Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ: తనలాంటి స్నేహితుడు ఉండడం  తమ్ముడి అదృష్టం అని  భూషణ్ గారితో అంటుంది కోటమ్మత్త..  అంతేకాకుండా చంద్రకళకి కళావేదికతోపాటు, కళ్యాణ వేదికపై కూడా ముందుండి భాధ్యత తీసుకోవాలని తన మనసులోని మాటను చెప్పేస్తుంది.  ఆమె మాటలకు అందరూ ఆశ్చర్యానికి  లోనవుతారు  ఆ తరువాత...  

హాస్పిటల్లోని ఫోర్త్ ఫ్లోర్ మీద, అంకుల్  రూములోకి వెళ్ళేప్పటికి,  ఆయన కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టున్నారు.  దగ్గరగావెళ్లి, బెడ్ పక్కనే కూర్చునున్న ఆంటీని పలకరించాను.


“రామ్మా రా,  మీ అంకుల్ లేచే ఉన్నారు.  అలా వెళ్లి పక్కనే కూర్చో,” అంది..|

“పనులున్నాయంటూ గొడవ చేసి, మీ అంకుల్, తన డిశ్చార్జ్ కి డేట్, తనే సెట్ చేసుకున్నారు.  రెండు రోజుల్లో ఇంట్లో ఉంటారు,” నవ్వుతూ ఆంటీ..

నే వెళ్ళిదగ్గర కూర్చోగానే, కళ్ళు తెరిచి చూసి, పైకి జరిగి కూచున్నారు  అంకుల్.

“కళా, మీ అమ్మా వాళ్ళు పొద్దుటే వచ్చి వెళ్ళారు.మీ నాన్న మళ్ళీ డ్యూటిలో జాయినయ్యే లోగా,  డైరెక్టర్ ముత్తురామన్ సార్ తో,  మా ఇంట్లోనే  మీటింగ్ ఏర్పాటు చేసానమ్మా,” అన్నారు...


“మీరు ముందు కోలుకోండి అంకుల్,” అన్నాను.                             

“చూస్తున్నావుగా, నేను బాగయిపోయినట్టే అనుకో. అయినా, మన కల్చరల్ టూర్స్,  మీ పెళ్ళిళ్ళు అవ్వాలిగా.  అందుకే, నన్ను ఆరోగ్యం గానే ఉంచుతాడు ఆ పైవాడు,” నెమ్మదిగా ఆగాగి మాట్లాడుతున్నారు...

స్వచ్చంగా అర్ధమవుతున్నా, నీరసంగా ఉంది మాట.

“చూడమ్మా కళా,” నా వంక సూటిగా చూశారాయన.  “మొదటి నుండీ నీవంటే మాకు వాత్సల్యం, మా అమ్మాయికి అయిష్టత..  నీ పెళ్లి మాట విని, రాణి అసూయ చెందడం వల్లనే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిందని మా భావన.. 

ఏమైనా,  దాని ఓర్వలేనితనం, నీ భవిష్యత్తుకి ఆటంకమవ్వదు.. నేను హామీ ఇస్తాను. నీవు మాత్రం దాన్ని తోబుట్టువులా భావించి, తప్పుల్ని క్షమించి, దాని పట్ల ఎప్పటికీ ఆదరాభిమానాలతో ఉండమని మా రిక్వెస్ట్,” అని చెబుతూ, కళ్ళు తుడుచుకున్నారు... 

“దాని మానసిక పరిస్థితి కూడా అంతగా బాగోలేదు,” అంది దిగులుగా ఆంటీ. ఆమెని బాధపడ వద్దని వారించారు అంకుల్. 

“మనతో సఖ్యత లేదు సరికదా, కనీసం అన్నిటికీ వ్యతిరేకించకుండా ఉంటేన్నా బాగుండు.  చాలా మొండిది మన రాణి.  దానికి అడ్డు చెప్పకుండా ఉంటేనే మంచిదేమో,” ఆమెతో అంటూ వాపోయారాయన.

నేనేమనలేక మౌనంగా ఉండిపోయాను.

కాసేపటికి తలెత్తి, నా వంక చూసారు అంకుల్.. 

“రాణి ఇప్పుడు బాగా క్రుంగిపోయింది.  బ్రెయిన్ లో కెమికల్ ఇంబాలెన్స్, కాక, దానికి డిప్రెషన్ కూడా ఉందని తేల్చారు... దాని వల్లే, బాధ కలిగిందనిపిస్తే, తనని తాను గాయపరుచుకుంటుందన్నారు....

మానసికంగా, తిరిగి మామూలు స్థితికి రావాడానికి, కొద్దిరోజులు మందులు వాడాలట.  ప్రమాదకరమైన జబ్బేమి కాదు... నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చట...

కాకపోతే దాన్ని సున్నితంగా ప్రేమగా చూసుకోవాలి... 

అందుకే, అర్ధం చేసుకోమని అడుగుతున్నాను.కోపం పెట్టుకోకుండా దానితో స్నేహంగా మెలుగుతావని, అండగా ఉంటావని  మా ఆశ,”  అంటున్న అంకుల్ మాటలకి  నాకు కన్నీళ్ళాగలేదు. 

 

“అలాగే అంకుల్,  రాణిని నేను ఎప్పుడూ తోబుట్టువుగానే అనుకుంటాను.  మీరు బెంగ పెట్టుకోకండి,” అని అంకుల్ చేతి మీద చేయి వేసి,హామీ పలికాను....

 

మరి కాసేపటికీ, వారి వద్ద సెలవు తీసుకుని, ఇంటి దారి పట్టాను.

**                                

అంకుల్ వాళ్ళ పరిస్థితికి బాధగా ఉంది.

మా మధ్య జరిగిన సంభాషణతో,నామీద వాళ్ళకున్న విశ్వాసం, నమ్మకం ఎంతటిదో తెలిసింది....

ఈ విషయమంతా అమ్మకి మాత్రమే చెప్పాను. జగదీష్ వద్ద ఈ ప్రస్తావన అనవసరం అనుకున్నాము.

**

ముత్తురామన్ గారి ఫిలిం ప్రాజెక్ట్ వివరాలు, కథ విని, నాన్న అమ్మ కూడా బాగుందన్నారు. నాకు మంచి అవకాశంగా భావించి, ఫిలిం చేయాలనే అందరం అనుకున్నాము. 

రెండు నెల్లల్లో సెట్స్ మీదకి వెళ్ళే సినిమా మరో రెండు నెలలకి విడుదలకి సిద్దమవుతుందన్నారు, డైరెక్టర్ గారు. 

 

నృత్యానికి ప్రాముఖ్యత ఇవ్వడమే కాక, ఓ సున్నితమైన కథా వస్తువుని ఎన్నుకున్నందుకు అమ్మావాళ్ళు, అంకుల్ కూడా ఆయన్ని అభినందించారు.

నా నుండి పూర్తి ఏకాగ్రత, అంకితభావం ఉంటుందన్న ఉద్దేశంతోనే, తమ కథకి నన్ను ఎన్నుకున్నట్టు చెప్పారు ముత్తురామన్ గారు...

ఆలస్యం లేకుండా కాంట్రాక్ట్ సైన్ చేసాను...

ఆ సినిమాలో,నేను వేయబోయే పాత్రకి సంబంధించిన నృత్యాలు, డైలాగ్ అన్నిటా ప్రాక్టీస్ వెంటనే మొదలవుతాయన్నారు. 

**

నా కళా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.  ఓ యజ్ఞంలా రాత్రింబవళ్ళు నన్ను తన సినిమాలోని ‘శ్రీలత’ గా తీర్చిదిద్దే కార్యక్రమం మొదలుపెట్టారు ముత్తురామన్ సార్. 

అభ్యాసన, ఏకాగ్రతలల్లో ఓ కొత్త అనుభవమే అయింది...

సెట్స్ మీదకి వెళ్ళేప్పటికి, నా ఆలోచన, ప్రవర్తనలో గూడా తన‘శ్రీలత’ కనబడాలన్నారు డైరెక్టర్ గారు...

రెండునెలల పాటు ముత్తురామన్ సార్ జరిపే ఈ ట్రైనింగ్ సెషన్స్ తో, ‘శ్రీలత’ పాత్రలో నేను నటించడం కాదు, ఆ పాత్రలో జీవిస్తానన్నారు అంతా.

**

రెండు నెలలు అవిరామంగా జరిగిన సినిమా షూటింగ్, ఆఖరి విడతలో ఉండగా, కాళ్ళ నొప్పులు-వాపులతో బాధపడుతూ నాన్న ఇల్లు చేరారు.

రక్త ప్రసారం  సరవడానికి కుడికాలుకి వెంటనే,‘వాస్కులర్ బైపాస్ సర్జరీ ‘ చేయాలన్నారు డాక్టర్లు...

 

సర్జరీ మాట విని భయపడి పోయిందికోటమ్మత్త.

