Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

                                                             చికాగో ప్రయాణం

 

చికాగోలోని ఆర్లింగ్టన్స్ హైట్స్ లో మా చెల్లెలిగారమ్మాయిబిందు, అల్లుడు శ్రీనివాస్, వారి సంతానం అద్వైత్ వున్నారు.  అమెరికా వెళ్దామనుకున్నప్పటినుంచే వాళ్ళ ఇంటికి తప్పక రావాలని పట్టుపట్టారు వాళ్ళు. పైగా నా ఆసక్తి తెలుసుగనుక కొంచెం ఆశకూడా పెట్టారు, చికాగోలో అన్నీ చూపిస్తామని.  

ఒక రోజు రాత్రి 7-50 కి మేమిద్దరం, మా అమ్మాయి, అబ్బాయి వాళ్ళని చూడటానికి  కారులో బయల్దేరాము.  మా పిల్లలే డ్రైవర్లు.  అమెరికాలో అద్దెకి కారు తీసుకున్నా స్వయంగా డ్రైవ్ చేసుకుంటారు.  దీనికి రెండు కారణాలు.  మొదటిది దాదాపు అక్కడ వుండేవారందరికీ డ్రైవింగ్ వచ్చే వుంటుంది.  ఇంకోటి అక్కడ డ్రైవర్ ని పెట్టుకోవటం మాటల్లో వ్యవహారం కాదు. 

అక్కడ నాకు నచ్చిన విషయాలలో ఇలా కార్లు అద్దెకు తీసుకోవటం ఒకటి.  దూర ప్రాంతాలకి ఎక్కడికన్నా విమానం వగైరా ఇతర ప్రయాణ సాధనాల్లో వెళ్తే మీరు వెళ్ళిన చోటునుంచీ మీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కారు అద్దెకు తీసుకోవచ్చు.  మీరు తిరిగి వెళ్ళేటప్పుడు తిరిగి కారుని అక్కడేగానీ లేకపోతే వాళ్ళు చెప్పిన పాయింట్స్ లో ఎక్కడన్నాగానీ తిరిగి ఇచ్చేసి వెళ్ళచ్చు.  కారు రెంటల్స్ ఇచ్చే స్ధలాలు చాలా అందుబాటులో వుంటాయి, పైగా టాక్సీలకన్నా చౌక.  అందుకే  పనిమీద కొన్ని రోజులు వేరే వూరిలో వుండాలనుకునేవారికి ఇవి చాలా అనుకూలంగా వుండటంతో వీటినే వుపయోగిస్తారు.

దోవలో 16 అంగుళాల పిజ్జా తిన్నాము.  నేను అంత పెద్ద పిజ్జా చూడటం అదే మొదలు.  అందుకే ఫోటో.  ఇక్కడ ఇంకొక విశేషం.  అమెరికాలో మీరు కారులో ఎంత దూరం వెళ్ళినా ఇబ్బంది వుండదు.  చక్కని రోడ్లు, రూల్స్ పాటించే డ్రైవర్లు, పాటించనివారిని ఏ పక్కనుంచో వచ్చి పట్టుకునే పోలీసులు .. అంటే అడ్డదిడ్డమైన ట్రాఫిక్ అస్సలు వుండదు.  దోవలో రెస్టు ఏరియాలుంటాయి.  అక్కడ మీరు ఫ్రెష్ అవటమేకాక మీ ఆత్మారాముడుకి కూడా అవసరమైన ఇంధనాలు వెయ్యచ్చు.   ఆ ప్రదేశంలో వుండే రద్దీనిబట్టి షాపుల సంఖ్య, తినే పదార్ధాల సంఖ్యా ఎక్కువ తక్కువలు వుండవచ్చుగానీ, అన్నీ నీట్ గా మాత్రం వుంటాయి.  అవి చూశాక మన ఊళ్ళల్లో  ప్రయాణాలు,  ప్రయాణ సాధనాలు తలచుకుంటే  మన నాయకులు ప్రజల సొమ్ముతో విదేశ ప్రయాణాలు చెయ్యటం శుధ్ధ వేస్ట్ అనిపించింది.  అలాంటివి మనవాళ్ళెందుకు ఏర్పాటు చెయ్యరు?  మన దేశంలో బస్సు ప్రయాణంలో నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఆపిన హోటల్ లోనే బోలెడు డబ్బులు చెల్లించి తిన్నా, బాత్ రూమ్ కి వెళ్ళాలంటే వాకిట్లో మనిషి ఆపేస్తుంది .. డబ్బులకోసం.  చిల్లర చేతిలో లేకపోతే అవసరాలు కూడా బంద్.

రాత్రి 7-50 కి మిచిగాన్ లోని లేన్సింగ్ లో బయల్దేరినవాళ్ళం  మధ్యలో ఆగుతూ ఆర్లింగ్టన్ హైట్స్ లోని మావాళ్ళ ఇల్లు చేరేసరికి 12-30 అయింది.  మిచిగాన్ కన్నా ఇక్కడ టైము ఒక గంట వెనక వుంటుంది..అంటే 11-30 అయింది.  రాత్రయిందికదా ఆ రోజుకి రెస్టు.

మర్నాడు చికాగోలోని డౌన్ టౌన్ కి వెళ్దామనుకున్నాము.  డౌన్ టౌన్ లు వ్యాపార కూడలులు.  అందుకే విపరీతమైన జనసందోహాలతో నిండి వుంటాయి.  అందులోనూ చికాగోలాంటి పెద్ద పట్టణాలలో ఇంక చెప్పాలా??  అక్కడివారు సాధారణంగా డౌన్ టౌన్ కి స్వంత వాహనాలుకాక వేరే వాహనాలలో వెళ్తారు! పార్కింగ్ ఇబ్బందులు తప్పించుకోవటానికి.  మేమూ రెండు కార్లల్లో ఆర్లింగ్టన్ పార్కు స్టేషన్ దాకా వెళ్ళి, కార్లు అక్కడ పార్కుచేసి అక్కడనుండి రైల్లో చికాగో డౌన్ టౌన్ కి వెళ్ళాం.

ఇక్కడ ఆ రైలు గురించి కొంచెం....రైలు డబుల్ డెక్కర్.  ట్రైన్ లో సీట్ బేక్ తేలికగా జరపవచ్చు.  దానితో ఒకళ్ళ వెనక ఒకళ్ళ కూర్చునే సీట్లు ఎదురెదురుగా కూర్చోవటానికి వీలుగా వస్తాయి.  చెప్పానుగా..మొదటిసారి చూస్తున్నా కనుక అన్నీ వింతలే.  రైలు ప్రయాణం గంటసేపు.  పక్కల్న కనిపించే పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తూ సమయం తెలియలేదు.

చికాగో డౌన్ టౌన్లో సియర్స్ బిల్డింగ్ అన్నింటికన్నా ఎత్తయిన బిల్డింగ్.  దాని తర్వాత హేన్కాక్.  వీటిలో లిఫ్ట్ లో 90వ అంతస్తు తర్వాత అంతస్తులకెళ్తే అక్కడనుంచి చుట్టుపక్కల ప్రదేశాలు చూడవచ్చు.  నాకు 90వ అంతస్తుదాకా వెళ్ళాలంటే భయమనిపించినా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని, మేము నలుగురం వెళ్దామని క్యూ దగ్గరకు వెళ్తే అక్కడవున్న లేడీ మా వంతు వచ్చేసరికి అర్ధగంట పైన పడుతుంది అని చెప్పింది.  దానితో మిగతా ప్రదేశాలు చూడటానికి సమయం సరిపోదని అక్కడ ఆగకుండా బయల్దేరాము.  డౌన్ టౌన్ లో బస్సులలాంటి ట్రాలీలు వుంటాయి.  అవ్వి వెళ్ళే ప్రదేశాలకి ఏ రుసుమూ చెల్లించకుండా ఫ్రీగా వెళ్ళవచ్చు.  ఏమిటోనండీ..నా బుధ్ధి పోదు.  ప్రతిదానికీ మన ఇండియాలో కూడా ఇలా వుంటే అనిపిస్తూనే వుంటుంది.  ఆ ట్రాలీలో హేన్కాక్ కి వెళ్ళాము.  అక్కడ హర్షీస్ చాకొలెట్ స్టోర్ చూశాము.  ఆ దేశంలో బయటకి వస్తే చాకొలెట్స్, ఐస్ క్రీంలు, సబ్ లు, పిజ్జాలు మామూలనుకోండి.  ఇంకో సంగతి తెలుసా?  వీటన్నింటి సైజులు మనవాటికన్నా చాలా పెద్దగా వుంటాయి!  ఎవరి చేతుల్లో చూసినా మన మంచినీళ్ళ లోటాలకన్నా పెద్ద గ్లాసులుంటాయి, కాఫీతోగానీ, జ్యూస్ లతోగానీ!! మేము అంతంత గ్లాసులు తాగలేక, వాటిని మోసుకు తిరగలేక,  చిన్నది తీసుకుని ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. 

హేన్కాక్ నుంచి బస్ లో నేవీ పియర్ కి వెళ్ళాము.

నేవీ పియర్

1916లో వస్తువులు, ప్రయాణీకుల రవాణాకోసం నిర్మించబడిన మునిసిపల్ పియర్ ఈ ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.  మొదటి ప్రపంచ యుధ్దం సమయంలో నేవీ స్ధావరంగా వుపయోగపడినందున, ఆ ప్రపంచ యుధ్ధంలో పాల్గొన్నవారి గౌరవార్ధం తర్వాత దాని పేరు నేవీ పియర్ గా మార్చారు.  రోడ్డు, రైలు రవాణా పెరిగిన తర్వాత ఓడ ప్రయాణాలు తగ్గినా,  వస్తువులు నిలవ చేసే గోడౌన్లుగా, నేవీ ట్రైనింగ్ సెంటర్ గా, యుధ్ధ సమయంలో నేవీ, ఆర్మీ స్ధావరాలుగా, యూనివర్సిటీగా, అనేక విధాల ఉపయోగపడిన ఈ స్ధలం ప్రస్తుతం చికాగోలోని ప్రముఖ టూరిస్టు ప్లేస్.  అక్కడ వుండేవారేగాక, టూరిస్టులు కూడా అధిక సంఖ్యలో దీనిని దర్శిస్తారు.  అందరూ ఆహ్లాదంగా గడపటానికి ఇక్కడ మ్యూజియంలు, ఫుడ్ కోర్టులు,  బాణా సంచా కాల్చటాలు,వగైరా అనేక ఆకర్షణలున్నాయి.  అనేక ప్రదర్శనలు కూడా ఇక్కడ జరుగుతాయి.

లేక్ మిచిగాన్ ఒడ్డున వున్న నేవీ పియర్ లో షిప్పింగ్ సెంటర్, ఎగ్జిబిషన్స్, ఫుడ్ కోర్టులు వగైరాలు, వాట్లల్లో మనుషులు, చాలా సందడిగా, హడావిడిగా వున్నది.  నేను చెప్పిన ప్రదేశాలన్నీ డౌన్ టౌన్ లోకే వస్తాయి.  ఇవన్నీ మొదటిసారి చూసేవాళ్ళకి మనం వేరే ప్రపంచంలో ఎక్కడో విహరిస్తున్నట్లుంటుంది.

ఇక్కడ వున్న స్మిత్ మ్యూజియమ్ ఆఫ్ స్టైన్డ్ గ్లాసెస్ లో 150 పైగా డిజైన్లు  ప్రదర్శించబడుతున్నాయి. అద్దాలమీద వేసిన పైంటింగ్స్ చాలా బాగున్నాయి.  అలాగే ఒక షాప్ లో వున్న అద్దాలలో చూసుకుంటే మన ఆకారాలు వివిధ ఆకారాలలో కనబడతాయి.

ఇంక అక్కడవున్న సరస్సులో నిర్మలమైన నీళ్ళు.  (ఇలాంటి సమయాల్లో కొన్ని బాధాకరమైన విషయాలు .. కనీసం మీతోనన్నా పంచుకోనియ్యండి..కొంచెం మనశ్శాంతి వస్తుందేమో.  ఆ మధ్య ఎప్పుడో మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో నర్మదా నది చూసి ముచ్చట పడిపోయా.  జీవితంలో ఒక్కసారన్నా అక్కడ స్నానం చెయ్యాలని ఉవ్విళ్ళూరాను.  అప్పుడు కుదరలేదు.  మొన్నీ మధ్య అక్కడికి వెళ్ళే ఛాన్స్ వస్తే మిస్ కాకుండా వెళ్ళటమేగాక,  నాతో వచ్చిన వాళ్ళకి కూడా నర్మదానదిలో స్నానం చేద్దామని చెప్పి ఆశపెట్టా.  తీరా అక్కడికెళ్తే అంతకుముందు శుభ్రత పోయింది,  నదిలో ఉమ్ములేసేవాళ్ళు, నానారకాల మలినాలు చేసేవాళ్ళు ఎక్కువై, నా కోరిక తీర్చుకోకుండానే వచ్చాను.  నిజం చెప్పాలంటే ఆ నీళ్ళు నదీ జలాలని నెత్తిన కూడా జల్లుకోబుధ్ధి కాలేదు.)

నేవీ పియర్ లో వున్న సరస్సులో వాటర్ టాక్సీలు, చిన్న షిప్ లాంటి పెద్ద బోట్లు వున్నాయి.  ఆ చిన్న షిప్ లో కొన్ని టూర్లున్నాయి.  ఒక షిప్ వాళ్ళు ఆర్కిటెక్చర్ టూర్ తీసుకెళ్తున్నారు.  మనిషికి 60 డాలర్లు టికెట్.  మేము నేవీ పియర్ లో వాటర్ టాక్సీ ఎక్కి మిచిగన్ ఎవెన్యూలో దిగి అక్కడనుండి స్టేషన్ దాకా నడిచి అక్కడనుంచీ రాత్రి 8-30 రైల్లో బయల్దేరి 10 గంటలకి ఇంటికి చేరాము.  వాటర్ టాక్సీలో వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఫౌంటెన్ నుంచి వచ్చే నీళ్ళతో ఏర్పడ్డ ఇంద్ర ధనుస్సుల అందాలు, అటూ ఇటూ పెద్ద బిల్డింగుల మధ్యన నీళ్ళల్లో ప్రయాణం మరచిపోలేని అనుభూతులు.

మరిన్ని శీర్షికలు
weekly horoscope20th november to 26th november