Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Height Increase | Grow Taller | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

సాధారణంగా, మాట్టాడేటప్పుడు, అవతలివారి మనోభావాలు కించపరచకుండా కూడా మాట్టాడొచ్చు. కానీ, అది ఒకరాజకీయనాయకులకి మాత్రమే సాధ్యం. మామూలు మనుషులు, ఏదో నిక్కచ్చిగా మాట్టాడేమో అనుకుని వీధిన పడిపోతూంటారు. సాధారణంగా, భార్యలు, భర్తలని కంట్రోల్ చేస్తూంటారు, ఇలాటి సందర్భాలలో. కానీ, ఆ విషయాన్ని గుర్తించకుండా, ఊరికే చిరాకు పడిపోతూంటాము... ఎప్పుడైనా, ఎవరింటికైనా వెళ్ళేముందరే, భార్యలు, భర్తలకి, ఓ “ క్లాసు “ తీసికుంటారు, తమ భర్తల  నోటి దురుసుతనమూ, పధ్ధతీ తెలిసుండడం వలన. అదేమీ తప్పుకాదు. ఒక్కోసారి, బుధ్ధిమంతుడిలాగ, నోరు విప్పకుండా,  అవతలివారు చెప్పిందే పరమావధిగా పెట్టుకుని, ఏదో కొద్ది సమయం, గడిపి క్షేమంగా తిరిగి వచ్చేస్తాడు. కానీ, ఎప్పుడూ, డబ..డబా .. వాగేవాడు, మరీ అంత “ ముంగి “ లా కూర్చుంటే, అవతలివాళ్ళకి, ఏదో తేడా కనిపించిపోతుంది. “ ఏమిటీ, అన్నయ్యగారి మూడ్ బాగాలేదేమో..


మరీ ఇంత సైలెంటుగా ఎప్పుడూ లేరే..” అంటారు. ఇలాటి పరిస్థితులు తలెత్తకుండా, బ్యాలెన్సు చేసికుని రావాలంటే, కొంచం కష్టమే మరి. అలాగని, నా భార్య, ముందరే చెప్పిందీ అంటే, మరీ బాగోదాయె.  పోనీ, నోటికొచ్చిందేదో, మాట్టాడేద్దామా అనుకుంటే, ఇంటికెళ్ళ్ళిన తరువాత ఎదురయ్యే పరిస్థితులు, ఎలా ఉంటాయో మరి ? అసలు గొడవంతా భోజనాల దగ్గర వస్తుంది. ఏదో తిండిపుష్ఠి ఉన్నవాడూ, (ఇదివరకటిరోజుల్లో, నాలుగైదు సార్లు వచ్చినవాడేగా ) అనుకుని, తన పాకకళాప్రావీణ్యమంతా రంగరించి, రకరకాల కూరలూ, పచ్చళ్ళూ చేస్తుందా ఇల్లాలు. టేబుల్ మీద పెట్టిన పదార్ధాలు చూడగానే, ఈ భర్తగారికి నోరూరిపోతుంది. తినడం, ప్ర్రారంభించగానే, మొదలవుతుంది, టేబుల్ కిందనుంది, భార్య తన కాలుని “ గోకడం”. దానర్ధం, ఊరికే “ ఆబ “ గా తినకండేం అని. ఇంకేముందీ, ఏదో కోడికెక్కరించినట్టు, సుతారంగా తినడం. నేర్చుకోవాల్సిందేమిటంటే, ఎక్కడైనా, ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు, సాధ్యమైనంతవరకూ, దరిదాపుల్లో ( పక్కన కానీ, ఎదురుగుండా కానీ, కాలు తగలకుండా) కూర్చోకుండా చూసుకోవడం. ఇంకో విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి--- ఎటువంటి పరిస్థితుల్లోనూ, అక్కడ తిన్న పదార్ధాలని, ఎంత నచ్చినా సరే పొగడకూడదు.

 ఒక్కరే ఉన్నప్పటి పధ్ధతి వేరూ, జంటగా ఉండే పరిస్థితి వేరూ. ఇతరుల ప్రమేయం ఉండదు. గుర్తుండే ఉంటుంది, బ్రహ్మచర్యంలో, ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు, హాయిగా ,  నచ్చినపదార్ధాలు, కొసరు అడిగి మరీ తింటారు. ఆ పెట్టినవారికీ, చాలా సంతృప్తిగా ఉంటుంది.. తను చేసిన వంటకాలు నచ్చాయీ అంటే, ఏ ఇల్లాలు సంతోషపడదూ, కట్టుకున్నవాడు, ఒక్కనాడూ, తన వంటకాల గురించి, బాగున్నాయనలేదు.  ఇన్నాళ్ళకి , బయటివాడు అన్నాడు అని సంతోష పడుతుంది..  భర్త పొగడకపోవడానికి  కారణం—ప్రతీరోజూ పొగిడేదేమిటిలే అనుకుని. అయినా , భార్యచేసిన వంట, ప్రతీరోజూ పొగిడితేనే, సుఖసంసారానికి  కొలమానమా ఏమిటీ అనుకుని.ఇల్లాలుకూడా, “ జీవితంలో ఈయన మాత్రం బాగుపడడూ..” అనుకుని పరిస్థితులతో రాజీ పడిపోతుంది.

 అందుకనే ఏమో, ప్రతీ ఇల్లాలూ, మరీ ప్రతీరోజు కాకపోయినా, నెలలో కనీసం, ఒకటిరెండుసార్లు, బయటివారికి భోజనం పెట్టడానికి సంతోషపడుతుంది. ఇదివరకటిరోజుల్లో, ప్రతీరోజూ, ఓ అతిథి విస్తరి వేస్తే , సంతోషించేవారు, అది వేరే విషయం. ఈరోజుల్లో, అప్పటి, ఆప్యాయతలూ లేవూ, సామర్ధ్యమూ లేదు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే, హాయిగా, ఏ హొటల్ కో తీసికెళ్ళి పని కానిచ్చేస్తున్నారు. ఏ గొడవా లేదు.మరీ  ఏ వంటమనిషో ఉంటే ఫరవాలేదు కానీ, ఈరోజుల్లో ఒకరిద్దరికంటే, ఎక్కువ అతిథులు వస్తే, చేయడం ఇంటి ఇల్లాళ్ళకి కొద్దిగా కష్టమే. ఎవరిష్టాలు ఎలా ఉంటాయో తెలియదు. అలాగని ఎవరికికావాల్సినవి చేయడమూ కొద్దిగా కష్టమే. పైగా, పాతతరంవారికి, సాంప్రదాయ వంటలు చేయడమే కానీ, ఈరోజుల్లో పిల్లలు ఇష్టపడే, ఫాస్టు ఫుడ్డులూ అవీ చేయడం రాదాయె. అందుకనే ఏ హొటల్ కో తీసికెళ్ళిపోతే గొడవుండదు.

 ఇంక ఏదో, సుగరుందనో, కొవ్వుపెరిగిపోతుందేమో అనుకుని, ఇంట్లో,  controlled diets  తో హింసింపబడేవారి పరిస్థితి, చూడాలి, ఏ పెళ్ళి రిసెప్షన్ కో, గృహప్రవేశ విందుకో వెళ్ళినప్పుడు, పెట్రేగిపోతూంటారు.   ఛాన్సు దొరికిందికదా అని లాగించేస్తే అదో గొడవా. సాధారణంగా, ఏ శస్త్రచికిత్సలో చేయాల్సొచ్చినప్పుడు, ముందుగా అవేవో, సుగర్ లెవెల్సూ అవీ సరీగ్గా ఉన్నాయో లేదో చూడాలిట. అలాటప్పుడు, విందులూ, వినోదాలకీ వెళ్తే, మనం పడ్డ కక్కూర్తులు బయట పడిపోతూంటాయి జాగ్రత్త  !!

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
veekshanam