Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

నైనాదేవి (హిమాచల్) - ..

మహిషాసుర మర్ధిని శైలసుత
 


దేవీ నవరాత్రులలో దుర్గాదేవి ని రకరకాల అవతారాలుగా పూజించడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం . హిందూ పంచాజ్ఞం ప్రకారం అశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు గల తోమ్మిదిరాత్రులు జరుపుకొనే పండుగ . కొన్ని ప్రాంతాలలో దుర్గా దేవి ప్రతిమకు పూజలు చేస్తారు . కొందరు కలశాన్ని పెట్టి దుర్గాదేవిని ఆవాహనం చేసుకొని పూజలు చేస్తారు . ఆంధ్ర , తమిళనాడులలో కొందరు బొమ్మలకొలువు పెట్టి కొలువునే దుర్గాదేవిగా ఆరాధిస్తారు . దుర్గా నవరాత్రులు ఆంగ్ల తేదీల ప్రకారము యీ నెల పదమూడవ తారీఖు నుంచి మొదలవుతున్నాయి . మన దేశం లోని హిందువు లందరూ జరుపు కొనే ముఖ్య మైన పండుగలలో యిది వొకటి .

కర్ణాటకలోని మైసూరు లో విజయదశమి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందేయి .

బెంగాలులో దుర్గాపూజల గురించి చెప్పనే అఖ్ఖరలేదు . వీధికి ఒకటికన్నా ఎక్కువ పెండాల్స్ , వాటి అలంకరణ చూడవలసినదే కాని వర్ణించలేము . దుర్గాదేవిని వారి యింటి ఆడపిల్లని , నవరాత్రులలో దుర్గాదేవి పుట్టింటికి వచ్చినట్లు భావిస్తారు . దశమి నాడు దుర్గాదేవిని అత్తవారింటికి పంపుతున్నట్లు భావిస్తారు .

ఉత్తరాది రాష్ట్రాలవారు ఘటాలను పెట్టి , మొలకెత్తిన నవధాన్యాలకు పూజలు చేస్తారు . తొమ్మిది రోజులు ఆడవారు ఉపవాస దీక్షని ఆచరిస్తారు . యీ రోజులలో ధాన్యాలతో చేసిన పదార్ధాలను తినరు . అష్టమినాడు కన్యాపూజ చేసి తొమ్మండుగురు కన్యలకు పూజచేసి  భోజనము పెట్టి శక్తానుసారముగా తాంబూలాదులు యిస్తారు .తొమ్మండుగురు కన్యలతో పాటు ఓ మొగపిల్లవాడికి కుడా భోజన తాంబులాదులు యిస్తారు . 
దేవీ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో అవతారం గా దేవిని పూజించడం హిందువులకు ఆనవాయితీ . ఏరోజు అమ్మవారిని యేరూపం లో పూజించాలో తెలుసుకుందాం .

 మార్కండేయ పురాణం లో బ్రహ్మదేవుడు మార్కండేయునికి వివరించిన ప్రకారం పాడ్యమి నాడు శైలపుత్రి గా , విదియనాడు బ్రహ్మాచారిణి గా , తదియ నాడు చంద్రఘంటగా , చవితి నాడు కుష్మాండ గా , పంచమి నాడు స్కందమాత గా , షష్ఠి నాడు కాత్యాయిని గా , సప్తమి నాడు కాళరాత్రిగా , అష్ఠమి నాడు మహాగౌరిగా , నవమినాడు సిద్ధిధాత్రి గా , దశమినాడు దుర్గా దేవిగా పూజింప బడుతోంది .

మన దేశం లో వున్న అన్ని దేవి మందిరాలలోనూ దుర్గా నవరాత్రులు విశేషం గా జరుపుకుంటారు . విజయవాడ కనకదుర్గ గుడిలో కుడా దెవీ నవరాత్రులలో దేవిని రోజుకో అవతారంలో అలంకరించి పూజలు చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం .

కనకడుర్గను పాడ్యమి నాడు శైలపుత్రిగాను , విదియనాడు బాలా త్రిపురసుందరి గాను , తదియనాడు గాయత్రి దేవిగాను , చవితినాడు అన్నపూర్ణాదేవిగాను , పంచమి నాడు లలితాదేవిగాను , షష్ఠి నాడు మహాలక్ష్మి గాను , సప్తమి నాడు సరస్వతిగాను , అష్ఠమి నాడు దుర్గ గాను , నవమినాడు మహిషాసుర మర్ధిని గాను , దశమి నాడు రాజరాజేశ్వరిగాను అలంకరించి పూజించడం ఆనవాయితీ గా వస్తోంది .     పరమ పవిత్రమైన యీ సమయం లో హిమాచల్ లోని నైనాదేవి మందిరం గురించి తెలుసుకుందాం . దీనిని మహిష పీఠమ్ అని కుడా అంటారు .  

హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ జిల్లాలో వున్న నైనాదేవి మందిరం శివాలిక్ పర్వత శ్రేణులలో చీకటి అడవులతో కూడుకున్న ప్రదేశం లో నైనా గ్రామం లో కొండపైన స్వయంభూ గా వెలసినది . యిక్కడ అమ్మవారు లింగాకారం ( పిండి ) లో వుంటుంది . ఛండీగఢ్ నుంచి సుమారు 100కిమి , దేశరాజధాని డిల్లీ కి సుమారు 350 కిమీ.. దూరం లో వుంది యీ నైనా గ్రామం . నైనా గ్రామం నుంచి సుమారు 2 కిమీ ఎత్తున్న కొండపైన నైనాదేవి మందిరం వుంది . యీ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 2210 అడుగుల ఎత్తులో వుంటుంది . భక్తులు కాలినడకన , పల్లకీల ద్వారా లేక రోప్ వే ద్వారాగాని కోవెల చేరుకోవచ్చు . రోప్ వే లో ప్రయాణం చాలా అహ్లాదకరంగా ఉంటుంది .  అడవులు , సెలయేళ్లు , పర్వతాలు ఎత్తైన ప్రదేశం నుండి చూస్తూ వుంటే కలిగే ఆనందమే వేరు .

మందిరం లో కొంతభాగం పాలరాతితోను , కొంతభాగం రాతితోను నిర్మించబడింది .  ముఖ్య ద్వారం దగ్గర పెద్ద ఆంజనేయుడు  వినాయకుడు విగ్రహాలు వున్నాయి  , ముఖ్య ద్వారం దాటుకొని లోనికి వెళితే అక్కడ రెండు పెద్ద సింహాల విగ్రహాలు వున్నాయి . గర్భగుడిలో మూడు విగ్రహాలు వుంటాయి మధ్యలో పెద్దపెద్ద కళ్ళతో లింగాకృతి లో వున్నది నైనాదేవి , కుడివైపున ద్వాపర యుగం లో పాండువులచే ప్రతిష్ఠించబడి పూజింప బడ్డ నైనాదేవి విగ్రహం , ఎడమ వైపు వినాయకుని విగ్రహం వుంటాయి . 

యీ ప్రదేశం లో దుర్గా దేవి మహిషాసురుని వధించి మహిషాసుర మర్ధినిగా స్తుతించ బడింది . 

 భక్తులచే దుర్గాదేవిగా పిలువబడుతూ మహిషాసురుని వధించి మహిషాసుర మర్ధినిగా స్తుతించ బడ్డ యీ దేవి యెవరు ? మహిషాసురుడు యెవరు ? దుర్గా దేవి మహిషాసురుని వధించిన ప్రదేశం వర్తమానం లో ఎక్కడ వుంది యివన్నీ తెలుసు కోవాలనుకుంటున్నారా ? అయితే ఆలస్యం యెందుకు యీ వ్యాసం చదివెయ్యండి .

దైత్య రాణి అయిన ' దను ' కు యిద్దరు పుత్రులు కలుగుతారు . వారు రంభుడు , కురంభుడు . తన పుత్రులు ముల్లోకాలను పరిపాలించాలానే కోరికతో వారిని అగ్ని , వరుణ దేవులను గురించి తపస్సు చేసి వరములు పొందమని చెప్తుంది . తల్లి కోరిక మేరకు రంభుడు అగ్ని కొరకు , కురంభుడు వరుణుని కొరకు ఘోరతపస్సు చేస్తారు , రంభుడు యింద్రుడు కలిగించిన అడ్డంకులను అధిగమించి అగ్నిదేవుని ప్రసన్నం చేసుకొని ముల్లోకాలకు పాలకుడు కావాలనే కోరికను కోరుతాడు . అగ్ని నుండి అతని కోరికని అతని పుత్రుని ద్వారా తీరుతుందనే వరాన్ని పొందుతాడు . కురంభుడు తపస్సు చేసుకుంటూ  వుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కురంభుని సంహరిస్తాడు .

రంభుడు దైత్యుల రాజైన తరువాత మహిష రాజపుత్రి మహిషిని మోహించి పెళ్లాడుతాడు . మహిషి శాపగ్రస్తురాలైన అప్సరస . రంభుడు , మహిషి అన్యోన్యమైన దాపత్య జీవనం సాగించసాగేరు . కొద్ది కాలానికి మహిషి నెలతప్పుతుంది . మహిషిని మోహించిన మహిషుడు ( మగ మహిషం ) మహిషిని అపహరించి తీసుకొని పోతాడు . రంభుడు మహిషిని విడిపించేందుకు మహిషునిపై దండెత్తుతాడు . రంభుడు , మహిషుడు మధ్య ఘోరమైన పోరు సాగుతుంది , అందులో రంభుడు మరణిస్తాడు . మహాసాద్వి అయిన మహిషి రంభుని చితిలో సహగమనం చేస్తుంది . మహిషి అప్సరస అయినకారణం గా ఆమెకు మరణము లేదు కాని రంభుని ప్రాణము మహిషి ప్రాణముతో ముడిపడి  వుండడం తో యముడు స్వయంగా వచ్చినా కుడా రంభుని ప్రాణము తీయుటకు వీలు గాక రంభుని ప్రాణమును మహిషి గర్భములో విడిచి మరలి పోతాడు . మహిషి మహిషాసురునకు , రక్తబీజునకు( రంభుని ప్రాణం ) జన్మ నిస్తుంది . మహిషాశురునకు యిఛ్ఛాను సారము రూపధారణ చేయు శక్తిని , రక్త బీజునకు అతని రక్తపుబొట్టు  నేలను తాకినంతనే అతని బలానికి సమమైన బలము కలిగిన వందమంది యోద్ధులు ఉత్పన్న మవాలనే వరాలు యిచ్చి శాప విముక్తురాలై స్వర్గానికి మరలుతుంది  మహిషి . మహిషాసురుడు తన తపశ్శక్తి తో బ్రహ్మదేవుని మెప్పించి పురుషుల వలన మరణము లేకుండు నట్లు  వరము పొందుతాడు . మహిషాసురుడు , రక్తబీజుడు తమ తమ వరముల ప్రభావముతో  ముల్లోకాలను జయించి లోక కంటకులై పరిపాలన సాగిస్తూ   వుంటారు .

మునులు , ఋషులు , దేవతలు వీరి బాధలు పడలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్ధించగా , బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మిగతా దేవీ దేవతల తేజస్సును కేంద్రీకరించగా ఆ మహా తేజస్సు నుంచి పాతాళ లోకం లో కాళ్లు ఆకాశాన్ని అటుతున్న  శిరస్సు అన్ని దిక్కులకు వ్యాపించిన అనేక మైన భుజములు కలిగి పులిని వాహనముగా చేసుకున్న  ఓ స్త్రీ మూర్తి వుద్భవిస్తుంది  . ఆమెకు దుర్గ అని పేరు పెట్టి దేవీ దేవతలందరూ తమతమ వద్దనున్న శక్తులను ఆయుధాలను ఆమెకు యిచ్చి లోక కంటకుడైన మహిషాసురుని వధించమని కోరుతారు వేయి సూర్యుల కాంతితో దుర్గాదేవి మహిశాసురునితో యుద్ధానికి వెళ్తుంది . ఆమె కాంతికి మహిషాసురుని సైన్యం చెల్లాచెదురు కాగా దుర్గాదేవి రక్తబీజుని సంహరించి , అతని రక్తపు బొట్టు కింద పడకుండా పాత్రలో అతని రక్తాన్ని సేకరించి అతనిని సంహరిస్తుంది . రక్తబీజుని మరణాన్ని చూసిన మహిషాసురుడు మహిషం  రూపంలో అడవులలోకి పారిపోతాడు . మహిషాసురుని సైన్యాధ్యక్షుడైన చికాసురుడు అతనివెంబడే వెళ్తాడు . దుర్గాదేవి మహిషాసురుని వెంటే వెళ్లి అతనిని వధిస్తుంది . 

నేటి హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ జిల్లాలో వున్న నైనాదేవి పర్వతం పైన మహిషాసురుని వధించి నట్లుగా యిక్కడ స్థల పురాణం చెబుతోంది .

ఇక్కడి పూజారులు సత్యయుగానికి చెందిన కధ కుడా చెప్పేరు . అదేమిటంటే సత్యయుగం లో దక్ష ప్రజాపతి పుత్రి సతీదేవి తండ్రి యిష్ఠానికి వ్యతిరేకం గా శివుని పరిణయ మాడుతుంది . దక్ష ప్రజాపతి మహా యజ్ఞం తలపెట్టి ఋషులను , మునులను , సర్వదేవీ దేవతలను ఆహ్వానిస్తాడు కాని సతీదేవిని , శివుని ఆహ్వానించడు . తండ్రి చర్యకు కోపగించిన సతీదేవి యాగ ప్రదేశమునకు వెళ్లి శివునిని  కుడా యజ్ఞమునకు ఆహ్వానించ వలసినదిగా కోరుతుంది . ఆగ్రహించిన దక్షుడు శివుని నానా దుర్భాషలతో నిందిస్తాడు . పతికి జరిగిన అవమానము సహించలేని సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది . సతీదేవి శరీరాన్ని భుజముపై మోస్తూ తిరుగుతున్న శివుని కార్యోన్ముఖుని చేయుటకు విష్ణు మూర్తి తన చక్రం తో సతీదేవి శరీరానన్ని 108 ఖండాలు గా ఖండిస్తాడు . అవి శక్తి పీఠాలుగా పూజింప బడుతున్నాయి . ఇక్కడ  సతీ దేవి నయనం పడ్డ ప్రదేశం కాబట్టి యీ ప్రదేశం నైనాగావ్ గాను యీ అమ్మవారు నైనాదేవిగాను ప్రసిద్ధి పొందేరు  . సతీ దేవి మరో కన్ను పడ్డ ప్రదేశం నైనిటాల్ అని అంటారు .

నైనా దేవి మందిర పరిసరాలలో దర్శనీయ స్థలాలు --

1) గుహ  --
కోవేలకి ఎదురుగా 70 అడుగుల పొడవైన నైనా గుహ చూడదగ్గది .

2) కృపాలి కుండం --
మహిషాసురుని వధించేటప్పుడు దుర్గాదేవి మహిషాసురుని రెండుకళ్ళు పీకి విసిరివేయగా అవి నైనా పర్వతానికి సుమారు రెండు కిమీ దూరంలో పడి రెండు సరస్సులుగా మారేయి అవి 1) బమ్  కి భవరి లేక జీరా కి భవరి , 2)  భుభక్ భవరి . 

3)  ఖప్పర మహిషాసుర --        నైనా దేవి దర్శనానికి ముందు యీ సరస్సులో భక్తులు స్నానం చేస్తారు . మహిషాసురుని శిరస్సు పడ్డ ప్రదేశం లో బ్రహ్మ మహిషాసురుని కోరిక మేరకు యీ సరస్సుని సృష్ఠించేడు .

4) కాలా జోహార్  --
 మహిషాసురుని సైన్యాధికారి  చికాసురుడు మరణించిన ప్రదేశం లో ఏర్పడ్డ సరస్సు . యీ సరస్సు నీటికి చర్మ రోగాలు పోగొట్టే శక్తి వుందని స్థానికులు నమ్ముతారు . సంతానము లేని వారు యీ సరస్సులో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనేది యిక్కడి వారి నమ్మకం .     యీ మందిర సమీపం లో పెద్ద మర్రి చెట్టు  వుంది .కొన్ని వందల సంవత్సరాలుగా యీ చెట్టు  వుందని అంటారు .15 వ శతాబ్దం లో రాజా బీర్ సింగ్ యీ మందిర నిర్మాణం చేసేడు . 1756 లో సిఖ్ఖుల గురువైన గురుగోబింద్  సింగ్  నైనాదేవి మందిరంలో యాగం చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది  మొఘలుల మీదకి యుధ్ధానికి వెళ్లి విజయ సాధించేడుట . 

 నైనాదేవి మందిరం లో శ్రావణ అష్ఠమి రోజు ప్రత్యెక ఉత్సవం నిర్వహిస్తారు .

దసరా నవరాత్రులు , వసంత నవరాత్రులు విశేషం గా జరుపుతారు . నవరాత్రులలో దేశం నలుమూలలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించు కుంటారు . 
       డిసెంబర్ , జనవరిలలో యీ ప్రదేశానికి వెళితే మంచుతో కప్పబడ్డ పర్వతాలను చూడగలుగుతాము . వేసవిలో యీ యాత్రకి వెళ్ళే వారు చలి బట్టలు సర్దు కోవడం మరచి పోవద్దు . 
మరిన్ని శీర్షికలు
humour interview