Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

పరమశివుని కుటుంబం - మారుతి

pramashivuni kutumbam


పరమశివుని కుటుంబం నుంచి మనం నేర్చుకోవలసినది చాలా ఉంది. నిజజీవితంలో మనకు ఎదురయ్యే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ కుటుంబం తెలియజేస్తుంది.

పరమశివుని కుటుంబాన్ని చూడండి. ఎంత విచిత్రం?

శంకరుడు నంది పై కూర్చుని ఉంటాడు. పార్వతీదేవి సింహం పై ఉంటుంది. నందికీ సింహానికీ పొసుగుతుందా? శివుడు తన మెడలో పామును ధరించి ఉంటాడు. ప్రక్కనే షణ్ముఖుడు నెమలి పై కూర్చుని ఉంటాడు. పాము మరియు నెమలికి జాతి వైరమే ఉంది.

శంకరుని మెడలో పాము ఉంటే వినాయకుని వాహనం ఎలుక. అదొక విచిత్ర కుటుంబం.

పార్వతీదేవి రాజు అయిన హిమవంతుని కూతురు.రాకుమారి. మరి శివుడు దిగంబర సన్న్యాసి.బూడిద పూసుకుంటాడు. అదీ అప్పుడే కాలిన శవం యొక్క చితాభస్మం. అయినా కుటుంబం అంతా ప్రేమమయం.

ఎందుకంటే పరస్పర అవగాహన. అక్కడ భేదమున్నదే కానీ విభేదం లేదు.ఎన్ని భేదాలున్నా కూడా విభేదాల్లేకుండా పరస్పర  అవగాహనలతో జీవించాలని శివుడు తన కుటుంబం ద్వారా మనకు బోధిస్తున్నాడు.

___________________________________________________________________________

నాగసాదువులు-నానో టెక్నాలజీ!

 

ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే....
మన ఋషులు,యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు.


హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళా లు గుర్తున్నాయి కదా. అక్కడికి లక్షలాది మంది నాగసాదువులు రావటం మనం టీవీల్లో,పేపర్ లలో చూశాం. నాగసాదువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో,నదీ తీరాల్లో వుంటారు.మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి.
ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ,వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో ,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?
వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం .అదే నానో టెక్నాలజీ.నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం.ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే సొల్లు అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu