Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

(గత సంచిక తరువాయి)

వసంతఋతువు వర్ణన చేస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలవారు.

మలయకటకోటజస్థిత 
కలశిసుత సేవ నిట్లు గనెనొ తదాశా
నిలు డనగ నలసవృత్తిన 
మెలగుచు నాపోశనించె మిహికాజలధిన్

మలయపర్వత సానువులయందు పర్ణశాలలో ఉన్న అగస్త్యుడు( మలయ కటక ఉటజ స్థిత)  సముద్రాన్ని ఒక్క గుక్కలో త్రాగేశాడు. ఆ పర్వతం దక్షిణ దిశలో ఉంటుంది. ఆ అగస్త్యుని సేవ జేశాడేమో బహుశా, అదే దక్షిణ దిక్కునున్న అనిలుడు (పవనుడు) తన గురువుగారిలా సముద్రాన్ని గాకున్నా, మంచు అనే సముద్రాన్ని ఆనవాల్లేకుండా త్రాగేశాడు. వసంతఋతువు  లో మంచు తెరలు మాయమవుతాయి, ఆ తర్వాత రానున్న గ్రీష్మ ఋతువు లక్షణాలు కొద్దిగా  ఉంటాయి, వసంతఋతువులో. చలి నశించిపోతుంది. మంద మలయపవనాలు వీస్తాయి.ఈ ప్రకృతిరహస్యాన్ని పౌరాణిక రహస్యంతో ముడిపెట్టాడు.

అగస్త్యుడు భారతీయ పురాణ ప్రసిద్ధ మహర్షి. వాతాపి ఇల్వలులను అంతంచేయడం, వింధ్యపర్వతాన్ని అణిచివేయడం మొదలైన అద్భుతాలు చేసినవాడు. మరొక సందర్భములో సముద్రంలో దాక్కుని ఆగడాలు చేస్తున్న కాలకేయులు అనే రాక్షసులను నాశనం చేయడంకోసం  సముద్రాన్ని మొత్తంగా ఒక్క గుక్కలో త్రాగేశాడు, అక్కడ దాక్కున్న రాక్షసులు బయటపడ్డారు,దేవతల చేతుల్లో నాశనం అయ్యారు. కొసరూ పిసరూ మిగిలినవాళ్ళను ఆతర్వాత అర్జునుడు ఏరి పారేశాడు. కశ్యప ప్రజాపతికి కాల అనే భార్యతో కలిగినవారు కాలకేయులు. ఈ పౌరాణిక గాథను పరామర్శచేశాడు సమస్త్ర శాస్త్రవేది ఐన రాయలవారు.         

అరుణాంశుండు హిమర్తువన్ రజని డీలై క్రుంకి పుష్పర్తు వా
సర కల్యోదితు డౌచు మున్న యిడుటన్శ్యామాకుచాలేపసం
కరసాంద్రాగ్నిశిఖారుణప్రభ గొనెన్ గాకున్న గాలజ్ఞప
త్త్రి రుతం బెట్లు చెలంగు మానకుపిత స్త్రీ కర్ణ దంభోళి యై 

సూర్యుడు(అరుణాంశుడు) సహజంగానే రాత్రుళ్ళలో బలహీనుడు అవుతాడు, హేమంతఋతువు  అనే రాత్రివేళ బలహీనుడై అస్తమించిన సూర్యుడు వసంతఋతువు అనే రోజున ఉదయాన్నే బలవంతుడు అయినాడు, ఉదయించాడు. హేమంతఋతువులో ఆయన వేడి స్త్రీల కుచములయందు దాక్కుంది. వారు వక్షోజాలకు అలదుకునే కుంకుమపూల యందున్న ఎర్రదనంలో సూర్యుడి 'అరుణ'దనం దాక్కుంది. ఆ తర్వాత వచ్చిన వసంతఋతువులో కాశ్మీర కుంకుమ పూలను, పూల పొడిని అద్దుకోవడం మానేశారు. కనుక మరలా తన ఎర్రదనాన్ని, వేడిమిని తాను పొందాడు సూర్యుడు.ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి స్త్రీల వక్షోజాలు, యిది శరీరసంబంధమైన  సరసపు విసురు, కుంకుమపూలు, కస్తూరి మొదలైన వాటిని అలదుకోవడం ఉష్ణాన్ని యిస్తుంది శీతాకాలంలో, అనే ఆరోగ్యరహస్యం, రాయలకు నమస్సులు!(చందనం, మంచిగంధము అలదుకోవడం చల్లదనాన్ని యిస్తుంది) అస్తమించే సూర్యుడు తన వేడిమిని, ప్రకాశాన్ని అగ్నిలో నిక్షేపం చేసి శెలవు తీసుకుంటాడు అని సూక్తి. కుంకుమపూవుకు 'అగ్నిశిఖ' అని కూడా పేరు. కనుక అరుణమును, ఉష్ణమును తరుణుల వక్షోజాల్లో నిక్షిప్తంచేసి, ఆ స్తనగిరులచాటున హేమంతఋతువు అనే రాత్రిపూట సూర్యుడు అస్తమిస్తాడు. మరలా వసంతఋతువు అనే ఉదయాన్నే తన వేడిమిని తాను వెనక్కు తీసేసుకుని ఉదయిస్తాడు. యిది పాండితీ ప్రతిభ.

స్త్రీ ప్రకృతి. పురుషుడు తన ప్రకృతి గుండెపై తన వేడిని ఉద్విగ్నతను సందేహాలను బాధలను నిక్షిప్తం చేసి హాయిగా నిదురిస్తాడు. 'తన కాంతకు' తన బరువులు, బాధ్యతలు అప్పజెప్పి రాత్రుళ్ళు ఆమె గుండెలో నిదురిస్తాడు, సేద దీరుతాడు. ఆ వేడిమిని అంతా ఆమె గ్రహిస్తుంది, అతడిని గుండెల్లో దాచుకుంటుంది, సేద దీరుస్తుంది. మరలా మరొక ఉదయం తొంగిచూస్తుంది, నిత్యజీవన సమరానికి, ఉద్విగ్నతకు, వేడిమికి ఎదురు సవాలు జేస్తూ పురుషుడు పైకి లేస్తాడు. యిది స్త్రీ, పురుష సంబంధమైన, ప్రేయసీప్రియుల సంబంధమైన, దాంపత్య సంబంధమైన రహస్యం. రాయలతో సరితూగగలిగినవారు కొందరున్నారేమో, వుంటే గింటే, రాయలను మించిన కవి అయితే లేడు, రాడు! సరే, చివరన మరొక మెరుపు ఉన్నది పద్యంలో.

రాయలు అంటున్నాడు..' అలా హేమంతం అనే రాత్రి గతించి వసంతం అనే ఉదయము వచ్చి ఉండాలి,  లేదంటే కాలజ్ఞులైన కోళ్ళ కూతలు (కాలగ్నపత్ర్త్రి రుతంబు) ఎలా వినబడతాయి? మాన కుపితలు ఐన స్త్రీలు ఎందుకు భయముతో ఉలికిపడుతారు? యిది ఎంత అద్భుతమైన పద్యపాదం! కాలజ్ఞ పత్త్రి అంటే కాలజ్ఞానము కలిగిన పక్షి, అంటే కోడి, కాలమును తెలుసుకుని భంగం లేకుండా  కూసి ప్రపంచాన్ని మేలుకొలుపుతుంది కనుక. కానీ 'కాలము అంటే వసంతకాలము', అది తెలుసుకోవడమే కాలజ్ఞత అని వ్యుత్పత్తి. ఈ పద్యంలో మొత్తం హేమంతఋతువును రాత్రిగా, వసంతఋతువును ఉదయంగా పోల్చడం ప్రధానంగా ఉన్నది. మామూలు ఉదయాల్లో మామూలు కోళ్ళు కూస్తాయి, ఉలిక్కిపడిన తరుణి లేస్తుంది, భార్య అయితే దైనందిన కార్యక్రమాలకు పొద్దు పోయిందే, అయ్యో మొద్దునిద్ర అనుకుంటూ. ప్రేయసి అయితే 'అయ్యో తెల్లవారింది, అందరి కళ్ళల్లో పడకుండా వెళ్లిపోవాలి' అని త్వరపడుతుంది. ఆమె అయినా ఈమె అయినా మాన కుపిత అవడం సహజమే, అనివార్యమే! పై పై రోషం, కసరులు, రుసలు, బుసలు సద్దుమణిగి, తనవాడిని దరిదీసి,సేద దీర్చి సంతోషపెట్టి ఆనందపడుతుంది. మరొక రకంగా, రోషంతో, బెట్టుతో బిగదీసుకున్న స్త్రీ 'అమ్మో! వసంతం వచ్చేసింది, ఎలా తట్టుకుంటానో ఏమిటో?' అని ఉలికిపడుతుంది, విరహబాధ కలుగుతుంది. 

వసంతఋతువు అనే ఉదయం కనుక, వసంతమును తెలుసుకోవడమే కాలజ్ఞత గనుక, వసంతఋతువులో ఆ ఋతుకాల జ్ఞానము కలిగిన 'కోకిలలు'కూస్తాయి, వసంతము అనే ఉదయం అవుతుంది! 'కాలజ్ఞాపిత కుక్కుటౌ' అని కోకిలకు బిరుదు. ' కాకః కృష్ణః పికః కృష్ణః కా భేదః పిక కాకయోః వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః' అని సూక్తి. కాకీ నల్లగానే ఉంటుంది,కోకిలా నల్లగానే ఉంటుంది, రెండిటికీ ఏమిటీ భేదం అంటే, వసంతం వస్తే తెలుస్తుంది, కూతను బట్టి, ఏది కాకి, ఏది కోకిల అనేది! యిక్కడ ఉదయాన కోడీ కూస్తుంది, కోకిలా కూస్తుంది, అది ఏ ఉదయము అనేది కోకిల కూస్తే తెలుస్తుంది, అది 'వసంతోదయం' అని అంటున్నాడు కారణజన్ముడు ఐన కవిరాయలు!  

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.     

మరిన్ని శీర్షికలు
weekly horoscope 6th november to 12th november