Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasi pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

 జరిగిన కథ: ప్రతిమ, పరంధామ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో చెల రేగిన వాగ్వివాదం సంగతి తేజాకి తెలుస్తుంది. ప్రియతమా... సక్సెస్‌ మీట్‌ తర్వాత వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో  అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఆ తరువాత...

సంస్థ ప్రగతిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. ఎప్పుడూ రాని చైర్మన్‌ వచ్చాడు... ఏం చేయబోతున్నాడో అని ఎవ్వరూ కలవరపడొద్దు. ఈ సంస్థంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. ఎంత ఇష్టమంటేకన్న కూతురంత ఇష్టం..’’ అంటూ ప్రతిమ వైపు చూసారొకసారి.

‘‘ప్రతిమ... ఈ సంస్థకు క్రియేటివ్‌హెడ్‌గానే తెలుసు. కానీ, ప్రతిమ నా కన్నకూతురు. కమాన్‌ బేబీ!’’ అంటూ రెండు చేతులు సాచి ఆహ్వానించాడు వేదిక మీదకి.

ప్రతిమ నవ్వుతూ లేచి వెళ్లింది వేదిక పైకి.|

‘‘ఇన్ని కోట్ల ఆస్తికి వారసురాలు నా కూతురు ప్రతిమ. ఐటెక్‌ కంపెనీకి కాబోయే చీఫ్‌. ఇప్పుడు వాగ్దేవి ప్రొడక్షన్స్‌కి కూడా అధినేత తనే’’ ప్రతిమని దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకుని ఆత్మీయంగా నుదుటి పై చుంబించాడు ఫణి భూషణరావు.

‘‘థాంక్యూ డాడీ’’ అంటూ గారాలు పోయింది ప్రతిమ.

‘‘ఏంటీ ... గడిచిన క్షణం వరకూ మన ఆఫీసులో క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేసిన ప్రతిమ ఫణిభూషణరావు గారి కూతురా?’’ నమ్మలేక పోయారు సంస్థ సిబ్బంది. ఎవరికి వారే ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు.

‘‘అయితే, ఇన్నాళ్లూ ఆమె ఎందుకు అజ్ఞాతంగా ఉండిపోయింది. వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టల్లో ఉంటూ సిటీ బస్సుల్లోనే ఎందుకు తిరిగింది? నిజంగానే చైర్మన్‌ గారి కూతురా? లేక..’’ అందరి చూపుల్లోనూ అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ సంగతి గ్రహించినట్లుగా ఫణిభూషణరావు చెప్తున్నాడు`‘‘ తల్లి లేని ప్రతిమ విదేశాల్లో మేనత్త దగ్గరుండి చదువుకుంది. గతేడాదే ఇండియాకి తిరిగి వచ్చింది. ఆమె రాగానే సంస్థలో కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకున్నాను. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు కూడా తను ఓకే. అయితే, తనే చిన్న మెలిక పెట్టింది. ఒకేసారి బాస్‌ కూతురిగా ఇంట్రడ్యూస్‌ చేయొద్దని కోరుకుంది. అందర్లాగానే నచ్చిన ఓ సంస్థలో పనిచేస్తూ
తనను తాను ప్రూవ్‌ చేసుకోవాలనుకుంది. ఎ బ్రాడ్‌ లో ఉన్నప్పుడు కొన్ని షార్ట్‌ ఫిల్మ్‌లూ తీసింది. అక్కడి టీవీ షోల్లో వ్యాఖ్యాత్రిగా వ్యవహరించింది. కొన్ని టాక్‌ షోలు రూపొందించింది. అవన్నీ చూసిన తర్వాత వాగ్దేవి ప్రొడక్షన్స్‌లో క్రియేటివ్‌ హెడ్‌ పోస్ట్‌ క్రియేట్‌ చేసి సంస్థ బాధ్యతల్ని ఆమెకి అప్పగించాను. ఆ తర్వాత కథ మీ అందరికీ తెలిసిందే. తన చేతుల్లో రూపుదిద్దుకున్న సినిమాలు ఆమె సమర్థతను చాటి చెప్తాయి. ఆమె ఎంచుకున్న సబ్జెక్ట్‌లు ఆమె సృజనకు అద్దంపడతాయి. సంస్థ నిర్వాహకురాలిగా తనేం చేయాలో తనకు తెలుసు. సిబ్బంది నుంచి ఏం తీసుకోవాలో కూడా ఆమెకు తెలుసు. అందుకే, ఇండస్ట్రీ లోనే ఈ సంస్థకు ప్రత్యేకతను సంతరించి పెట్టింది’’ ప్రతిమ గురించి చెప్పాడతడు.


‘‘ఇకపై కూడా ప్రతిమ ఇక్కడే పనిచేస్తుంది. ఈ సంస్థ నుంచి మరిన్ని మంచి సినిమాలు రూపొందిస్తుంది. ఇక, అసలు విషయానికొస్తే ... ఈ మధ్య సంస్థలో జరిగిన పరిణామాలు నా దృష్టికీ వచ్చాయి. పరంధామ్‌ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. అలాంటి వాళ్ల గురించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. అంతా కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’’

ఆ తర్వాత ప్రతిమ మాట్లాడిరది. సంస్థలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తూ క్లుప్తంగానే ముగించింది. ఆ సంగతులన్నీ తెలుసుకున్న తేజా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. నిన్నటి దాకా ప్రతిమ తమ లాగే మధ్య తరగతికి చెందిన అమ్మాయనుకున్నాడు కానీ, కోట్లకు పడగెత్తిన సంపన్నురాలని అస్సలు ఊహించలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా తేజాకి ఆమె అజ్ఞాత ప్రేమికుడు గుర్తొచ్చాడు. కులం, మతం, ధనం, బలం ప్రేమకు అడుగడుగునా అడ్డు తగులుతున్న సందర్భంలో ప్రతిమ ప్రేమకథ ఫలిస్తుందా?  ఆ అజ్ఞాత ప్రేమికుడే ఆమె మెడలో తాళికట్టి తన దాన్ని చేసుకుంటాడా? కళ్లెదురుగా జరుగుతున్న ఈ కథ తేజాలో అంతులేని ఉత్కంఠకు కారణమవుతోంది. ఆ ఆలోచనల మధ్య లోనూ ప్రతిమ ప్రేమను తను దక్కించుకోలేదన్న బాధ కూడా అతడి మనసుకు మంటపెడ్తోంది.

కొన్ని రోజుల తర్వాత`

వాగ్దేవి కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ప్రత్యేకంగా హాజరైన కంపెనీ చైర్మన్‌ ఫణి భూషణరావు ప్రతిమని ఆకాశానికెత్తేసారు. ఆప్రెస్‌ కాన్ఫరెన్స్‌కి తేజా కూడా అటెండయ్యాడు.

వివరాలన్నీ నోట్‌ చేసుకున్న తర్వాత`‘‘కంగ్రాట్స్‌...’’ ప్రత్యేకంగా కలిసినప్పుడు ప్రతిమను అభినందించాడు.

‘‘థాంక్స్‌..’’

‘‘మా చానెల్‌కి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఎప్పుడు?’’

‘‘ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ మీరు కవర్‌ చేయరా?’’

‘‘ఇది వేరు.. నేనడుగుతోంది ఎఫ్‌ టూ ఎఫ్‌’’

‘‘ఏంటది?’’

‘‘ఎలక్ట్రానిక్‌ మీడియా పరిభాషలో ఎఫ్‌ టు ఎఫ్‌ అంటే ఫేస్‌ టు ఫేస్‌. ముఖాముఖి. మీ విషయానికొస్తే... నీలాల నింగితో నేల చేసే సంభాషణం’’ అన్నాడు తేజ.

‘‘ఔనా?’’  నవ్వింది ప్రతిమ.

‘‘ఔను... ఆకాశమా నీవెక్కడ... అవనిపై నేనెక్కడా?’’ అనాలనిపిస్తోంది నాకు. నిన్నటి దాకా మా అందరిలో మీరూ ఒకరు. ఇవాళ అందనంత ఎత్తులోనూ మీరే...’’

‘‘ఎలాగనగలుగుతున్నారు మీరు?’’

‘‘ఫణి భూషణరావుగారమ్మాయని తెలిసిన తర్వాత మీరు మాలో ఒకరని ఎలాగనుకోగలం?’’ ప్రశ్నించాడు.

‘‘ఫణిభూషణరావు గారమ్మాయికి ఫ్రెండ్స్‌ ఉండరా?’’

‘‘ఆ ఫ్రెండ్స్‌ కూడా అదే స్టేటస్‌లో ఉంటారు’’

‘‘అలాగా ... ఓ కొత్త విషయం చెప్పారు. ఇక ముందు అలాగే నడుచుకుంటాను. అన్నట్టు ... మిస్టర్‌ తేజా! మీరు నన్ను కలిసేందుకు వచ్చే ముందు ఫార్మాలిటీస్‌ పాటించండి. ఆఫీస్‌ నంబర్‌ అడిగి తెలుసుకోండి. నేనున్నానో లేదో ఆరా తీయండి. ఉన్నా...మిమ్మల్ని కలిసే మూడ్‌లో ఉన్నానో లేదో అబ్జర్వ్‌ చేయండి.  ఇంకో విషయం ...నా పర్సనల్‌ నంబర్‌కి డైరక్ట్‌గా ఎప్పుడూ ఫోన్‌ చేయకండి. ఇలాంటి కాల్స్‌ డిస్టర్బ్‌ చేస్తాయి ...ఓకేనా?’’ అంది ప్రతిమ అక్కడ్నుంచీ కదుల్తూ.

‘‘ ఒక్క క్షణం .. ఆగండి. ఇంతకీ మీరేమంటున్నారు?’’

‘‘ఇందాక మీరన్నదే. అందులో ఒక్క మాట నా మాట లేదు. ఇక ముందు నేనెలా ఉండాలో మీరు సజెస్ట్‌ చేసారు. అది మీతోనే మొదలుపెట్టాలనుకున్నానంతే’’

‘‘ సారీ ... మీరు ఫణిభూషణరావుగారమ్మాయని తెలిసీ ... అలా మాట్లాడాను’’

‘‘ ఆ సంగతి తెలీక ముందు ప్రతిమ మీ ఫ్రెండే కదా! ఆ అమ్మాయి గురించి మీరు తెలుసుకున్నది అంతేనా?’’

‘‘మిమ్మల్ని అందని ఆకాశం అనుకున్నాను..’’

‘‘ఆకాశంలోని వాన చినుకు కూడా నేలతోనే నేస్తంకడుతుంది’’

‘‘ఇంద్రధనుసనుకున్నాను’’

‘‘ఆ హరివిల్లే నింగికీ నేలకు వంతెన కడుతుంది’’

‘‘వదిలేయండి ... మీరేంటో అర్ధం చేసుకున్నాను. ఫేస్‌ టు ఫేస్‌ ఎప్పుడు?’’

‘‘ఇప్పటి దాకా జరిగింది అది కాదా?’’ అడిగింది నవ్వుతూ ప్రతిమ. తర్వాత`‘‘ ఒకట్రెండు రోజుల్లో తీరిగ్గా మనం కలుద్దాం. అప్పుడే మీతో ‘ఫేస్‌ టు ఫేస్‌...’’ చెప్పింది ప్రతిమ. తేజా వెళ్లిపోయినా అతడి మాటలే ప్రతిమని వెంటాడుతూ వచ్చాయి.

ప్రతిమ ... ఆ మూడక్షరాల పేరుతో ఇప్పటి వరకూ తన ఐదిటిటీ కొనసాగింది. ఇక ముందు ... ఫణిభూషణరావుగారమ్మాయనే ట్యాగ్‌ లైన్‌తో ఈ ప్రపంచం తనని గుర్తించేలా ఉంది. తేజా మాటల్లోనూ అదే వ్యక్తమైంది. ఆ తర్వాత సంస్థ లోనూ ఆ తేడా పసికట్టింది ప్రతిమ.

ప్రతిమ ఎవరో తెలిసిన తర్వాత ఆమెతో చనువుగా వెనుకెనుక తిరిగిన వాళ్లు కాస్త దూరం మెంటైన్‌ చేయడం మొదలెట్టారు. కారిడార్‌లో ప్రతిమ ఎదురైతే చాలు... భయం భయంగా విష్‌ చేసి పక్కకు తప్పుకునే వాళ్లు. ప్రతిమ కూడా తమలాంటి ఉద్యోగే అనుకుని చాటుగా హాస్యాలు, రహస్యాలు చెప్పిన వాళ్లు ఏ క్షణంలో తమ సీటు కిందకు నీళ్లొస్తాయా? అని భయాందోళనలు చెందుతున్నారు.

ఈ పరిస్థితిని గమనించింది ప్రతిమ.

ఇక, భరించలేక ఓ రోజు మళ్లీ అందర్నీ కాన్ఫరెన్స్‌ హాల్‌కి ఇన్‌వైట్‌ చేసింది.

‘‘ ఊ ... చెప్పండి ’’ అంది ప్రతిమ. సంస్థ అధినేతగా సమావేశాన్ని అరేంజ్‌ చేసింది తనే.

మీటింగ్‌ ఎజెండా తనదే. కానీ, తమనే చెప్పమనేసరికి ఏం చెప్పాలో అర్ధంకాక ఇబ్బందిగా ఆమెని చూసారంతా.

‘‘ అదే ... మనమధ్య ఉండకూడనిది ఈ దూరమే. ఇన్నాళ్లూ కలిసి పనిచేసాం. అలాగే ఇప్పుడూ పనిచేద్దాం. నేనేదో మీలా నేల మీద తిరిగేదాన్ని కాదని ... ఎక్కడో ఆకాశం నుంచి జారిపడ్డాననే ఫీలింగ్‌ని మీరంతా విడిచి పెట్టాలి. నేను .. ఎప్పటికీ మీ ప్రతిమనే’’ అంది.

ఆ మాటలకే ఉబ్బితబ్బిబ్బయ్యారు వారంతా. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్