Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 30th october to 5th november

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద  (గతసంచిక తరువాయి)

వసంత ఋతు వర్ణన చేస్తున్నాడు రాయలు  గోదాదేవి విరహ తాపంతో వేడెక్కిపోయింది. ఆమె ప్రకృతి, పురుషోత్తముడు పురుషుడు. కనుక ఆమె బాధ ప్రక్రుతికంతకూ బాధ.ఆమె దైన్యము ప్రకృతికి అంటుకుంది. కనుక  చమత్కారంగా యిలా అంటున్నాడు.

తెలియఁగ వచ్చె నట్టితఱిఁ దిగ్మకరుండు ధనాధిపాశకై
తొలఁగినకారణం బతివ దుర్వహ దీర్ఘవియోగవహ్ని  పె
ల్లలమిన తద్దిశం దగిలినట్టి తనూష్మ ఘనీభవన్మహా
జలమయశంకరశ్వశుర శైలముకోనల చల్వఁ దీర్చకోన్ 

తిగ్మకరుడు అంటే సూర్యుడు. ధనాధిపుడు అంటే కుబేరుడు. ఆశ అంటే ఆకాశము. ధనాధిప-ఆశ అంటే  కుబేరుని దిశ ఐన ఉత్తర దిశ. ఉత్తరాయణం ఎందుకు ప్రవేశింది, సూర్యుడు ఉత్తర దిశకు ఎందుకు తొలిగిపోయాడు అనేది తెలిసిపోయింది తనకు అంటున్నాడు 'కవి'రాయలు. దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనంలో, వసంతఋతువు ప్రవేశించకముందు, గోదాదేవియొక్క విరహతాపముతో సోకిన కాకను చల్లబరుచుకోడానికి ఘనీభవించిన అపార జలమయమైన శివునిమామను, అంటే హిమవత్పర్వతాన్ని  ఆశ్రయించాడు, ఉత్తర దిశకు వెళ్లి. ఆ హిమాలయ చరులను ఆశ్రయించాడు చల్లబడడానికి. అమ్మ దక్షిణ దిశకు దృక్కులు సారిస్తూ ఉన్నది, దక్షిణ నాయకుని కోసం, నాథుని కోసం, హరికోసం, కనుక ఆవిడ చూపుల, తలపుల, శరీర వేడిమి, విరహ తాపము దక్షిణానికి సోకింది. అంతవరకూ  అక్కడున్న సూర్యనారాయణమూర్తి ఉత్తరానికి వెళ్లి హిమవంతుడిని ఆశ్రయించాడు. సూర్యుడూ  నారాయణుడే, సుర్యమండలాంతర్వర్తి ఐన నారాయణమూర్తి సాక్షాత్తూ శ్రీహరియే. చల్లదనం కోసం మాత్రమే అనుకోవడం సామాన్య విషయము. 

హిమవంతుని కుమార్తె ఐన కాత్యాయనిని ఆశ్రయించి కాత్యాయనీ వ్రతము చేసి అలనాడు గోపికలు  బృందావనంలో శ్రీకృష్ణుని పతిగా పొందారు. అలాగే నీవూ చేసి హరిని పతిగా పొందవమ్మా అని  చెలికత్తెలు సలహా ఇవ్వడంతో 'కాత్యాయనీ వ్రతం' చేస్తున్నది గోదాదేవి. కనుక అమ్మ తరపున  రాయబారిగా సూర్యుడు, తన స్వార్థంతో సూర్యనారాయణుడు అటునుంచి నరుక్కొస్తున్నారు,  కార్యం సానుకూలం గావడానికి, ఎందుకంటే గోపికల విషయములో మనకు తెలియదు గానీ,  గోదాదేవి విషయములో శ్రీ హరి కూడా వేగిపోయాడు, గోదమ్మను 'సతి'గా పొందడానికి. యిది  రాయల పలుకుల అంతరార్థం.  'లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతి, ఋషీనాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి'  అన్నాడు మహానుభావుడు భవభూతి 'ఉత్తర రామచరితము' అనే గొప్ప నాటకంలో, అంటే ,  లౌకికులైన సాధువులవాక్కులకు అర్థం అనుసరించి వస్తుంది, అంటే వారి వాక్కులు అర్ధవంతములుగా  ప్రయోజన పూర్వకములుగావుంటాయి, కానీ, ఋషులకు అర్ధములను బట్టి వాక్కు తనంత తానుగా  అనుసరించి వస్తుంది, అంటే వారిమనసులోని అర్ధాన్ని అనుసరించి పలుకులు తమంత తాముగా  మేమంటే మేము అని వస్తాయి. సామాన్య కవిపండితులలాగా వాక్కులకోసం వెదుక్కునే,  పలుకులకోసం పలవరించే పరిస్థితి వారికి ఉండదు. వాక్కులే వారిబంట్లవలె ఎదురుచూస్తూంటాయి  వారిమనసులోని అర్ధానికి అక్షరరూపాన్ని ఇవ్వడంకోసం. మంచి  ఉపన్యాసకుల పలుకులకు మంచి  అర్థాలు వస్తాయి, మహావక్తలకు మంచి అర్థాలనిచ్చే పలుకులు పరుగెత్తివస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఋషితుల్యుడే, కనుక ఆయన పలుకులకు అమేయ ప్రభావ సంపన్నములైన అంతరార్థములు.

వాటిని పట్టుకొనగలిగితే అనిర్వచనీయమైన అలౌకికానందం! సాహిత్య పఠనము యొక్క అత్యున్నత 
ప్రయోజనం అలౌకికానందమే కదా, మిగిలినవాటితో పాటు. 
 
కినిసి వలఱేఁడు దండెత్తఁ గేతు వగుట 
మీన మిల దోఁచు టుచితంబ మేష మేమి 
పని యనఁగ నేల? విరహాఖ్యఁ బాంథయువతి 
దాహమున కగ్గి రాఁగఁ దత్తడియు రాదె?
 
'వలఱేఁడు' అంటే మన్మథుడు. వచ్చింది వసంతఋతువు గనుక మన్మథుడు దాడికి రావడం సహజమే. 
ఆయనకు శరీరం లేదు గానీ శరీరాలను, మనసులను మంటబెడతాడు. ఆయన జెండాగుర్తు మీనము, 
చాప. ఆయన వచ్చాడు గనుక రథం మీదే వస్తాడు గనుక రథ ధ్వజం కూడా వచ్చింది, దానిమీద ఉండే 
చాప కూడా వచ్చింది. అది సమంజసమే! మరి మేక(మేషం) ఎందుకొచ్చింది? దానికేంపని?
 
అంటే మకర సంక్రమణం తర్వాత మీన సంక్రమణం వచ్చింది, మకర సంక్రాతి తర్వాత మీన సంక్రాంతి. 
యింతలోనే మేషం కూడా, మేక కూడా వచ్చింది, దానికేంపని రావడానికి? అంటే.. మకర సంక్రమణం 
తర్వాత కుంభ సంక్రమణం, తర్వాత మీన సంక్రమణం, కనుక మీనం వచ్చింది.ఆ తర్వాత మేష 
సంక్రమణం, కనుక మేషం వచ్చింది. అంతే గాక అగ్నిదేవుడు మేషవాహనుడు, మేకను ఎక్కి 
తిరుగుతుంటాడు. ఆ అగ్ని యిప్పుడు విరహాగ్ని రూపంలో గోదమ్మను దహించడానికి వచ్చాడు కనుక 
ఆతనికి వాహనమైన మేషం కూడా వచ్చింది. రాదా మరి? 
 
మకర సంక్రమణం, మకర సంక్రాంతితో ధనుర్మాసం పూర్తి అవుతుంది, మార్గళి నెల, మార్గశీర్ష మాసం 
పూర్తి అవుతుంది. ఆ తర్వాత కుంభ సంక్రమణం, కుంభమాసం, అంటే మాఘమాసం. దాని తర్వాత 
మీన సంక్రమణం, అంటే మీన మాసం, అంటే అంటే ఫాల్గుణమాసము. ఆ తర్వాత మేష సంక్రమణం, 
అంటే మేష మాసం, అంటే చైత్రమాసం, చైత్రం, వైశాఖం రెండూ వసంత ఋతువు, కనుక వసంత 
ఋతువు ప్రవేశించింది. క్రమ క్రమంగా ధనుర్మాస వ్రతం పూర్తి చేసిన తర్వాత, హేమంత ఋతువు 
ముగిసిన తర్వాత, శిశిరఋతువు గడిచి, ఆమె ఆశల వసంతఋతువు ప్రవేశించింది అని చెబ్తూ,
ఋతుపరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా చమత్కరిస్తున్నాడు రాయలవారు. ఆయన సమస్తశాస్త్ర 
పారంగతుడు అనడానికి, ఆయన రాసిక్యానికి, పాండిత్యానికి, వ్యుత్పత్తికి, ప్రతిభకు యివి 
మచ్చుతునకలు.
 
(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.    
మరిన్ని శీర్షికలు
Carrot Batani Curry - కారట్ బటానీ కూర!