Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వర ప్రసాదరావు

sahitivanam

ఆముక్తమాల్యద 

(గత సంచిక తరువాయి)
 
గోదాదేవి శ్రీహరిని తన నాథునిగా పొందదలచి ఆయనను విశేష మార్గంలో అర్చించడం మొదలెట్టింది.ఇంతలో వసంతఋతువు ప్రవేశించింది. ఋతువర్ణన ప్రబంధ లక్షణాలలో ఒకటి. ఇంతకుముందు గ్రీష్మ ఋతువును, వర్ష ఋతువును, శరద్రుతువును వర్ణించిన రాయలవారు ఇప్పుడు వసంతవర్ణనా సుమలతాంతాల వర్షం కురిపిస్తున్నాడు. అరవై ఆరు పద్య  గద్య ఆశ్వాసాంత పద్యాలతో కూడిన ఈ భాగం 
మాటలకందని చమత్క్రుతికి, కల్పనలకు నిలయం. మచ్చుకు కొన్ని ముఖ్యమైన ఘట్టాలను రుచి చూసి ఆ తర్వాత ఈ ప్రబంధంలోని చివరిదైన ఆరవ ఆశ్వాసానికి వెళ్దాము.

మొదల నాముక్తమాల్యద మదనతాప తరణి పెనువెట్ట వేఁగిన దక్షిణాశ మత్కృతోష్మకుఁ దుదముట్ట మాఁడు ననుచుఁ దొలఁగె నన నుత్తరాశకు దొలఁగెఁ దరణి మొదలే 'ఆముక్తమాల్యద' కు కలిగిన మదనతాపమనే సూర్యుడు 'రెచ్చిపోవడం'తో వేగిపోయిన దక్షిణాకాశం నా వేడిమికి పూర్తిగా మాడిపోతుంది, ఎందుకులే పాపం అన్నట్లుగా ఉత్తరాకాశానికి తొలిగిపోయాడు ఆకాశంలో సూర్యుడు. అంటే ఉత్తరాయణం ప్రవేశించింది. చాలా చిన్ని పద్యం, కానీ పెనుచమత్కారాల రసరమ్యం. చాలా సరసమయమైన రహస్యాలను కష్టపడకుండా తెలుసుకునే 
విధంగా సున్నితంగా, సరళంగా, క్లుప్తంగా చెప్పిన అరుదైన రాయలవారి పద్యాలలో యిదొకటి.

'ఆముక్తమాల్యద' అనే గ్రంథ నామధేయంతో వసంతఋతువు మొదలైంది. ఆముక్తము అంటే వదిలిపెట్టినది, అంటే ధరించి విడిచిపెట్టినది. మాల్యము అంటే మాలిక, తెలిసినదే, 'ద' అంటే యిచ్చినది. అంటే తను ధరించి విడిచిపెట్టిన, ఎంగిలిచేసిన, అనుభవించి యిచ్చిన మాలను పరమాత్మునికి యిచ్చింది కనుక 'ఆముక్తమాల్యద' ఐంది ఆవిడ. నిజానికి ఈ గ్రంథానికి 'విష్ణుచిత్తీయము' అనే మరొక పేరు 
కూడా ఉన్నది. విష్ణుచిత్తుని కథ కనుక. మొదటినుండీ చివరివరకూ ప్రతి ఆశ్వాసములోనూ ఆయన ఉన్నాడు కనుక. కానీ ఆయన తన పరమాత్మునిలానే కనిపించీ, కనిపించక ఉన్నట్టే అనిపిస్తుంది. గోదమ్మ విశ్వరూపంతో నిండిపోతుంది, ఈ కథ తెలిసిన వారే, కథను ప్రేమించేవారే దీన్ని చదువుతారు గనుక. ఖచ్చితంగా ఉన్నదున్నట్టుగా గ్రంథ నామధేయాన్ని యిలా పద్యరూపములో ఇచ్చిన ప్రబంధం 
వేరే ఏదీ సామాన్య పాఠకుడైన ఈ వ్యాసకర్తకు కనబడలేదు. మనం ఈ రోజుల్లో 'టైటిల్ సాంగ్' అని అనుకుంటున్నట్లు యిది 'టైటిల్ పద్యం'. యిది ఒక చమత్కారం.
 
వసంతంలో కొత్త ఆశలు మోసులెత్తుతాయి. కొత్త చివుళ్ళు తలలెత్తుతాయి. వసంతంలో తొడిగిన ప్రతి చివురు, ప్రతి సుమము శోభిస్తుంది. మిగిలిన ఋతువుల్లో ఎంత ప్రయత్నించి, ప్రేమించి సాకినా కళ, ఈ జీవము ఉండదు లతలలో, వృక్షాలలో, పూలలో, గాలిలో ప్రకృతిలో కూడా. వేడి ఎక్కువై ఎండాకాలంలో, తడి ఎక్కువై వర్షాకాలంలో, సూర్యకాంతి తగ్గి శరదృతువులో, మరీ క్షీణించి హేమంత 
ఋతువులో, శిథిలమై శిశిర ఋతువులో ఆకులు, పూలరేకులు, చివుళ్ళు మాడిపోతాయి, నానిపోతాయి, నలిగిపోతాయి, రాలిపోతాయి. యిది ఋతుపరమైన రహస్యం, ఈ రహస్యాన్ని అమ్మ కోర్కెపరంగా వాడుకున్నారు కవనసార్వభౌమ రసికరాయలు, కనుకనే ఆమె కామనల వసంతమిది, ఫలిస్తుంది.

ఆమె కామనల వసంతఋతువును సూచించడానికే ఆమె పేరుతో మొదలెట్టాడు. ఆపేరు కూడా ఆమె ఏ రకంగా పరమాత్ముడిని లొంగదీసుకుందో తెలియజేసే పేరే పెట్టాడు. ఒక చమత్కారం ఏమిటంటే ' ఈ పాటికే వధూవరులు దండలు మార్చుకోవడం' పూర్తి ఐంది. ముందు ఆమె చాటుగా ధరించి వదిలివేసిన మాలను పరమాత్మునికి యివ్వడాన్ని గురించి చెప్పాడు. ఈ ఆశ్వాసంలో పరమాత్ముడు
ధరించిన మాలను నిర్మాల్యంగా, ప్రసాదంగా అర్చకస్వామి యిస్తే ధరించింది అని చెప్పాడు. అమ్మ ఇంకా నేరుగా అయ్యను చేరుకోలేదు, భక్తురాలి స్థాయిలో ఉన్నది, కనుక మధ్యన అర్చకస్వామి కరుణ అవసరము ఐంది. భగవంతునికి, భక్తునికి మధ్యన గురువుగా, అనుసంధానకర్తగా ఒకరు అవసరం, కనుక అర్చకస్వామి(నంబి) యిచ్చిన మాలను ధరించింది అని స్పష్టంగా చెప్పాడు. యికపై విశ్వంలో 
అదృష్టవంతులు కావాలనుకునే భక్తులెవరికీ వేరేవారి అవసరము లేదు, ఉండదు. గురువుగా, సంధానకర్తగా, అమ్మగా, పురుషకారిణిగా గోదమ్మ జీవులను, జీవికలను తరింపజేస్తుంది యిక, కనుక ఆమె ఆశల వసంతము, విష్ణుమోహితుల ఆశలకు కూడా యిది వసంతము.
స్వామివారి విరహతాపం అనే సూర్యుని వేడికి ఆముక్తమాల్యద ఈసరికే మాడిపోయింది, ఎండాకాలంలో లాగా. ఆమె కన్నీరు మున్నీరైంది వర్షాకాలంలాగా. నిర్మలమైన ప్రేమ చిగిర్చింది శరత్కాల నదీ నదాల,

సరసుల జలములలాగా. స్వామి మీది కోపం, అనుమానము, ఉక్రోషము, ఈర్ష్య, మత్సరము, సాధింపులు అనే మంచుతెరలు కప్పుకున్నాయి, హేమంత ఋతువులోలాగా. యిక ఏ ఆశా లేదు, ఇక ఈ జీవితం వ్యర్థం అనుకుని శిథిల శిశిర పర్ణమై, వివర్ణమై, వ్యథావికీర్ణమైపోయింది శిశిరఋతువులోలాగా. అప్పుడు కారణజన్ములు ఐన (నాగకన్యలు) చెలికత్తెలు గురువులైనారు, మార్గదర్శకులైనారు, ఆశాజ్యోతులైనారు, పరమాత్ముని చేరుకునే మార్గం చూపించారు, ఆమెలో ఆశ కలిగింది, ప్రకృతికి వసంతంలో కలిగినట్లుగా. ఆ మూల ప్రకృతికి తానేంటో తెలిసింది, తనకు ఏం కావాలో తెలుసుకుంది, దాన్ని పొందడం ఎలా సాధ్యమౌతుందో తెలిసింది, యిక ఎప్పుడు అన్నదే మిగిలింది. త్వరలోనే అన్న ఆశల వసంతం ఏతెంచింది. ఔను, యిక ఈ ప్రకృతి తన పురుషుడిని, ప్రథమపురుషుడిని, ఏకైక పురుషుడిని చేరుకునే ఆశలు ఫలించే  వసంత తరుణం వచ్చింది. యివన్నీ లలిత లలితంగా వసంత మలయమారుతంలాగా గుసగుసగా రహస్యంగా చెప్తున్నారు రాయలవారు ఈ చిన్ని పద్యంలో.

గోదాదేవి విరహతాపమువలన దక్షిణ దిక్కు వేడెక్కి మాడిపోయింది అనడం ఆమె ప్రకృతి అనడం, తన  పురుషుడిని చేరుకునే ఆశ చిగిర్చడం వసంతం అరుదెంచడం. అసలే ఈమె విరహతాపానికి వేడెక్కి ఉన్న దక్షిణ ఆకాశాన్ని ఇంకా వేడెక్కించడం ఎందుకు అని ఉత్తర ఆకాశానికి చేరుకున్నాడు సూర్యుడు. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రవేశించింది అని సూచన. దక్షిణ నాయకుడు, అమ్మకు దక్షిణ 
నాయకుడైన ఆకాశనీలిమ ఐన పరమాత్ముడు కూడా ఈమె విరహంతో వేగిపోతూనే ఉన్నాడు, యిక  చాల్లే, నేను కూడా వేగించడం ఎందుకు అన్నట్లు ఉత్తరాకాశానికి చేరుకున్నాడు సూర్యుడు. క్రమక్రమంగా ఉత్తరాయణం ప్రవేశించింది, మార్గశిరం ప్రవేశించింది, ధనుస్సంక్రమణం జరిగింది, మకరసంక్రమణం జరిగింది, వసంతం ప్రవేశించింది. ప్రకృతిలోని ఋతువుల పరంగా క్రమ పరిణామ దశ యిది. మార్గ శీర్షంలోనే విష్ణువును  చేరుకునే మార్గశీర్షమైన, మార్గములన్నింటిలోనూ అత్యంత తేలికైన, సుఖమైన, సురక్షితమైన మార్గమైన ప్రపత్తి మార్గాన్ని, సంకీర్తనా మార్గాన్ని అమ్మ అనుసరించింది, అనుసరింపజేసింది. తిరుప్పావై వ్రతాన్ని చేసి, దివ్య పాశురములను రచించి పాడి, తన ఆశలు అందంగా కుసుమించి, ఫలించే వసంతం వచ్చింది గోదమ్మకు అని సూచన జేస్తున్నాడు రాయలవారు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.    
మరిన్ని శీర్షికలు
siddhi vinayakudu