Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> చీమారావు ప్రేమాయణం

cheemaaraavu premaprayanam

" ఝామ్మంటూ పిజ్జా బాయ్ వెంకట్, ఆర్డర్ చేసిన కేక్ బాక్స్ , పిజ్జా బాక్స్ బైక్ మీద ముందు అటాచ్ చేసిన బాక్స్ లో పెట్టి రివ్వుమంటూ బంజారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండులో ఉన్న పారిశ్రామికవేత్త పాపవినాశం ఇంటికి బయలుదేరాడు.

ఆయన ఇల్లు అక్కడకి పది కిలోమీటర్ల దూరం, అసలు ఆ చుట్టుపక్కలేబోలెడన్ని పిజ్జా హట్లు, బేకరీస్ ఉన్నా ఆయన ఎప్పుడూ ఫేమస్బేంగళూర్ అయ్యంగార్ బేకరీ  నుంచే ఆర్డర్ ఇస్తాడు.

సాధారణంగా ఆ ఆర్డర్ వెంకట్ తీసుకువెడతాడు, జస్ట్ అది తీసుకెళ్ళిఇచ్చినందుకే అతనికి టిప్ ఐదువందల నోటు ఇస్తాడాయన.

అందుకే ఆర్డర్ రాగానే హుషారుగా బయలుదేరాడు ఝామ్మని. బైక్ బయలుదేరగానే కేక్ బాక్స్ లోనుంచి కులాసాగా బయటికి వచ్చి నింపాదిగా బయటికి వచ్చి  కులాసాగా ఆ పెట్టె మీదకు చేరిన 'చీమారావ్' విలాసంగా ఒంటి కాలిమీద నిలబడి,దిక్కులు చూడసాగాడు.

ఆహా ఈ ఊరు ఎంత అందంగా ఉందీ, ఏమిటో ఇన్నాళ్ళూ ఆ బేకరీలో కేకులే ప్రపంచం అనుకుని ఎంత సమయం వృధా చేసేసాను... బయట ఇంత పెద్ద ప్రపంచం ఉందని తెలియక, నూతిలో కప్పలా, ఛా ఛా ఇన్నాళ్ళూ ఎంత మంచి లైఫ్ మిస్ అయ్యానూ అనుకుంటూ పరధ్యాహనం గా నిలబడ్డ అతనికి తనకి చిటికెడు దూరంలో నిలబడి తనకేసే ఆరాధనగా చూస్తున్న చిట్టి చిట్టికళ్ళచిచ్పూ కనబడింది... ఇదొకత్తీ స్వర్గానికి వెళ్ళినా సవతి పోరన్నట్లు ఇంతటి విశాల ప్రపంచంలోని అందాలని చూద్దామని పుట్టి పెరిగిన బేకరీని వదిలేసి తనవాళ్ళెవరికీ చెప్పకుండా వచ్చేసినా ఈ దరిద్రం ముఖంది తనని వదిలేలా లేదు, విసుగ్గా ముఖం తిప్పుకుని రయ్యిన వస్తున్న గాలి పాటకు దీటుగా తన ఈల పాట మొదలుపెట్టాడు.

ఆ పాటనీ, చీమారావు స్టైల్ నీ పరవశంగా చూస్తూ ఆదమరపుగా నిలబడ్డ చిచ్పూ ఆ గాలివేగానికి కొట్టుకుపోయి ఎలాగో కిందపడకుండా ఆపుకుని, ఆ గడబిడలో మళ్ళీ కేక్ బాక్స్ లో పడిపోయింది బతుకుజీవుడా అనుకుంటూ.

ఇదంతా ఓరకంట గమనిస్తున్న చీమారావ్, క్రింద పడిపోయిందనుకుని ఒక్క క్షణం అయ్యో అనుకున్నా పోనీలే ఈ రకంగా తన పీడా పోయింది, ఇక్కడే ఎక్కడో  గంతకు తగ్గ బొంతను చూస్కుంటుంది నన్ను మర్చిపోయి అనుకుంటూ పాట కంటిన్యూ చేసాడు.

బైక్ పాపవినాశం ఇల్లు చేరింది, వెంకట్ ఆ బాక్స్లు చేతిలోకితీసుకు ఇంట్లో అడుగుపెట్టాడు... ఎందుకైనా మంచిదని లోపలికి దూరిన చీమారావ్ కి అక్కడ వయ్యారంగా పడుకున్న చిచ్పూ ని చూసి వళ్ళు మండిపోయింది ..హూ  అంటూ విసురుగా పక్కకి వెళ్ళిపోయాడు.

