Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

పోర్టు హ్యూరాన్ – ది బ్లూ వాటర్ ఏరియా 

 

మనిషి మనుగడకు నీరు చాలా అవసరం.  నాగరికత పరిఢవిల్లినది నదీ తీరాలలోనే.  ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా నాగరికత పరిఢవిల్లక మునుపు మానవ మనుగడ మొదలయింది నదీ తీరాలలోనే.   జీవిత ముఖ్యావసరమైన నీటికోసం నదీ తీరాలలో నివాసాలేర్పరుచుకున్న మానవులు ఆ ప్రవాహాలలో తమ జీవన ప్రవాహాలను పరుగులెత్తించారు.  అనేక విధాల అభివృధ్ధి చెందారు.  వ్యాపారాలలో ఉద్దండులయ్యారు.   అలాంటి ప్రదేశాలలో మిచిగాన్ రాష్ట్రంలోని పోర్టు హ్యూరాన్ ఒకటి.

ఇక్కడివారు ఆ నీటి తీరాలను అతి శుభ్రంగా వుంచి మనుషులకు అవసరమైన ప్రశాంత వాతావరణంకల ప్రదేశాలుగా అభివృధ్ధి చెయ్యటమేకాక, పూర్వంనుంచి తాము సాధించిన అభివృధ్ధిని ప్రదర్శన శాలల ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు.

ఈ విషయంలో అమెరికా వారిని మెచ్చుకోక తప్పదు.  మనకూ వనరులున్నాయి.  వాటిని  కాపాడుకునే శక్తి సామర్ధ్యాలు, తెలివితేటలు అన్నీ వున్నాయి.  కానీ అనవసరమైన రాజకీయాలు, ప్రజల నిరాసక్తత వలన వేటి విలువా మనం గ్రహించటంలేదు సరికదా, దూరపు కొండలు నునుపని పరుగులు తీస్తున్నాము.  దయచేసి ఎవరికి వారు కొంచెం శ్రధ్ధ చూపించండి.  మనద్వారా ఈ దేశం చెత్త కుప్ప కాకుండా  తగు జాగ్రత్త తీసుకోండి.  సరే అసలు విషయానికి వస్తాను....

పోర్టు హ్యూరాన్ చేరగానే, హ్యూరాన్ లేక్ లో నిండుగా వున్న నీలి నీరు కళ్ళబడగానే మనసు ఆనందంతో గంతులేసింది.  ఎంతో అందంగా, ప్రశాంతంగా వున్న దాని ఒడ్డున కొంచెంసేపు అలా ఒక్కదాన్నీ నడవాలనిపించింది.  ప్రపంచంలోని సంతోషం, ప్రశాంతత అంతా నా నెత్తిన కుమ్మరించినట్లు అనిపించింది.  మా పిల్లల మూలంగా కదా మేమివ్వన్నీ చూస్తున్నది, వాళ్ళని ఇక్కడ చదివించి మంచి పని చేశామనిపించింది.  అంత అందంగా వున్న ఆ వాతావరణం చూస్తే నాకే కాదు, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.

ఇంత అందమైన ఈ పోర్టునుంచి వర్తకం జరుగుతుంది.  ఇది ఇంటర్నేషనల్ పోర్టు.  ఇక్కడికి వచ్చిన సందర్శకుల కోసం స్ధానికుల చరిత్ర వివరాలు, విశేషాలు తెలుపుతూ మ్యూజియంలు వున్నాయి, మ్యూజియంలుగా మారిన షిప్పులు కూడా వున్నాయి.  మీరు ఆసక్తిగా చూడాలేగానీ, ఆ షిప్పుల వివరాలు తెలియజేయటానికి గైడ్లు కూడా వుంటారు.  వీటికి వేటికీ టికెట్లు లేవు.  సందర్శకులకు కూడా వారి ఆసక్తినిబట్టి ఇక్కడ నది మీద సాగే టూర్లు, నది – రోడ్డు మీద సాగే టూర్లు రకరకాలవి   వున్నాయి.  వీటికి టికెట్లుంటాయి.    మనకి కావలసినదల్లా సమయం, వాటిని చూసే ఆసక్తి. అంతే. 

హ్యూరన్ లైట్ షిప్ మ్యూజియమ్

లైట్ షిప్ లు లోతైన సముద్రంలోనూ, లైట్ హౌస్ లు కట్టటానికి వీలుకాని ప్రదేశాలలో, లైట్ షిప్ కన్నా లైట్ హౌస్ కట్టటం ఎక్కువ వ్యయమవుతుందనుకున్న ప్రదేశాలలో ఏర్పాటు చేసేవారు.  ఇవి వేరే షిప్స్ కి సముద్రంలో దోవ చూపించటమేగాక, వాతావరణ హెచ్చరికలు కూడా చేసేవి.  అలాంటి వాటిలో ఒకటి 1921లో ప్రారంభించబడిన ఈ షిప్.  ఇది ఇతర లేక్స్ లోని లైట్ షిప్స్ కి రిలీఫ్ వెసల్ గా పని చేసింది.  11 మంది క్రూ పని చేసిన ఈ షిప్ పొడుగు 97 అడుగులు.  ఈ షిప్ నుంచి వచ్చిన వెలుతురు ఎలాంటి వాతావరణంలోనైనా 24 అడుగుల వరకు స్పష్టంగా కనిపించేదిట.

 నిర్మలమైన వాతావరణంలో ఈ వెలుతురు 14 మైళ్ళదాకా కనిపించేది.  క్రీ.శ. 1940 తర్వాత గ్రేట్ లేక్స్ మీద వున్న లైట్ షిప్ హ్యూరన్ ఒక్కటే.  కోస్టు గార్డు డ్యూటీ నుంచి 1970లో రిటైరయిన (ఎంత గొప్ప షిప్పులయినా,  జవసత్వాలుడిగితే రిటైరుమెంటు తప్పదు కదండీ) ఈ షిప్ ని 1971 లో సిటీ ఆఫ్ పోర్టు హ్యూరన్ కి బహూకరించారు.  అప్పటినుంచీ ఈ సీనియర్ సిటిజన్ (రిటైరయింది కదండీ) ఇక్కడ మనలాంటివారిని అలరిస్తోంది. 
సందర్శకులు ఆ షిప్ ఎక్కి అంతా చూడవచ్చు.  మేము ఆసక్తిగా చూడటం గమనించి ఒక ఆఫీసర్ వచ్చి 40 నిముషాలపాటు దాని గురించి అంతా వివరించి చెప్పారు.   ఇదే మనం నేర్చుకోవాల్సింది అంటాను.  మన దేశంలోని విశేషాల గురించి తెలుసుకోగోరే వాళ్ళకి కొంచెం వివరించి చెప్తే ఎంత సంతోషిస్తారోకదా.

కోస్ట్ గార్డ్ కట్టర్ బ్రేంబుల్

అలాగే ఇంకొక షిప్ కోస్ట్ గార్డ్ కట్టర్ బ్రేంబుల్  కూడా దర్శకుల సందర్శనార్ధం వుంచారు.  షిప్ లోపలకు వెళ్ళాక అక్కడున్న బెల్ కొడితే గైడ్ వచ్చి అంతా చూపిస్తారని వుంది కానీ, మాకు సమయం లేక ఆ సాహసం చెయ్యలేదు.  షిప్ మొత్తం ఒక రౌండ్ వేసేసి వచ్చాము.  ఈ షిప్ నీటిలో పేరుకు పోయిన మంచును కట్ చేసి ఓడలు తేలికగా ప్రయాణం చేయటానికి వీలుని కల్పిస్తుంది.

ఇంటర్నేషనల్ ఫ్లాగ్ ప్లాజా

బ్లూ వాటర్ బ్రిడ్జీలకి ఉత్తరంగా అమెరికా జెండా, కెనడా జెండా ఎగురుతూ కనబడతాయి.  దీనినే ఫ్లాగ్ ప్లాజా అంటారు.  అమెరికాలోగానీ, కెనడాలోగానీ ప్రజలకి ఆరోగ్యం, యాక్సిడెంట్స్ వగైరా ఏ అత్యవసర పరిస్ధితుల్లోనైనా  9-1-1 కి ఫోన్ చేస్తే వెంటనే సహాయం వస్తుంది.  అలా సహాయం చేసేవారి గౌరవార్ధం ఈ రెండు దేశాల జెండాలతో ఈ ఫ్లాగ్ ప్లాజా ఏర్పాటు చేశారు.  ఈ ప్లాజా కేవలం విరాళాలతోనే నిర్మింపబడింది.  దీనికోసం విరాళాలిచ్చినవారి పేర్లు ఇక్కడ రాశారు.

ఇక్కడ వున్న ఇంకొక మ్యూజియమ్ ఎడిసన్ డిపో మ్యూజియమ్ కూడా చూసి ఇంటి ముఖం పట్టాము.  దాని గురించి ఇంకోసారి....

మరిన్ని శీర్షికలు
Pulse Diagnosis | నాడిని ఎలా చూడాలి? | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)