Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ: చంద్రకళ వాళ్ళ అమ్మమ్మ కుట్టించిన తెల్ల పట్టు పరికిణీ, కుంకుం రంగు వోణీ వేసుకుని, ముత్యాల హారం, ముత్యాల గాజులు, జుమ్కాలు పెట్టుకుని  జడ వేసుకొని హాల్లోకి వస్తుంది. అందరూ చంద్రకళనే ఎగాదిగా చూస్తారు.. వాళ్ళ తాతగారు మాత్రం పందిరి నొదిలి మల్లె తీగ ఇంట్లో నడుస్తుందేమిటి?” అంటూ చమత్కరిస్తారు... ఆ తరువాత....   

అత్తయ్య నుండి ఫోన్ అందుకుని, లేచి బయటకి నడిచాడు జగదీష్.  రాణితో మాట్లాడ్డానికి, అతనలా అవతలికి వెళ్ళడం, నాకు కోపంగా, అవమానంగా అనిపించింది.

విసురుగా అక్కడి నుండి కదిలి,వరండాలో అమ్మా వాళ్ళ వద్దకు వెళ్ళి కూర్చున్నాను. 

​ఢిల్లీ షాపింగుల గురించి,అత్తయ్య,చెన్నై గోల్డ్ షాపుల గురించి,అమ్మ,  అమ్మమ్మకి కబుర్లు చెబుతున్నారు....

దూరంగా కూర్చున్న నన్ను చూసి, “ఇలా వచ్చి కూర్చోమ్మా,” అంది  అమ్మమ్మ.. వెళ్లి పక్కనే కూర్చున్నాను.

“రేపేగా అమరావతి ప్రయాణం....అక్కడి నుంచి తిరిగొచ్చిన మూడో రోజున అందరూ వెళ్ళిపోతారు.  ఇల్లంతా బోసి పోతుంది. ఇప్పట్నించే దిగులుగా ఉంది,” అంది నా భుజం మీద చేయి వేస్తూ.

“ఇకపై ప్రతి యేడూ  వస్తాము లేమ్మా, అంత దిగులెందుకు.” అమ్మ జవాబుగా. 

“అమరావాతంటే గుర్తొచ్చింది.  మేము వెళ్ళి చాలా కాలమయింది.  రోడ్లు, ఊరు అలాగే ఉన్నాయా?” అడిగింది మణత్తయ్య.

“మేము మూడేళ్ళ క్రితం వెళ్ళాము.  గుంటూరుతో సమానంగా అభివృద్ధి చెందిందిగా,”

మా అమరావతి  ట్రిప్పు గుర్తు  చేసుకుంటూ అమ్మ.

అమరావతి ఎంతలా డెవలప్  అయిందో డిస్కస్ చేయసాగారు.

**

మరి కాసేపటికి, లోనికొచ్చి,  వాళ్ళమ్మకి సెల్ఫోన్ అందించి, మా ఎదురుగా కూర్చున్నాడు జగదీష్.  ముభావంగా ఉన్నాడు.

‘రాణితో మాట్లాడినంత మాత్రాన అతని మూడ్  ఇంతలా మారాలా?’  అనుకున్నాను.

“మళ్ళీ ఏమిట్రా? ఆ అమ్మాయి ఏమంటుంది?” అంది జగదీష్ ని గమనించిన అత్తయ్య. 

“ఏదో చెబుతూనే ఉంటుంది. నాకు బోర్ కొట్టిస్తుంది,” ఆసహనంగా జగదీష్.

“సరదాగానే మాట్లాడుతావుగా, అంతలోనే ‘బోర్’ అంటావే?” నసిగింది అత్తయ్య...

“నువ్వేగా!  రాణిని ఎంకరేజ్ చేస్తావు.  శారదత్తయ్యకి  స్టూడెంట్  కాబట్టి, ఫామిలీ  ఫ్రెండ్సు కాబట్టి, వాళ్ళతో మంచిగా ఉండమంటావు.   నీ వల్లే, ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడల్లా ఫ్రెండ్లీగానే మాట్లాడుతాను.  నా తల తినేస్తుంది.అసలు,సమస్యంతా నీ మూలంగానే మమ్మీ. అయినా ..నువ్వు అటు ఇటు కూడా మాట్లాడుతావు మమ్మీ,”  కోపంగా లేచి తన రూం కి వెళ్ళిపోయాడు జగదీష్.

