Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

కలియుగ ఆరంభ కాలం క్రీ.పూ. 3102 సంవత్సరాలు. క్రీస్తు తర్వాత ఇప్పటి వరకు జరిగిన కాలాన్ని కూడా కలుపుకుంటే కలియుగం ఆరంభమై 3102+2015=5117వ సంవత్సరం నడుస్తోంది.

ఈ కలి యుగానికి అధిపతి కలి పురుషుడు.

కలికి పుణ్యాత్ములు శత్రువులు, పాపాత్ములు ఆత్మీయులు.

కలి కూడ కాలం లో ఒక భాగం. తన అధీనంలో వున్న కాలానికి బలాన్నిచ్చేవాడు కలి. ఈ కలి ప్రభావం ఎంత గొప్పదంటే భవిష్య పురాణంలో ఓ చోట ఇలా చెప్పబడింది.

శో॥     బలాదివ వికృష్యంతే కాలేన జన బుద్దయః ।

            నను దూరాద్వికీర్యంతే వాత్సయావన పాదపః ॥

ఈ శోక్లానికి అర్థం: మహా వృక్షాలు సైతం పెను గాలిచేత లాగ బడి దూరంగా విసిరి వేయబడినట్లు మానవుడు ధర్మ గుణాలన్నీ కలి కాలం చేత బలవంతంగా పెకలించి వేయబడతాయి.

ఈ కలి ప్రభావం ద్వాపరం నందు యుగ సంధికి ముందు నుంచే ఆరంభమైంది.

కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ముప్పై అయిదు సంవత్సరాకు కలియుగం ఆరంభమైంది. అది శ్రీ కృష్ణ నిర్యాణం రోజునే ఆరంభమైంది. తర్వాత వారం రోజులకు శ్రీకృష్ణుని ద్వారక నీట మునిగింది. ఈ కలియుగ ఆరంభ కాలానికి కాస్త ముందు వెనుకలుగా మూడు వంశ క్షయాలు జరిగాయి.

కురుక్షేత్ర సంగ్రామంలో కురువంశ క్షయం జరిగింది.

ఇది జరిగిన ముప్పై అయిదేళ్ళకు కలియుగ ఆరంభంలో గాంధారి శాపం ఇతర కారణాల వల్ల యాదవ కులంలో ముసలం పుట్టింది. తద్వారా యాదవ కుల క్షయం జరిగింది. ఇది నాటి రెండో దారుణ విషాద ఘటన.

శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత పాండవు తమ వంశాంకురము అర్జునుని మనవడు అభిమన్యుడి కొడుకు అయిన ముప్పై అయిదేళ్ళ ప్రాయమున్న పరీక్షిత్తును హస్తినకు రాజుగా చేసి స్వర్గారోహణ చేయటం జరిగింది. కొంత కాలానికి ముని కుమారుడి శాపాన్ననుసరించి తక్షకుడనే నాగు కరవగా పరీక్షిత్తు మరణించాడు.

అప్పటికి కొడుకు జనమేజయుడు ఏడేళ్ళ పసివాడు. జనమేజయుడు యుక్త వయస్కుడై సింహాసనం ఎక్కాక తన తండ్రి మరణానికి కారణం తెలుసుకుని మండిపడ్డాడు. భూమి పైన నాగ జాతి లేకుండా నాశనం చేయాలని సంకల్పించి ప్రతీకారంగా సర్పయాగం చేసాడు. ఆ యాగాగ్నిలో పడి అనేక నాగజాతులు నశించాయి.

దీనికి కారకుడైన తక్షకుడు మాత్రం ఇంద్రసింహాసనాన్ని ఆశ్రయించి యాగాగ్నిలో పడకుండా చివరి క్షణంలో తప్పించుకున్నాడు. కర్కోటకుడనే నాగం పాతాళం వెళ్ళి ప్రాణాలు దక్కించుకున్నాడు. సర్పయాగం నిలిపే సమయానికి సర్పకులం లో మిగిలింది తక్షకుడు, కర్కోటకుడు యిద్దరే. ప్రస్తుతం భూలోకంలో సంచరించే నాగజాతులన్నీ వీరి సంతతే.

సర్పయాగం వల్ల జరిగిన తమ నాగలోక  క్షయానికి సహజంగానే నాగలోక రేడు నాగరాజుకి అంతులేని మనోవేదన, దుఃఖం కలిగాయి. ఆ బాధలో ఆగ్రహావేశంతో పాండు వంశాన్ని శపించాడు. ఆ తర్వాత కాలం లో దేశకాల పరిస్థితులేమిటి? పరిణామాలేమిటి? ఏం జరిగింది?  

    ****************************************************

అది కలియుగం మూడు వందల యాభై ఒకటో సంవత్సరం. అంటే ఇప్పటికి నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు (4,766) సంవత్సరాల క్రితం మాట.

ఒకనాటి అపరాహ్న వేళ.

అది నలనామ సంవత్సరం.

గ్రీష్మ ఋతువు.

ఎండలు మండిపోతున్న సమయం.

సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.

నీలాకాశం అద్దంలా మెరుస్తోంది.

గగన సీమలో ఎక్కడా మచ్చుకైనా ఒక మబ్బు తునక కనిపించుట లేదు. వడగాల్పులు వెచ్చగా ఈ చెవి నుంచి ఆ చెవికి సోకుతోంది. రత్నగిరి రాజ్య భూభాగంలో ఉత్తర అటవీ ప్రాంతంలో నిశ్శబ్ధం ఆవరించుకొనుంది. ఎండ ధాటికి భయపడి కీకారణ్యంలోని అడవి మృగాలేవీ తమ తావులు వదిలి బయటకు రావడం లేదు.

అటువంటి మండు వేసంగి రోజున`

అంతటి వడగాడ్పునూ ఇసుమంతయినా లెక్క చేయకుండా అటవీ మార్గంలో ప్రయాణం సాగిస్తున్నాడో యువకుడు. అతడి అశ్వం కాలిగిట్టల శబ్ధం మార్గం వెంట మారు మోగుతోంది. ధూళి ఎగసి పడుతోంది. అది రాజధాని రత్నగిరి నగరం నుండి ఈశాన్యంగా ఆరావళీ పర్వతాలను చేరి అక్కడి నుండి ఉత్తర ఈశాన్యంగా వింధ్య పర్వత ప్రాంతాల్లోని మాళవ రాజ్యానికి చేర్చే రాజమార్గం.

మహేంద్రుని ఉశ్చెశ్వరంను ధిక్కరించే బలిష్టమైన పాల నురుగులాంటి తెల్లని అశ్వం మీద ఆ యువకుడు ప్రయాణం చేస్తున్నాడు. అశ్వం శ్వేత వర్ణంలో వున్నా దాని జూలుకు భాగం, తోక భాగాలు మాత్రం కాటుక పూచినట్టు చిక్కటి నలుపు రంగుతో విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ జాతి అశ్వాలు చాలా అరుదుగా లభిస్తాయంటారు.

అంతటి అందమైన మగ గుర్రం మీద ప్రయాణం చేస్తోంది కూడ ఒక సుందరాకారుడైన యువ పురుషుడే. అతను ఏడడుగుల పైగా పొడవుంటాడు. అతడి ముఖ వర్ఛస్సు చూస్తే మాత్రం వయసు ఇరవై రెండు లేదా ఇరవై మూడేళ్ళ వయస్సు మించదనిపిస్తుంది. వంటి మీద ఎలాంటి ఆభరణాలు అలంకారాలు లేవు. సాదాసీదా దుస్తులు ధరించాడు. కాని అతడి ఠీవి చూస్తుంటే ఖచ్చితంగా ఎవడో ఉన్నత వంశీయుడని ఇట్టే తెలిసిపోతుంది.

అతడు క్షత్రియ వీరుడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే నడుం నుండి పొడవాటి ఒరలో వీర ఖడ్గం వేలాడుతోంది. ఇంకా భుజాన విల్లు, మూపున అంబుల పొది వున్నాయి. ఇవి గాక, గుర్రం జీను దిగువన అడ్డంగా బళ్ళెం, శూలం , బరిసె వంటి ఆత్మ రక్షణ ఆయుధాలు  సిద్ధంగా వున్నాయి. జీనుకు అటు యిటు రెండు తోలు సంచులు నిండుగా దుస్తులు, ఇతర సామాగ్రి కావలిసినంత ధనం వున్నాయి. ముందు భాగంలో మంచి నీటితో కూడిన సొరకాయ బుర్ర వేలాడుతోంది.

చూడ్డానికి సుకుమారుడిలా కన్పిస్తున్నాడు. కాని అతడి అంగ సౌష్టవం చూస్తుంటే నిత్య వ్యాయామం, వీర విద్యల సాధనలో రాటు దేలిన వీరుడని అర్థమవుతోంది. పసిమి ఛాయ మేనితో అతడు లాగి వుంచిన వెదురు బద్దలా వాడిగా వేడిగా చాలా హుషారుగా వున్నాడు.

కొటేరు వంటి నాశిక, విశాల ఫాల భాగం, చురుకైన కనుదోయి నీటయిన కోర మీసం అతడిలో ప్రత్యేకతని చాటుతున్నాయి. నిశితమైన చూపులు అతడి పట్టుదల, కార్యదీక్షను ప్రకటిస్తున్నాయి. విశాలమైన ఛాతీ, సింహపు నడుము, అజాను బాహువుతో సాక్షాత్తూ ఆ చెరకు విలుకాడే వచ్చి తన పవనాశ్వంపై వనవిహారం చేస్తున్నాడాని భ్రమింపజేసేంతగా బహు సుందరాకారుడా యువకుడు.

అతడు రత్నగిరి నుండి బయలుదేరి ఇది రెండవ దినము. అనువైన చోటు చూసి భోంచేసి, ఒకింత విశ్రమించడానికి తగిన ప్రాంతాన్ని అన్వేషిస్తూ అశ్వాన్ని నెమ్మదిగా పోనిస్తున్నాడు. ఉష్ణ తాపానికి అలసిపోయిన అశ్వాన్ని మరింత బాధించటం అతనికిష్టం లేదు.

ఆ అడవిని రెండుగా చీలుస్తూ`

నిలువు రేఖలా వుందా బాట.

అసలే వేసవి. ఆ పైన ఎర్రమట్టినేల. గాలికి ధూళి ఎగసి పడుతోంది. దిగువన ఒక ఎత్తయిన మిట్టను దాటి వచ్చిన ఆ బాట దూరంగా ఎగువన మరో ఎత్తయిన మిట్ట వైపు సాగుతోంది. కళ్ళాలు బిగించకుండా అశ్వాన్ని ముందుకు పోనిస్తున్నాడా యువకుడు.

ఇది కలియుగ ఆరంభ కాలం నాటి గాధ. ఆ నాటి దేశకాల పరిస్థితులు ఏయే రాజ్యాలుండేవి మొదలయిన విషయాల మీద కొంతయినా అవగాహన అవసరం.

కురు సార్వభౌముడు దుర్యోధన చక్రవర్తి పతనం తర్వాత పాండవాగ్రజుడు ధర్మరాజు చక్రవర్తి అయి ముప్పై అయిదేళ్ళ పాటు ధర్మ పరిపాలన సాగించాడు. అశ్వమేధ యాగం చేసి మరిన్ని రాజ్యాలు జయించి సామంతుల్ని చేసుకుని సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కలియుగం ఆరంభమైంది. పాండవుల వారసుడిగా పరీక్షిత్తు రాజ్యాధికారానికి వచ్చాడు. తర్వాత అతని కొడుకు జనమేజయుడు చక్రవర్తి అయ్యాడు.

జనమేజయుని తర్వాత నాలుగు తరాలు మారేసరికి పరిస్థితులు మారాయి. వారసులు రాజ్యాన్ని పంచుకోవటం, సామంతులు స్వతంత్రులుగా ప్రకటించుకోవటంతో రాజధాని హస్తిన బలహీనపడిపోయింది. కారణాలు ఏమైనా హస్తిన ప్రాభవం తగ్గి తిరిగి చిన్న చిన్న రాజ్యాలు అనేకం ఏర్పాడ్డాయి. వీటిలో చాలా రాజ్యాలకి పాండువంశీకులే రాజులు. ఆ క్రమంలో ఏర్పడిందే రత్నగిరి రాజ్యం కూడ. ప్రస్తుతం ఈ రాజ్యం పాండువంశీకుడైన ధర్మతేజుడనే రాజు ఆధీనంలో వుంది.

ఈ రత్నగిరి రాజ్యానికి రాజధానీ నగరం రత్నగిరి. పశ్చిమ సముద్ర తీరంలోని ఎత్తైన కొండకు రత్నగిరి అని పేరు. ఈ కొండను పరివేష్టించి సముద్ర తీరం వరకు విస్తరించి నగరం వుంది. రత్నగిరి కొండ పేరు మీదు గానే ఇది రత్నగిరి నగరమైంది. ఈ నగరం రాధానిగా విస్తరించిన రాజ్యం గాబట్టి రత్నగిరి రాజ్యం అయింది.

రత్నగిరి కొండ పైన కోటలు పేటలతో దుర్గం వుంది. కొండ పైకి చక్కటి రాచబాటతో బాటు విశాలమైన మెట్ల దారి కూడ వుంది. ఈ నగరానికి అనేక రహదారులతో బాటు పెద్ద ఓడ రేవు కూడా వుంది. దాంతో రత్నగిరి పెద్ద వ్యాపార కూడలి కూడా. రేవులో ఎప్పుడూ దేశ విదేశ నౌకలు అనేకం వచ్చి పోతూంటాయి.

ఆనాటికింకా మనుషులు పొడగరులే.

పురుషుల సరాసరి ఎత్తు ఏడు నుంచి ఏడున్నర అడుగులు. స్త్రీ సరాసరి ఎత్తు ఆరు నుంచి ఆరున్నరడుగులు. నాటి ప్రజంతా శ్రమ జీవులు. సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ శాంతుతో జీవించేవారు. వారి ప్రధాన వృత్తులు వ్యాపారం, వ్యవసాయం, చేపల వేట, పశు సంపద, కుల వృత్తులు. ఆ రోజుల్లో పశ్చిమ సముద్రాన్ని (అరేబియా సముద్రం) రత్నదధి అని పిలిచేవారు. రత్నగిరి కొండకు ఆ పేరు రావటానికి కూడా సమీప సముద్రంలో రత్నాలు  లభించటమే కారణం. దక్షిణ సముద్రాన్ని (హిందూ మహా సముద్రం) రత్నాకర దధియని, తూర్పు సముద్రాన్ని (బంగాళాఖాతం) మహాదధియని వ్యవహరించేవారు.

ఇక సరిహద్దుల విషయానికొస్తే`

ఈ రత్నగిరి రాజ్యానికి సుదీర్ఘమైన పశ్చిమ సముద్ర తీరం సరిహద్దుగా వుంది. ఉత్తరాన నర్మదా నది వరకు విస్తరించి వుంది. దక్షిణాన కుంతల రాజ్యం (కర్నాటక) సరిహద్దు. ఇక తూర్పు దక్షిణ దిశలో త్రిలింగదేశం (తెలుగు) తూర్పున విదర్భ (పూర్వ భీష్మకుని రాజ్యం. రుక్మిణీదేవి పుట్టిన రాజ్యం), ఇక ఉత్తర ఈశాన్యంగా మాళవ రాజ్యం            సరిహద్దుగా గల విశాల రాజ్యం రత్నగిరి.

అప్పట్లో రత్నగిరితో బాటు, హస్తిన, మగధ, కోసల, కౌశాంబి, కాంభోజ, గాంధార, అయోధ్య, మత్స్య, ద్వారక, మధుర, పాంచాల, సాళ్వ, విదేహ, బాహ్లీక, చౌది, శూరసేన, అంగ, వంగ, కళింగ, కరూష్ట్ర, కాంచి, పాండ్య, కాశీ, కుంతల, అమర కటకం, బ్రహ్మదేశం(బర్మా) మొదలయిన చిన్న పెద్ద అనేక రాజ్యాలుండేవి.

వీటిలో రత్నగిరితో బాటు ద్వారక, కోస, కాశీ, అయోధ్య, మధుర, మగధ, కౌశాంబి, కాంచీపుర రాజ్యాలు సంపన్న రాజ్యాలుగా పేరు పొందాయి. ఈ రాజ్యాలతో వర్తక వ్యాపారాలకు దేశవిదేశీ వర్తకులు అధిక ఆసక్తి చూపేవారు. అలనాటి ధర్మరాజు ప్రభువుల సుపరిపాలనను తలపింపజేస్తూ ధర్మాతేజుడు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు.

సరిగ్గా ఈ తరుణంలోనే రత్నగిరి కోటలో ఓ విషాదం. ప్రభువు ధర్మతేజకు ఓ కష్టం ఏర్పడింది. సరిగ్గా అప్పుడే ఆ క్షత్రియ వీరుడు రత్నగిరి నగరం వదిలి బయలుదేరాడు. తను ఎందుకు బయలుదేరాడో అతడికి తెలుసు.  కాని ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అది తెలుసుకునే ప్రయత్నంలోనే అడవి బాట పట్టాడు. ఒక విధంగా ఇది అతనికి గమ్యం తెలీని ప్రయాణమే. అడవి బాటన ప్రయాణం సాగిస్తున్న ఆ వీర యువకుడి అశ్వం క్రమంగా రెండో కొండ పైకి కూడా చేరుకుంది. దారిలో ఎక్కడా ఒకింత విశ్రాంతికి అనువైన చోటు కన్పించ లేదు. అశ్వాన్ని సరిగ్గా కొండ మీద బాట మధ్య నిలిపి సొరకాయలోని కొంచెం నీరు తాగాడు. చల్లని నీటితో ముఖాన చెమట కడుక్కుని పైతుండుతో ముఖం తుడుచుకుంటూ ఓసారి చుట్టూ పరికించాడు.

కనుచూపు మేర ఎగువన కొండ దిగువకు పోతున్న బాట నిర్మానుష్యంగా వుంది. వెనక వైపున అర్ధజాము క్రితం తనకు ఎదురు పడిన బిడారు గుంపు (వర్తక సముహం) అటు పక్క ఏటవాలుగా బాట వెంట దిగువ కొండవపైకి తమ వాహనాలు, సరుకులతో సాగిపోతూ చీమలబారులా కన్పిస్తున్నారు. సుదూర ప్రాంతం వరకూ ఎటు చూసినా కీకారణ్యం. పశ్చిమాన దూరంగా మైదాన ప్రాంతంలో పైకి లేస్తున్న పొగను బట్టి అక్కడేదో అటవిక గూడెం వుందని వూహించాడు.

ఎక్కడోచోట ఒకింత విశ్రమించే ఉద్దేశంతో అశ్వాన్ని వృక్ష ఛాయల్లోకి అదిలించబోతూ చివరి క్షణంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. చుట్టూ వృక్షశాఖల మీద విశ్రాంతిగా వున్న పక్షి సమూహాన్ని గగ్గోలుగా ఒకేసారి గాల్లోకి లేచి కకావికలై తలో దిశగా ఎగిరి పోతున్నాయి. ఆ దృశ్యం చూడగానే యువకుడి ముఖంలో ఆశ్చర్యం పొడ చూపింది.

సందేహం లేదు. చెట్ల మాటుగా ఎవరో వస్తున్నారు. ఎవరది? మనుషులా..? మృగాలా...? శత్రువులా...? ఏమీ అర్థం గావటం లేదు. నింగికెగసిన పక్షులు ఆ ప్రాంతం లోనే చక్కెర్లు కొడుతూ ఇంకా అరుస్తూనే వున్నాయి. గాలి మరింత వేడెక్కుతున్నట్టుంది.

ఏం జరుగుతోందక్కడ!

నిశితంగా గమనిస్తున్నాడు.

ఇంతలో ఒక కొమ్ము బూర శబ్ధం బిగ్గరగా విన వచ్చింది. దాన్ని అనుసరించి భేరీనాదం ఒకటి లయ బద్ధంగా మ్రోగటం ఆరంభించింది. ఆ శబ్ధాలకు మరింత విభ్రాంతి చెందాడా యువకుడు. ఆ శబ్ధాలకు యుద్ధానుభవం గల అతడి పవనాశ్వం బిగ్గరగా సకిలించి కదం తొక్కనారంభించింది.

భేరీనాదం, కొమ్ము బూర ఇవి రెండూ యుద్ధ సంకేతాలు. ఇంత నిశ్శబ్ధంగా ఇంతటి అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు యుద్ధానికి తలపడుతున్న ఇరువర్గాలు ఎవరు? ఆటవిక తండాలేవైనా యుద్ధానికి సన్నద్ధమయ్యాయా? తనకు తెలీకుండానే యుద్ధక్షేత్రంలోకి ప్రవేశించాడా? ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాడా? పరిసరాల్ని నిశితంగా గమనిస్తూ పరిపరి విధాలా యోచిస్తున్న ఆ యోధ యువకునిలో ఎన్నో సందేహాలు. మరెన్నో అనుమానాలు. అప్రయత్నంగానే అతడి కుడిచేయి ఖడ్గం పిడి మీద పడి బిగుసుకుంది.

ఇంతలో పరిసర పొదు చెట్ల మాటు నుండి విచిత్రమైన దుస్తులు, ఆభరణాలు ధరించిన ఆటవికులు ఆయుధాలు ఎక్కుపెట్టి బయటికి రావడం కన్పించింది. చూస్తుండగానే సుమారు వంద మంది సాయుధలైన ఆటవికులు వృత్తాకారంలో అతడ్ని చట్టు ముట్టి ఎడంగా నిలబడ్డారు. అప్పటిగ్గాని ఆ యుద్ధ సన్నాహమంతా తన కోసమేనన్న సంగతి ఆ యువకునికి అర్థం కాలేదు. అర్థంకాగానే ఒకింత ఆశ్చర్య సంభ్రమాలకు లోనయ్యాడు. ఎందుకంటే వాళ్ళంతా శత్రు సైనికులు కారు, ఆటవికులు. అందునా నాగాలు. రత్నగిరి అడవుల్లో ఎక్కడా నాగాలు నివశిస్తున్నట్టుగా ఇంత వరకు తను వినలేదు. అదే అతని ఆశ్చర్యానికి కారణం.

వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు? తనను చుట్టుముట్టడంతో వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఇలాంటి నాగా తెగ ఆటవిక జాతులు కొన్ని వింధ్యా పర్వతాల పైన అవతల ఎక్కడో ఉత్తర భూములన్దు (నాగాలాండ్‌) నివశిస్తారని విన్నాడు. అలాంటి జాతికి ఈ దక్షిణ అడవుల్లో ఏం పని?

ఇదే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాడా యువకుడు. అశ్వాన్ని ఉన్న చోటే తిప్పుతూ వాళ్ళని నిశితంగా గమనిస్తున్నాడు. చూస్తుంటే తన అంచనా సరైనదేననిపించింది. వాళ్ళంతా నడుంకి జింక చర్మాలు ఆచ్ఛాదనగా ధరించారు. ఛాతీకి అడ్డంగా సర్ప కుబుసం వేసుకున్నారు. కాళ్ళకు వెండి తోడాలు, మెడలో కర్ణాభరణాలుగా వెండి ఆభరణాలు ధరించారు. ముఖ్యంగా పడగ విప్పిన వెండి నాగాభరణాన్ని తల మీద కిరీటంలా ధరించారు.

విచిత్రమైన విషయం, వాళ్ళు యుద్ధభేరీ మోగిస్తూ తన మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఆయుధాలు ఎక్కుపెట్టి యుద్ధ సన్నద్ధులై వున్నారు. కాని యుద్ధం ఆరంభించటం లేదు. దాడికి సిద్ధంగా వున్నారు. కాని దాడి చేయటం లేదు. అంతా ఏక కాలంలో కుడిపాదాన్ని నేలకు తాటిస్తున్నారు. దాంతో వెండి తోడాలు లయబద్ధంగా శబ్ధం చేస్తూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. తననే నిశితంగా చూస్తూ పాము బుస కొడుతున్నట్టు విచిత్రమైన శబ్ధం చేస్తున్నారు.

తనకు యాభై ధనువుల దూరంలో వలయాకారంలో చుట్టి వున్న ఆ నాగాలు ఇంత హడావుడి చేస్తున్నారు గాని ఒక్కడూ తన వైపు కదిలి ముందుకు రావడం లేదు. ఇంతకీ యుద్ధం వాళ్ళు ఆరంభిస్తారా లేక తను మొదలు పెట్టాలా? కలబడని శత్రువు మీదకు తెగబడటం న్యాయసమ్మతం కాదు గదా! ఏం చేయాలి? ఆ వీర యువకునికేమీ అర్థంగావటం లేదు. లిప్తలు... ఘడియలు కరిగిపోతున్నాయి గాని పరిస్థితిలో మార్పు లేదు.

ఇప్పుడు తనేం చేయాలి?

అశ్వాన్ని అదలించి వాళ్ళని దాటి తన దారిన వెళ్ళి పోవటమా? లేక వీళ్ళ సంగతేమిటో తేల్చుకోవడానికి తలపడి అంతు చూడ్డమా? ఏం చేయాలి? ఓ పక్క ఎండ మాడ్చేస్తుంది, మరో పక్క వడగాలి. నాలుక పిడచ గట్టుకు పోతోంది. చెమటలతో దుస్తులు తడిసిపోతున్నాయి. దీనికి తోడు, జరగని యుద్ధానికి ఆర్భాటం ఎక్కువన్నట్టు కొమ్ముబూర భేరీనాదాల శబ్ధాలు మరింత చికాకును, కోపాన్ని కలిగించాయి.

వీళ్ళ వ్యవహారం ఏమిటో తేల్చుకోకుండా ముందుకు సాగటం మంచిది కాదనిపించింది. వెంటనే విల్లు అందుకుని రెండు బాణాలు సంధించాడు. అది చూసి గొల్లున అరుస్తూ ఆయుధాలు ఎత్తారు నాగా వీరులు. వాళ్ళ ఆర్భాటాన్ని పట్టించుకోకుండా రెండు బాణాలను ఏకకాలంలో ప్రయోగించాడు.

ఝూంకారం చేస్తూ గాలిని చీల్చుకెళ్ళిన బాణాల్లో ఒకటి సూటిగా కొమ్ము బూరను తాకి రెండు ముక్కలు చేసింది. రెండో బాణం భేరీని తాకి ధ్వంసం చేసింది. అంతవరకు వాటిని ఏకధాటిగా వాయిస్తున్న నాగాలు యిద్దరూ భయంతో ఎగిరి వెనక్కి దూకారు. మరో రెండు బాణాలు అందుకున్నాడా వీరుడు. ఇంతలో ఒక బలిష్టమైన కంచర గాడిద పొదలను విరుగదోసుకొంటూ ముందుకు రావడం కన్పించింది. దాని మీద వయసు మళ్ళిన వృద్ధ నాగా నాయకుడు ఒకడు కూచునున్నాడు. అతడు అశ్వం మీది వీరుడ్ని శాంతించమన్నట్టు రెండు చేతుతో సైగ చేస్తూ నాగా భాషలో ఏదో అరుస్తున్నాడు. అతడ్ని చూడగానే బాణాలు ప్రయోగించే ఉద్దేశం విరమించుకున్నాడు అశ్విక వీరుడు. తనను సమీపిస్తున్న కంచర గాడిదను, ఆ నాగా నాయకుడ్ని నిశితంగా చూడసాగాడు.

********************************************************

సరిగా అక్కడికి చాలా దూరంలో దిగువన మరో చిన్న కొండ వుంది. అంత క్రితమే బిడారు గుంపు ఒకటి ఆ కొండ పైకి చేరుకుంది. అప్పటికి భోజన సమయం మించటంతో వాళ్ళంతా కొండ పైకి చేరుకోగానే చెట్ల నీడన తాత్కాలికంగా మజిలీ చేసారు.

ఈ బిడారు గుంపు నెల రోజులు కిందట మాళవ రాజ్య రాజధాని అవంతీ నగరం (ఉజ్జయిని) నుండి సుమారు ఏడు వందల మంది వర్తకులు వారి సరుకులు, వాహనాలు, నౌకర్లతో బయలుదేరింది. మార్గంలో వివిధ నగరాలు, పట్టణాల్లో వ్యాపారం కోసం ఆగిన వాళ్ళు ఆగిపోగా, అక్కడ బిడారులో చేరిన వర్తకులు చేరి వస్తుండగా ఇప్పటికింకా సుమారు రెండు వందల మంది వర్తకులు వారి సరుకుతో కూడిన బండ్లు, నౌకర్లు ఆ గుంపులో వున్నారు. వీళ్ళంతా రత్నగిరి నగరం చేరగానే ప్రయాణం ముగుస్తుంది. రత్నగిరి నుండి ఓడలో ప్రయాణం చేయాల్సిన వర్తకులు కూడ వారిలో వున్నారు.

బిడారు గుంపు బయలుదేరి ప్రయాణం చేస్తోందంటే చిన్న వూరే బయలుదేరి తరలిపోతున్నట్టుంటుంది. ఈ వర్తకులు సమూహమంతా బిడారు రక్షణ వ్యవహారం చూసే బిడారు నాయకుని ఆధీనంలో వుంటుంది. ఈ నాయకుడు ఆయా మార్గాల్లో ఎంతో అనుభవం నిండిన వాడై వుంటాడు. అతడి చేతికింద యుద్ధ విద్యలు తెలిసిన సుశిక్షితులైన మనుషులు అశ్వాల మీద ఆయుధాలతో అనుసరిస్తూ బిడారు రక్షణ బాధ్యత నిర్వర్తిస్తూంటారు.

అడవి మార్గాల్లో దోపిడి దొంగలు, బందిపోటు దొంగల నుండి కాపాడుతారు. కృరమృగాల్ని తరిమేందుకు అవసరమైన డోలు వాద్యాలు, డప్పు, బాణాసంచా కూడా వెంట వుంటాయి. మార్గంలో ఎక్కడ మజిలీ చేయాలి, ఎక్కడ వాగు వంకు దాటాలి, ఏ మార్గం సురక్షితంగా వుంటుందనే విషయాలు బిడారు నాయకునికి క్షణ్ణంగా తెలిసి వుంటాయి.

నాయకుడు ఎప్పుడూ ధైర్యసాహసాలు కలిగి, అనుభవం పండిన వాడై వుంటాడు. ఆ విధంగా వర్తకుల్ని ఒక నగరం నుంచి మరో నగరానికి సురక్షితంగా చేరుస్తున్నందుకు బిడారు నాయకుడు వర్తకుల నుండి రుసుం తీసుకుంటాడు. ప్రయాణంలో వారం రోజుల తర్వాత ఈ బిడారు అవంతికి తిరుగు ప్రయాణమవుతుంది.

బిడారు నాయకుడు తప్పు చేస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో నీలోపాఖ్యానంలో ఓ చోట వివరంగా చెప్పబడింది. శని ప్రభావం చేత అడవుల పాలైన నలమహారాజు తనతో బాటు కష్ట పడుతున్న మహారాణి దమయంతి కష్టం చూసి బాధ పడతాడు. తాను వెళ్ళిపోతే తనయినా పుట్టింటికి చేరి సుఖపడుతుందని ఆశ పడతాడు. రాత్రికి రాత్రి ఆమెను నట్టడవిలో వదిలి తన దారిన వెళ్ళిపోతాడు

భర్త జాడ తెలీని దమయంతి దుఖ్ఖితురాలై చేసేది లేక పుట్టింటికి బయలుదేరుతుంది. దారిలో కన్పించిన ఒక బిడారు గుంపు వెంట తను పుట్టిన రాజ్యానికి నడక సాగిస్తుంది. చాలా పెద్ద బిడారు సమూహం అది. అందులో ఎందరో వర్తక వ్యాపారులతో బాటు తీర్థయాత్రీకు, బిచ్చగాళ్ళు ఇంకా ఇతర పను మీద వూళ్ళకు వెళ్తున్న వాళ్ళు యిలా ఎందరో తమ స్వస్థలాలు వదిలి బిడారుతో ప్రయాణం చేస్తున్నారు.

ఒక రాత్రి వారంతా ఒక లోయ ప్రాంతంలో మజిలీ చేసారు. అయితే అర్ధరాత్రి ఏనుగుల సమూహం నీళ్ళ కోసం మడుగు వైపు పోతూ అటుగా వచ్చి బిడారు మజిలీ మీద పడ్డాయి. బిడారు నాయకుని అవగాహనారాహిత్యమే ఆ బిడారు పాలిట శాపమైంది. అది ఏనుగుల రాకపోకలు సాగించే దారి. చీకట్లలో ఒక్కసారిగా గగ్గోలు చెలరేగింది. బెదిరిన ఏనుగు గుంపు బిడారు మజిలీని ధ్వంసం చేసాయి. దొరికిన వాళ్ళని కాళ్ళతో తొక్కి తొండంతో కొట్టి చంపేసాయి.

ఏనుగు కోపానికి బిడారంతా సర్వనాశనమైపోయింది. ఎందరో చనిపోగా, కొందరు పారిపోయారు. విలువైన సరకు, బండ్లు ధ్వంసమయ్యాయి. ఎలాగో ఆ భయంకరమైన విపత్తు నుండి బయట పడిన దమయంతి అష్టకష్టాలు పడి చివరకు పుట్టింటికి చేరుతుంది. బిడారు నాయకుడు అసమర్థుడైతే ఎంత నష్టం జరుగుతుందో చక్కగా వివరించిన సంఘటన యిది.

బిడారులంటేనే వర్తక సమూహం.

దేశ విదేశాలతో బాటు ఖండాంతరాల వరకు భూమార్గం గుండా, జలమార్గం వెంట ధనార్జనే ధ్యేయంగా ఎండనక వాననక సుదూర ప్రాంతాల వరకు వెళ్ళి వచ్చే అనాటి వర్తకులే భారత ఖండం ఔన్నత్యాన్ని దిశదిశలా వ్యాపింపజేసారు. వారి వల్లనే భారత ఖండం ఒక ఆధ్మాత్మిక కేంద్రమని, రాజ్యాలు సర్వతోముఖంగా అభివృద్ధి చెందిన ధనవంతమైనవని విదేశీయుకు తెలిసింది. అనేక సాహస గాధ ప్రచారానికి కూడా వారే కారణం.

విశ్వ విజేత అలెగ్జాండర్‌ గ్రీసు దేశం నుండి ఉత్తర భారతం వరకు జయించుకొచ్చినా, గజనీ మహమ్మదు పదిహేడుసార్లు దండెత్తి వచ్చి సోమనాధ ఆలయ సంపదలను దోచుకెళ్ళినా, పామీరు పీఠభూమి నుంచి బాబర్‌ అనే మంగోలియన్‌ ఇండియాకు దండెత్తి వచ్చి షర్షాను ఓడించి హస్తిన సింహాసనం ఎక్కి మొగలాయి రాజ్యం స్థాపించినా, ఇలా భారత భూమి తరచూ విదేశీయుల దండయాత్రకు గురికావటానికి కారణం నాటి దేశవిదేశీ వ్యాపారుల మూలంగా కథలు కథలుగా ఇక్కడి సుసంపన్నమైన రాజ్యాల గురించి వినటమే.  

( ఈ ఉత్కంఠ వచ్చేవారం దాకా..............)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్