Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వరద వినాయకుడు ( మహాడ్ ) - కర్రా నాగలక్ష్మి

 
అష్ఠగణపతులలొ వొకటైన వరద వినాయకుని గురించి యీ సంచికలో తెలుసుకుందాం .


వరద వినాయకుని మందిరం మహారాష్ట్రాలోని రాయ్ ఘడ్ జిల్లాలోని ఖాలాపూర్ తాలుకా లో గల మహాడ్ గ్రామం లో వుంది . పూణే బొంబాయి యెక్స్ ప్రెస్  హైవే మీద వుంటుంది ఖలాపూర్ . ఖలాపూర్ ' టోల్ నాకా ' దగ్గర ఎడమవైపుకి తిరిగి స్టేట్ రోడ్డు మీదకి మళ్లి మహాడ్ గ్రామం చేరుకోవచ్చు . మహాడ్ బొంబాయి కి సుమారు 80 కిమీ .. దరంలోను , పూణే నుంచి సుమారు 130  కిమీ.. లోను వుంది .

ఈ కోవెల తుర్పుముఖం గా వుంటుంది . ఈ కోవెల నాలుగు వైపులా నాలుగు ఏనుగు విగ్రహాలు వుంటాయి . 25అడుగుల యెత్తైన గోపురం బంగారు శిఖరం వుంటాయి .గర్భగుడిలొ వరద వినాయకుడు తూర్పు ముఖంగా కూర్చున్న భంగిమలో వుంటాడు . తొండం ఎడమ వైపుకి తిరిగి , యిరువైపులా రిద్ధి , సిద్ది ల రాతి విగ్రహాలు వుంటాయి . మిగతా అష్ఠ గణపతుల మందిరాలలో గర్భగుడి లోనికి భక్తులను అనుమతించారు కాని వరద వినాయక కోవెలలో భక్తులకు గర్భగుడిలోకి ప్రవేశించి పూజాది కార్యక్రమాలు స్వయం గా నిర్వహించుకొనే అవకాశం కల్పించేరు .

యీ కోవేలలోని దర్శించు కొనవలసినది గర్భగుడి లో వుండే అఖండ దీపం . కొన్ని వందల సంవత్సరాలుగా అఖండం గా వెలుగుతూనే వుందిట . వరద వినాయకునికి మూడు పూటలా నిత్య పూజలు జరుగుతాయి .

వరద వినాయకుని స్థల పురాణం గురించి అడుగగా యిలా చెప్పేరు .

సంతానం కొరకై కౌండన్య పురాన్ని పాలించే రాజు భీముడు , ధర్మపత్ని తో  తపస్సాచరించడానికి అడవికి వెళ్తాడు . అక్కడ విశ్వామిత్రుడు ని కలిసి అతని ద్వారా ఏకాక్షర గజానన మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్ర ప్రభావము వలన పండంటి పుత్రుని పొందుతాడు భీముడు  . ఆ బిడ్డకు రుక్మాంగదుడు అని నామకరణం చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని , సర్వ శాస్త్ర విద్యలు నేర్పించి , యుక్త వయస్కుడవగానే వివాహం చేసి పట్టాభిషిక్తుడను చేస్తాడు .

 ఒకరోజు రుక్మాంగదుడు వేటకి వెళ్లి అక్కడకి దగ్గరగా వున్న వచక్నవి అనే ఋషి ఆశ్రమానికి విశ్రమించడానికి వెళ్తాడు . రుషి పత్ని ముకుంద యవ్వన వంతుడైన రుక్మాంగదుని చూచి మోహించి అతనిని తన కోరిక తీర్చమని అడుగుతుంది . ఆగ్రహించిన రుక్మాంగదుడు ఋషి పత్నిని వారించి అక్కడ నుంచి వెడలిపోతాడు . ముకుందను యెప్పటినుంచో మోహించిన ఇంద్రుడు రుక్మాంగదుని రూపంలో వచ్చి ముకుంద తో గడుపుతాడు . జరిగిన మోసం తెలియని  ముకుంద గర్భం దాల్చి   'గ్రిత్సామద ' అనే పుత్రునకు జన్మ నిస్తుంది . పెరిగి పెద్దవాడైన గ్రిత్సామదుడు తన జన్మ వృత్తాంతం తెలుసుకొని , ముకుందను అసహ్యించుకొని ఆమెను ముళ్ళతో కూడుకొని వుండే బదరిక వృక్షం ( రేగు చెట్టు) కమ్మని శపిస్తాడు . ఆ శాపానికి ప్రతిగా ముకుంద గ్రిత్సామదునకు రాక్షసుడు జన్మించాలని శపిస్తుంది . అంతలో ఆకాశవాణి గ్రిత్సామదుని జన్మానికి కారణం రుక్మాంగదుడు కాదని సాక్షాత్తూ దేవేంద్రుడే నని చెప్తుంది .

అవమానం తో కుంగిపోయిన గ్రిత్సామదుడు ఆ వనాన్ని విడిచిపెట్టి పుష్పక వనానికి వెళ్లి తన తపశ్శక్తి తో గణేషుని ప్రసన్నుని చేసుకొని తల్లి వలన పొందిన శాపాన్నుంచి తప్పించమని కోరుతాడు . గణేశుడు తల్లి శాపాన్నుండి తప్పించే శక్తి యెవరికీ లేదని చెప్పి అతని పుతృనకు  యీశ్వరుని చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేనట్లుగా  వరం యిస్తాడు .

 గ్రిత్సామదుడు , గణేశుని  తనను కరుణించిన పుష్పక వనములోనే స్థిరనివాసుడై భక్తులకు విజయ ప్రాప్తిని , జ్ఞానమును ప్రసాదింప మని కోరుతాడు . 

గ్రిత్సామదుని కోరిక మన్నించి గణేశుడు స్వయంభు గా ఉద్భవించె ననేది యిక్కడి స్థల పురాణం . గ్రిత్సామదుడు గణెశునికి కోవెల కట్టించి భక్తుల కోర్కెలు తీర్చే వినాయకుడు కావున వరద వినాయకుడు అనే పేరుతో సేవించుకొని ముక్తి పొందుతాడు . పుష్పక వనం కాలాంతరాన భద్రకావనం గా పిలువబడుతోంది .

వరద వినాయకునికి రోజు మూడు పూటలా నిత్య పూజలతొ పాటు , భాద్రపద , మాఘ మాసాలలో శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు . 

గణేశ జయంతి , వినాయక చవితి విశేషం గా జరుపుతారు .

సంతానం లేని దంపతులు మాఘ ఉత్సవం ( శుద్ధ పాడ్యమినుంచి పంచమి వరకు ) లో పాల్గొని వినాయకునికి నైవేద్యం గా కొబ్బరికాయను సమర్పించి ఆ ప్రసాదాన్ని తినడం వల్ల వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది స్థానికుల నమ్మకం .
మరిన్ని శీర్షికలు
sahiteevanam