Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ఈసారి  పారితోషికం పెంచేద్దామ‌నుకొంటున్నా!  - రాజ్ త‌రుణ్‌ 

చేసిన‌వి రెండు సినిమాలు. రెండూ హిట్టే. 
న‌టుడిగా కుర్రాడికి ఫుల్లుగా మార్కులు ప‌డిపోయాయి.
ప‌క్కింటి అబ్బాయి అన్న ట్యాగ్‌లైన్ ప‌డిపోయింది.
రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఇబ్బంది పెట్ట‌డు అన్న పేరొచ్చింది.
సొంతంగా క్రియేటివిటీ ఉన్న ఐడియాలిస్తాడ‌న్న గుర్తింపొచ్చింది.

ఇంకేం కావాలండీ.. హీరోగా నిల‌బ‌డిపోవ‌డానికి. అందుకే ఇప్పుడు అత‌ని చేతిలో అర‌డజ‌ను సినిమాలున్నాయి. అందులో ఒక్క హిట్టు ప‌డినా... కోటి హీరోగా ఎదిగిపోవ‌డం ఖాయం. అత‌నే.. రాజ్ త‌రుణ్‌. ఉయ్యాల జంపాల ఆట‌లాడి... మావ‌కు సినిమా చూపించిన టాలెంట్ - రాజ్ త‌రుణ్‌ది. ఇప్పుడు కుమారి 21 F తో హ్యాట్రిక్ కొట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా రాజ్‌త‌రుణ్‌తో గో తెలుగు చేసిన చిట్ చాట్ ఇది.


* హాయ్ రాజ్‌..
- హాయండీ..

* చేసిన రెండు సినిమాలూ హిట్టు.. మ‌రి హ్యాట్రిక్ కొట్టేస్తారా?
- కొట్టాల‌నే ఉందండీ. చేతిలో ఎన్ని విజ‌యాలున్నా.. చేయ‌బోతున్న సినిమా కూడా హిట్ట‌వ్వాల‌నుకొంటారెవ‌రైనా. నేనూ అంతే. హ్యాట్రిక్‌...అనే స‌రికి ఇంకొంచెం టెన్ష‌న్ ఉంటుంది.

* రెండు హిట్స్ ప‌డేస‌రికి బాధ్య‌త పెరిగింది క‌దా. మ‌రి కుమారితో జాగ్ర‌త్త ప‌డ్డారా?
- నేను తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కూడా సుకుమార్‌గారే తీసేసుకొన్నారండీ. నేను సెట్‌కి వెళ్లి బుద్దిగా ద‌ర్శ‌కుడు చెప్పింది చేశానంతే. క‌థ‌ని న‌మ్మి.. పెద్ద పెద్ద టెక్నీష‌న్లు క‌ల‌సి ఈ సినిమాలో ప‌నిచేశారు. ఒక ర‌కంగా అది నా వ‌రం.

* కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఊహించారా?
- లేదండీ. చాలామంది ఇది చిన్న సినిమా అనుకొంటున్నారేమో. పెద్ద‌వాళ్లంతా క‌ల‌సి చేస్తున్న చిన్న సినిమా అని నా ఫీలింగ్‌. సుకుమార్ గారు తీసిన ఆర్య సినిమా కోసం క్యూలో నిల‌బ‌డి టికెట్లు కొనుక్కొన్న రోజులు నాకింకా గుర్తున్నాయి. ఆయ‌న రాసిన క‌థ‌లో... నేను న‌టించ‌డం ఓ క‌ల‌లా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ గారి పాట‌ల‌కు నేను డాన్స్ చేస్తాన‌ని, ర‌త్న‌వేలుగారి కెమెరా ముందు నిల‌బ‌డ‌తాన‌ని నేనెప్పుడూ అనుకోలేదు. ఎన్ని సినిమాలు చేసినా.. కుమారిని ఎప్ప‌టికీ మ‌ర్చిపోను. నా కెరీర్‌లోనే ఇది స‌మ్‌థింగ్ స్పెష‌ల్ మూవీ.

* ఉయ్యాల జంపాల‌, సినిమా చూపిస్త మావ‌.. ఈ సినిమాల్లో మీ క్యారెక్ట‌ర్ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది. కుమారి కోసం మాత్రం అండ‌ర్ ప్లే చేసిన‌ట్టు క‌నిపిస్తోంది?
- ఉయ్యాల జంపాల‌లో నేనేం మ‌రీ అంత ఎన‌ర్జ‌టిక్‌గా క‌నిపించ‌నండీ. సినిమా చూపిస్త మావ‌లో మాత్రం... మీర‌న్న‌ట్టు ఎన‌ర్జీ లెవిల్స్ చూపించాల్సి ఉంటుంది. ప్ర‌తీ సినిమాకీ ఒకేలా కనిపిస్తే బాగోద‌ని నా ఫీలింగ్. 