“కాళ్ళల్లోని రక్తనాళాల్లో, రక్తప్రసారం మెరుగవ్వడానికి జరుగబోతున్న అత్యవసర ఆపరేషన్” అని అమ్మ ఆమెకి  వివరించాక, కుదుటపడింది.

ఎప్పటిలా, నాన్న సర్జరీ బాధ్యత కూడా భూషణ్ అంకుల్ తీసుకొని వాళ్ళ హాస్పిటల్లోనే, దానికి ఏర్పాట్లు చేసారు.

**

ఆపరేషన్ సవ్యంగా జరిగి, నాలుగు రోజులుగా హాస్పిటల్లో కోలుకుంటున్న నాన్న దగ్గర కూర్చుని, కాసేపు షూటింగ్ కబుర్లు చెప్పాను.ఆయనతో పాటు బ్రేక్ఫాస్ట్ అయ్యాక, ఆఖరి రోజు ఫిలిం -షూటింగ్ కి బయలుదేరాను.  

ముత్తురామన్ గారు కూడా అన్న టైంకే  మూవీ కంప్లీట్ చేసారు.   రెండు నెలల్లో రిలీజుకి సన్నాహాలు చేస్తున్నారు.  నా పర్ఫార్మెన్స్  గురించి,  కాస్త నర్వాస్ గానే ఉంది.

ఏమైనా,  ఇక పైన, విదేశీ టూర్ కి ప్రోగ్రాముల ప్రిపరేషన్ గురించి ఆలోచించాలి..

 

ట్రాఫిక్ రద్దీ దాటుకుంటూ, కారు వేగంగా సాగిపోతుంది.  

హాస్పిటల్ బెడ్డు మీద నీరసంగా ఉన్న నాన్న రూపమే మనస్సులో మెదులుతుంది....

కొత్త సంవత్సరం ఆరంభం ఎన్నో కొత్త ఉత్సాహాలని, పురోగతిని తెచ్చినా, నాన్న ఆరోగ్యం ఆందోళన కలిగిస్తూనే ఉంది....  ఇక ఇప్పుడు సర్జరీ సవ్యంగానే జరిగినా, కొద్దికాలం విశ్రాంతిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు డాక్టర్లు. పూర్తిగా కోలుకోవడానికి,  టైం పడుతుందట..

ఎప్పుడూ ఏదో ఒక విషయంగా మనస్సుకి శాంతి లేకుండా ఉందనిపించి, ఒక్కసారిగా నిస్సత్తువుగా అయిపోయాను...

సీటులో జారిగిల పడి,  కళ్ళు మూసుకున్నాను.

మరో వైపు, రాణి మూలంగా అంకుల్ మానసికంగా క్రుంగిపోతున్న పరిస్థితి కూడా బాధగా ఉంది.

**

పక్కనే ఉన్న సెల్ఫోన్ రింగవ్వడంతో,  అలోచనల నుండి బయటపడ్డాను. 

భూషణ్ అంకుల్ కాల్ చేస్తున్నారు.  లిఫ్ట్ చేసి, “హలో అంకుల్,” అన్నాను.

 

“ఏమ్మా కళా,  అమెరికా నుండి విక్రమ్, తేజశ్విని గారు వచ్చేది,యెల్లుండే...... వాళ్ళుమా ఇంట్లోనేఉండబోతున్నారు.  రేపటినుండి ఒక వారం పాటు నీకు వెకేషన్ కదా! వాళ్ళున్న ఆనాలుగు రోజులూ, నీవు కనబడుతూనే ఉంటావని, వాళ్లకి చెప్పానమ్మా కళా,” అన్నారు..

 

“తప్పకుండా అంకుల్... వాళ్ళు నాకు కూడా ఆత్మీయులు కదా!  వాళ్ళకోసం శలవు పెట్టకపోతే ఊర్కోనని, విక్రమ్ నాకెప్పుడో వార్నింగ్ ఇచ్చాడు.  వాళ్ళ విషయంలో మీకు సాయంగా ఉంటాను.  మీరు బెంగ పెట్టుకోవద్దు,” అన్నాను.

 

“ఇకపోతే, ఆదివారం జరగబోయే ఆవిడ అవార్డ్ ఫంక్షన్ ఇన్విటేషన్ మీకూ అందే ఉంటుందిగా,” అడిగారాయన.

“అందింది అంకుల్, అందరం అటెండ్ అవుతాము,” చెప్పాను... ..

“ఉంటానమ్మా,”  ఫోన్ పెట్టేసారాయన.

 

మానసికంగా అయన ఇంకా పుంజుకోలేదు అనిపిస్తుంది. ఎందరికో ఆత్మస్థైర్యాన్నిచ్చి, వారి జీవితాలకి అండదండగా నిలిచే ఆయన, రాణి విషయంగా డీలాపడిపోవడం, నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను..

**

అమెరికాలో తెలుగు జాతి కీర్తిని చాటుతున్న కళాకారిణిగా, తేజశ్విని గారిని కొనియాడి, సన్మానించి,  పాండుచేరి గవర్నర్ గారి చేతులమీదుగా ‘హంస అవార్డు’ ఇప్పించారు ‘చెన్నై సంస్కృతి సంఘం’ వారు. 

 

ఎంతో గొప్పగా జరిగింది ఆ సన్మాన సభ. 

సభకి ముందు జరిగిన ‘బ్యాంక్వెట్’  కూడా అటెండ్ అయ్యాము.

రాణి తన ఫ్రెండ్ రంజిత్ సూరితో వచ్చింది.  అందరితో సరదాగా మాట్లాడింది.

**

విక్రమ్, తేజశ్విని గార్లతోసమయం క్షణాల్లా గడిచిపోతుంది... 

 

హాస్పిటల్ నుండి ఇంటికొచ్చేసిన నాన్నని, రోజూ కాసేపు విజిట్ చేసి,లోకాభిరామాయణం మాట్లాడుతాడు.. విక్రమ్. 

 

వినోద్ తో ఎంత అల్లరి చేస్తాడో, అమ్మవాళ్ళతో, కోటమ్మత్తతో అంతే హుందాగా మసులుకుంటాడు.  నాతో ఫ్రెండ్లీగా ఎడతెగని కబుర్లు చెబుతాడు.

 

“సున్నితమైన మనస్తత్వం ఉన్నవాడు విక్రమ్.  అందరి భావాలకి విలువినిస్తూ,గౌరవంగా ఉంటాడు.  మంచివాడు,” అన్నారు అతని గురించి నాన్న.

**

జగదీష్ కి ఎప్పటిలా ప్రతిరోజూ ఇక్కడ విషయాలు, విశేషాలు చెబుతూనే ఉన్నాను.

 

విక్రమ్ గురించిన కబుర్లు చెప్పినప్పుడు,

“విక్రమ్ అన్నివిధాల నన్నే గుర్తుచేస్తున్నాడంటే, అతను నా ట్విన్ బ్రదరా? అయితే, ఆ విక్రమ్ కారెక్టర్ ని మీట్ అవ్వాలనే ఉంది,” అన్నాడు నవ్వుతూ జగదీష్....

**

తేజేశ్విని గారు‘గవర్నర్  అవార్డ్’  అందుకున్న సందర్భంగా,  అమ్మ మా ఇంట విందు ఏర్పాటు చేసింది. దానికి,రాణి కూడా రావడం విశేషం.  సౌమ్యంగా సంతోషంగా నాతోనూ మాట్లాడింది.

విక్రమ్ కబుర్లు వింటూ, అతను చెప్పే జోక్స్ కి నవ్వుతూ సరదాగా డిన్నర్ చేసాము..

 

“మీరు కొత్త ఫ్లాట్ లోకి మారబోతున్నందుకు నా శుభాకాంక్షలు, సత్యం గారు,” పాయసం కప్ చేతిలోకి తీసుకుంటూ, తేజశ్విని గారు.

మలేషియా, లండన్ టూర్స్ అయ్యాక, నన్ను, అమెరికాకి వచ్చే సన్నాహాల్లో ఉండమన్నారామె. విజిటింగ్ ఆర్టిస్ట్ గా స్పాన్సర్ చేసి,  డాన్స్ క్యాంప్స్,  ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తాన్నారు. 

మంచి బ్యాక్-గ్రౌండ్  ఉన్న యువ నర్తకిని, అమెరికాలో ప్రమోట్  చేయడం ఓ అవకాశంగా భావిస్తాన్నారు ఆమె.

 

“ఆ ఐడియా బాగుంది.. తేజశ్విని గారు.  చాలా సంతోషం,” అన్నారు నాన్న. 

 

“రియల్లీ చంద్రకళ,  నువ్వు అమెరికా వస్తే, మా అమ్మ నిన్ను సొంత డాటర్ లా చూసుకుంటుంది.  ఇకప్పుడు, న్యూయార్క్ లో చదువుకుంటున్నమా సిస్టర్ ని,డల్లాస్ కివెళ్ళిపోబోతున్న నన్ను, మా అమ్మ మిస్ అయ్యే ప్రశక్తే ఉండదు,” అన్నాడు విక్రమ్ సంతోషంగా....

“ఆ పనేదో త్వరగా చేయండి ఆంటీ.  చంద్రకళ సింగిల్ గా ఉన్నప్పుడే పిలిపించండి. అక్కడ తన పర్ఫార్మెన్స్ అయ్యాక, అలాగే మంచి సంబంధం దొరికితే, పెళ్లి కూడా చేసేయండి,” అంది నవ్వుతూ రాణి..

నా పక్కనే ఉన్న అమ్మ, నేను ముఖాలు చూసుకున్నాము...

భూషణ్ అంకుల్ కూడా నా వంక చూసి నవ్వారు...

 

“నిజంగా అక్కడే సంబంధం చూడమంటే, అంతకన్నానా? చంద్రకళ లాంటి అమ్మాయి కోడలుగా రావడం అంటే, కళలంటే ఆసక్తి ఉన్న నా బోటి వాళ్ళతో సహా, లైన్ లో నిలబడతారేమో!” అంటూ నవ్వేసింది తేజశ్విని గారు...

 

“ఎంత మాట.  మీ అభిమానం వెలకట్టలేనిది..  కాకపోతే, మా చంద్రకళ మనసు, దాని కుటుంబం అంతా ఇక్కడే ఉన్నాముగా,”  అనేసింది అమ్మ జవాబుగా....

దానికి, వెంటనే అందుకున్నారు, నాన్న...

“పెళ్లి సంగతంటారా..ఆ నిర్ణయం పూర్తిగా చంద్రకళ, వాళ్ళమ్మ, అమ్మమ్మలదే...

నాట్య రంగంలో మాత్రం, మీలా అంతర్జాతీయంగా గుర్తింపు పొంది, నాట్య గురువుగా, స్థిరపడితే చూడాలని మాత్రం నా అభీష్టం.  అందుకు అమెరికాలో స్థిరపడవలసి వస్తే, అభ్యంతరం ఏముంటుంది... ఆపై ఆ దేవుని దయ,” అన్నారాయన.

 

“మీరు మరీ నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.  చంద్రకళ వంటి వారికి ఇదంతా సులభ సాధ్యం సత్యం గారు.  చంద్రకళ ఎక్కడైనా స్థిరపడవచ్చులెండి,” జవాబుగా తేజశ్విని మేడమ్..

“మీకు చెప్పాలనుకున్న మరో విషయం కూడా ఉంది, తేజశ్విని గారు.  టూర్స్ కి ముందే, చంద్రకళతో ఓ కూచిపూడి డాన్స్ డాక్యుమెంటరీ తీసే ప్రయత్నంలో కూడా ఉన్నాము,” తన ప్లాన్ వెల్లడించారు నాన్న.

 

ఇంతలో,  తను కూర్చున్న స్థలం నుండి పైకి లేచాడు, విక్రమ్... అందరి వంక చూసి, చేతులు జోడించి నమస్కరించాడు...

“మీరంతా మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు.  థాంక్యూ వేరి మచ్... మీరు కూడా అమెరికా తప్పక రావాలి.  చంద్రకళ, రాణి  ప్రోగ్రామ్స్ తో ట్రిప్ వేయడం అంత కష్టమైన పని కాదు.   మిమ్మల్ని హోస్ట్  చేసే అవకాశం మాకూ ఇవ్వండి,” అంటూ హుందాగా పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు పలికాడు విక్రమ్.

**

తమ తిరుగు ప్రయాణంకి ముందు రోజు, నా బయోడేటా ప్రిపేర్ చేసి ఫైల్ ఇమ్మని అడిగారు తేజశ్విని  గారు...

అర్ధరాత్రి వరకు నాన్న పక్కనే కూర్చుని, ఆఫైల్ ని, స్వయంగా ప్రిపేర్ చేసాడు విక్రమ్. 

నేను యాక్ట్ చేసిన మూవీ ‘డాక్టర్ శ్రీలత అయ్యర్’  డివిడి కూడా కావాలన్నారు ఆవిడ.

 

ఆ మరునాడు, వారికి సెండాఫ్ ఇవ్వడానికి, అంకుల్ తో పాటు నాన్న, నేను కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము..  నేను త్వరలోనే, అమెరికాకి రావాలని ఆశిస్తామంటూ, మా వద్ద సెలవు తీసుకున్నారు తేజశ్విని గారు, విక్రమ్...

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery