Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ఇప్పుడు ఆ నిర్ణ‌యం మార్చుకొన్నాను - రామ్‌చ‌ర‌ణ్‌
 
రామ్‌చ‌ర‌ణ్ డాన్సులు చేస్తే స‌రిపోదు
మిగిలిన హీరోల్లా డైలాగులు చెబితే స‌రిపోదు
ఫైట్లూ.. ఫీట్లూ.. ఆన‌వు!
ఎందుకంటే చ‌ర‌ణ్ అంటే అభిమానుల‌కు చిరంజీవే క‌నిపిస్తారు.
ఏం చేసినా చిరంజీవితో పోల్చుకొంటారు.
చ‌ర‌ణ్ కూడా ఆ స్థాయి అందుకోగ‌ల‌గాలి.  ఆ క‌ష్టం ప్ర‌తి సినిమాకీ ప‌డుతూ, అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చుకొంటూ.. క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయ‌కుడిగా ఎదుగుతూ... త‌న మార్కెట్‌ని తానే సృష్టించుకొన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం బ్రూస్లీతో మ‌రోసారి అభిమానుల మ‌న‌సు గెలుచుకోవ‌డానికి వ‌స్తున్నాడు. ఈసంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది. 
 
* బ్రూస్లీ అంటే మాకు ఓ గొప్ప ఫైట‌ర్‌గానే తెలుసు... మ‌రి ఈ బ్రూస్లీని ఎలా చూపించ‌బోతున్నారు?
- (న‌వ్వుతూ) బ్రూస్లీ గొప్ప ఫైట‌రే. కానీ.. అత‌నిలోనూ చాలా చాలా ఎమోష‌న్స్ ఉన్నాయి. బ్రూస్లీ సూప‌ర్ హిట్ సినిమాలేమైనా తీసుకోండి. అందులో ఫైట్సే కావు, ఎమోష‌న్ డ్రామా కూడా ఉంటుంది. ఈ బ్రూస్లీ కూడా అలాంటి సినిమానే. యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, కామెడీ... ఇలా ఈ సినిమాలో అన్నీ ఉన్నాయ్‌.

* అంటే అచ్చంగా క‌మ‌ర్షియ‌ల్ కోణంలోనే ఆలోచించి సినిమా తీశారన్న‌మాట‌..
- అదే కావొచ్చు. కానీ.. దాన్ని డీల్ చేసే విధానంలో కొత్త‌ద‌నం క‌నిపిస్తుంది. అది మిమ్మ‌ల్ని థ్రిల్ చేస్తుంద‌ని నా న‌మ్మ‌కం.

* బ్రూస్లీ ని సెట్స్‌పైకి తీస‌కెళ్ల‌డానికి చాలా టైమ్ తీసుకొన్నారు. కార‌ణం ఏమిటి?
- ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త చిత్రాన్ని చూపిద్దామ‌నుకొన్నాం. ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌లేదు. అన్నీ ప‌క్క‌గా కుదిరాకే సెట్స్‌పైకి వెళ్లాల‌న్న‌ది మా ఆలోచ‌న‌. షూటింగ్ మొద‌లెట్ట‌డం ఆల‌స్య‌మైనా.. చాలా వేగంగా పూర్తి చేశాం. ఏడు నెల‌ల్లో సినిమా కంప్లీట్ అయ్యింది. 

* మీ లుక్ కూడా కొత్త‌గా ఉంది.. చేతిపై టాటూ, ఆ హెయిర్ స్టైల్‌...
- ఇదంతా శ్రీ‌నువైట్ల గారి ఆలోచ‌నే. జుత్తు కాస్త ఒత్తుగా క‌నిపిస్తే బాగుంటుంద‌న్నారు. నేను ఫాలో అయిపోయా.

* సాధార‌ణంగా మీ కాస్ట్యూమ్స్ విష‌యంల‌తో ఎవ‌రి స‌ల‌హాలు తీసుకొంటారు?
- వాటి గురించి పెద్ద‌గా ఆలోచించ‌నండీ. ఏది ట్రెండీగా అనిపిస్తే అదే వేసుకొంటా. మ‌రీ థిక్ క‌ల‌ర్స్ అంటే నాకు చిరాకు. దాదాపుగా అలాంటి దుస్తుల్ని ఎవాయిడ్ చేస్తా.

* బ్రూస్లీలో చిరంజీవిగారు మూడు నిమిషాలే క‌నిపించినా, సినిమా క్రెడిట్ మొత్తం ప‌ట్టుకెళ్లిపోతార‌ని శ్రీ‌నువైట్ల అంటున్నారు.. హీరోగా మీ ఫీలింగ్?
-  హీరోగానే కాదు, ఓ కొడుకుగా కూడా గ‌ర్వ‌ప‌డ‌తా. ఆయ‌న న‌టించే 150వ సినిమాలో ఓ చిన్న రోల్ ద‌క్కితే చాల‌నుకొన్నా. అలాంటిది నా సినిమాలో ఆయ‌న న‌టించారు. డాడీ మూడు నిమిషాలు కాదు, మూడు సెక‌న్లు క‌నిపించినా, ఆడియన్స్ దృష్టి ఆయ‌పై ఉంటుంది. సినిమా అంతా ఒక ఎత్తు.. ఆయ‌న ఎంట్రీ మ‌రో ఎత్తు అని అప్పుడే అనుకొన్నా. డాడీ క్రెడిట్ ప‌ట్టుకెళ్లిపోతే అంద‌రి కంటే ఆనందించేది నేనే. ఎందుకంటే ఆయ‌న్ని ఎవ‌రూ డామినేట్ చేయ‌లేరు.. చేయ‌రు కూడా. 

* మీనాన్న‌గారి లుక్ మీరే డిజైన్ చేశార‌ట‌..
- అవును. నాన్న‌గారు పొద్దుట షూట్‌కి వెళ్తార‌న‌గానే ఆయ‌న లుక్‌ని నేనే ఆలోచించి డిజైన్ చేశా. ఎందుకో నాకు ఆ స‌మ‌యంలో గ్యాంగ్ లీడ‌ర్ గుర్తొచ్చింది. అందులో గ‌డ్డంతో కాస్త ర‌ఫ్‌గా క‌నిపిస్తారు డాడీ.  మానేట‌ర్‌లో డాడీ ని చూస్తే.. నాకు గ్యాంగ్ లీడ‌రే గుర్తొచ్చింది. అప్పుడెలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారాయ‌న‌.

* సంఖ్యాప‌రంగా చిరు న‌టించే 150వ సినిమా ఇదే అవుతుంది క‌దా..?
- డాడీ 150వ సినిమా చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఆయ‌న్ని మూడు నిమిషాల‌కే ప‌రిమితం చేస్తే.. అభిమానుల‌కు సంతృప్తిగా ఉండ‌దు. పూర్తి భోజ‌నం.. 150వ సినిమాలోనే. ఇది టీజ‌ర్ లాంటిదంతే. 

* బ్రూస్లీ సెట్లోకి షారుఖ్ వ‌చ్చారు క‌దా, అప్పుడు ఏం మాట్లాడుకొన్నారు?
- షారుఖ్ అర్థ‌రాత్రెప్పుడో హ‌ఠాత్తుగా సెట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఆయ‌న్ని చూడ‌గానే మైండ్ బ్లాంక్ అయ్యింది. దిల్‌వాలే గురించి ఆయ‌న‌, బ్రూస్లీ గురించి నేనూ మాట్లాడుకొన్నాం. ఈ సినిమాలోని స్టెప్ప్ చూసి ఆయ‌న చాలా ఎంజాయ్ చేశారు.

* శ్రీ‌నువైట్ల వ‌ర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది?
- ఆయ‌న సినిమాలు ఎంత జోవియ‌ల్‌గా ఉంటాయో.. ఆయ‌న కూడా అంతే స‌ర‌దాగా ఉంటారు. ఆయ‌న సెన్సాఫ్ హ్యూమ‌ర్ అదిరిపోతుంది. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా ఈజీగా  అనిపించింది.

* టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుల కొర‌త ఉందంటారా?
- అవును. మ‌న‌కు హీరోలెక్కువ‌య్యారు. ప్రామిసింగ్ ద‌ర్శ‌కులు లేరు. వినాయ‌క్‌, శ్రీ‌నువైట్ల‌, త్రివిక్ర‌మ్ ఇలా... వాళ్ల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంది.

* కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వొచ్చుగా?
- సంప‌త్‌నందితో ర‌చ్చ సినిమా చేశా.  ఆ త‌ర‌వాత కూడా కొన్ని క‌థ‌లు విన్నా. కానీ.. గొప్ప‌గా అనిపించ‌లేదు. ఈ విష‌యంలో దిల్‌రాజుగారిని మెచ్చుకోవాలి. కొత్త‌వాళ్ల కు ఆయ‌నో ఫ్యాక్ట‌రీలా క‌నిపిస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుల్ని త‌యారు చేస్తున్నారు. ఎగ్జ‌యిటింగ్ గా అనిపించే క‌థ‌తో వ‌స్తే... అనుభ‌వం లేకపోయినా సినిమా చేస్తా. 

* త‌ని ఒరువ‌న్ రీమేక్ ఎప్పుడు?
- ఆ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర చాలా కీల‌కం. ఆ పాత్ర‌కు త‌గిన న‌టుడు దొరికితే వెంట‌నే మొద‌లెట్టేస్తాం.

* అస‌లు రీమేక్ చిత్రాల‌పై మీ అభిప్రాయం ఏమిటి?
- రీమేక్ చేయ‌డం అంటే నాకు పెద్ద‌గా ఇష్టం ఉండేది కాదు. ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయ‌డం క‌ష్టం అనుకొనేవాడ్ని. అందుకే రీమేక్‌లు చేయ‌కూడ‌దుకొన్నా. అయితే శంక‌ర్‌దాదా, ఠాగూర్ సినిమాలు చూసి ఆ నిర్ణ‌యం మార్చుకొన్నా. స‌రిగ్గా తీస్తే.. రీమేక్‌ల తోనూ మెప్పించొచ్చు అనిపించింది.

* క‌త్తి రీమేక్ క‌న్‌ఫామేనా?
- ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. నాన్న‌గారి త‌దుప‌రి సినిమా ఏంట‌న్న‌ది రెండు మూడురోజుల్లో నేనే వెల్ల‌డిస్తా.

* ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా ఎప్పుడు?
- త్వ‌ర‌లోనే ఉంటుంది. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

* ఏడు నెల‌లు సుదీర్ఘంగా కష్ట‌ప‌డ్డారు.. మ‌రి త‌ర‌వాతేంటి?
- కాస్త రిలాక్స్ అవ్వాలి. ఎక్క‌డికైనా ఫ్యామిలీతో క‌ల‌సి స‌ర‌దాగా వెళ్లాల‌నిపిస్తోంది. నెక్ట్స్ ప్లాన్ అదే

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ

కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
movie review - Bruce Lee