Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆదిశక్తులై అవతరించాలి - ..

 

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః |

 

యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాః తత్రాఫలాః క్రియాః ||
 

వనితల కెందు నెందు సమభావన తోడ లభించుచుండునో

ఘనమగు గౌరవమ్మచట క్రాలు నిరంతర శాంతిసౌఖ్యముల్

మన మలరంగ నచ్చట నమర్త్యులు నొప్పుదు, రెందు మానినుల్

కనరొ సుఖమ్ము లట్టియెడ కార్యములెల్లను నిష్ఫలమ్ములౌ.

అతివలంటే, అబలలు కాదనీ, ఆకాశంలో సగమనీ నిరూపిస్తూ, అనేక రంగాలలో దూసుకుపోతున్న మహిళలకు కనీస రక్షణ కరువైంది. వయసుతో నిమిత్తం లేకుండా మృగాళ్ళ అరాచకత్వాలకు బలైపోతున్న చిన్నారులొక వైపు, ప్రేమించ లేదని తెగబడుతోన్న పైశాచిక కాముకుల యాసిడ్ దాడులతో ఉజ్వలమైన భవిష్యత్తు కోల్పోతున్న విద్యా కుసుమాలొకవైపు....నిత్యం వార్తలు చూస్తూంటే అసలు మన సమాజమెటు పోతోందని అనిపించక మానదు.


సహ విద్యార్థులూ, సహోద్యోగులూ, పై అధికారుల నుంచే కాక, విద్యా బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయుల నుంచి కూడా లైంగిక వేధింపులకు గురి కావడం తెలిసినప్పుడు కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ మధ్య మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం, చైన్ స్నాచింగ్స్....ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకసారి జరిగితే మామూలేనని అనుకోవచ్చు, కానీ, ఈ మధ్య ఒకే రోజు, 11చోట్ల గొలుసు దొంగలు రెచ్చిపోయారన్న వార్త ప్రతి ఒక్కరినీ కలవర పెడుతోంది. రైళ్ళో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఐపీఎస్ అధికారిణి పైనే ఒంటిమీదున్న నగల కోసం దాడి జరిగిందంటే, ఈ గొలుసు దొంగతనాలకు మామూలు గృహిణులెంత భీతిల్లుతున్నారో అర్థమవుతోంది...

అయితే, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు, ప్రతి సమస్యకూ పరిష్కారముంటుంది....బాధితుల కడుపు మంటే దోషుల పాలిట యమపాశం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. చిన్నప్పట్నుంచే సాంస్కృతిక, లలిత కళలలో ప్రవేశం కల్పించినట్టే ప్రతి తల్లిదండ్రులూ అమ్మాయిలకు స్వీయ రక్షణలో శిక్షణనిప్పించాలి, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా తట్టుకుని ఎదురు నిలిచి పోరాడేందుకు కావలసిన శారీరక-మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండేలా తీర్చి దిద్దాలి. తమపై దాడులకు తెగబడే వారిపై ప్రతి ఆడపిల్లా ఆదిశక్తి అవతారమెత్తి లంఘించాలి...ఆడవారితో అనుచిత ప్రవర్తన అనే ఆలోచనొచ్చినా సరే గజగజా వణికి పోవాలి..అప్పుడే ఈ దురాగతాలకు చరమ గీతం పాడ గలం. ఆరోజు అతి త్వరలో రావాలని ఆశిద్దాం. అమ్మవారిని ప్రార్ధిద్దాం.

( ఈవ్యాసానికి ప్రత్యేకంగా చక్కటి చిత్రాన్ని గీసిచ్చిన ప్రముఖ చిత్రకారులు శ్రీ శంకు గారికి కృతజ్ఞతలతో)

-గోతెలుగు

మరిన్ని శీర్షికలు
Dondakaya Masala Curry! ( Gherkins Masala Curry )