Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాస్తూ - వాస్తవాలు - సూర్యదేవర వేణుగోపాల్ M.A(జ్యోతీష్యము)



 

వాస్తు మూఢ నమ్మకం కాదు

వాస్తు మూఢ విశ్వాసం కాదు. వాస్తు నియమాలలో శాస్త్రీయత ఉంది. ప్రకృతితో మనిషి జీవితాన్ని వాస్తు సమతౌల్యం చేస్తుంది. వాస్తును పాటించడం వల్ల మానవ జీవితం ఆరోగ్యకరంగా,మంగళప్రదంగా సాగుతుంది. "వసనివాసే' అనే ధాతువు వాస్తు అనే పదానికి మూలము." వసత్" అనే పదము నుండి వాస్తు అనే మాట జన్మించింది. నివశించడానికి యోగ్యమైన స్థలాన్ని "వసత్" అని అంటారు. భూమికి వాస్తువు  అనే పేరు ఉంది. భూమిపై నిర్మిస్తున్నాం కాబట్టి వాస్తు అయిందని  "మయమతం"అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలియజేస్తుంది. ఈ వాస్తు భూమిపై నిర్మించే అన్ని నిర్మాణాలకు అంటే, గృహాలు,ఆలయాలు, రాజప్రాసాదాలు, పట్టణాలు, మరియు తటాకాలు వంటి అన్నింటికీ  వర్తిస్తుంది. మానవ సర్వతోముఖ అభివృద్దికి యే నిర్మాణ నియమాలు అమలు చేయాలి, అదే విధంగా ప్రకృతి నుండి మంచి ఆరోగ్యాన్నియేలా పొందాలి అనే విషయాలను వాస్తుశాస్త్రం తెలియ జేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, అనేక లాభాలను ప్రకృతి నుండి పొందడానికి యే విధమైన నియమాలను పాటించాలో వాస్తుశాస్త్రం తెలుపుతుంది.


వాస్తు వేదం నుండి ఉధ్భవించింది. వేదాంగాలలో ఒకటైన జ్యోతిష్యం నుండి వాస్తు జన్మించింది. వాస్తుశాస్త్రం ను 18 మంది  మహర్షులు అందించినట్లుగా మత్స్త్యపురాణం తెలియజేస్తుంది. ఈ శ్లోకాన్ని గమనించండి.                 

                   “భృగు అత్రి వశిష్ట శ్చ్హ విశ్వకర్మా మయ స్తధా

                   నారదో  నిగ్నాజీశ్చైవ విశాలాక్ష: పురందర:

                   బ్రహ్మకుమారో నందీశ సౌనాకో గర్గ ఏవచ

                   వాసుదేవో నిరుదశ్చ్హ తధా శుక్రో బృహస్పతి:

                   ఆష్ట దశైతే విఖ్యాత వాస్తు శాస్త్రపదేశకా;”

                                                          --------       
"మత్స్థ్యపురాణం"

వాస్తు నవీనమైనది కాదు. పై శ్లోకం ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.వాస్తు, వేదాంగమైన జ్యోతిష్యం లోని సంహిత విభాగానికి చెందుతుంది. సమరాంగణ సూత్రధారము, మయమతము, విశ్వకర్మప్రకాశిక, వసిష్ట సంహిత, నారదసంహిత,,పద్మపురాణం, అపరాజిత పృచ్చ,మొదలైన గ్రంధాలలో వాస్తు  ఉదహరింపబడినది. మహాభారతములో మయసభ వర్ణనలో ఇంకా  రామాయణం లో లంకా పట్టణ వర్ణనలో వాస్తు అంశాలు ఇమిడిఉన్నాయి.. సింధులోయ నాగరికత లో పట్టణాలు, గృహనిర్మాణాలు వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని పండితుల విశ్వాసం. ఈ అంశాలను పరిశీలిస్తే వాస్తు అత్యంత ప్రాచీనమైన శాస్త్రం అని తెలుస్తుంది.

ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా వాస్తు రూపొందించబడింది. మనదేశం లో ఉన్న వాతావరణాన్ని దృష్టిలోఉంచుకొని  మన మహర్షులు వాస్తును మనకు అందించారు. ఇది మూఢనమ్మకం కాదు. ఇందులో ఎంతో విజ్ఞానం ఇమిడిఉంది. మనదేశం భూమిపై తూర్పు భాగంలో ఉంది. దక్షిణ,నైరుతి,పడమర గుండా ప్రపంచ గాలులు మనదేశానికి వీస్తాయి. ఈ దక్షిణ, నైరుతి ,పడమర గాలులు తూర్పు, ఉత్తర, మరియు  ఈశాన్యం వైపుకు వీస్తాయి. ఈ గాలి వీచే అంశాన్ని దృష్టి లో ఉంచుకొని ముఖ్యమైన కొన్ని వాస్తు విషయాలు రూపొందించబడ్డాయి. నీరు ఉండవలసిన స్థానాలు, వాస్తులోని ఎత్తుపల్లాల నియమాలు ఈ గాలి వీచే పద్దతి పైనే సూచించబడ్డాయి.. నీరు ఈశాన్యం,తూర్పు మరియు ఉత్తరం దిశలలో ఉండాలని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే మనం బావులు, బోర్లు నీటి ట్యాంకులు అన్నీ ఈ దిశలందే ఉంచుతున్నాము. ఈ నీటిని దక్షిణ, పడమర మరియు నైరుతి ప్రాంతాలందు ఉంచితే తీవ్ర నష్టాలు వస్తాయని వాస్తు తెలుపుతుంది. ఈ నియమమం లో అంతర్లీనంగా వైజ్ఞానిక అంశం ఇమిడిఉంది. మనదేశంలో గాలి దక్షిణం,నైరుతి,పడమర  నుండి తూర్పు, ఉత్తర, ఈశాన్యం వైపుకు వీస్తుంది..నిల్వ ఉన్న నీరు సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుంది. నీరు గృహానికి దక్షిణ,నైరుతి, పడమర దిశలల్లో ఉంటే ఈ నీటి పై నుండి గాలి వీస్తుంది. అప్పుడు ఈ గాలితో పాటు నిల్వ నీటి పై ఉండే సూక్ష్మజీవులు తూర్పు ఉత్తరంగా ప్రయాణించి ఇంట్లోకి చేరతాయి. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు గృహంలో ఉండేవారికి కలుగుతాయి.తద్వారా కుటుంబం రోగగ్రస్తం  అవుతుంది. అందుకే ఈ దిశలందు నీటిని ఉంచకుండా తూర్పు,ఉత్తర, ఈశాన్యాలలో ఉంచమని వాస్తు చెపుతుంది. ఈ దిశలందు నీటిని ఉంచినట్లైతే విషక్రిములు ఇంట్లోకి రాకుండా బయటకు పోతాయి. అందుకే ఇంటికి దూరంగా ఈ దిశలందు నీటిని ఉంచాలి. నిల్వ నీటిపై నుండి గాలి గృహం వెలుపలికి పోయే విధంగా వాస్తు సూత్రాలను రూపొందించారు. నీరు తూర్పు,ఉత్తర,ఈశాన్యమూలందు ఉంటే ఇంట్లో ఉండేవారికి నష్టం రాదు. ఎందుకంటే వీచే గాలి నిల్వ నీటి పై నుండి ఇంటి వెలుపలికి వెళ్లిపోగలదు.

వాస్తుప్రకారం దక్షిణం.పడమర దిశలు, తూర్పు,ఉత్తర దిశలకన్నా ఎత్తులోఉండాలి. . అన్ని రకాల నిర్మాణాలలో తూర్పు,ఉత్తరం దిశలను పల్లంగా ఉంచాలని వాస్తు తెలుపుతుంది. దీనిలో కూడా శాస్రీయత ఉంది. పడమర. దక్షిణ దిశలలో నీరు ఉంటే ఆరోగ్యానికి చేటు. ఇక్కడ వర్షపు నీరు ,వాడుక నీరు నిల్వ ఉండకుండా తూర్పు,ఉత్తర దిశలను పల్లంగా ఉంచాలని వాస్తు తెలుపుతుంది. దక్షిణం,పడమర లను తూర్పు,ఉత్తరాలకన్నా మెరకలొ ఉంచితే ఉపయోగించిన నీరు, వర్షపునీరు దక్షిణ పడమరలలో ఉండకుండా తూర్పు,ఉత్తరాలవైపు వెళతాయి.అక్కడి నుండి గృహం వెలుపలకు పంపితే ఎటువంటి నష్టం ఉండదు. అందుకనే ఇంట్లోని వాడుక నీటిని తూర్పు,ఉత్తర, ఈశాన్యాల గుండా వెలుపలికి పంపమని వాస్తు నిర్దేశిస్తుంది.దక్షిణ,నైరుతి,పడమర దిశలలో నీరు నిలవ ఉండకుండా చేసేందుకు మహర్షులు ఈ నియమాన్ని ఏర్పరిచారు. పూర్వకాలం లో డ్రైనేజ్ వ్యవస్థ అంతగా ఉండేది కాదు.

దక్షిణం, పడమర మరియు నైరుతి నుండి వచ్చే గాలి ఎటువంటి ఆటంకం లేకుండా తూర్పు ఉత్తరాలకు వెళ్ళాలి. లేకపోతే నిర్మాణాలకు నష్టం ఏర్పడుతుంది. ఈ సూత్రం ప్రాతిపదికపై దక్షిణం,పడమరల ప్రహరీలకన్నా తూర్పు, ఉత్తరాల వైపు తక్కువ ఎత్తులో ప్రహరీలని నిర్మించాలన్న వాస్తు నియమము వచ్చింది.. అదే విధంగా తూర్పు ఉత్తరం వైపు ఎక్కువ కిటికీలను, దర్వాజాలను ఉంచాలని వాస్తు తెలుపుతుంది.గాలి సులభంగా ప్రవహించడానికే  వేసే వసారాలు తూర్పు, ఉత్తరం వాటంగా ఉండాలని వాస్తు తెలియజేస్తుంది. ఇంకా తూర్పు ఉత్తరాలలో ఎత్తైన చెట్లు గాని నిర్మాణాలు గాని ఉంటే వీచే గాలి నిరోధింపబడుతుంది. దీనివల్ల అనేక నష్టాలు గృహస్తుకు, నిర్మాణాలకు కలుగుతుంది. అందువల్ల ఈ దిశలందు ఎత్తైన చెట్లు, నిర్మాణాలు ఉండరాదని వాస్తు ఆదేశిస్తుంది. ఈ వాస్తు నియమాలన్నీ మనిషికి ఆరోగ్యాన్ని కలిగించేవే. ప్రకృతిని పూర్తిగా అర్ధం చేసుకొని దాని గమనం మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే విధం గా వాస్తు నియమాలు రూపొందింపబడినాయి.

భూమిపై నుండే ప్రతి వస్తువు ఉత్తర ధ్రువం వైపు ఆకర్షింపబడుతుంది. మానవులపై కూడా ఈ ఆకర్షణాప్రభావం ఉంటుంది. అయస్కాంత తరంగాలు ఎల్లప్పుడు దక్షిణం  నుండి ఉత్తరం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి.ఉత్తర ధ్రువం ఆకర్షణ ప్రతి వస్తువు పై ఉంటుంది. ఈ అయస్కాంత తరంగాలకు మనిషి మెదడు ప్రభావితం కాకూడదని ఉత్తరం వైపు శిరసునుంచి నిద్రపోకూడదని వాస్తు తెలుపుతుంది. ఉత్తరం వైపు తల పెట్టరాదని వాస్తు నిర్దేశిస్తుంది. ఉత్తరం వైపు తలనుంచి నిద్రిస్తే అయస్కాంత తరంగాల ప్రభావం మనిషి మెదడు పై పడి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శిరోసంబంధమైన సమస్యలు,నిద్ర లోపించడం,టెన్షన్, మొదలగు సమస్యలు వస్తాయి. అందువల్ల ఉత్తరం వైపు తలనుంచి నిద్రపోకూడదని వాస్తు తెలుపుతుంది.

ఈ విధంగా ఇంకా ఎన్నో నియమాలు వాస్తు లో రూపొందించబడినవి. ఈ నియమాలలో ఉన్న ఆంతరార్ధాన్ని శోధిస్తే ఎన్నోవిజ్ఞాన విషయాలు తెలుస్తాయి.వాస్తు మూఢవిశ్వాసం కాదు అని అర్ధం అవుతుంది. మన ప్రాచీన వాస్తు గ్రంధాలు అప్పటి జీవన విధానానికి అనుగుణంగా ఉన్నాయి. ఇప్పటి వాస్తుకు  కొన్నిపురాతన నియమాలకు భేదముంది. అయినప్పటికి మౌలిక సూత్రాలు ఒకటే. ఇప్పుడు అనుసరిస్తున్న వాస్తు నవీన కాలానికి అనుగుణంగా ఉంది. ఇవన్నీ  శోధించి తెలుసుకొన్నవే. పాతవాటితో ఇప్పటి కొన్ని సూత్రాలు విభేదించినప్పటికి వాస్తు మౌలికతకు  నష్టం కలుగ కుండా ప్రజలకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. వాస్తు కొన్ని సందర్భాలలో మానవ మేధస్సు అందని ఫలితాలు ఇస్తుంది. వీటి పై ఇంకా పరిశోధన చేయవలసింది ఉంది. ఏదిఏమైనా వాస్తు మూఢనమ్మకం కాదు. వాస్తు లోని అంతరార్ధాన్ని గ్రహించి ఈ నియమాలను అనుసరిస్తే మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. గుప్తంగా చెప్పబడిన సత్యాన్ని గ్రహించకుండా వాస్తును విస్మరిస్తే తీవ్ర నష్టాలు కలుగుతాయి. ఇది సత్యం.

మరిన్ని శీర్షికలు
humour interview