* ఈ సినిమాలో హీరోయిన్ మిమ్మ‌ల్ని డామినేట్ చేసింద‌నుకోవ‌చ్చా?
- ఎవ‌రూ ఎవ‌ర్నీ డామినేట్ చేయ‌లేదు. క‌థ‌ని బ‌ట్టే మా పాత్ర‌లుంటాయి. హీరోయిన్ గురించిన క‌థే అయినా.. సినిమా మాత్రం హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సాగుతుంది.

* ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయ‌ని, అందుకే ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారన్న ప్ర‌చారం సాగుతోంది?
- యూత్‌కి న‌చ్చే సినిమా ఇది. అలాగ‌ని పెద్ద‌వాళ్లు ఇబ్బందిప‌డే సన్నివేశాలేం ఉండ‌వు. కొన్ని కొన్ని డైలాగుల‌కు బీప్ వేశారంతే. విజువ‌ల్ క‌ట్స్ ఒక్క‌టీ లేదు.

* రెండు హిట్ల‌తో పారితోషికం పెంచేశార‌ట‌..
- (న‌వ్వుతూ) నిజంగా పారితోషికం పెంచే అవ‌కాశం నాకు రాలేదండీ. ఎందుకంటే చేతిలో ఉన్న సినిమాలు.. ఈ సినిమాతో స‌హా.. రెండేళ్ల క్రిత‌మే ఒప్పుకొన్న‌వి. ఈసారి మాత్రం.. పారితోషికం ఎక్కువే అడ‌గాల‌ని ఉంది.

* అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మీ కెరీర్ మొద‌లైంది.. మ‌రి ద‌ర్శ‌క‌త్వం ఎప్పుడు?
- క‌చ్చితంగా ఏదో ఓ రోజు మెగా ఫోన్‌ప‌డ‌తా. అయితే దానికి ఇంకా టైం ఉంది.

* మ‌రి స్ర్కిప్టులు రాసుకొంటున్నారా?
- ఖాళీగా ఉన్న‌ప్పుడు రాస్తుంటా. నాకు అల్లు అర్జున్‌, సునీల్ భ‌య్యా అంటే చాలా ఇష్టం. ఏ క‌థ  రాసినా వీళ్లిద్ద‌రినీ దృష్టి లో పెట్టుకొని రాస్తుంటా. మొన్నామ‌ధ్య సునీల్ భ‌య్యాని క‌లిశా. అప్పుడు.. 'నా కోసం ఓ క‌థ రాయొచ్చుగా' అన్నారు.  ఆయ‌న కోసం స‌ర‌దాగా ఓ క‌థ కూడా రాశా.

* ఈమ‌ధ్య మిమ్మ‌ల్ని క‌దిలించిన సినిమా ఏది?
- రాక్ స్టార్ బాగా క‌దిలించింది. ర‌ణ‌బీర్ క‌పూర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆ సినిమా మ‌రింత న‌చ్చింది. రెండ్రోజుల పాట ఆ ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయా.

* అలాంటి క‌థ రాయాల‌ని అనిపించిందా?
- లేదండీ. అలా అనుకొంటే.. మ‌న‌సంతా ఆ సినిమా చుట్టూనే తిరుగుతుంది. మ‌ళ్లీ ఆ క‌థే రాస్తాం. అలా ఉండ‌కూడ‌దు. కొత్త‌గా ఆలోచించాలి.

* ఫ‌లానా త‌ర‌హా సినిమా చేయాల‌న్న ఆలోచ‌న‌లేమైనా ఉన్నాయా?
- రోడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ జోన‌ర్‌లో సినిమాలు చేయాల‌ని ఉంది. అయితే.. కంప్లీట్ ఫ‌న్ ఉండాలి. అది లేక‌పోతే.. నేను సినిమా చేయ‌లేను.

* ట్విట్ట‌ర్లో  వ‌ర్మ‌తో ఏంటి  గొడ‌వ‌?
- భ‌లేవారే. ఆయ‌నంటే నాకు చాలా గౌర‌వమండీ బాబూ. తెలుగు సినిమాని కొత్త‌గా ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడాయ‌న‌. చ‌నువుకొద్దీ నాసెల్ తీసుకొని, నా ఎకౌంట్‌లోంచి ఆయ‌నే ట్వీట్లు చేసుకొన్నారు.

* మీరిద్ద‌రూ క‌ల‌సి సినిమా చేస్తార‌ట‌..
- ఆయ‌న చేద్దామ‌న్నారు. నాకూ ఆస‌క్తిగానే ఉంది. అయితే క‌థ ఇంకా రెడీ కాలేదు.

* ఓకే... ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ కుమారి...
- థ్యాంక్యూ..

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
manchu manoj  trilling love story