Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasi pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: ప్రతిమ చుట్టూ ఉన్న పాత్రల్లో ఫణిభూషణరావు,  ఆనందరావు, పరంధామ్‌తో పాటు ఆమె ఎంతగానో ప్రేమిస్తున్న అభిరామ్‌ ప్రధానంగా కనిపిస్తుంటారు తేజాకి. అయితే, ఆ రోజు ఏడో అంతస్థు టెర్రస్‌ మీంచి ప్రతిమ ఎందుకు పడిపోయింది?  అంతెత్తు నుంచి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే దూకిందా? వెనుక నుంచి ఎవరైనా తోసేసారా?  ఒకవేళ దూకితే... బలవంతంగా చచ్చిపోవాలనే ఆలోచన ఆమెకెందుకొచ్చింది? అసలింతకీ ఏం జరిగింది?  ఇలా పలుకోణాల్లో ఆలోచిస్తుంటాడు తేజ. ఆ తరువాత.. 

.‘‘నాకూ తెలుసు. మొన్నే కోఠీ విమెన్స్‌ కాలేజీ నుంచి వస్తుంటే ఇండికా కార్లో ఆ అమ్మాయిని చూసా. ఎంత బాగుందీ అనుకున్నా. ఇవాళ నీ డైరీలో చూసా’’

‘‘ఇండికా కార్లోనా?’’  అర్చన కోఠీ విమెన్స్‌ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది.

‘‘ఔను... ఇండికా కార్లోనే..’’ అదే సమయంలో ఆనందరావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

కోఠీ హరిద్వార్‌ హోటల్‌ ముందు ఇండికా కార్లో ఆ అమ్మాయిని చూసినట్లు చెప్పాడతడు.

ఆ మాటలు ఆనందరావు చెప్పినప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు తేజ.

కానీ,  ఇవాళ తన చెల్లెలు అర్చన కూడా అదే మాట చెప్తోందంటే... ప్రతిమ బతికే ఉందా? సందిగ్ధంలో పడిపోయాడు. 

‘‘అర్చనా ... నిజం చెప్పు. ఆ అమ్మాయిని నిజంగానే నువ్వు చూసావా?’’

‘‘చూసాను... అచ్చం ఈ ఫొటోలో ఉన్నట్లే ఉంది’’ చెప్పింది అర్చన.  చనిపోయిన  ప్రతిమ  బతికుండడమేంటీ?  తేల్చుకోలేకపోతున్నాడు తేజ.‘‘లవ్‌.. సెక్స్‌... రొమాన్స్‌!  ఎవరికీ ఎవరూ నేర్పక్కర్లేదు. ప్రకృతి తప్ప ప్రత్యేకించి ఏ గురువూ నేర్పించాల్సిన విద్య కూడా కాదిది. మీ మొగుళ్లను ప్రేమించండంటూ పెళ్లయిన ఆడవాళ్లకి ఎవరైనా సలహాలివ్వడం ఏ మేరకు సబబు?  ఆ మాత్రం ఇంగితం లేకుండా ఖాకీలు లవ్‌ గురు అవతారమెత్తారు. తగుదునమ్మా... అటూ పోలీస్‌ వెబ్‌సైట్‌లో పండంటి కాపురానికి ఎనిమిది సూత్రాలంటూ ఏకంగా ప్రేమ పాఠాలే చెప్తున్నారు. మీ భర్తలు పక్క చూపులు చూడకుండా ఉండాలంటే ... తప్పనిసరిగా ఆచరించాల్సిన చిట్కాలివే నంటున్నారు ఖాకీలు. అయితే, వాటిలో కొన్ని సూచనలు పరిశీలిస్తే... ఒంటి పై తేళ్లూ జెర్రులూ పాకడం ఖాయం...’’

యాంకర్‌ పార్ట్‌ రాస్తున్నాడు తేజ.

అనుకోకుండా పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌ చూసాడతడు.

ఆ వెబ్‌సైట్‌లో లేడీస్‌ స్పెషల్‌ పేజీలోకి అతడి దృష్టి మళ్లింది. పచ్చటి బతుకుల్ని బలి తీసుకుంటున్న వివాహేతర సంబంధాలు నిరోధించాలంటే ఇంట్లో ఇల్లాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ పేజీలో ప్రముఖంగా ఓ ఆర్టికల్‌ ప్రకటించారు. ఉద్దేశం మంచిదే అయినా...  ఆ ఆర్టికల్‌ వ్యక్తీకరించిన పద్దతిని శృతి మించినట్లనిపించింది తేజాకి.

జీవితభాగస్వామికి ఆత్మీయ నేస్తం మీరే... సమస్యలు, సందేహాల్ని మనసులో అట్టే పెట్టుకోకుండా నిస్సందేహంగా ప్రకటించండంటూ సూచనలు చేస్తూనే... వైవాహిక జీవితంలో గుడ్‌ సెక్స్‌ ప్రాధాన్యత గుర్తించమంటూ ఖాకీలు సలహాలిస్తున్నారు.

మీ భర్త పక్కచూపులు చూడకుండా ఉండాలంటే... శయన మందిరంలో మీ పాత్ర అమోఘంగా ఉండాలంటూ భార్యలకు హితవు పలుకుతున్నారు. ప్రేమలు, పెళ్లిళ్లూ, రొమాన్స్‌, సెక్స్‌... ఇలా ప్రతి విషయంలోనూ యధేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించిన పోలీస్‌ వెబ్‌సైట్‌ లేడీస్‌ స్పెషల్‌ పేజీ పై మహిళా సంఘాల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

అందుకే, పోలీసుల వైఖరిని ఎండగడుతూ హాఫెనవర్‌ ప్రత్యేక ప్యాకేజ్‌కి స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు తేజ.

అదే సమయంలో... యాంకర్‌ వరలక్ష్మి వచ్చిందక్కడికి.

‘‘హలోసార్‌...’’  విష్‌చేసింది.  ఆ ఇన్సిడెంట్‌ తర్వాత వరలక్ష్మి బాగా దగ్గరైంది. చనువుగా మాట్లాడుతోంది. అప్పుడప్పుడూ వ్యక్తి ‘గతా’ల్ని తోడుకుని మరీ విశ్లేషించుకోవడం పరిపాటైంది. ఓ రకంగా వరలక్ష్మి క్షేమం కోరే ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌ అన్నీ తేజానే. ప్రతి చిన్న విషయాన్నీ అతడితో షేర్‌ చేసుకుంటోంది. చివరాఖరికి... సుప్రభాత కిరణాలు లోకాన్ని పలకరించే వేళలో ఓ ‘గుడ్‌మార్నింగ్‌’, పశ్చిమాన ఆకాశం అ రుణరాగ రంజితమయ్యే సమయంలో ఓ ‘గుడ్‌ఈవెనింగ్‌’, రాత్రిలోకం నిద్రలోకి జారుకునే ముందు ఓ ‘గుడ్‌నైట్‌’ మెసేజ్‌ల్ని తేజాకి పంపకపోతే లిటరలీ ఆమెకు రోజు గడవనట్లే.

‘‘కమాన్‌..’’  ఆత్మీయంగా ఆహ్వానించాడు వరలక్ష్మిని తేజ.

‘‘డిస్టర్బ్‌ చేసానా?’’

‘‘నా టెటాల్‌... ప్రొఫెషనల్‌ స్ట్రెస్‌ తగ్గించావు. నువ్వే రాకపోతే... సీరియస్‌గా కంటెంట్‌లో మునిగిపోయేవాడిని’’ నవ్వుతూ ఆన్సరిచ్చాడు తేజ. ఆమెని చూస్తున్నప్పుడల్లా అతడి హృదయం ద్రవించుకుపోతుంటుంది. బంగారంలాంటి జీవితాన్ని అమాయకంగా ఇబ్బందుల్లో పడేసిందనే భావన కలుగుతుంటుంది. గత జ్ఞాపకాలు ఆమెని ముల్లుల్లా గుచ్చి వే ధించకుండా ఉండాలంటే... రొటీన్‌తో బిజీ అయిపోవాలి. ఆలోచించడానికే సమయంలేనంత బిజీ అయిపోవాలి. అందుకే, వీలైనన్ని ఎక్కువ ప్రోగ్రాంలు చేయమంటూ ప్రోత్సహిస్తున్నాడు తేజ.

‘‘ఫీడ్‌ బ్యాక్‌ ఎలా ఉంది?’’ చాల్రోజుల తర్వాత అపర్ణ అపహరణ కేసుకు సంబంధించిన ప్రోగ్రాం గురించి ప్రత్యేకించి ప్రశ్నించిందామె.

‘‘ఆ ప్రోగ్రామా?  చాలా కాల్స్‌ వచ్చాయి. అన్నట్టు...బాస్‌కి నీ యాంకరింగ్‌ తెగ నచ్చింది’’అంటూ బాస్‌ చెప్పిన కొత్త ప్రోగ్రామ్‌ గురించి వరలక్ష్మితో షేర్‌ చేసుకున్నాడు తేజ.

కాన్సెప్ట్‌ విన్న వెంటనే ఎగ్జయిట్‌ అయిందామె.

‘చాలా మంచి ప్రోగ్రామ్‌ సర్‌. స్పాట్‌ కవరేజ్‌ తప్పిస్తే ఏ చానెల్‌ కూడా క్రయింకి సంబంధించి కంప్లీట్‌ డిటెయిల్స్‌ ఇవ్వడం లేదు. ఇప్పటికే క్రయిం కవరేజ్‌లో మన చానెల్‌కి స్పెషల్‌ ఇమేజ్‌ ఉంది. కొత్త కాన్సెప్ట్‌ కూడా ఎయిర్‌ లోకి వెళ్లిందంటే... మిగతా చానెల్స్‌ కుళ్లు కోవాల్సిందే’’ ఆనందం పట్టలేక పోతోంది వరలక్ష్మి.

‘‘ఎప్పుడో జరిగి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఇన్సిడెంట్స్‌ ప్రజెంట్‌ స్టేటస్‌ తెలుసుకోవాలని పబ్లిక్‌కి ఉంటుంది. కానీ, తెలుసుకో లేకపోతున్నారు.  కారణం...’’

‘‘కారణం నే చెప్పనా?’’ అన్నాడు తేజ.

‘‘ష్యూర్‌ ... మీరే చెప్పండి’’ అంది నవ్వుతూ.

‘‘సముద్రాన్ని చూడు... ఓ అల వెనుక మరో అల వస్తూనే ఉంటుంది. అలాగే, క్రయిం ఇన్సిడెంట్స్‌ కూడానూ. ట్విన్‌ సిటీస్‌తో పాటు సైబర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్ని చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. ఓ కేసు కవర్‌ చేసే లోపల మరో కేసు వచ్చిపడుతోంది. దాంతో... పాత కేసుల్ని పోలీసులే పట్టించుకోవడం లేదు. అన్నట్లు... పోలీస్‌ వెబ్‌ సైట్‌ చూసావా?’’ అంటూ వెబ్‌సైట్‌ లోని లేడీస్‌ స్పెషల్‌ పేజీ చూపించాడు తేజ.

‘‘ అసలు కేసుల నొదిలేసి ఇలాంటి కొసరు పనులపై మన పోలీసులు కాన్‌సంట్రేట్‌ చేస్తున్నారు. అందుకే, క్రయింరేట్‌ జనాల్ని బెంబేలెత్తిస్తోంది. అందుకే, స్పెషల్‌గా మన బాస్‌ పాత కేసుల్ని తిరగదోడమన్నాడు. ముందుగా మనకు ఎసైన్‌ చేసింది ప్రతిమ కేసు. అది నీకు గుర్తుంది కదా!’’ అడిగాడు తేజ.

‘‘గుర్తుంది. అన్నట్లు...వాళ్ల సినిమా సక్సెస్‌ మీట్‌కి నేనే యాంకరింగ్‌ చేసాను కదా’’ చెప్పింది వరలక్ష్మి.

‘‘ఇప్పుడు ... ఈ ప్రోగ్రామ్‌కి కూడా నువ్వే యాంకరింగ్‌ చేయాలి’’ చెప్తూ పూర్తిచేసిన స్క్రిప్ట్‌కి సంబంధించి ఓ కాపీని ఆమె చేతుల్లో పెట్టాడు. రెండో కాపీ ప్రింటవుట్‌ తీసి బాయ్‌ని పిలిచి ఎడిటింగ్‌ సెక్షన్‌కి పంపించాడు. తర్వాత ఇంటర్‌కంలో కెమెరా సెక్షన్‌కి ఫోన్‌ చేసి కెమెరామేన్‌ని వెబ్‌సైట్‌ పేజీల్ని షూట్‌ చేసేందుకు అర్జంట్‌గా తన క్యాబిన్‌ లోకి రమ్మన్నాడు. కెమెరామెన్‌ వచ్చే లోగా దొరికిన కాస్త సమయంలో... వరలక్ష్మి అడిగింది`‘‘నేనో డౌట్‌ తీర్చుకోవచ్చా?’’

‘‘అడుగు... డౌటెందుకు?’’ అన్నాడు తేజ.

‘‘చనిపోయిన తర్వాత మనుషులేమవుతారు?’’

‘‘కాలిస్తే బూడిద... పూడిస్తే ఎముకల గూడుగా మిగులుతారు’’ చెప్పాడు నవ్వుతూ. 

‘‘సీరియస్‌గా చెప్పండి సార్‌. జనాల్ని థ్రిల్‌ చేసే కాన్సెప్ట్‌ నేచెప్తా’’

‘‘క్రయిం బులెటెన్‌ ద్వారా నువ్విస్తున్న థ్రిల్లింగ్‌ చాల్లేదా? ’’ అడిగాడతడు.

‘‘నా క్వశ్చన్‌కి ఆన్సరివ్వండి సార్‌... చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారు?’’

‘‘ఆ క్వశ్చన్‌కి నేనే కాదు... బతికున్న ఏ ఒక్కరూ ఆన్సరివ్వలేరు. కారణం.. ఒక్కటే. బతికున్న మనిషి దగ్గరికి చావు రాదు. చావొచ్చిన తర్వాత మనిషి బతికుండడు. ఇంతకన్నా సింపుల్‌ లాజిక్‌ ఇంకోటి ఉండదు’’

‘‘అంటే... చావు ఎలా ఉంటుందో చెప్పేందుకు మనిషి బతికుండడంటారు’’

‘‘ఇప్పుడు నేనన్నది అదే కదా!’’

‘‘అయితే, ఏదో ఓ రోజు హాఫెనవర్‌ శ్లాట్‌ రెడీ చేసి ఉంచండి. చచ్చిపోయిన ఓ మనిషిని మీ ముందుంచుతాను’’

‘‘ఏంటీ... చచ్చిపోయిన మనిషిని స్టూడియో లైవ్‌లోకి తీసుకొస్తావా?’’

‘‘కచ్చితంగా...’’

‘‘ఎలా?’’

‘‘చనిపోయి కూడా బతికుండి మన కళ్లముందు తిరుగుతోంది కాబట్టి...’’

‘‘తిరుగుతోందా?’’

‘‘తోందే... లేడీ కాబట్టి అలాగే అనాలి. గ్రామరే భాషకి గ్లామర్‌ కదా!’’

‘‘కరెక్ట్‌గా చూసావా?’’

‘‘చూసాను’’

‘‘అదే... ఆ అమ్మాయి పాదాలు రెండూ ముందుకే ఉన్నాయా?’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika