Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ: భూషణ్ గారిని చూడటానికి చంద్రకళ హాస్పిటల్ కి వెళుతుంది.  రాణి ఓర్వలేనితనం తన భవిష్యత్తుకి ఆటంకమవ్వదని తను హామీ ఇస్తాడు. అంతేకాకుండా రాణిని  మాత్రం తన  తోబుట్టువులా భావించి, తప్పుల్ని క్షమించి, తన  పట్ల ఎప్పటికీ ఆదరాభిమానాలతో ఉండమని  రిక్వెస్ట్ గా మాట్లాడుతూ కళ్ళు తుడుచుకుంటాడు...  భూషణ్ గారు..    ఆ తరువాత...

‘సినీ జగత్’ వారి ఆఫీసు నుండి బయటపడి,  నేను, భూషణ్ అంకుల్, స్టూడియో దారి పట్టాము.  వీలైనంత త్వరగా స్టూడియో చేర్చమని డ్రైవర్ని ఆదేశించారాయన.  చేతినున్న  వాచ్ వంక చూసుకుంటూ,“ అరగంటలో నువ్వు స్టూడియోలో ఉంటావు, సరేనా,” అన్నారు నాతో.
ఔనన్నట్టు చిరునవ్వుతో సమాధానమిచ్చాను.    

“చెప్పమ్మా, ఈ నాటి మీటింగుతో, నువ్వూ సంతోషంగా ఉన్నావు కదూ,” అడిగారు.

“మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అంకుల్,” అన్నాను...

“నీ ఫస్ట్ ఫిలిం ‘శ్రీలత అయ్యర్’ పెద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా, అందరి దృష్టి ఆకర్షించిందన్నమాట.   ఇటీవలే రిలీజు చేసినా, మొత్తానికి తన సినిమాని అవార్డుల రేసులో, నిలబెట్టగలిగాడు ముత్తురామన్. 

ఏమైనా, ఈ యేడాది ‘బెస్ట్ న్యూ ఫైండ్ అవార్డు’ నీకివ్వాలని, ‘సినీ జగత్’ కమిటీ చేత ఏకగ్రీవంగా నిర్ణయించబడడం, నాకెంతో గర్వంగా ఉంది కళా.  మనల్ని ప్రత్యేకంగా ఈ మీటింగుకి ఆహ్వానించి, విషయం అనౌన్స్ చేయడం, ఒకెత్తయితే, వారి ‘విజన్ సోర్స్ డివిజన్’  తరఫున నీ ‘కూచిపూడి డాక్యుమెంటరి’కి  ‘సబ్సిడీ గ్రాంట్’ అందిచడం, మరో ఎత్తు.   నీకు, అన్నీ నేనాశించిన దానికంటే వేగంగా అందుతున్నాయి, కళా.  అంతా నీ అదృష్టం,”  మెచ్చుకుంటూ అంకుల్. 

రాణి గురించి వాకబు చేయడానికి సరయిన సమయమనిపించిది....

“రాణి ఇప్పుడు బాగుంది కదా, అంకుల్?” అడిగాను..

కొద్దిసేపటికి గాని జవాబు చెప్పలేదు ఆయన. 

“జనరల్ గా అంతా ఒకే.   రాణి, తన సైకియాట్రిస్ట్ ని కలుస్తూనే ఉంది.  మందులు కంటిన్యూ చేస్తుంది.  పర్వాలేదనుకో.  ప్రస్తుతం మన మలేషియా-సింగపూర్ ట్రిప్ కి ప్రిపేర్ అవుతుంది,”  అన్నారు...

“ఏవో ఇంసెక్యూరిటీస్...దానికి.  ఎప్పుడూ అబధ్రతాభావంతో సతమతమవుతూ ఉంటుంది.  పైగా మొండిది.  తను ఇష్టపడే వ్యక్తులు, వస్తువులు తనకి దూరమౌతాయని భయమట ఆ పిల్లకి.  అలాగని తన డాక్టర్ కి చెప్పినట్టు గ్రహించాను.  

అయినా తల్లీ,  మన రాణి, ఆ రంజిత్ సూరితో స్నేహాన్ని వదులుకుంటే, అసలు ఏ సమస్యా ఉండదని నా అభిప్రాయం...,” నిట్టూర్చారు అంకుల్. 

“బాధపడకండి అంకుల్...  ఈ తరం వారి జీవితాల్లో, ఇటువంటి అధ్యాయాలు చోటుచేసుకోడం  నేను చూస్తూనే ఉన్నాను.  మన రాణి ఏమీ విడ్డూరం కాదు.  ఈ పరిస్థితి నుండి తప్పక బయట పడుతుంది. పూర్తిగా బాగుంటుంది.  మంచి మార్గంలో సెటిల్ అవుతుంది,” ఓదార్చాను.

“నువ్వనేదీ కరక్టేనమ్మా, కళా,  రాణి విషయం కుదుట పడాలనే ఆశిద్దాం” అన్నారు.

“అదలా ఉంచితే,  మన విదేశీ పర్యటన సందర్భంగా, ఎల్లుండి, గవర్నర్ గారితో లంచన్ కి ఆహ్వానాలు వచ్చాయిగా.  ఆఖరి నిముషంలోనైనా, మన పర్యటనకి, ప్రభుత్వం వారు మెయిన్ స్పాన్సర్ గా ముందుకు రావడం మేలయింది.  ఇక వాళ్ళు  తలుచుకుంటే రాజమార్గమే మనకి,” అన్నారు అంకుల్...

“అంతా మీ ప్రయత్నమే కదా, అంకుల్... లేదంటే ఇవన్నీ ఇంత దూరం వచ్చేవా?” అన్నాను నవ్వుతూ. 

“ఎవరి కోసమమ్మా? రాణికోసం, నీ కోసమే కదా! మీరు వృద్దిలోకి వస్తే, వెనుక నాపేరేగా మారుమ్రోగేది...,” నవ్వుతూ అంకుల్. 

“ఔనూ మరిచేపోయాను.... ఇవాళో, రేపో మన జగదీష్ వస్తున్నాడని చెప్పింది రాణి.  వారం రోజులు ఉండి, మనకి వీడ్కోలిచ్చి వెళతాడట కదా.   ఆ సమయంలో మిమ్మల్ని  డిన్నర్ కి పిలవాలని,  ఇంకా వాలెంటైన్స్ డే పార్టీ కూడా అంటూ రాణి ఏవేవో ప్లాన్స్ వేస్తుంది,” మళ్ళీ  అంకుల్.   

“అవును అంకుల్. జగదీష్  రేపు సాయంత్రం వస్తున్నాడు.  మెడిసిన్ లో జాయిన్ అయ్యే ముందు ఫ్రీ టైం కదా.  ఒక వారముంటాడు.  అందుకే, గవర్నర్ గారి లంచన్ కి, జగదీష్ పేరు కూడా చేర్చి – మా నలుగురి పేర్లు పంపేసాను అంకుల్,”  అన్నాను.

“ఔనాను,  ఆ టైంలోనే మా మెడికల్ కాలేజీ టూర్ కూడా ఎరేంజ్ చేసుకున్నాడన్నమాట.  మా హాస్పిటల్ కూడా విజి’ట్ చేస్తానని అన్నాడు మరి,” అంకుల్ అంటుండగానే,

స్టూడియో  ముందు కారాగడంతో,  కారు దిగి, అంకుల్ వద్ద శలవు తీసుకున్నాను. 

రెండురోజుల పాటు, అవిరామంగా జరగబోయే డాన్స్ షూట్ గురించి ఆలోచిస్తూ నడిచి  సెట్స్ మీదకి వచ్చేసాను.  

**

‘డాక్యుమెంటరీ’ షూట్ కోసం వచ్చున్న ఇద్దరు గురువులతో సహా, మూర్తి గారు, మేకప్ అసిస్టెంట్, నాకోసమే వెయిట్ చేస్తున్నారు..  నన్ను కలవగానే, తమ వంటి పాత తరం గురువులకి, సదవకాశాన్ని కల్పించామంటూ కృతజ్ఞతలు తెలిపారు.

**

నిర్విరామంగా  సాగి, రెండో రోజు నైట్ షూట్ కూడా ముగిసేప్పటికి తెల్లారుజామున ఐదయింది.  ఆశించినట్టుగానే,  గడిచిన  రెండు రోజుల్లో,  ‘పాచ్-వర్క్’ తో సహా పని ముగించాము.  

జగదీష్ నిన్న సాయంత్రమే ఇంటికి వచ్చేసాడని తెలిసింది.. అతన్ని చూడాలని ఆదుర్దాగా ఉంది. అందరి వద్ద సెలవు తీసుకుని ఇంటిదారి పట్టాను.

తెలతెలవారుతుండగా, నిశ్శబ్దంగా ఉన్న రోడ్ల మీద, కారు వేగంగా సాగిపోతుంది...  

కళ్ళు మూతలు పడుతుంటే, కాసేపు వెనక్కి వాలాను..

**   

మామూలు కన్నా త్వరగానే ఇల్లు చేరాను.  ఇంత పొద్దున్నే డోర్-బెల్  మోగించి అందర్నీ డిస్టర్బ్ చేస్తానేమో అనుకుంటూ కారు దిగాను.  కాని ఇంటి మెయిన్ డోర్స్ తెరిచే ఉన్నాయి.. 

హాల్లో అడుగు పెట్టేప్పటికి, కోటమ్మత్త, వినోద్, జగదీష్ తో సహా అందరూ కాఫీలు తాగుతూ,  హాల్లోనే కూర్చునున్నారు. 

పరుగున వెళ్లి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాను.  “హలో, హౌ ఆర్ యు? జగదీష్.   ఎవ్వరూ నన్ను మిస్ చేసినట్టు లేరే?” అడిగాను నవ్వుతూ.

“నువ్వు లేకపోయినా నిత్యం నీగురించేగామ్మా మాటలు,” అంటూ కప్పులోకి  కాఫీ  వొంపి అందించింది, కోటమ్మత్త.

“నీ ధ్యాస పని మీద ఉంచావా, లేక ఇక్కడ మా మీదకి మళ్ళించావా? ఎలా జరిగింది మీ నాన్-స్టాప్ షూట్?” నవ్వుతూ అడిగాడు జగదీష్. 

“హాఫ్ ఎండ్ హాఫ్,” నేనూ నవ్వాను. 

“నువ్విప్పుడు డాన్సింగ్ స్టార్ మాత్రమే కాదు, మీ డాక్యుమెంటరీకి ప్రోడ్యూసర్, డైరెక్టర్ వి కూడా..... బాధ్యతగా పని చేసుకోవాలి

రి.....ఎనీవేస్,  కంగ్రాట్స్,”  అభినందించాడు.  


“అయినా,  నీవిక్కడ లేని సమయంలో, అత్తయ్య మామయ్యలతో ఎన్నో విషయాలు మాట్లాడుకునే అవకాశం దొరికింది. సో, మంచిది కదా,” మళ్ళీ జగదీష్.

“సరే మంచిది,” కాఫీ ఫినిష్ చేసాను.

“ఏమ్మా కళా,  ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో.  గవర్నర్ గారి లంచన్ ఉందిగా! పదకొండుకి బయలుదేరుదాము,”  అన్నారు నాన్న  నాతో...

“సరే, అలాగే,”  లేచి నా రూమ్ వైపు నడిచాను...

“ఎప్పటిలా, మీ నాన్నే నీవు కట్టవలసిన చీర, నగలు పిక్ చేసారు.  నీ బెడ్ మీద ఉంచాను, చూడు,” వెనుకనుంచి అమ్మ.

**

మేము తాజ్-కృష్ణ  లోని ఫంక్షన్ హాల్లోకి వెళ్లి, మాకు కేటాయించిన టేబిల్ వద్ద కూర్చున్నాము.  సన్నగా వినబడుతున్న మృదంగ వాద్యం శ్రావ్యంగా ఉంది. 

కాసేపటికి, భూషణ్ అంకుల్, ఆంటీ, రాణి కూడా వచ్చి, మా టేబిల్ వద్దే కూర్చున్నారు.  

గ్రీట్ చేసి,  జగదీష్ పక్కనే కూర్చుంది రాణి.   చుట్టూ అందరూ పలకరింపులు, మాటల్లో ఉండిపోయారు..  

అమ్మ, నీరూ ఆంటీతో  కబుర్లు, రాణి - జగదీష్ తో కబుర్లు, అంకుల్ తో నాన్న కబుర్లు సాగిస్తున్నారు....

నేను మ్యూజిక్ వింటూ  లోనికి వస్తున్న గెస్ట్స్ ని చూస్తూ కూర్చున్నాను. 

రాణి ఫ్రెండ్, రంజిత్ సూరి కూడా లోనికి రావడం కనిపించింది..  

ఇంతలో వేదిక పై మొదలయిన సందడి దిశగా నా దృష్టి మళ్ళింది.  సభారంభానికి సన్నాహమవుతున్నారు కార్యవర్గం. తిరిగి చూసేప్పటికి, మా టేబిల్ వద్దకు వచ్చేసిన  రంజిత్, అందరినీ పలకరించాడు. 

రాణి కి ‘హలో’ చెప్పి,  “ఈ లంచన్ గురించి అడిగితే, వెళతానో, లేదో అన్నావుగా! “ అడిగాడు.  అప్పటివరకు నవ్వుతూ ఉన్న రాణి మౌనంగా ఉండిపోయింది.  

వేదిక పైనుండి కార్యదర్శి ఆహుతులకి ఆహ్వానం పలకడంతో,  తిరిగి తన టేబిల్ వద్దకి వెళ్ళక తప్పలేదు, రంజిత్ కి.  

అంకుల్ ముఖంలో, అతని పట్ల ఉన్న అయిష్టత, కంగారు కనబడ్డాయి.

రంజిత్  వెళ్ళిపోగానే, తిరిగి జగదీష్ తో మాట్లాడుతూన్న రాణి ముఖం మాత్రం వెలిగిపోతుంది. 

‘ఆమెకి జగదీష్ పట్ల ఉన్న ఇష్టం, ఆకర్షణ  అలాగే ఉన్నాయి’ అనుకున్నాను. 

**

కార్యక్రమం మొదలైంది.

గవర్నర్ గారి  ప్రసంగం,  ఆయన  చేతులమీదుగా, గురువుగారికి  సత్కారం, ఆర్కెస్ట్రా వాళ్ళని గుర్తించి అభినందించడం, జరిగాయి.  

తరువాతి అంశంగా, నన్ను వేదిక పైకి ఆహ్వానించారు. 

‘వేదిక’ పైకి వస్తూ, ఆనందంతో వెలిగిపోతున్న అమ్మా నాన్నల ముఖాలని చూసాను.  వారి పక్కనే ఉన్న అంకుల్ ముఖంలో తృప్తి,  గర్వం కనబడ్డాయి.  

జగదీష్ వంక చూసాను.  కళ్ళల్లో మునుపెన్నడూ చూడని ప్రేమ మెరిసింది.  వీరి సంతోషాలు నా గుండెల్లో ఎన్నో అనుభూతుల్ని నింపాయి... చాలా సంతృప్తిగా అనిపించింది.

నా గురించి కార్యదర్శి ప్రసంగించారు....

“కూచిపుడు నృత్య రంగంలో దూసుకుపోతున్న ధ్రువతార కుమారి చంద్రకళ.. ఆమెని ఈ పిన్న వయసులోనే, సాంస్కృతిక రాయభారిగా గుర్తిస్తున్నాము.  మున్ముందు ఆమె ఈ రంగంలో మరింత కృషి చేయాలని ప్రోత్సహిస్తూ, ‘నృత్యకోవిద’ అనే బిరుదుని, గుర్తింపుని బహుకరిస్తున్నాము ..... 

అని ప్రకటించి గవర్నర్ గారి చేతుల మీదుగా నాకు సన్మానాలు, బహుమతులు ఇప్పించారు...

అనతికాలంలోనే  గాయనిగా  పేరుప్రతిష్టలు పొందినందుకు,  రాణి కూడా సత్కరాలు పొంది, ‘మొమెంటో’ స్వీకరించింది.  జాతీయ, అంతర్జాతీయ  గుర్తింపు పొందాలని, మా ఇద్దరినీ, సభలో పెద్దవాళ్ళు ఆశీర్వదించారు. 

చివరి అంశం - అంకుల్ ని ‘గ్రాండ్ పాట్రన్’ గా  సత్కరించి, ఆ నాటి లంచన్  ఈవెంట్  స్పాన్సర్  చేసినందుకు  కృతజ్ఞతలు తెలిపారు, ప్రభుత్వ కార్యదర్శి.

కార్యక్రమం ముగిసాక, నన్ను ప్రత్యేకంగా గవర్నర్  గారికి పరిచయం చేసి, నా గురించి గొప్పగా చెప్పారు భూషణ్ అంకుల్...లంచ్ అయ్యాక,  కార్యవర్గం వారికి కృతజ్ఞతలు తెలియజేసి,  ఆనందంగా ఇంటిముఖం పట్టాము.

**

కారు దిగుతూనే, ఎప్పటిలా గేట్ ముందు దిష్టి తిప్పేసింది అమ్మ. 

ఎలివేటర్ దిశగా వెళ్ళబోతున్న నన్ను, ఆపి, నా చేయందుకున్నాడు జగదీష్. తనతో రమ్మనమంటూ,  తిరిగి కార్లో కూర్చోబెట్టాడు.  ఎక్కడికి? ఏమిటి? అని అడగబోయిన నన్ను,  ‘అత్తయ్య మామయ్యల పర్మిషన్ తీసుకున్నా’నంటూ, కార్ స్టార్ట్ చేసాడు.

పక్కకి తిరిగి అమ్మావాళ్ళ వంక చూసాను.   వెళ్ళిరమన్నట్టు,  చిరునవ్వుతో చేయూపి ఎలివేటర్ లోకి నడిచారు వాళ్ళు. 

**

అసలేమిటీ కారులో షికార్? ఎక్కడికి? అమ్మావాళ్ళ పర్మిషన్ ఉండడం ఏమిటి? ఎన్నెన్నో ప్రశ్నలు నాలో మెదులుతున్నాయి... డ్రైవ్ చేస్తున్న జగదీష్ వంక చూసాను.  ఆట పట్టిద్దామనుకున్నా..

“బావ, రాంగ్ రూట్.  దారి తప్పావు,” అన్నాను కావాలని నవ్వుతూ.  ఈ మధ్య అతన్ని అప్పుడప్పుడు ‘బావా’ అని కూడా పిలుస్తున్నాను....

“ఐ నెవెర్ గో రాంగ్, చాంద్, జస్ట్ వెయిట్ ఎండ్ సీ,”  అంటూ మరి కాసేపటికి ‘నటేషన్ పార్క్’ లో కార్ పార్క్ చేసాడు... దిగవద్దు. ఆగమన్నాడు. చుట్టూ తిరిగొచ్చి, డోర్ తెరిచి పట్టుకున్నాడు.

“యువరానర్, చంద్రకళా మేడమ్, ప్లీజ్,” అంటూ దిగమని బౌ-డౌన్ చేసాడు జగదీష్. “వాట్ ఇజ్ స్పెషల్? నీకివాళ ఏమయింది?  ఆర్ యు డ్రంక్!” అంటూ కారు దిగాను.

“యూ ఆర్ ఇన్సల్టింగ్ మి చాంద్...ఇ యామ్ ఇన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ మైండ్ ఎండ్ బాడీ,” అంటూ, “మే ఐ,” మళ్ళీ బౌ-డౌన్ చేసి నా చేయి అందించమని అడిగాడు...

జగదీష్ కి, చేయందించి వెంట నడిచాను. చుట్టూ చూసాను.  బయట వాతావరణం ఎలా ఉన్నా ఈ గార్డెన్స్ మాత్రం చాలా చల్లగా – ఫాంటాస్టిక్  గా  ఉంటాయి.  వర్షానికి  కూడా తడవనంత దట్టంగా గ్రీనరీ ఉంది....

జగదీష్ చేతి స్పర్శ వెచ్చగా ఉంది.  చల్లని చిరుగాలి వీస్తుంది.   రకరకాల పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నాయి...

ఏదో తెలియని కొత్త అనుభూతి.  వొళ్ళంతా తేలిగ్గా అనిపించింది.

గార్డెన్స్ లో అటు ఇటూ వెళుతున్న కొందరు, మావంక అదోలా  చూస్తున్నారు. 

ఫార్మల్ గా తయారయి, కాజ్యువల్ గా పార్క్ లో తిరగడం మరి కాస్త చిత్రమే కదా! అనుకున్నాను.

మాకెదురుగా వస్తున్న ఇద్దరు ఆడవాళ్ళు,  నన్ను గుర్తు పట్టారేమో! పిల్లలతో సహా నా వద్దకు వచ్చారు.

“నీవు, డాన్సర్ చంద్రకళ కదా!...మా పిల్లలు కూడా డాన్స్ నేర్చుకుంటున్నారు.  మేము మీ ఫాన్స్ మేడమ్.  మీ టివి షో’ ‘సంస్కృతీ’ అసలు మిస్ అవ్వము,”  అంటూ, హ్యాపీగా నా చేయి పట్టుకుంది వాళ్ళల్లో ఓ పెద్దావిడ.  

“ఇక్కడ ఏదన్నా షూటింగ్ జరుగుతుందా మేడమ్? మీరింత అందంగా తయారయ్యారు!”  అడిగింది రెండో ఆమె....

లేదన్నాను...

నేను, జగదీష్ చేతులు పట్టుకుని నడుస్తున్నామని గమనించినామె, “అయితే, ఈయన ఎవరు? మీ ఫియాన్సీనా?” అడిగి క్షణమాగింది.   

నేను నోరు మెదపలేదు.

“గార్డెన్ లో షికారు చేస్తున్నారని, అలా అడిగాను.  ఏమనుకోవద్దు.  మీ ఇద్దరూ పక్కపక్కన బాగున్నారు,”  మళ్ళీ  ఆమే నవ్వుతూ.

“ఈయన మా కజిన్,  ఇక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ చేసి, ఇలా వచ్చాము,” , “థాంక్స్, ఇక ఉంటానండీ,” అంటూ అక్కడి నుండి కదిలాను.

***

మిగతా వచ్చే వారం..  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam