Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Pulse Diagnosis | నాడిని ఎలా చూడాలి? | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు



 

దీపావళి సంబరాలు, ఇదివరకటిరోజుల్లో బాగున్నాయా, ఈరోజుల్లో బాగున్నాయా అంటే, ఇదివరకటి రోజులే అని గంటా బజాయించి చెప్పొచ్చు. ఏవిషయం తీసికున్నా, తేడా స్పష్టంగా కనిపిస్తోంది.  ఇదివరకటి రోజుల్లో, ఇంట్లో అమ్మలు పిండివంటలు చేశారంటే, ఓ మూడు నాలుగురోజులు ముందునుంచీ, హడావిడి పడిపోయి, తమ ఆత్మీయతా, అభిమానమూ రంగరించి, తీపి,కారం పదార్ధాలు తయారుచేసి, దీపావళి దాకా, ఎవరినీ ముట్టుకోనీయకుండా దాచేసి, ఆరోజున మాత్రం, ఇంట్లో పిల్లలకీ, పొరుగింటివారికీ, పనిచేసేవారికీ , మనసారా ఇచ్చి ఆనంద పడిపోయేవారు. అందులో, ఆ ఇల్లాలి ప్రేమా, అభిమానమూ, కళ్ళకి కొట్టొచ్చేటట్టుగా కనిపించేది.. ఈరోజుల్లో, అంతంత ఓపికలూ లేవూ, అభిమానాలు, ఆత్మీయతల మాట సరేసరి, ఏదో మొక్కుబడిగా, బజారుకెళ్ళి,, ఎవరో ఇస్తే, తిరిగి ఇవ్వడం ఇంకా ఓ ఆనవాయితీగా మిగిలింది కాబట్టి, ఓ నాలుగైదు స్వీట్స్ ప్యాకెట్లు కొనడం చూస్తున్నాము. ఆ ప్యాకెట్ లో, ప్యాక్ చేసిన పదార్ధాలు, ఆ కొట్టువాడు, ఎప్పుడు తయారుచేశాడో, ఆ భగవంతుడికే తెలియాలి.. ఈ గొడవలన్నీ ఎందుకూ అనుకుని, కొంతమందైతే, ఏ డ్రై ఫ్రూట్స్  ప్యాక్కులో తీసేసికుంటున్నారు.

 ఇదివరకటిరోజుల్లో, వార, మాస పత్రికలు, దీపావళి ప్రత్యేక సంచికలు ప్రచురించేవారు. అందులో ప్రచురించే కథలకి ఓ పోటీకూడా నిర్వహించేవారు. కథల క్వాలిటీ కూడా చాలా బాగుండేది.  “ యువ”,  “ జ్యోతి “ మాసపత్రికలైతే, ఒత్తుగా, ఓ నూటాభై , రెండువందల పేజీలతో వచ్చేవి. ముందుగా కాపీ రిజర్వు చేసికుంటే తప్ప, బజారులో దొరికేదికాదుకూడానూ. ఇంక ఆంధ్రపత్రిక, ప్రభ  వార పత్రికలైతే, సరీగ్గా దీపావళి రోజుకి వచ్చి, “కునేగా మరికొళుందు “ సెంటుతో ఘుమఘుమలాడేవి.. ఆ ప్రత్యేక సంచికలలో, వ్యాసాలు కానీ, కథలు కానీ ప్రచురితం అయితే, ఎంతో ఘనంగా చెప్పుకునేవారు.. ఈరోజుల్లో ప్రత్యేక సంచికలు లేవా అంటే, ఉన్నాయి, కానీ చాలామట్టుకు అంతర్జాల పత్రికలే. చేతిలో, ఓ స్మార్ట్ ఫోనో, లేదా ఓ ల్యాప్ టాప్పో, డెస్క్ టాప్పో ఉన్నవారే కదా చదివేదీ?  చేతిలో పుస్తకం చదవడంలో అనుభవించే ఆనందమే వేరు.  బజారుకెళ్ళి, దీపావళి సంచికలు ఓపికున్నన్ని కొని,  (ఖరీదుని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు ). ఎవరికీ కనిపించకుండా దాచేసి, ఓ పుస్తకం కింద ఇంకో పుస్తకం పెట్టేసి, భార్య చూసి “ అదేవిటండీ పుస్తకం తెచ్చినట్టే చెప్పేరు కాదూ, ఏదో ఓసారిలా ఇవ్వండి.. ఓమారు బొమ్మలు చూసి ఇచ్చేస్తానూ… “ అంటూ , చేతిలో ఉన్న పుస్తకాలు, లాగేసికుంటే, లేని కోపం తెచ్చేసికుని, “ సర్లే.. ఓ పుస్తకమైనా ఇలా దయచెయ్యి, ఛస్తే ఎప్పుడైనా పుస్తకాలు తెస్తే ఒట్టూ..” అనడం, ఇంతలో, ఏ పిల్లాడో, పిల్లదో, అమ్మ చేతిలోంచి ఆ పుస్తకం కాస్తా లాగేసికుని, “ అరే.. దీపావళి సంచికొచ్చేసిందేవిటీ…” అంటూ, ఇంట్లోని కుటుంబసభ్యులందరూ, తలో పుస్తకమూ, ఒకరి తరువాత ఇంకోరు చదివే ఆనందం ఎక్కడ కనిపిస్తుందీ ఈ రోజుల్లో? ఎవరికి వారే యమునాతీరే…

న్యూక్లియర్ ఫ్యామిలీలుగా మారిపోయిన కుటుంబ వ్యవస్థ గురించి చెప్పుకునేదేముందీ? ఇదివరకటి రోజుల్లో, దీపావళి వచ్చిందంటే, కొత్త అల్లుడినీ, వియ్యాలవారినీ, పండక్కి పిలిచి సత్కరించడం ఓ ఆనవాయితీగా ఉండేది. ఈ రోజుల్లో, దీపావళి శలవలొచ్చేయంటే, ఏదో టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళడమే ప్రధానంగా భావిస్తున్నారు.  బాణాసంచా కాల్చినప్పుడు, ఏదో ఒక శబ్దం వస్తేనే బావుంటుంది, కానీ  ఆ శబ్దాలు మరీ గుండెలు గుభేలమనిపిస్తే ఎవరికైనా చిరాకే కదా. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా భయంకరమే మరి—ఓ సినిమాకి వెళ్తే, అదేదో డాల్బీ సౌండని పేరెట్టి, గుండెలు హోరెత్తించేస్తారు. అదేమి ఆనందమో మరి! బాణాసంచా విషయం అడగక్కర్లేదు. ఎంత శబ్దం ఉన్న బాణాసంచా కాలిస్తే అంత గొప్ప. పైగా, అర్ధరాత్రి దాటిన తరువాతే మొదలెడతారు. ఇదివరకటిరోజుల్లో, దీపావళి సామాన్లు, పూర్తిగా కాల్చనిచ్చేవారు కాదు. ఇంట్లో అమ్మలు, నాగులచవితికి కొన్నీ, కార్తీకపౌర్ణమికి కొన్నీ, విడిగా పెట్టే, మిగిలినవి చేటలో పెట్టేవారు.

ఆరోజుల్లో, జువ్వలూ అవీ కాల్చుకోడానికి, పోటిలు జరుపుకోడానికీ, ఏ చెరువుగట్టుకి పక్కనో, ఓ ఖాళీ స్థలం లాటిదుండేది. ఇప్పుడు, ఆ చెరువులూ, ఖాళీ స్థలాలూ మచ్చుకైనా కనిపించవు.. ఎక్కడ ఖాళీ కనిపిస్తే, దాన్ని కబ్జా చేసేసి, ఏ బహుళ అంతస్థుల సముదాయమో కట్టేయడం…

 దీపావళి వచ్చిందంటే, ఏదో  ఆ పాతమధురాలు గుర్తుచేసికుని సంతోష పడడంతోనే సరిపోతోంది…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
sahiteevanam