‘రాణి విషయంలో’ నేనన్న మాటలకి, ఇలానాకు జవాబు చెపుతున్నాడా?... అనిపించింది..  కాసేపు ఎవ్వరు ఏమీ అనలేదు.
అత్తయ్యే  మాట్లాడింది.

“ఏం లేదు శారదా.  వీడంటే ఆ అమ్మాయికి ఏదో ఆకర్షణ.  తన వెంట తిప్పుకోవాలని ఆరాటం.   అతి గారాబమనుకుంటా.  కాస్త మొండిదనిపించినా, పిల్ల మంచిదే, మాతోఆప్యాయంగా ఉంటది,” క్షణమాగింది అత్తయ్య. 

అందరం వింటున్నాము...

“మొన్న వాళ్ళు ఢిల్లీ  వచ్చినప్పుడు, వీడి బర్తడేకి  డైమెండ్ లాకెట్ ప్రెజెంట్ చేసింది.  వీడు తీసుకోనన్నాడని, మూడు రోజులు పచ్చి మంచినీళ్ళు  ముట్టలేదు,. 

ఇక ఆఖరికి లాకెట్ తీసుకున్నాడు.   కాకపోతే , తను వేసుకోననిదాన్ని నాకిచ్చేసాడనుకో.  ఇదిగో నా మెడలోనే ఉంది,” లాకెట్ చూపిస్తూ అత్తయ్య.

“ఇంతకీ, చెప్పేదేమంటే, ఆ అమ్మాయి వీడితో ఫ్రెండ్లీగా, ఉంటుంది.  ఈ తరం వారు చాలా మటుకు అలాగే ఉంటారుగా మరి,” తేల్చేసింది అత్తయ్య.

అమ్మమ్మ నా వంక చూసి సన్నగా నవ్వింది.

కాసేపు మళ్ళీ ఎవరు ఏమీ అనలేదు.

“సరే మరి.  పదండి, భోజనం చేసి, పెందరాళే పడుకుందాం.  పొద్దున్నే  గుడికి బయలేదేరాలిగా,” అని అమ్మ అంటుండగానే, వినోద్ ని తీసుకొని వచ్చాడు జగదీష్. 

“ఇ యామ్ హంగ్రీ  నానమ్మా.  పదండి భోంచేద్దాం,“ అన్నాడు. 

**

గుడికి వెళ్ళేప్పుడు తను కుట్టించిన గ్రీన్ కలర్ కి పింక్ బార్డర్ పట్టు పెరికిణీ  వేయించింది, నాచేత అమ్మమ్మ.  తన కెంపుల హారం కూడా పెట్టింది. 

అమరావతిలో,దేవుడు దర్శనం బాగా జరిగింది. 

మునుపటిలా,అదే పెద్ద మర్రిచెట్టు నీడన కూర్చుని, ప్రసాదాలు తింటుండగా, వాళ్ళ పెళ్ళి నాటి ముచ్చట మరోసారి  గుర్తుచేశారు నాన్న.  

అందరూ నవ్వుతూ విన్నారు.

**

“పిల్లలంతా ఇలా సంప్రదాయమైన దుస్తులు వేసుకొని, చక్కగా చూడముచ్చటగా  ఉన్నారర్రా.  పరికిణీ  వోణీ వేసుకుని కళ,  పట్టు జుబ్బాల్లో యువరాజుల్లా మగపిల్లలు .. కన్నుల పండువగా ఉంది మాకు,” అంది అమ్మమ్మ.

తన కెమెరాతో, అందరినీ చాలా ఫోటోలు తీసాడు, జగదీష్... తిరుగు ప్రయాణం కూడా, కబుర్లు, పాటలతో సరదాగా గడిచింది.

**

వెకేషన్ లో మిగిలింది మూడు రోజులేనంటూ, ప్రతిపూట యేదో ఒక యాక్టివిటీ పెట్టుకుని,అమ్మమ్మ వాళ్ళతో  సరదాగా గడిపేస్తున్నాము... వెళ్ళే ముందు రోజు ‘విందు భోజనం’ అంటూ పొద్దుటి నుంచీ వంటలు చేయించింది అమ్మమ్మ.  ఒకేసారి తినడం అవ్వదు కాబట్టి,  ‘రోజంతా భోజన హాలు వోపెన్’ అంటూ అనౌన్స్ చేసింది కూడా.  

నిజంగానే, బ్రేక్ ఫాస్ట్ కి - ఇడ్లీ, దోసె, కిచిడి తో మొదలయి, లంచ్ కి చికెన్ ఫ్రై, ఫిష్, ప్రాన్స్ తో అమ్మమ్మ వంటలు అందర్నీ అలరించాయి.

ఇక రాత్రి భోజనానికి  దోసకయి పప్పు, ఆలు ఫ్రై, పచ్చి పులుసు చేసామంటూ,  భోజనానికి పిలిచింది..

జగదీష్ కి, వినోద్ కి కబుర్లు చెబుతూ స్వయంగా వడ్డించ సాగిందామె. 

“నానమ్మ, నేను వచ్చే యేడు మెడిసిన్ లో చేరాలి కాబట్టి,సమ్మర్లో  రావడం కష్టం.  ఇక నుండీ క్రిస్టమస్ టైం లో మాత్రమే, నాకు ఫ్రీ టైం ఉంటుంది.  ఆ సమయంలో, మేము తప్పక గుంటూరు రావడానికి హ్యాపీ.  అలాగే అత్తయ్య వాళ్ళు కూడా అనుకుంటే, చాలా  బాగుంటుంది,”  అన్నాడు  జగదీష్  అమ్మావాళ్ళ  వంక చూస్తూ..

“అలాగే ప్లాన్ చేద్దాము.  ఫామిలీ రీ-యునియన్లా ఉంటుంది.  మీ పెద్దమ్మాయి సుశీల గారికి కూడా చెప్పండి మామయ్య,” నాన్న తాతయ్యతో.

**

బ్రేక్ ఫాస్ట్ తరువాత , జగదీష్ వాళ్ళు ఎయిర్ పోర్టుకి  వెళ్ళిపోయారు. లంచ్ కూడా అయ్యాక, వినోద్ ని తీసుకొని, తాతయ్య, నాన్న షాపింగ్ కి బయలుదేరారు.. 

మా ట్రైన్ రాత్రి ఎనిమిదికవడంతో, ప్యాకింగ్ఫినిష్ చేసి,తీరిగ్గా ల్యాప్ టాప్ తో సోఫాలో చేరాను.

వంటింట్లో నుండి వచ్చినఅమ్మా, అమ్మమ్మా కూడానా  పక్కనే చేరారు. ట్రేలో కాఫీ కప్పులు  తెచ్చి సెంటర్ టేబిల్ మీద ఉంచి వెళ్ళింది, రేవతి. నా చేతికి కాఫీ కప్పందించింది  అమ్మమ్మ.

“చంద్రకళా,  ఇప్పుడు నేను చెప్పేది మీ అమ్మతో పాటు నువ్వూ విను,” అంది నాతో... అలాగేనన్నట్టు తలాడించాను.

ముఖాన చిరునవ్వుతో..అమ్మ వంక చూసింది...

“ఎంతటి గొప్ప కళాకారిణి అయినా,  ఆడపిల్లకి మంచి జీవితం ముఖ్యం.  నా దృష్టిలో, చంద్రకి మన జగదీష్ సంబంధం చాలా మంచిదనిపిస్తుంది. 

వాడు ఎంత ప్రేమ కలవాడో, ఎంత బాధ్యత కలవాడో మనకి తెలుసు.  రేపు సర్జన్ అవబోతున్నాడు.  ఆస్తిపాస్తులు విషయం అటు పెట్టు. మనిషే  బంగారం.  అందగాడు.  పైగా వాడికి చంద్రకళ పై ఎనలేని అభిమానం.  దాని డాన్స్ అంటే మహా ఇష్టం.  

ఇంకేం కావాలి?” అందామె అమ్మతో...

పక్కకి తిరిగి, నా భుజంపై తట్టింది....“ఇదిగో చంద్రమ్మా, జగదీష్ తో స్వేచ్చగా మాట్లాడు.  పరాయి వాడేమీ కాదుగా! ప్రేమగా, ఆప్యాయంగా ఉండు,” అంది సూటిగా నాతోనే.

విని మౌనంగా తల దించుకున్నాను.

క్షణమాగిందామె....

“పోతే, శారదా, అసలు సంగతి విను..  మణి వైఖరి చూసారుగా.  మనిషి మంచిదే, కాని అంతగా కుదురు లేదు. ఆ రాణి వాళ్ళ కుటుంబమంటే వొణుకుతుంది. 

భూషణ్ గారికి కొత్తగా అధునాతన ఆసుపత్రి ఉందటగా! మెడికల్ కాలేజీ కూడా కట్టించారటగా.  తన కొడుక్కి   బోలెడంత ఆలంబన అవుతారని దాని ఆశ,” వివరించింది అమ్మకి....

నేను, అమ్మ ముఖాలు చూసుకున్నాము.

“ఇక ఆ రాణికైతే అడ్డు దాపు లేనట్టుంది.  విపరీతపు పెంపకంలా ఉంది. దానికి మనమేమీ చేయలేమనుకో...అయితే, మీరు చేయగలిగింది ఒకటైతే ఉంది.అన్నీ గమనించుకుని  జగదీషుని  మీవాణ్ణి  చేసుకోండి.  అవకాశం పోనీయవద్దు,” అంటూ ముగించి, నా వంక చూసింది, అమ్మమ్మ,

ఏదో మంత్రం వేసినట్టు వింటున్న నేను, గబక్కున సర్దుకునిచూపు అమ్మ వైపు సారించాను.

“నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా.  నా మనస్సులోనూ అదే ఉంది.  కానీ, పిల్లలు చిన్నవాళ్ళుగా.  చూద్దాములే.  ఏది ఎలా జరుగుతుందో...” అంది అమ్మ.

“నాకు మాత్రం తెలియదా, ఇంకాటైముందని. కాకపోతే, మీ ఇద్దరి చెవిన ఈ మాట వేస్తే,  మీకు నా ఆలోచన తెలుస్తుందనే.  పైగా ఆ రాణి పోటీ కొచ్చిందిగా!  అందుకే హెచ్చరించవలసిన అవసరం వచ్చింది..

అదీకాక,  మేము పెద్దవాళ్ళం కదా తల్లీ.  మనసులో మాట ఎప్పడికప్పుడు చెప్పాలి మరి.  ఇక ఆ పైవాడి దయ,” అంటూ వాకిలవతలతాతయ్య గొంతు వినబడ్డంతో,  లేచి అటుగా వెళ్ళింది. 

“ఏమ్మా, ట్రైన్టైం అవుతుందిగా!భోజనంవడ్డిస్తే,  తినేసి,కాస్త తీరిగ్గా బయలుదేరవచ్చు,” అంటూతాతయ్య లోనికొచ్చారు.....

**

అమ్మమ్మా వాళ్లకి వీడ్కోలు చెప్పేసి, రెండుగంటలకి పైగా,ట్రైన్లోసాగిపోతున్నామనసంతా దిగులుగా ఉంది....అమ్మమ్మకి నా మీద ఎనలేని ప్రేమే కాదు, నా భావిష్యత్తుగురించి ఆమెకున్న శ్రద్ధ  గుర్తించగలిగాను.  నాకెంతోగర్వంగా, సంతోషంగాకూడా అనిపించింది...

చుట్టూచూస్తే, కాబిన్ లో అందరూ మౌనంగా, విశ్రాంతిగాఉన్నారు. చదువుదామని,నవల చేతిలోకి తీసుకున్నానే గాని,మనసు నిండా జగదీష్  గురించిన ఆలోచనలుకమ్ముకున్నాయి.  నాకెప్పుడూ  అతనంటే  ఇష్టమే.

. అతనికి కూడా నేనంటే ఇష్టం, ప్రేమ ఉన్నాయని అమ్మమ్మ అంటుందిగా! 

జీవితంలో జగదీష్  తోడుంటే, నా నాట్య సాధనకి అడ్డు ఉండదు కాబట్టి, ఆశయాలు పాడయ్యేది ఏముంటుంది?  అమ్మకి నాన్నకి కూడా జగదీష్ ఇష్టమేగా!...

నా  ఆలోచన సాగుతున్న  తీరు కాస్త ఇబ్బందిగానే అనిపించింది.

‘ఏదేమైనా ఇక ఈ గజిబిజి ఆలోచనలు నా మనస్సునుండి తీసేయాలి.  ఏదెలా జరగాలో అలా జరుగుతుంది కదా’.

‘సమయం వృధా చేయవద్దని, లేని సమస్యలు  సృష్టించుకోవద్దని  అమ్మ ఎప్పుడూ చెబుతుంది....’ అనుకుంటూ, నిద్ర పోదామని గట్టిగా కళ్ళు మూసుకొన్నాను.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్