పాపవినాశం ఇంట్లోంచి పనివాడొచ్చి వెంకట్ చేతికి డబ్బిచ్చి, ఆ బాక్స్ లు తీసికెళ్ళాడు... వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి తర్వాత కేక్ బాక్స్ ఒక్కటీ ఫ్రిజ్ లో పెట్టాడు... ముందు హాయిగా చల్లాగా అనిపించినా రెండు నిముషాలు గడిచేసరికిచిచ్పూచీమారావ్ గడగడా వణకడం మొదలుపెట్టారు... ఇక తమ చావు పక్కా అనుకున్న చీమారావు కి చిచ్పూ మీద ముందు జాలి తర్వాత ప్రేమా కలగసాగాయి హాయిగా తనవాళ్ళమధ్యకావలసినంత తింటూ హాయిగా ఆనందంగా ఉండాల్సిన చిచ్పూతనవలనేబయటకొచ్చి ఈ ప్రమాదంలో పడింది పాపం అనుకుంటూ చిచ్పూకేసి రాసాగాడు...

"ఏయ్ ఎవరు మీరు? ఇక్కడికెలా వచ్చారు? " పొగరుగా వచ్చిన ప్రశ్నకేసి చూసిన చీమారావు ఒక్కసారిగా అవాక్కయ్యాడు, ఎర్రగా,బుర్రగా అచ్చంగా తన కలల రాణిలా ఉన్న ఆ గొప్పింటిపిల్లకేసి అలా చూస్తూ ఉండిపోయాడు, అంత చలిలోనూ వళ్ళు వేడెక్కిపోయింది...

"నేనూ... నేనూ " మాట తడబడింది

"ఏయ్ ... ఎవరంటే జవాబు చెప్పకుండా ,ఇంతంతకళ్ళేసుకు దయ్యంలా ఆ చూపేంటి? "

దబాయింపుగా అంది.

" చించిం ఎవడో దారినపోయేదానయ్యతో ఆ కబుర్లేంటీ? మనమేమిటీ? మన అంతస్తేమిటీ? కనబడడంలేదూ అదిగో ఆ కేక్ తో బాటు పొరపాటుగా వచ్చేసిఉంటారు అలగా జనం... ఇంట్లో వాళ్ళ కళ్ళబడితే ఆ కేక్ తో బాటే వెళ్ళి చెత్తబుట్టలో పడతారు, చల్వాళ్ళతోమాటలేమిటీ? దానిలాగే ఎర్రగా బుర్రగా ఉన్న ఇంకో పెద్దాయనఅన్నాడు, బహుశా ఆ పిల్ల తండ్రి కాబోలు...  

" అలాగే నాన్నారూ " గారంగా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోయింది ఆ చించిం. చీమారావ్కళ్ళముందు కారు చీకట్లు, మరి మెరుపులాంటి చించింవెళ్ళిపోయిందిగా.

మనసు మార్చుకు ప్రేమగా తనకేసి రాబోయిన చీమారావ్అంతలోకే మనసు మార్చుకుతనకేసిచీదరింపుగా చూడడం తన కళ్ళముందే ఆ కులుకుల రాణిని ఆరాధనగా గొప్పగా చూడడం తట్టుకోలేకపోయింది.

"నువ్వెంతగా వెంటబడినా ఆ గొప్పింటి రాణికి నువ్వు ఆనవు, నీకు అవమానమే తప్ప ఆ పిల్ల దక్కదు, నా మాట విను ఈ గొప్పింటివాళ్ళ సంగతి నీకు తెలియదు, వాళ్ళు మనలాంటి పేదవాళ్ళ నీడ కూడా భరించలేరు... చూసావుగా వాళ్ళ డాబూ,దర్పం, ఇలా ఏ.సీలలో ఉంటారు ... పట్టు పరుపులమీద నిద్రిస్తారు నువ్వు ఆ పిల్లను మరచిపో, ఎలాగైనా ఇక్కడనుంచితప్పించుకుపోదాం,ఇక్కడే ఉంటూ  మనకు వాళ్ళలా తప్పుకోవడం, తప్పించుకు తిరగడం తెలియవు..  ఈ ఇంటి మనుషులు మనల్ని చూసారంటే ఏ మందో,మాకో పెట్టి చంపేస్తారు, నన్ను చేసుకోకపోయినా ఫర్వాలేదు నువ్వు క్షేమంగా ఉంటే చాలు." కళ్ళనీళ్ళతో అంది చిచ్పూ. నిర్లక్షంగా ఓ చూపు చూసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు చించిం వైపు.

" ఏంటీ నా వెనక పడ్డావ్? " కవ్వింపుగా అంది చించింఓరగా చూస్తూ ... చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి. 

"నాకు నువ్వు బాగా నచ్చావు,నన్ను పెళ్ళిచేసుకో నిన్ను మహరాణిలా చూసుకుంటాను " ప్రేమగా కళ్ళలోకళ్ళుపెట్టి చూస్తూ అడిగాడు.
ఫకాల్మని నవ్వింది అందమైన తనవంక ఓ సారి గర్వంగా చూసుకుంటూ ...

పెళ్ళా? నిన్నా? నీకు తెలుసా నేను పుట్టిందీపెరిగిందీ ఇక్కడే ... పగలూ రాత్రీ ఏ.సీ గదుల్లో తప్ప ఉండలేను ... ఖరీదైన తిండి తప్ప తినలేను, నీకు తెలుసా రోజూ జీడిపప్పు, బాదాం తిని బతికే నేను నిన్ను చేసుకుంటే,రేషన్ బియ్యం,   ఎంగిలి కంచాల దగ్గరా తింటూ బితుకూబితుకూ మంటూ దిక్కుమాలిన బతుకు గడపాలి, అది నా వల్ల కాదు అయినా నేను ఇక్కడే మాతో బాటే ఉంటున్న మాంచిపవర్ఫుల్ కరెంట్ చీమూని ప్రేమిస్తున్నా, పెళ్ళి చేసుకు ఇక్కడే సర్వసుఖాలూ అనుభవిస్తూ గడిపేస్తాం ... వెళ్ళు అనవసరంగా వాళ్ళ కంట పడి ప్రాణం మీదకు తెచ్చుకోక చల్లగా ఇక్కడనుంచి జంప్ అయి అదిగో నువ్వంటే పడిచస్తున్న ఆ చలిచీమను చేసుకోఫో ... " విసవిసా వెళ్ళిపోయింది.

" అదిగో వాళ్ళెవరో తలుపు తీసి ఆ గిన్నెలు బయటకు తీస్తున్నారు, త్వరగా వాటిమీదకు చేరి ఇక్కడనుంచితప్పించుకుపోదాం రా, పోనీలే నేనంటే ఇష్టం లేని నిన్ను చేసుకు నేను మాత్రం ఏం సుఖపడతాను, ముందు ఇక్కడ నుంచి బయట పడి తరువాత నీకు ఎవరు నచ్చితే వాళ్ళనేచేసుకో ... త్వరగా రా ... అదిగో వాళ్ళు ఆ గిన్నె తీస్తున్నారు, నే పోతున్నా ... నువ్వూ రా " అంటూ తను ఆ గిన్నె మీదకు దూకుతూ, చీమారావుని ఒక్క గుంజు గుంజింది....

"అమ్మయ్యా ... ఆ మంచు కొండల్లోంచి బయట పడ్డాం ... ఇదిగో నే ఈ భవంతిలోంచి బయటకు పోతున్నా ... క్షణం క్షణం భయంతో చస్తూ ఇక్కడ ఉండలేను ... హాయిగా మనతో బాటే ఉంటూ, మనతో బాటే తింటూ ఉండే నా స్థాయి జనం మధ్యకు పోతా ... నువ్వు కూడా అత్యాశకి పోక నీ స్థాయి గమనించుకుని, హాయిగా, సుఖంగా బ్రతుకు... బై బై ... నీ సుఖమే నే కోరుకున్నా, నిను వీడి అందుకే వెడుతున్నా ... " కళ్ళుతుడుచుకుంటూ ఆ ఇంట్లో పని అతని చొక్కా మడతలో దూరిపోయింది ... ఎటూ వాడి పని సమయం అయిపోయాకావాడింటికి వాడు వెడతాడుగా అందుకే ...

మనిషయినా, చీమైనా, దోమైనా తమ తమ స్థాయి మరచిపోతే అన్నీ కష్టాలే మరి అనుకుంటూ. ఇంత జరిగినా తన మీద ఏ మాత్రం కోపం పెట్టుకోక తన సుఖాన్ని, ఆనందాన్ని ఆశించే చిచ్పూ కన్నా ప్రేమించే వాళ్ళు తనకెవరు దొరుకుతారు? మనం ప్రేమించేవాళ్ళకన్నా, మనల్ని ప్రేమించేవాళ్ళని చేసుకుంటేనే తన జీవితం హాయిగా, ఆనందంగా మూడు పువ్వులూ, ఆరు కాయలుగా సాగిపోతుంది, అవును అదే కరెక్ట్, నేనూ తనతో బాటే, ఇద్దరం హాయిగా ఆనందంగా జీవితాంతం పాలూ-నీళ్ళలా కలిసిమెలసిగడిపేస్తాం ... అనుకుంటూ తను కూడా చటుక్కున అతని చొక్కా మడతల్లో దూరిపోయింది చిచ్పూ వెనకాలే.                                                                                                ***                  

మరిన్ని కథలు
kavisainyam