Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

 జరిగిన కథ: సహస్రను ఆ వేషం లో చూడగానే విరాట్ కు ఏడుపొచ్చేస్తుంది.. వెంటనే  ఆ ఇంట్లోకి రాగానే  సహస్ర చేయి పట్టుకుని చర చరా పడగ్గది లోకి లాకెళ్ళి తలుపు మూస్తాడు విరాట్‌. కౌగిట బంధించి ఏడుస్తాడు. ఇదేం ఖర్మ. ఆగర్భ శ్రీమంతురాలివై వుండి ఈ వేషం ఏమిటి? వీధుల్లో అడుక్కోవటం ఏమిటి? ఇదంతా అవసరమా?అని  బాధగా అంటాడు విరాట్.. ఆ తరువాత...   

 

సి.యం. గుంభనగా నవ్వటం ఫోన్‌లో విన్పించింది. ‘‘మిష్టర్‌ విరాట్‌ నీ పట్టుదలను మెచ్చుకొంటున్నానయ్యా. సహస్ర అభీష్టానికి విరుద్ధంగా నువ్వేమీ చేయవని అర్థమవుతోంది. లోకంలో జంటలన్నీ మీలా ఏకాభిప్రాయంతో ముచ్చటగా ఉంటే ఎంత బాగుంటుంది? ఒకే సహస్ర ఎక్కడుందో తెలీక పోయినా ఆ అమ్మాయి నీకు ఫోన్‌లో టచ్‌లోనే ఉందని రేపు సైదాపేట కోర్టుకి హాజరవుతుందని నాకు తెలుసు. ఎనీవే బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’’ అంటూ లైన్‌ కట్‌ చేసారు సియం.


ఆమె మాటలకి విరాట్‌ నిర్ఘాంతపోయాడు. ఆమె తమని మర్చిపోలేదు. క్లోజ్‌గా గమనిస్తోంది. బహుశ తన ఫోన్‌ కాల్స్‌మీద నిఘా ఉంచవచ్చు.

అదే రోజు సాయంకాలం మధురై నుంచి సహస్ర తండ్రి మహా దేవ నాయకర్‌ సియం సెల్వి చెందామరైకి ఫోన్‌ చేసాడు.

‘‘సియం గారు క్షమించాలి. తప్పనిసరై ఇలా సడెన్‌గా ఫోన్‌ చేసాను’’ అన్నాడు.

‘‘ఫరవా లేదు మహా దేవ నాయకర్‌ గారు. మీరు మాకు మా  పార్టీకి ఎంతో కావలసిన వారు. అంతా క్షేమం గదా!’’ పరామార్శించారు సియం.

‘‘ఆ విషయం చెప్పటానికే ఫోన్‌ చేసాను మేడం. రేపు సహస్ర కోర్టుకి రాగానే ఆ త్యాగరాజన్‌ మనుషులు ఏదోటి చేసి చంపాలని చూస్తారు. మీరే తగిన రక్షణ ఏర్పాటు చేయించి మా బిడ్డని కాపాడాలి’’ అంటూ రిక్వెస్ట్‌ చేసాడాయన.

‘‘నేనా విషయం మర్చిపోలేదు నాయకర్‌ గారూ. ఈ ఉదయం కూడా విరాటకి ఫోన్‌ చేసి అడిగాను. వాళ్ళు ప్రభుత్వ పరంగా ఏ సాయం తీసుకోడానికి సిద్ధంగా లేరు. అలా చేస్తే పరిస్థితి రాజకీయ గందరగోళానికి, అనిశ్చితికి కారణం కావచ్చని సందేహిస్తున్నారు. ఏం చేస్తాం? బట్‌ మీక్కాబోయే అల్లుడు జీనియస్‌. మీ అమ్మాయి డేరింగ్‌ డాషింగ్‌ లేడీ. వాళ్ళ రక్షణ ఏర్పాట్లలో వాళ్ళున్నారు గాబట్టి భయపడాల్సిందేమీ లేదనుకొంటున్నాను.

అయినప్పటికి ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకోవటం జరిగింది. మీరూ మాక్కావలసినవారు. విరాట్‌ తండ్రి గారూ కోయంబత్తూరు లక్ష్మీ క్లాత్‌ మిల్స్‌ వెంకటరత్నం నాయుడు గారు కూడా కావలసిన వారు. కాబట్టి నేను ఉపేక్షించకుండా ఎప్పటికప్పుడు పరిస్థితి గమనిస్తూనే వున్నాను. భయపడకండి అంతా శుభమే జరుగుతుంది.

ఎ వార్‌ వితవుట్‌ బ్లడ్‌ అని నెత్తురు చిందకుండానే ముగిసిన యుద్ధాలు కొన్ని చరిత్రలో వున్నాయి. నా అంచనా కరక్టయితే రేపు అలాంటి ఒక యుద్ధాన్నే మనం చూడబోతున్నాం. మీకు తెలీని విషయాలిక్కడ చాలా వున్నాయి. మేం చూసుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండండి’’ అంటూ భరోసా యిచ్చారు సియం.

‘‘థ్యాంక్యూ మేడం. థ్యాంక్యూ’’ అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మహాదేవనాయకర్‌.

***************************************************

కోర్టు వాయిదా రోజు.

జర్నలిస్టు లహరి కోర్టుకు హాజరై తనిచ్చిన రిపోర్ట్‌ మీద త్యాగరాజన్‌కి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ యివ్వాల్సిన రోజు. అంతకు రెండ్రోజుల క్రితంనుంచే టివిల్లోను. పత్రికల్లోను జర్నలిస్టు లహరి సైదాపేట కోర్టుకు హాజరు కానున్న విషయాన్ని భిన్న కథనాలుగా వార్తలొచ్చాయి. తొమ్మిది గంటలకే పత్రికా విలేకర్లు కోర్టుకు చేరుకున్నారు. వివిధ ఛానళ్ళకు చెందిన రిపోర్టర్లు వీడియో కేమెరాలతో పరుగులెత్తుకొచ్చారు. రచయిత్రి సహస్ర, జర్నలిస్టు లహరి ఒకరే అని తెలిసి పోడంతో సిటీలోని ఆమె అభిమానులంతా లహరిని చూడాలని కోర్టుకి చేరుకోనారంభించారు. దాంతో ఉదయం తొమ్మిది గంటలకే చెన్నై సైదాపేట కోర్టుల సముదాయం ఆవరణ అంతటా సందడిగా మారిపోయింది. 

త్యాగరాజన్‌ మనుషులు అప్పటికే అక్కడ తిష్టవేసి రెడీగా ఉన్నారు. హర్యానా షూటర్స్‌ యిద్దరు సాధారణ పౌరుల్లా వుండి కోర్టు మెట్లకి అటుయిటు ద్వారపాలకుల్లా నిలబడి సహస్ర రాక కోసం ఎదురుచూస్తున్నారు.

దుస్తుల్లో మారణాయుధాలు దాచుకున్న త్యాగరాజన్‌ మనుషులు సుమారు డెబ్భై మంది సాధారణ పౌరులతో కలిసిపోయి ఆవరణలో తిరుగుతున్నారు.

అక్కడికి కాస్త ఎడంగా ఒక పక్కన పార్కింగ్‌లో నిలిపిన వేన్‌లో కూచొని తమ వాళ్ళ పొజిషన్స్‌ని గమనిస్తున్నాడు పాండ్యన్‌. సెల్‌ఫోన్‌ నుంచే వాళ్ళకి సూచనలిస్తున్నాడు. హర్యానా షూటర్స్‌లో మరో ఇద్దర్ని అప్పటికే విజిటర్స్‌ గాలరీలోకి పంపించి వున్నాడు.

ఇదిలా ఉండగా అక్కడికి దూరంగా ఒక అశోక వృక్షం కింద ఆగుంది ఖరీదైన కారు ఒకటి. దానికి నల్లద్దాలు లేపి ఉంచటంతో బయటి వాళ్ళకు లోన ఎవరుందీ తెలీదు. ఆ కారులో ఇద్దరే వ్యక్తులున్నారు. ఒకడు కారు డ్రైవరు. రెండో వాడు త్యాగరాజన్‌ అతడు వెనక సీట్లో కూచుని పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అవసరమైతే అక్కడ్నుంచి వెళ్ళి పోడానికి వీలుగా డ్రయివరు కారు దిగిలేదు. స్టీరింగ్‌ వెనక కూచునే వున్నాడు.

పాండ్యన్‌ అంతగా చెప్పినప్పటికీ లహరి కోర్టుకి వస్తుందా? అసలా అమ్మాయి ఇన్ని రోజలుగా ఎక్కడుంది? ఎలా వస్తుంది? అసలు రాదా అనేక సందేహాలతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు త్యాగరాజన్‌.

అయితే యిక్కడ విరాట్‌ వర్గం పరిస్థితి మాత్రం వేరు.

సహస్ర ఖచ్చితంగా కోర్టుకి వస్తుందని వాళ్ళందరికీ తెలుసు. కాని ఏరూపంలో ఎలా వస్తుందనేది మాత్రం తేలీదు. తమ ఏర్పాట్లలో తాముండాలి గాబట్టి ఒక్కరొక్కరుగా కోర్టు ఆవరణలోకి రావటం ఆరంభించారు.

సహస్రకు అసలైన ముప్పు హర్యానా షూటర్స్‌ నుంచి పొంచి వుంది. ఎవడు ఎటునుంచి షూట్‌ చేస్తాడో తెలీదు. ముందు వాళ్ళని గుర్తించాలి. వాళ్ళు ఎవరో ఎలా ఉంటారో దీక్ష ఒక్కదానికే తెలుసు. ఆ రోజు శిధిల భవనం వద్ద సంఘటనల్లో వాళ్ళని చూసింది. తనను త్యాగరాజన్‌ మనుషులెవరూ గుర్తించకుండా నల్లటి బురఖాలో బయలు దేరింది దీక్ష. ఆమె వెంట విశాల మాత్రమే కాదు లహరి స్టేట్‌మెంట్‌ వినాలనే కుతూహలంతో డాక్టర్‌ గుణదీపిక కూడా బయలు దేరింది. నల్లని బురఖాల్లో ఈ ముగ్గురూ వస్తుంటే వాళ్ళని అనుసరించి ముగ్గురు ముస్లిం యువకులూ వచ్చారు. వాళ్ళంతా పిల్లి గడ్డం తలమీద టోపీ పైజామా కుర్తాలు ధరించి అచ్చ ముస్లిం యువకుల్లాగే వున్నారు. కాని వాళ్ళలో ఒకడు విరాట్‌, రెండోవాడు ధర్మ చివరగా వస్తున్న వాడు చందూ.

వాళ్లంతా మెట్లను సమీపిస్తుండగానే దీక్ష అక్కడ అమాయకుల్లా నిలబడున్న హర్యానా షూటర్స్‌ ఇద్దర్నీ గుర్తించి విరాట్‌కి సైగ చేసింది. బయట ఇద్దరున్నారంటే మిగిలిన యిద్దరూ లోన గేలరీలో ఎక్కడో తిష్ట వేసుండాలని విరాట్‌కి అర్థమైంది. పక్కనే వస్తున్న మునుసామికి సిగ్నలిచ్చి మెట్లెక్కి లోనకెళ్ళి పోయాడు విరాట్‌.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery