Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
పుకార్లొస్తే నేనేం చేయ‌లేను..! - అనుష్క‌
 
అనుష్క అంటే ఓ బ్రాండ్‌!
క‌త్తి ప‌ట్టాలంటే ఆమే..
యుద్ధం చేయాలంటే ఆమే..
ముద్దులొలకాల‌న్నా, బొద్దావ‌తారంలా మారాల‌న్నా.. అనుష్క‌నే చేయాలి.
త‌న పేరుతో కోట్ల రూపాయ‌ల వ్యాపారం జ‌రుగుతోందిప్పుడు. తెలుగులో తనే టాప్‌. త‌మిళంలోనూ ఇంచుమించు అదే ప్లేసు! అయినా స‌రే, ఇంకా ఒదిగే ఉంటుంది. అదే అనుష్క స్పెషాలిటీ..!  ఇప్పుడు సైజ్ జీరో అంటూ మ‌రో కొత్త పాత్ర‌లోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్భంగా అనుష్క‌తో ముచ్చ‌టించింది గోతెలుగు.  సైజ్ జీరో ముచ్చ‌ట్లు, త‌న కెరీర్ సంగ‌తులు, పెళ్లి క‌బుర్లూ... ఇలా చెప్పుకొచ్చింది అనుష్క.
 
 
* సైజ్ జీరోతో అనుష్క బాగా రిస్క్ చేసిందేమో అనుకొంటున్నారు జ‌నాలంతా..?
- అవునా..? (న‌వ్వుతూ) నాకు మాత్రం భ‌లేంటి సినిమా చేశాన‌నిపిస్తోంది. అయినా ఎందుకొచ్చిందా అనుమానం..?

* మ‌రీ లావుగా మారిపోతేనూ.. అమ్మాయిల‌కు బ‌రువు పెర‌గ‌డం ఇష్టం ఉండ‌దు క‌దా?
- (న‌వ్వుతూ) ప్ర‌తీ సినిమాలోనూ ఒకేలా క‌నిపిస్తే బోర్ కొట్టేస్తానండీ బాబూ. ఇలాంటి అవ‌కాశం ఎప్పుడో గానీ రాదు. అయినా లావు అనేది అమ్మాయిల మాన‌సిక స‌మ‌స్య‌. చాలామంది దీన్నీ సీరియ‌స్ ప్లాబ్ల‌మ్‌గా చూస్తున్నారు. వాళ్లంద‌రికీ సంబంధించిన క‌థ ఇది.

* డెరెక్ట‌ర్ వ‌చ్చి - ఈ సినిమా కోసం మీరు బ‌రువు పెర‌గాలండీ అన్న‌ప్పుడు మీ ఫ‌స్ట్ ఫీలింగ్ ఏమిటి?
- క‌థ చెప్ప‌కుండా ఆ మాట అంటే నేను చచ్చినా ఒప్పుకొనేదాన్ని కాదు. క‌థ చెప్పాక  ఈ సినిమా కోసం బ‌రువు పెరిగితే బాగుంటుంద‌ని నాకే అనిపించింది. ఆర్టిఫిషియ‌ల్‌గా న‌న్ను బొద్దుగా చూపిస్తే జ‌నాలు క‌నెక్ట్ కారు. వాళ్లు చాలా తెలివైన వాళ్లు చిన్న చిన్న త‌ప్పుల్ని ఇట్టే ప‌ట్టేస్తారు. ఓ మంచి ప్ర‌య‌త్నం చేయాల‌నిపించినప్పుడు ఇలాంటి త్యాగాలు చేయ‌క త‌ప్ప‌దు.

* స‌డ‌న్‌గా బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం ఇబ్బందిగా అనిపించ‌డం లేదా?
- నిజంగానే చాలా ఇబ్బంది. ఆరోగ్య‌ప‌రంగానూ ఒకేసారి బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం రెండూ మంచిది కాదు. అందుకే డాక్ట‌ర్ల స‌ల‌హాలు పాటిస్తున్నా. బ‌రువు పెర‌గ‌డం ఈజీగానే అయ్యింది. ఇక త‌గ్గ‌డం మాత్రం మెల్లిమెల్లిగా త‌గ్గుతున్నా. ఈ సినిమా కోసం దాదాపుగా 18 కిలోలు పెరిగా. ఇప్పుడు ప‌దికిలోలు త‌గ్గా. మ‌రో నెల రోజుల్లో పాత అనుష్క‌ని చూస్తారు.

* జీరో సైజ్ మోజుపై వ్య‌క్తిగ‌తంగా మీ అభిప్రాయం ఏమిటి?
- నాకు ఈ సైజ్‌ల గోల ఏమాత్రం న‌చ్చ‌దండీ. లావుగా ఉన్నామా, స‌న్నంగా ఉన్నామా అన్న‌ది ప్ర‌ధానం కాదు. ఎంత ఆరోగ్యంగా ఉండ‌డ‌మే ముఖ్యం. ఆ విష‌యాన్ని అమ్మాయిలంతా గుర్తుపెట్టుకోవాలి.

* మీకెప్పుడైనా ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయా?
- చాలా. కొంత‌కాలం యోగా టీచ‌ర్‌గా ప‌నిచేయ‌డం వ‌ల్ల ఇవ‌న్నీ నా అనుభ‌వంలోకి వ‌చ్చాయి. కొంత‌మంది స్టూడెంట్స్ కేవ‌లం లావు త‌గ్గ‌డానికే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవారు. 'ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారండీ.. అర్జెంటుగా స్లిమ్మ‌యిపోవాలి' అంటుండేవారు. వాళ్లంద‌రికీ నేను కౌన్సిలింగ్ కూడా ఇచ్చేదాన్ని. 

* లేడీ ఓరియెంటెడ్ అంటే ఆ సినిమాకి సంబంధించిన బ‌రువంతా మీరే మోయాల్సివ‌స్తోంది. ఇబ్బందిగా ఏం అనిపించ‌లేదా?
- న‌న్ను న‌మ్మి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ మంచి మంచి క‌థ‌ల‌తో వ‌స్తుంటే గ‌ర్వంగా అనిపిస్తోంది. దానికి తోడు బాధ్య‌త కూడా పెరుగుతోంది. క‌థ‌కు నేనెంత వ‌ర‌కూ న్యాయం చేస్తున్నాను? ద‌ర్శ‌కుడు అప్ప‌గించిన పాత్ర నాకు సెట్ట‌వుతుందా లేదా? అనుకొన్న‌ట్టు సినిమా వ‌స్తుందా, లేదా అనే విష‌యాన్ని చెక్ చేసుకొంటూ ఉంటా. ఈ విష‌యంలో నాకు ఒక‌ట్రెండు సినిమాల అనుభ‌వ‌మే. సినిమా అంతా భుజాల‌పై వేసుకొని ఏళ్ల‌కు ఏళ్లుగా ప్ర‌యాణం సాగిస్తున్న హీరోలు అంతంత ఒత్తిడి ఎలా ఎదుర్కొంటున్నారా అనిపిస్తోంది.

* నాయికా ప్రాధాన్యం ఉన్న క‌థ‌ల‌కు ఇప్పుడు మీరే కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్నారు.. ఆ ర‌హ‌స్యం ఏమిటి?
- అదేంటే ద‌ర్శ‌కుల్నే అడ‌గాలి. ఓ అరుంధ‌తి, ఓ రుద్ర‌మ‌దేవి, ఓ సైజ్ జీరో వ‌చ్చాయంటే అదంతా ద‌ర్శ‌కుల న‌మ్మ‌క‌మే. నా బాధ్య‌త నిర్వర్తించ‌డానికి నేను నూటికి నూరుశాతం శ్ర‌మిస్తుంటా. అంత‌కు మించిన మ్యాజిక్ నా ద‌గ్గ‌ర కూడా లేదు.

* ఇన్నేళ్ల ప్ర‌యాణం ఏం నేర్పింది?
- క‌ష్ట‌ప‌డ‌డం నేర్పింది. బంధాల్ని ఎంత‌గా కాపాడుకోవాలో నేర్పింది. క‌ష్టాల్ని ఎలా త‌ట్టుకోవాలో నేర్పింది.

* మీపై అప్పుడ‌ప్పుడూ పుకార్లు వ‌స్తుంటాయి క‌దా. వాటిపై ఎలా స్పందిస్తారు?
- పుకార్లు మామూలేనండీ. మ‌నల్ని పొగిడిన వాళ్లు తిట్టాల్సివ‌స్తుంది. మ‌న గురించి గొప్ప‌గా రాసిన‌వాళ్లు ఏదో ఓ గాపిస్ సృష్టించాల్సివ‌స్తుంది. ఇదంతా పార్ట్ అండ్ పార్ళిల్‌. ఓ మంచిని స్వీక‌రించిన‌ప్పుడు చెడునీ ఆహ్వానించాలి. పుకార్ల‌ను నేను కంట్రోల్ చేయ‌లేను క‌దా.

* షూటింగులంటూ నెల‌ల త‌ర‌బ‌డి ఓ టీమ్ తో ప్ర‌యాణం చేస్తుంటారు. ఇంట్లో వాళ్ల‌ని, ఆ వాతావ‌ర‌ణాన్ని మిస్ చేసుకొంటున్నా అన్న బాధ లేదా?
- నా అదృష్ట‌మేంటంటే హైద‌రాబాద్‌లో నాకు ఆత్మీయులు చాలా ఎక్కువ‌. నాగార్జున‌, పీవీపీ, రానా.. వీళ్లంతా న‌న్ను చాలా బాగా చూసుకొంటారు. సెట్లో కుటుంబ వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లోవాళ్లు గుర్తొస్తే ఒక్క ఫోన్ కొడ‌తా అంతే. క్ష‌ణాల్లో వాలిపోతారు.

* పెళ్లి చేసుకోమ‌ని ఇంట్లోవాళ్లు ఒత్తిడి తీసుకురావ‌డం లేదా?
- పెళ్లి చేసుకోవాల‌ని నాకూ ఉంది. జీవితంలో స్థిర‌ప‌డాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నా. కానీ అన్నీ క‌ల‌సి రావాలి క‌దా?  సినిమాల్లోకి రావాల‌ని నేను అనుకోలేదు. ఫ‌లానా సినిమాలు చేయాల‌ని క‌ల క‌న‌లేదు. అవ‌న్నీ అనుకోకుండానే జ‌రిగిపోయాయి. పెళ్లి కూడా అంతే.

* న‌వ‌త‌రం క‌థానాయిక‌ల జోరు పెరుగుతోంది. పోటీ అనిపించ‌డం లేదా?
- ఏమాత్రం లేదు. పోటీ అనుకొని భ‌య‌ప‌డితే.. ఒక్క క్ష‌ణం కూడా ఇక్క‌డ ఉండ‌లేం. ఒకప్పుడు నేనూ కొత్తే క‌దా.?  వారిలో ప్ర‌తిభ ఉంటే.. ప్రోత్స‌హించాలి. 

* ఈమ‌ధ్య వ‌చ్చిన క‌థానాయిక‌ల్లో మీకు న‌చ్చిన నాయిక ఎవ‌రు?
- చాలామంది ఉన్నారు.. ఒక్క పేరే చెప్ప‌మంటే ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు చెబుతా. తాను కెరీర్ మ‌ల‌చుకొంటున్న విధానం నాకు బాగా న‌చ్చింది.

* ఇవ‌న్నీ వ‌దిలేసి మాస్ మ‌సాలా సినిమాలు చేయాల‌ని అనిపించ‌డం లేదా?
- ఎందుకు అనిపించ‌డం లేదూ.?  హాయిగా హీరోల‌తో డ్యూయెట్లు పాడుకోవాల‌నిపిస్తోంది. అలా అనుకొన్న‌ప్పుడ‌ల్లా సైజ్ జీరోలాంటి క‌థ‌లొచ్చి ఊరిస్తున్నాయి. అందుకే త‌ప్ప‌డం లేదు. 

* ఓకే ఆల్ ది బెస్ట్ ఫ‌ర్ సైజ్ జీరో..
- థ్యాంక్సండీ..
మరిన్ని సినిమా కబుర్లు
movie review