినా, బాగానే ఉండేవి.  నాటకాలూ, తోలుబొమ్మలాటలూ, హరికథలూ, సింగిల్ స్క్రీన్ మీద, సింగిల్ ప్రొజెక్టర్ తో సినిమాలూ, భోగం మేళాలూ   ( వాటికి చిన్నపిల్లలని వెళ్ళనిచ్చేవారు కాదు ), ఒకటేమిటి, తొమ్మిదిరోజులూ ఏదో ఒకకార్యక్రమం ఉండేది. పక్క పక్కనుండే చిన్నచిన్న గ్రామాలనుండి,, ఒంటెద్దుబళ్ళమీదా, రెండెడ్లబళ్ళమీదా, ఏ సాయంత్రానికో, కుటుంబసమేతంగా, వచ్చేసి, కార్యక్రమాలన్నీ చూసి, ఆనందించి, ఏ తెల్లవారుఝాముకో తిరిగి వెళ్ళడం.  చివరి నాలుగురోజులూ, చాలా హడావిడిగా ఉండేది, అందులోనూ, చివరిరోజు విజయదశమికి, దసరా ఉత్సవాలు పరాకాష్టకి చేరేవి.. రంగురంగుల దీపాలతో అలంకరించిన, జంతువులవాహనాలూ, వాటిని ఊరంతా ఊరేగించి, ఓ రావణాసురుడి పేద్ద బొమ్మ, దాన్నిండా బాణాసంచా పెట్టి, దానిని , దహనం చేయడంతో దసరా ఉత్సవాలు ముగిసేవి.

మహరాష్ట్ర లో గణపతి ఉత్సవాలూ, బెంగాల్ , మైసూరు లలో దసరా ఉత్సవాలూ, చాలాబాగాచేయడం ఓ ఆనవాయితీగా ఉండేది.   ఆయాప్రదేశాలకి వెళ్ళి చూసేవారు. కాలక్రమేణా, ఈరోజుల్లో అన్ని నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, ఆ సంస్కృతి వ్యాపించింది.. దానికి సాయం, పెద్దపెద్ద వ్యాపారసంస్థలు కూడా, ఈ ఉత్సవాలని sponsor  చేయడం, ఓ ముఖ్యభాగంగా మారిపోయింది. పండగల పేరుచెప్పి, ప్రతీ వస్తువుకీ, భారీగా రాయితీలు ( discounts), ప్రకటించే ఓ ఆనవాయితీ మొదలయింది.

అలాగే ఫాక్టరీలలో ఆయుధపూజలూ, ఉద్యోగస్థులకి , కార్మికులకీ, బోనస్సులూ,, మనవేపైతే, పోస్టుమాన్లకీ, మునిసిపాలిటీ, పంచాయితీ  “ స్వఛ్ఛభారత్” కార్మికులకి దసరా మామూళ్ళూ . టెలిగ్రాం వాళ్ళకి ప్రత్యేకం, పోస్టుమాన్లకి ప్రత్యేకం, ఏదో టెలిగ్రాములు మూసేశారుకానీ, ఇదివరకటిరోజుల్లో, వాళ్ళూ విడిగానే వచ్చేవారు. టెలిఫోన్లవారికి, ఎలెక్ట్రిసిటీ వారికీ  ప్రత్యేకంగా మామూళ్ళూ ఇవ్వాల్సొచ్చేది.  వీళ్ళు కాకుండా, ఇళ్ళల్లో పనిమనుషులకీ, చాకలివారికీ అయితే , విధిగా ఓ నెలజీతం విధిగా ఇవ్వాల్సిందే. వీటిలో, ఏ ఒక్కరికి ఇవ్వకపోయినా, కష్టాల్లో పడిపోవడమే.

దసరా వచ్చిందంటే, తీర్థాలకీ, తిరునాళ్ళకీ, వంటినిండా నగలు పెట్టుకుని, హాయిగా వెళ్ళేవారు. కానీ, ఈరోజుల్లో తీర్థాలమాట దేవుడెరుగు, సాధారణంగా ఒంటరిగా రోడ్డుమీద వెళ్ళడానిజే భయంగా ఉంటోంది. ఏ బైక్కుమీదొచ్చి, మెడలోని ఏ నల్లపూసలో, గొలుసో  లాగేస్తాడేమో అనే భయమే. అంతభయంలోనూ, పోనీ, నగలు పెట్టుకోవడం మానుతారా అంటే, అబ్బే దేనిదారిదానిదే. పోతే చూద్దాంలెద్దూ.. అనుకోవడం. 

మనదేశంలో, స్త్రీలు,  ఒంటినిండా,  గిల్టునగలు కాకుండా, మేలిమిబంగారపు  నగలు ధరించి వెళ్ళగలిగే రోజు ఎప్పుడొస్తుందో ఏమో….

సర్వేజనా సుఖినోభవంతూ….

మరిన్ని శీర్షికలు
ninadevi temple