Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: పిచ్చిపట్టిన వాడిలా తేజా అరుస్తూ బైక్‌ స్డాండ్‌ వేసి కారు దగ్గరికి వెళ్లి విండోలోకి తొంగి చూస్తూ` ‘‘మీరు ప్రతిమ కదూ’’ అని గట్టిగా అడుగుతాడు.  ఊహించని రీతిలో తేజా వచ్చి ఆరా తీసేసరికి ఆమె గాభరా పడుతుంది. అంతలోనే తేరుకుని చెవిలో ఉన్న సెల్‌ఫోన్‌ని కాస్త పక్కకు తీసి అతడి వంక చూస్తూ అడుగుతుంది. హూ ఆర్‌ యూ? అని. ఆ తరువాత...  

 

ఆమె గురించి పూర్తి వివరాలు సేకరించాను. ఆ తర్వాతే నీవు సేకరించిన సమాచారంతో బేరీజు వేసుకుందామని ఇలా వచ్చాను. నా అంచనా తప్పు కాకుంటే ...జెస్సికాపై ఫణి భూషణరావు ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చు’’

‘‘ఔను, నిజమే! దాడి చేయొచ్చు. ఎందుకంటే నువ్వు రావడానికి పది నిముషాల ముందే జెస్సికా రెసిడెన్స్‌ అడ్రస్‌తో సహా రహస్యంగా సేకరించిన అన్ని వివరాలు ఆనందరావుకి అందించాను. కేవలం నేను క్లయింట్‌కి సమాచారం అందిస్తున్నానని, అది అసైన్‌మెంట్‌ గానే భావించాను తప్ప... మరీ ఇంత లోతుగా ఆలోచించలేదు’’ అన్నాడు సిద్దార్థ.

‘‘అందుకే,  డిటెక్టివ్‌ల కన్నా మీడియా పర్సన్స్‌ మిన్న. ఎందుకంటే... వారు ఏ సమాచారం సేకరించినా మానవతా కోణం నుంచి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే... జనంతో షేర్‌ చేసుకోబోతున్న ఇన్‌ఫర్మేషన్‌  కదా! ఏ ఒక్కరి సెంటిమెంట్‌ హర్ట్ అవకూడదనే ఉద్దేశంతోనే ఆ విధంగా పని చేస్తుంటారు. ఒక్కోసారి నా దగ్గరికి వచ్చిన కొన్ని కేసుల్ని టెలికాస్ట్‌ కూడా చేయకుండా ప్రయివేట్‌ గా సెటిల్‌ చేసిన సందర్భాలు కోకొల్లలు. అద్సరే! వెంటనే మనం జెస్సికాను కాపాడాలి. హర్రియప్‌’’ తొందర పెట్టసాగాడు తేజ.

‘‘ఎస్‌... జెస్సికాను కాపాడాలి. అంతకు ముందుగా ఎందుకైనా మంచిది పోలీసులకు కూడా ఓ ఇన్‌ఫర్మేషన్‌ ఇద్దాం...’’ అంటూ సెల్‌ఫోన్‌ చేతుల్లోకి తీసుకున్నాడు సిద్దార్థ.

‘‘హలో... పోలీస్‌ కమిషనరేట్‌...’’

పది నిముషాల తర్వాత సిద్దార్థ కారు జూబ్లీహిల్స్‌ వైపు స్పీడుగా దూసుకు పోతోంది. జెస్సికా గురించిన వివరాలు తనెలా సేకరించింది సిద్దార్థ కళ్లకు కట్టినట్లు వివరిస్తుంటే తేజ మౌనంగా వింటున్నాడు. తను చీకట్లో వేసిన బాణం గురి తప్పలేదన్న సంతోషం అతడి ముఖంలో తాండవిస్తోంది. నిజానికి, జెస్సికా గురించి తనకే మాత్రం తెలీదు. కేవలం కారు నంబర్‌ తప్ప. కానీ, సర్వం తెలుసునన్నట్లు సిద్దార్థ దగ్గర ఫోజిచ్చి.. ఆమె ప్రాణాలకు ఫణి భూషణరావు వల్ల ముప్పు ఉందంటూ అడ్డంగా అబద్దం ఆడేసాడు. దాంతో, ఇన్విస్టిగేషన్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఇవ్వనంటూ మొరాయించిన సిద్దార్థ దారిలోకి వచ్చాడు. నిజానికి, ఫణిభూషణరావుకీ జెస్సికాకి మధ్య ఉన్న రిలేషనేంటో తనకస్సలు తెలీదు. ఏ కారణంగా రహస్యంగా ఆమె గురించి ఆరా తీయాలనుకుంటున్నాడో కూడా తెలీదు. అసలు ఆమె ప్రతిమ పోలికల్లో ఎలా ఉందో కూడా అంచనాకి అందని విషయం. అయితే, ఎన్నో కథలల్లిన అనుభవంతో తనకు తోచింది మాట్లాడేసాడు... నవ్వుకుంటున్నాడు తేజ 

‘‘ఇంతకీ... ఫణిభూషణరావుకి జెస్సికా ఏమవుతుంది?’’

‘‘ఇంకా అర్ధం కాలేదా? ఫణి భూషణరావు మరో కూతురు జెస్సికా. ఈ మధ్యనే ఆమె ఎబ్రాడ్‌ నుంచి ఇండియాకి వచ్చింది. అదీ ఫణిభూషణరావుతో ఢీ కొట్టడానికే సుమా!’’ అన్నాడు తేజ. సిటీలో జెస్సికా అడ్రస్‌ కోసం మాత్రమే తను పరిశోధనను పరిమితం చేసాడు. అంతే తప్ప... ఫణి భూషణరావుకీ జెస్సికాకి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసుకునే దిశగా ప్రయత్నం చేయలేదు. కారణం... క్లయింట్‌కి కావాల్సింది ఆమె చిరునామా మాత్రమే. ఆమెని ఎక్కడుందో కనిపెట్టమనే క్లయింట్‌ కోరాడు  తప్ప... అంతకు మించిన వివరాలు కావాలనలేదు. అందువల్లే... ఫణి భూషణరావు వల్ల జెస్సికాకు ముప్పు ఉందనే విషయాన్ని విస్మరించాడు. కానీ, తేజా మాత్రం కూలంకుషంగా పరిశోధించాడు. అన్ని వివరాలు సేకరించాడు. వారిద్దరి మధ్య తండ్రీ కూతుళ్ల సంబంధం ఉందన్న విషయాన్ని గట్టిగానే చెప్తున్నాడు.

‘‘హాట్సాఫ్‌ తేజా. పరిశోధన ముగిసిన తర్వాత రిపోర్ట్‌ చేసే రిపోర్టరే అని అతడి గురించి ఇంతకాలం అనుకున్నాడు. అవసరమైతే పరిశోధన లోనూ రిపోర్టర్లు కీలకం కాగలరని ప్రూవ్‌ చేసాడు’’ మనస్ఫూర్తిగా అనుకున్నాడు సిద్దార్థ.

‘‘అంత పెద్దమనిషి ఫణిభూషణరావును ఢీ కొట్టడానికి ఇండియాకి వచ్చిందా?’’ అడిగాడు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆకాంక్షతో.

‘‘ఔను... ఇందాక చెప్పినట్లు జెస్సికా ఫణిభూషణరావు మరో కూతురు. వ్యాపార లావాదేవీల కారణంగా ఆయన గారు తరచూ ఎబ్రాడ్‌ వెళ్తుంటాడు కదా! అలాంటి సందర్భాల్లో పాతిక సంవత్సరాల క్రితం మంచు కురిసిన వేళలో ఓ రాత్రి అక్కడి ఎన్‌ ఆర్‌ ఐ మహిళతో కమిటయ్యాడు. ఆ తర్వాత తర్వాత... ఆమెతో సంబంధం కొంతకాలం వరకూ కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆమె జెస్సికాకు జన్మనిచ్చిందో... అప్పట్నుంచీ ఆమెను దూరంగా పెడుతూవచ్చాడు.  ఇంత కాలానికి జెస్సికా తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చింది. తనకు జన్మనిచ్చిన తండ్రినని సమాజం ముందు అంగీకరించమంటూ జెస్సికా ఒత్తిడి చేస్తోంది.  ఫణిభూషణరావు ఆ ఒత్తిడికి లొంగడం లేదు... అందుకే, ఆమెను ఈ లోకం నుంచే తప్పించాలని కుట్ర పన్నాడు. అందులో భాగంగానే ఆమె అడ్రస్‌ కోసం నిన్ను ఆశ్రయించాడు’’ చెప్పాడు తేజ. తను కల్పిస్తూ చెప్తున్న కథయినా లాజిక్‌ మిస్సవకుండా చెప్తున్నాడతడు.

‘‘అద్సరే... ఫణిభూషణరావుపై ఒత్తిడి తేవడానికి జెస్సికా ఆయన్ని కలిసే ఉంటుంది కదా! అలాంటప్పుడు ఆమెని దూరం నుంచే చూసానని మనకెలా చెప్పాడు?’’  సిద్దార్థ అడిగాడు.

‘‘ఔను కదూ! ఆ డౌట్‌ ఇంకా నీకెందుకు రాలేదా? అని ఆశ్చర్యపడుతున్నాను. మొదట్లో సిటీకి రాగానే ఓసారి గెస్ట్‌హౌస్‌లో ఫణిభూషణరావుని కలిసింది. తనిక్కడికెందుకు వచ్చింది... ఎక్కడ బస చేసిందో చెప్తూ తన డిమాండ్‌ని అతడి ముందు పెట్టింది. ఎక్కడో ఎబ్రాడ్‌లో ఎవరికీ తెలీకుండా సాగించిన రహస్య ప్రేమాయణం ఈమె రాకతో ఇక్కడ ఇండియాలో బట్టబయలవుతోందని తెలిసి పరువు కోసం ప్రాకులాడే ఫణిభూషణరావు కస్సుమన్నాడు. కాదు పొమ్మన్నాడు. అయితే, తను అనాథ కాదని, తనకూ ఓ తండ్రి ఉన్నాడని... అలా చెప్తే సరిపోతుందని ఆమె అభ్యర్ధించింది. ఆస్తికి వారసురాలిగా తాను రాలేదని, కేవలం ఓ తండ్రికి కూతురుగా తాను వచ్చానని వివరించింది. అయినా, ఫణిభూషణరావు మనసు కరగలేదు. ఆ తర్వాత ఆమె తనున్న బసకి వచ్చేసింది. ఓ రాత్రి వేళ అక్కడే ఆమెపై దాడి జరిగింది. చుట్టుపక్కల వాళ్లు సకాలంలో స్పందించ బట్టీ ఆమె బతికి బట్టకట్టింది. ఇండియాలో తనకెవరూ శత్రువులు లేరు... మిత్రులు లేరు. అందువల్ల తనపై జరిగిన దాడికి కారకులెవరో ఆమెకు బాగా తెలుసు. వెంటనే, వ్యూహం మార్చి తన బస కూడా మార్చి ఫణిభూషణరావుని నయానభయాన ఒప్పించేందుకు కూడా ప్రయత్నిస్తోంది. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆమె డిఎన్‌ఎ పరీక్షలకు కూడా సన్నద్ధమవుతోందని తెలిసింది. అందువల్లే ... ఆమెపై పగపెంచుకున్న ఫణిభూషణరావు ఆమెని ఈ లోకంలోనే లేకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు’’ చెప్పాడు తేజ.

‘‘అన్నీ బాగానే ఉన్నాయి. కానీ,  జెస్సికాకు ప్రతిమ పోలికలెందుకు వచ్చాయో?’’

‘‘అదే సృష్టి రహస్యం. ఎన్నో అద్భుతాలు చేసే సృష్టి ఈ వై చిత్రాన్ని కూడా సృష్టించింది. ఓ రకంగా చూస్తే జెస్సికా ప్రతిమ పోలికల్లో ఉండడమే ఆమెకు ప్లస్‌ పాయింట్‌.  ఎందుకంటే, ప్రతిమ ఫణిభూషణరావు కూతురన్న సంగతి యావత్‌ సమాజానికీ తెలుసు. బలమైన సాక్ష్యాల కోసం ఆమె డీఎన్‌ఏ పరీక్షలంటూ హడావుడి చేస్తోంది. అలాగే, ఫణిభూషణరావును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలనే ఉద్ధేశ్యం తోనే ఈ వ్యూహం పన్నింది. అయితే, ప్రతిమ పోలికల్తో ఉన్న జెస్సికా కూడా ఫణిభూషణరావు కూతురంటే వాళ్ల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఇట్టే నమ్మేస్తారు. ఇక, కోర్టు కూడా నమ్మి తీరుతుంది. అందుకే,  కోర్టు మెట్లెక్కక ముందే ఆమెని పాడెక్కించాలని చూస్తున్నాడు ఫణిభూషణరావు’’ చెప్పాడు తేజ.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam