Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

క‌మ‌ర్షియాలిటీ ఎక్క‌డుందో నాకిప్ప‌టికీ అర్థం కాలేదు - క‌మ‌ల్‌హాస‌న్‌

క‌మ‌ల్ హాస‌న్ ఓ ప్ర‌యోగ శాల‌. నిత్యం ఏదో ఓ కొత్త పాత్ర‌కై అన్వేషిస్తుంటారాయ‌న‌. క‌మ‌ల్‌ని ఎన్నో పాత్ర‌ల్లో చూశాం.. త‌రించాం. ఇప్ప‌టికీ క‌మ‌ల్ సినిమా వ‌స్తోందంటే.. అందులో క‌మ‌ల్ న‌ట విశ్వరూపం ఎలా ఉంటుందో అన్న ఉత్సుక‌త మొద‌ల‌వుతుంది. క‌మ‌ల్ న‌టించిన సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చు. అత‌ని ఆలోచ‌న‌లు విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవ‌చ్చు. క‌మ‌ల్ నిర్మాత‌లు ఆర్థికంగా న‌ష్టాల పాల‌వ్వొచ్చు. కానీ క‌మ‌ల్ మాత్రం ఓ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఓ ద‌ర్శ‌కుడిగా ఎప్పుడూ ఎవ్వ‌రినీ నొప్పించ‌లేదు. అందుకే.. క‌మ‌ల్ అంటే ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు ఇంత ప్రేమ‌. ఇప్పుడు చీక‌టి రాజ్యం సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు.  ఈ సంద‌ర్భంగా గో తెలుగులో చిట్ చాట్.
 

* చీక‌టి రాజ్యం స్పెషాలిటీ ఏమిటి?
- యూనిక్ సినిమా ఇది. ఒక ప‌గ‌లు, ఒక రాత్రి.. జ‌రిగే క‌థ‌. చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఫాస్ట్ ఫేస్ థ్రిల్ల‌ర్ అనుకోవ‌చ్చు. చాలా స్ట‌యిలీష్‌గా తీశాం.

* ఫ్రెంచ్ సినిమా స్లీప్ లెస్ నైట్‌కి  ఇది రీమేక్ క‌దా?  రీమేక్ సినిమాల్లో ఉన్న సౌల‌భ్యాలేంటి?
- రీమేక్ సినిమా అంటే చాలా ఈజీ అనుకొంటారు. కానీ అంద‌రికీ తెలిసిన క‌థ‌ని అర్థ‌వంతంగా తెర‌కెక్కించ‌డం అనుకొన్నంత సుల‌భం కాదు. జేమ్స్ బాండ్ సినిమాని మ‌నం రీమేక్ చేయ‌గ‌ల‌మేమో గానీ, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని మ‌ళ్లీ సృష్టించ‌లేం. క‌థ‌లో మలుపులు ముందే తెలిసిపోయినా కూర్చోబెట్ట‌డం క‌త్తిమీద సామే.

* ఈ సినిమా మీ శిష్యుడి చేతుల్లో పెట్ట‌డానికి కార‌ణం ఏమిటి?  మీరే డైరెక్ట్ చేయొచ్చు క‌దా?
- నాగురువుగారు బాల‌చంద‌ర్  లేక‌పోతే నేను లేను. గురువ‌న్నాక శిష్యుల‌కు అవ‌కాశం ఇవ్వాలి క‌దా?  లేదంటే.. గురువ‌న్న ప‌దానికి అర్థం ఉండ‌దు. నాకు తెలిసి న‌టన‌, ద‌ర్శ‌క‌త్వం రెండూ రెండు దారులు. క‌థ‌లో బాగా ఇన్‌వాల్వ్ అయిన‌ప్పుడే డైరెక్ష‌న్ ఈజీ అవుతుంది. నా వ్య‌క్తిగ‌త అభిరుచులకు దూరంగా ఉండే క‌థ‌ని డైరెక్ట్ చేయ‌డం అంత ఈజీ కాదు.

* మీ సినిమా అనేస‌రికి... మీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎంత వ‌ర‌కూ ఉంటుంది? ద‌ర్శ‌కుడి ప‌నిలో జోక్యం చేసుకొంటారా?
-  సినిమా సెట్లో ఎవ‌రైనా స‌ల‌హాలు ఇవ్వొచ్చు. బాల‌చంద‌ర్ గారి ద‌గ్గ‌ర నేర్చుకొన్న విష‌యం ఇది. సెట్లో ఆ వాతావ‌ర‌ణ‌మే ఉండేది. నా సినిమాకి సంబంధించి నేను న‌టుడ్ని మాత్ర‌మే కాదు స‌హాయ‌ ద‌ర్శ‌కుడ్ని కూడా. ఎన్ని స‌ల‌హాలు చెప్పినా కెమెరా ముందుకు వెళ్ల‌నంత వ‌ర‌కే. ఆ త‌ర‌వాత‌.. న‌టుడిగా మాత్ర‌మే ఉంటా. 

* క‌మ‌ల్‌లోని న‌టుడు, టెక్నీషియ‌న్ ఇద్ద‌రూ ఉన్నారు. ఎవ‌రు ఎవ‌రిని డామినేట్ చేస్తుంటారు?
- న‌న్ను ఓ టెక్నీషియ‌న్ గా గుర్తించుకోవ‌డ‌మే నాకిష్టం. ప్ర‌తీ విభాగంతోనూ నాకు ప‌రిచ‌యం ఉంది. ఆ ప‌నుల‌న్నీ నేను ద‌గ్గ‌రుండి చూసుకోగ‌ల‌ను. అన్నింటికంటే ముఖ్యంగా సినిమా మేకింగ్ అనే ప్ర‌క్రియ‌ని బాగా ఇష్ట‌ప‌డ‌తా.

* తెలుగులో సినిమా చేస్తా చేస్తా అని చాలాకాలం నుంచి ఊరిస్తున్నారు..
- ఇది తెలుగు సినిమానేనండీ. డ‌బ్బింగ్ కాదు. అయినా మీకోసం.. మ‌ళ్లీ ఓ తెలుగు సినిమా చేస్తున్నా. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు ప్ర‌క‌టిస్తా. 

*తెలుగు, త‌మిళ భాష‌ల్లో వేర్వేరుగా షూట్ చేశారు..  అయినా సినిమా త‌క్కువ రోజుల్లోనే పూర్త‌య్యింది.. క్రెడిట్ ఎవ‌రికి?
- క‌చ్చితంగా టీమ్ అంత‌టికీ. ఈ సినిమా ఇన్ని రోజుల్లో పూర్త‌వ్వాలి అని ముందేప్లాన్‌వేసుకొన్నాం. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ డబ్బింగ్ సినిమా చూస్తున్నామ‌న్న ఫీలింగ్ రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో ప్ర‌తి స‌న్నివేశాన్ని రెండు భాషల్లో షూట్ చేశాం. ఇప్పుడు ఈ సినిమాని హిందీ వాళ్లు కూడా కావాలంటున్నారు. చూద్దాం.. అక్క‌డ డ‌బ్ చేస్తానో, లేదంటే మ‌ళ్లీ రీమేక్ చేస్తానో..

* ఓ సినిమా తీస్తున్న‌ప్పుడు క‌మ‌ర్షియాలిటీ గురించి ఎలాంటి లెక్క‌లేసుకొంటారు..?
- మాది మాంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని చాలామంది చెప్తుంటారు. నిజానికి నాకు క‌మ‌ర్షియాలిటీ అంటే ఏమిటో అదెక్క‌డ ఉందో తెలీదు. ఓ క‌థ నాకు న‌చ్చి, దాన్ని ప్రేక్ష‌కుల‌తో పంచుకోవాల‌నుకొన్న‌ప్పుడు సినిమాగా తీస్తా. అంతే త‌ప్ప‌.. అందులో వాణిజ్యం ఎక్క‌డుంది, ఎంత ఉంది? అనే విష‌యాల్ని ప‌ట్టించుకోను. సినిమా విడులయ్యాక ఆడిందా, లేదా అన్న‌దాన్ని బ‌ట్టే ఆ సినిమా క‌మ‌ర్షియాలిటీ అర్థ‌మ‌వుతుందేమో.

* అన్ని ర‌కాల పాత్ర‌లు చేశారు.. ఇక చేయ‌డానికి ఏం లేద‌న్న భావ‌న ఎప్పుడైనా వెంటాడిందా?
- ఎంత‌మాటండీ. నేను చేసింది ఎంత‌?  నేను చేసిన సినిమాల్లో మూడొంతులు రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే. వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాల్ని ఓ ముఫ్పై, న‌ల‌భై చేసుంటా. అంతే. నేనే అలా అనుకొంటే ఇక మ‌హా న‌టుడు శివాజీ గ‌ణేష‌శ్ ఏమ‌నుకోవాలి. ఆయ‌న అన్ని ర‌కాల పాత్ర‌లూ చేసుండొచ్చు. అయినా సరే... ఆయ‌న కోసం ఇప్ప‌టికీ ఓ కొత్త పాత్ర సృష్టిస్తా. ఎన్ని చేసినా చేయ‌డానికి ఇంకా ఎన్నో ఉంటాయి.

* పౌరాణిక పాత్రలో మీరెప్పుడూ క‌నిపించ‌లేదు..
- ఇదిగో మీరే అంటున్నారుగా.. పౌరాణికం చేయ‌లేదని. అప్ప‌ట్లో ట్రై చేశా. కానీ కుద‌ర్లేదు. బేసిగ్గా నాకు దేవుడిపై న‌మ్మ‌కం ఉండ‌దు. అందుకే ఆ త‌ర‌హా క‌థ‌ల గురించి ప‌ట్టించుకోలేదేమో. భ‌విష్య‌త్తులో నా మ‌న‌సు మారుతుందేమో చూడాలి.  

* విశ్వ‌రూపం 2కి మోక్షం ఎప్పుడు?
- ఆ సినిమా పూర్త‌య్యింది. ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీలు ఓ కొలిక్కి వ‌చ్చాక‌.. విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం.

* మ‌ళ్లీ డైరెక్ష‌న్ ఎప్పుడు?
- త‌క్కువ టైమ్‌లో ఎక్కువ సినిమాలు, అవీ.. నాణ్య‌మైన సినిమాలు తీయాల‌న్న‌దే నా ధ్యేయం. ద‌ర్శ‌క‌త్వం, న‌ట‌నా రెండు బాధ్య‌త‌లూ యాల్సివ‌స్తే స్పీడు త‌గ్గుతుంది. ఇంత వేగంగా సినిమాలు తీయ‌లేం. అందుకే ప్ర‌స్తుతం మెగాఫోన్‌ని దూరంగా పెట్టా.

* ఈత‌రంకి మీరిచ్చే సూచ‌న‌..
- క‌ష్ట‌ప‌డండి. ఫ‌లితాల్ని అందుకోవ‌డానికి షార్ట్ కర్ట్స్‌పై దృష్టిపెట్టొద్దు.  అడ్డ‌దారులు వెతుక్కొంటే... మీరు గ‌మ్యాన్ని చేరుకోలేరు.

* థ్యాంక్యూ.. ఆల్ ద బెస్ట్‌

- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

-కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
movie review