Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 జరిగిన కథ: గడిచిన రెండేళ్ళల్లో అందరి జీవితాల్లో  మార్పులు చోటు చేసుకుంటాయి. చంద్రకళ షూటింగ్ డేట్స్, ప్రోగ్రాం షెడ్యూల్ మానేజ్ చేసి, అకౌంటింగ్ చూడ్డానికి, మూర్తి అనే మానేజర్ ని అపాయింట్ చేస్తారు భూషణ్ అంకుల్. అంతటితో ఊరుకోకుండా రెండు వారాల క్రితం చంద్రకళ బర్తడే కి, తన చేతనే మంచి కార్ కొనిపిస్తారు.  పేమెంట్స్ చేసుకోగల స్తోమత కూడా వుందని నచ్చజెప్తారు. ఆ తరువాత... 

 

 “వొట్టి మాటలతో ఏమవుతుంది?  ఈ మధ్య మీ ఫ్రెండ్ అంటగా! అదే భూషణ్ కూతురు - ‘రాణి’.  ఓ మారు వాళ్ళమ్మతో, మరో మారు ఒక్కత్తే , ఢిల్లీ వెళ్ళిందటగా.  ఆ అమ్మాయిని , జగదీష్ వెంటబెట్టుకొని ఊరంతా తిప్పి చూపించాడట.. వీళ్ళిద్దరి బర్తడేలు కలిపి సెలబ్రేట్ చేసారట. 


ఇదంతా వాడే నాకు చెబుతాడు. అలా వాడు చెబుతాడని కూడా మణికి తెలుసు.  మీ మణత్తయ్య కూడా ఆ రాణి వాళ్ళమ్మతో, తెగ రాసుకు పూసుకు తిరుగుతున్నట్టు నా అనుమానం,” క్షణమాగింది అమ్మమ్మ.

“ఏముందమ్మా,  ఆ పిల్లావాళ్ళు డబ్బున్నోళ్ళు.  బరితెగించి మనుషుల్ని కట్టిపడేసుకుంటారు,  ఎవ్వర్నీ నమ్మలేము,”  మళ్ళీ  అమ్మమ్మ.

“ఎవరు? దేనికి? నమ్మలేమంటున్నావు,” అంటూ వచ్చిన అమ్మకి,  రాణి – నీరూ ఆంటి ఢిల్లీ వెళ్లడం సంగతి మళ్ళీ చెప్పసాగింది అమ్మమ్మ.

నేను ఆలోచనలో ఉండిపోయాను.

అమ్మమ్మ అన్నట్టు,  ఓసారి  స్కూల్స్ రి-వోపెన్ కి ముందు, ఒక వారం ఢిల్లీ వెళ్లారు రాణి, నీరూ ఆంటి. 

మొన్నటి  సమ్మర్ లో కూడా, రాణి ఒక్కతే ఢిల్లీ వచ్చిందని జగదీష్  చెప్పగా విని, నవ్వాలో, కోపం తెచ్చుకోవాలో అర్ధం కాలేదు........ ఆ సమయంలో మేము డాన్స్ ప్రోగ్రాముకి  ముంబాయిలో ఉన్నాము. 

“అవన్నీ మాకు తెలిసిన విషయాలే, అమ్మా,” అమ్మమ్మకి జవాబుగా అమ్మ.

ఇంతలో, బయట నుండి హడావిడి, పలకరింపులు వినబడ్డంతో, నా ఆలోచనల నుండి బయటపడ్డాను.  అమ్మమ్మతో కలిసి హాల్లోకి  వెళ్లాము. 

**

అత్తయ్య, మామయ్యా, లోనికి వస్తూ కనబడ్డారు..  ఎదురెళ్ళి పలకరించాను.  మణత్తయ్య నన్ను దగ్గరికి తీసుకుంది.

“గుర్తు పట్టలేనంతగా ఎదిగి పోయావుగా!” నాతో అంటూ, “ఏం శారదా ఏం పెడుతున్నావేంటి పిల్లలకి?” అంది అమ్మతో, నవ్వుతూ.

“ఏమ్మా? బాగున్నావా? మీ అమ్మ హైట్ వచ్చేసావులా ఉందే? ఇంకా పొడవైతే, కృష్ణుడు వేషం వెయ్యాల్సిందే,” నవ్వాడు మామయ్య నా తల మీద చేయి వేసి..

వెనకాలే, సూట్ కేసులు పట్టించుకుని, వినోద్ తో కబుర్లు చెప్పుకుంటూ లోనికొచ్చాడు జగదీష్.

అమ్మని హగ్ చేసి, “హలో అత్తయ్య,” అన్నాడు.

నాన్న హాండ్ షేక్ చేసి, “ఎలా ఉన్నారు మామయ్యా,” అంటూ పలకరించాడు. అమ్మమ్మ వాళ్ళతో కూడా పలకరింపులయ్యాక, నాకు దగ్గరగా వచ్చాడు. 

”ఇజ్ ఇట్ చంద్రా?”  నా ముఖంలో ముఖం పెట్టి చూసాడు.  “థాంక్ గాడ్.  ఎవరో సౌత్ ఇండియన్ మాడల్ అనుకున్నా. అందుకే అక్కడే ఉండి పోయాను,” నవ్వుతూ, నా హాండ్ షేక్ చేసి,”హలో చంద్రా,” అన్నాడు.

అందరూ నవ్వారు...

“నిన్ను కూడా మేము గుర్తు పట్టలేదు జగదీష్ , ‘అత్తయ్యా’ అంటూ నువ్వు దగ్గరికి రాబట్టి గానీ, లేకపోతే తెలిసేది కాదు.. నీ జీన్స్, గోటీ, చూసి, ఎవరో ఈ కౌబాయ్  అనుకున్నాము,” అమ్మ జోక్ చేసింది.

నేను కూడా నవ్వాను.

“పోనీలెండి, నా మనవలు పెద్దవాళ్ళయ్యారు.  అందంగా ఎదిగారు,” అంది అమ్మమ్మ.

“నేను కూడానా అమ్మమ్మా? పొడుగయ్యానా? " అడిగాడు వినోద్. 

“అందరిలోకి అందగాడు మాత్రం వినోద్ బాబే,”  అంది ఆమె. 

“పదండమ్మా, ఫ్రెష్ అయ్యి రండి. కాసేపట్లో భోజనాలు చెయ్యవచ్చు,” అన్నారు తాతయ్య. 

**

మరునాడు, అందరం పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కి వచ్చేసాము. రోజంతా ఏం చేద్దామని అనుకునే లోగా వర్షం మొదలయింది. చేసేది లేక, దినమంతా బోర్డ్-గేమ్స్ ఆడాము.. 

జగదీష్ చెపుతున్న కబుర్లు, జోక్స్ తో, కడుపుబ్బ నవ్వుతూ గడిపేసాము.

సాయంత్రమయ్యాక, అమ్మమ్మ వాళ్ళ థియేటర్ లో తెలుగు సినిమాకి వెళ్ళాము...

హాయిగా జరిగిపోయింది రోజంతా....

రాత్రి భోజనాలయ్యాక, మరునాడు జరగబోయే సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లల్లో ఉండిపోయారు పెద్దవాళ్ళంతా. 

**

తెల్లవారక ముందే, పని వాళ్ళు అటు, ఇటు తిరుగుతూ పనులు చేస్తున్నారు.  ఇల్లంతా సందడిగా ఉంది.  అందరూ పూజకి తయారవుతున్నారు.

నేనూ లేచి పనులు కానిచ్చాను.  అమ్మమ్మ కుట్టించిన తెల్ల పట్టు పరికిణీ, కుంకుం రంగు వోణీ వేసుకుని, అత్తయ్య  నా చిన్నప్పుడు ఇచ్చిన ముత్యాల హారం పెట్టుకున్నాను.  ముత్యాల గాజులు, జుమ్కాలు  సహా.  జడ వేసుకోడం మిగిలింది.

అందరూ హాల్లో చేరిన హడావిడి తెలుస్తూనే ఉంది. నా గదిలో నుండి అంతా కనబడుతున్నారు కూడా.  వినోద్, జగదీష్ - జీన్స్ వేసుకొని, పైన క్రీం కలర్ జుబ్బాలు వేసుకున్నారు. 

అమ్మా, అత్తయ్య, అమ్మమ్మ కూడా పసుపు రంగు పట్టు చీరలు కట్టుకున్నారు.  ఇక నాన్న, తాతయ్య, మామయ్య  గోధుమ రంగు పైజమా కుర్తాలు  వేసుకునున్నారు.

జడ అల్లడం ముగించి, హాల్లోకి వచ్చాను.  

అందరూ నా వంక ఎగాదిగా చూశారు. 

అప్సరలా ఉన్నానన్నారు, అత్తయ్య, అమ్మమ్మ.

“పందిరి నొదిలి మల్లె తీగ ఇంట్లో నడుస్తుందేమిటి?” అంటూ టీజ్  చేసారు తాతయ్య.  

“తాత ఇజ్ కరెక్ట్. సరిగ్గా పోల్చారు,” అంటూ పరికిణీ, వోణీ వేసుకున్న నా  వంక తేరిపార చూసాడు జగదీష్. 

“అవును చంద్రా, తాతగారి గార్డన్ లోని జాస్మిన్ క్రీపర్ లాగానే ఉన్నావు,” అంటూ నవ్వడం మొదలు పెట్టాడు. అదొక జోక్ లా అందరూ నవ్వడమే....

“ఎందుకురా ఆ అమ్మాయిని అలా టీజ్  చేస్తావు? ఊర్కో,” అన్నారు రాం మామయ్య.

“పర్వాలేదులే మామయ్యా,” నేనేమీ ఫీల్ అయి పోడం లేదు,” అంటూ దేవుని మందిరం వైపు నడిచాను, అక్కడ పని చేస్తున్న రేవతికి హెల్ప్ చేద్దామని.

**

పూజ, భోజనాలు బాగా జరిగాయి.. అమ్మమ్మ  స్నేహితులంతా  మమ్మల్ని కలిసినందుకు సంతోషపడ్డారు.

“మా మనమరాలు గొప్ప డాన్సర్,”  అంటూ, నన్ను ప్రేత్యేకంగా అందరికీ పరిచయం చేసారు అమ్మమ్మ, తాతయ్య. నా ‘నృత్య మంజరి’ అవార్డు నుండి, నేను యాక్ట్ చేసిన టెలిఫిలిం వరకు, అందరికీ గర్వంగా చెప్పారు. 

**

అతిధులు వెళ్ళాక, పెద్ద వాళ్ళందరు వరండాలో చేరారు.  పూజ హాలు శుభ్రం చేయడమయ్యాక, వినోద్, జగదీషుల కోసం చూసాను.  వెనుక తోటలో క్రికెట్ ఆడుతున్నారు.  చేసేది లేక, హాలు పక్కనే గదిలో టి.వి ఆన్ చేసి సోఫాలో ఒరిగాను.  కళ్ళు మూతలు పడుతున్నా, బలవంతంగా కాసేపు సినిమా చూస్తూ, నిద్రలోకి జారుకోడం  తెలుస్తూనే ఉంది....

**

“హలో, చాంద్, హలో, వెకేషన్ అంటే నిద్ర పోవడం కాదు”...అంటూ భుజాలు కుదిపి జగదేష్, కాళ్ళు తట్టి, వినోద్ నన్నునిద్ర లేపేసారు. 

“సరే సరే,” అంటూ లేచి కూర్చున్నాను.  వచ్చి, నాకు చెరో వైపు కూర్చున్నారు వాళ్ళు.

“ట్వెల్వ్, ట్వెల్వ్ డిసెంబర్  నీ బర్తడే అయిందిగా.  యు ఆర్ నైన్టీన్?  దానికి ముందు, ఏప్రిల్ టెన్త్ న, వినోద్ బాబు బర్త్ డే అయింది.  హి ఇజ్ థర్టీన్.  మీ ఇద్దరికీ బర్త్ డే గిఫ్ట్స్ ఏం కావాలి?” అడిగాడు జగదీష్.

“నేను ఆలోచించి చెపుతా,” అన్నాడు వినోద్...”మరి నీ బర్త్ డే కూడా అయిందిగా బావా, నీకేం కావాలి?” అడిగాడు వాడు...

నేనేదో అనబోయే లోగా జగదీష్ ఫోన్ మోగింది.  ఫోన్ తీసి చూసి, ఆన్సర్ చేయకుండా పెట్టేసాడు.  మళ్ళీ కూడా మోగితే ఆఫ్ చేసాడు. 

ఎందుకు తీయవు?” అడిగాను.

“మీ ఫ్రెండ్ రాణి ఫోన్. ఇప్పుడు ఒక గంట సేపు టైం తినేస్తుంది.  అందుకని,”  అన్నాడు.

“మాట్లాడ్డం అంత ఇష్టం లేకపోతే, మానేసేయవచ్చు కదా!” అన్నాను. 

విని ఏమనలేదు జగదీష్. 

కాస్త మౌనం తరువాత, “నీకు తెలుసా? నీ పర్సనల్ మేనేజర్ లా వ్యవహరిస్తున్నారని, అప్పట్లో వాళ్ళ డాడీతో గొడవపడింది రాణి.  భూషణ్ అంకుల్ మాత్రం, నీ కెరియర్ కి తన సహకారం  తప్పనిసరిగా  ఉంటుందన్నారని, ఆయనతో మాట్లాడ్డం మానేసింది కూడా.  నేనెంతో కన్విన్స్ చేసాక కొద్ది కొద్దిగా సర్దుకుంది,” నవ్వుతూ నా వంక చూసాడు.  

“మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండకుండా చూసే ‘రెఫెరీ’ అనుకో నన్ను.  అందుకని ఫ్రెండ్ షిప్ ఉండాలి, మాట్లాడాలి,” మళ్ళీ జగదీష్..

ఇదంతా వింటున్న వినోద్ కల్పించుకున్నాడు.

“నాతో మాత్రం,ఫ్రెండ్లీగానే ఉంటుంది, రాణి... అక్క అంటేనే ఆమెకి ఇష్టం లేదని అందరికీ తెలుసు,” నవ్వుతూ నా వంక చూసాడు.

నాకు మాట్లాడక తప్పలేదు.

“నేను రాణితో కలిసి ప్రదర్శనలు చేస్తున్నా, విడిగా కలుసుకునే అవకాశాలు తక్కువయిపోయాయి.అమ్మ వద్ద సంగీత సాధన చేయడానికి మాత్రమే వచ్చి వెళుతుంది..

సినిమాల్లో, రాణి పాడుతున్న
వెస్టర్న్ స్టైల్   పాటలకి, మంచి క్రేజ్ ఉంది.  కనుక, తనకి జెలసీ ఫీల్ అయ్యే అవసరం కూడా లేదుగా” అన్నాను జవాబుగా...

“నీ కెరియర్  పట్ల, వాళ్ళ డాడీ చూపే శ్రద్ధ రాణికి నచ్చదు... అదే వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది.  ప్రతీకారంగా, మీ కంటే ఎక్కువగా, తనే నాకు దగ్గరవ్వాలని తన ఆలోచన,” వివరించాడు జగదీష్.


“సరే గాని, ఈ రంజిత్ సూరి ఎవరు? వాడి పేరు చెబుతూ ఉంటుంది రాణి,” అడిగాడు ...

నేను జవాబు చెప్పేలోగా, “ఇదో నీకే ఫోన్, డాడీ సెల్ కి చేసింది రాణి,” అంటూ అతనికి ఫోన్ అందించి వెళ్ళింది  అత్తయ్య.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasi pattiste koti