Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahitivanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిద్ధటేక్ సిద్ధివినాయకుడు - ..

యీ వారం మనం అష్ఠ గణపతులలొ ఒకటైన  సిద్ధటేక్ సిద్ధివినాయకుడు గురించి తెలుసుకుందాం .

పూణే నగరం నుంచి సుమారు 55కిమి .. షోలాపూర్ రోడ్డు మీదుగా వెళ్తే భీమా నదికి ఉత్తర తీరాన అహ్మద్ నగర్ జిల్లాలో కర్జాత్ తాలుకాలో వున్న సిద్ధటేక్ గ్రామానికి ఒక కిలొమీటరు దూరంలో వో చిన్న గుట్టపై వుంది సిద్దివినాయక మందిరం . 

మహారాష్ట్రాలో వున్న అష్ఠ గణపతి మందిరాలలో యిది రెండవదిగా చెప్తారు .

యిక్కడ సిద్దివినాయకుని తొండం కుడివైపుకి తిరిగి వుంటుంది . తొండం కుడివైపుకి తిరిగి వున్న వినాయకుడు అత్యంతశక్తులను కలిగి ఉంటాడని ప్రతీతి , అటువంటి వినాయకుని ప్రసన్నం చేసుకోవడం కూడా కష్ఠమ్ అని కుడా అంటారు . యీ వినాయకుని పూజిస్తే సకల కార్య సిద్ధి లభిస్తుందని , సకల మంత్రం , తంత్ర శక్తులు సిద్ధిస్తాయని నమ్మకం. యీ క్షేత్రాన్ని జాగృత క్షేత్రం అనిఅంటారు . యిక్కడ వినాయకుడు జాగ్రదావస్థ లో వుండి భక్తుల కోరికలు తీరుస్తూ వుంటాడని ప్రతీతి .

యీ మందిరం నల్లరాతి కట్టడం . భీమా నదీతీరాన చిన్న పర్వతం పైన తుమ్మ అడవుల మధ్యన వుంది యీ మందిరం . 18వ శతాబ్దం లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కార్ చే మందిరం , దీప స్థంభం నిర్మింప బడ్డాయి  . తరవాత తరవాత కాలాలలో లోపలి మండపాలు , నగారా మండపం మొదలయినవి నిర్మించ బడ్డాయి . 15అడుగుల యెత్తు , 10 అడుగుల వెడల్పు గల ద్వారం నుండి గర్భ గుడిలొకి ప్రవేశిస్తాము . ద్వారానికి యిటు అటు ద్వారపాలకులుగా జయ విజయులు , లోపల స్వయంభూ గణపతిని , వినాయకుని కాలుదగ్గర వినాయకుని భార్యగా చెప్పే సిద్ధిని చూడొచ్చు , మాములుగా పూల అలంకరణ , సింధూరం అలంకరణలలో సిద్ది విగ్రహం కప్పబడి పోతూ వుంటుంది . పూజారిని అడిగితే చూపుతారు . వినాయకుని కి  ప్రక్కగా ఇత్తడి విష్ణు మూర్తి ప్రతిమ వుంటుంది . గర్భగుడిలో పంచాయతనం ( శివుడు , వినాయకుడు ,విష్ణుమూర్తి , మిగతా దేవీ దేవతలు సూర్యుడు ) వుంటుంది .

ఇక్కడి స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం .    ముద్గల పురాణం , స్కంద పురాణం ప్రకారం కృత యుగం లోమహావిష్ణువు యోగనిద్ర లో యుండగా  మహావిష్ణువు నాభి నుంచి పద్మవాహనుడిగా ఉద్భవించిన బ్రహ్మ బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ  వుండగా విష్ణుమూర్తి  చెవులనుండి పుట్టిన మధు , కైటభులు అనే రాక్షసులు సృష్ఠికి ఆటంకం కలుగ జేస్తూ వుంటారు . ఋషులు , మునుల ను అనేక రకాలైన బాధలకు గురి చేస్తూ వుంటారు . ఋషులు , మునులు దేవీ దేవతలు అందరూ విష్ణు మూర్తి వద్దకు వచ్చి పరిపరి విధాలుగా స్తుతిస్తూ  యోగనిద్రా భంగం కలిగిస్తారు . 

యోగనిద్ర నుండి మేల్కొన్న విష్ణు మూర్తి విషయం తెలుసుకొని మధు కైటభు లతో యుద్దానికి వెళతాడు . విష్ణు మూర్తి యెంత యుద్ధం చేసినా మధు , కైటభు లను వోడించ లేకపోతాడు . వారిని వోడించ లేకపోవుటకు గల కారణం తెలుసుకొనగోరి పరమ శివుని ప్రార్ధించగా , శివుడు యుద్ధానికి ముందు వినాయకుని పుజించుట విష్ణు మూర్తి మరిచె ననే విషయం చెప్తాడు . అప్పుడు విష్ణుమూర్తి వినాయకుని " ఓం శ్రీ గణేశాయనమః " అనే మంత్రం జపం తో  ప్రసన్నుని చేసుకొని వినాయకుని వద్దనుండి అనేక శక్తులు పొంది తిరిగి మధు , కైటభు ల పైకి యుద్ధానికి వెళ్లి వారిని సునాయాసము గా సంహరిస్తాడు . 

మధు కైటభుల కోరిక మేరకు విష్ణు మూర్తి యీ ప్రదేశం లో మందిరం నిర్మించి , శక్తులను సిద్ధింప చేసే వినాయకుడు కాబట్టి సిద్దివినాయకుడు అని నామకరణం చేసేడు .

 గణపత్యం మతం ప్రాచుర్యం లో వున్నప్పుడు మౌర్య గోసాయి , నారాయణ్ మహారాజ్ లు ఇక్కడ  వినాయకుని ఆరాధించు కొని ముక్తి పొందేరని స్థానికుల కధనం .

విష్ణు మూర్తి చే నిర్మింప బడ్డ మందిరం కాలాంతరం లో కూలిపోయి మట్టిలో కలిసి పోయిందని 12వ శతాబ్దం లో ఆవుల కాపరి ద్వారా యీ విగ్రహం కనుగొనబడగా అప్పటి ఆదేశపు రాజు మందిరం కట్టించెనట . అదికూడా కాలాంతరాన కూలిపోగా యిప్పుడు వున్న మందిరాన్ని ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కార్ చే నిర్మింప బడింది . ప్రస్తుతం యీ మందిరం " చించవాడ్ మందిర్ ట్రస్ట్ " వారి ఆధ్వైర్యం లో భక్తులకు తాత్కాలిక వసతులకు గదులు , నిత్యాన్నదానము , వుచిత విద్య మొదలయినవి నిర్వహింప బడుతున్నాయి .
 

సిద్ధి వినాయకుని కోవెల వున్న కొండకి ఏడు ప్రదక్షిణలు చేసుకుంటే సిద్ది వినాయకుడు ప్రసన్నుడై భక్తుల కోరికలు తీరుస్తాడని భక్తు ల నమ్మిక . 
యీ కోవెలలో గణేశ జయంతి , వినాయక చవితి , దశరానవరాత్రులు , సోమావతి అమావాస్య ( సోమవారం అమావాశ్య అయితే ) విశేషం గా జరుపుతారు .
మరిన్ని శీర్షికలు
weekly horoscope 23rd october to 29th october