Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review
చిత్రం: సైజ్‌ జీరో 
తారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహన్‌, ప్రకాష్‌రాజ్‌, ఊర్వశి, అడివి శేష్‌, గొల్లపూడి మారుతీరావు, అలీ, బ్రహ్మానందం, భరత్‌ తదితరులు 
చాయాగ్రహణం: నిరవ్‌ షా 
సంగీతం: కీరవాణి 
కథ, స్క్రీన్‌ప్లే: కనిక థిల్లాన్‌ 
దర్శకత్వం: ప్రకాష్‌ కోవెలమూడి 
బ్యానర్‌: పివిపి 
నిర్మాత: పొట్లూరి వరప్రసాద్‌ 
విడుదల తేదీ: 27 నవంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
స్వీటీ అలియాస్‌ సౌందర్య (అనుష్క) మరీ బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ. పెళ్ళి చూపుల కోసం ఎవరొచ్చినా, ఆమె బొద్దుతనం చూసి పారిపోతుంటారు. ఇక తనకు పెళ్ళి కాదేమోనని బెంగపెట్టుకుంటుంది స్వీటీ. ఈ క్రమంలోనే తనను పెళ్ళి చూపులు చూసుకునేందుకు వచ్చిన అభి(ఆర్య)ని చూసి ఇష్టపడుతుందిగానీ, అతను తన బొద్దుతనాన్ని అసహ్యించుకుంటాడేమోనని భావించి, అతన్ని కాదనుకుంటుంది. అభి, స్లిమ్‌గా ఉండే సిమ్రాన్‌ (సోనాల్‌ చౌహన్‌)ని ఇష్టపడతాడు. తానే స్లిమ్‌గా మారిపోతే ఎలా ఉంటుంది? అని అనుకుని, సన్నబడ్డానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది స్వీటీ. అక్కడి నుంచి స్వీటీ కష్టాలు తెరపై చూడాల్సిందే. సన్నబడి స్వీటీ, తాను ఇష్టపడ్డవాడ్ని సొంతం చేసుకుందా? తెరపై చూస్తేనే బాగుంటుందిది. 

మొత్తంగా చెప్పాలంటే 
'అరుంధతి' సినిమాలో జేజెమ్మగా అలరించిన అనుష్కకి, ఈ సినిమా కూడా ఎంతో ప్రత్యేకమైనది. నటిగా ఆమె ఎంతో పరిణతి సాధించింది. నటించింది అనడం కన్నా స్వీటీ పాత్రలో జీవించేసిందనడం కరెక్ట్‌. సహజంగా బొద్దుగా కనిపించేందుకోసం అనుష్క పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. లావెక్కిన స్వీటీని తెరపై చూడాలంటే అయ్యోపాపం అనిపించకమానదు. నటనలోనే కాదు, సైజ్‌ సెక్సీ సాంగ్‌లో అనుష్క పెర్ఫామెన్స్‌ సూపర్బ్‌. క్యూట అనుష్క ఇంత ఫ్యాటీనా? అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతవుతుందంటే, ఆమె పడ్డ కష్టం వృధా పోనట్టే. 

అభి పాత్రలో ఆర్య బాగా సూటయ్యాడు. బాగా నటించాడు కూడా. ఇంకాస్త బెటర్‌గా ఆర్య పాత్ర తీర్చిదిద్ది ఉండాల్సింది. సిమ్రాన్‌ పాత్రలో గ్లామర్‌ పండించింది సోనాల్‌ చౌహన్‌. ఆమె గ్లామర్‌ సినిమాకి అడిషనల్‌ ఎట్రాక్షన్‌ అనడం నిస్సందేహం. ప్రకాష్‌ రాజ్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. సహజంగానే చేసుకుపోయాడు. తల్లి పాత్రలో ఊర్వశి బాగా నటించింది. అడివి శేష్‌ బాగా చేశాడు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, అలీ కామెడీ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపిస్తారు. 

లావెక్కడం ద్వారా వచ్చే కష్టాలు చాలామందికి అనుభవమే. అందుకే తెరపై అనుష్కను చూసి తమను తాము సరిపోల్చుకుంటారు ఆడియన్స్‌. ఇక్కడిదాకా కనెక్టివిటీ బాగానే ఉన్నా, స్టోరీలో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది. మాటలు ఓకే. స్క్రీన్‌ప్లే ఇంకా గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది. తక్కువ నిడివి సినిమానే అయినా అక్కడక్కడా బోరింగ్‌ అనిపించిందంటే, అది ఎడిటింగ్‌ లోపమే. పాటలు బాగానే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడలేదన్న విషయం సినిమా క్వాలిటీని చూస్తే అర్థమవుతుంది. 

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో ఆ వేగం తగ్గుతుంది. కథ బాగున్నా, కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందనిపిస్తుంది. ఎమోషన్‌నీ, ఎంటర్‌టైన్‌మెంట్‌నీ మిక్స్‌ చేసుంటే ఆడియన్స్‌కి మంచి ఫీల్‌ కలిగేది. సరదా సరదాగా సాగిపోతున్నట్టనిపిస్తూనే, డల్‌గా అనిపిస్తుంది. అదొక మైనస్‌. సినిమాకి బాగా ప్రమోషన్‌ చేయడం, అనుష్క ఇమేజ్‌ ఇవన్నీ తొలిరోజు థియేటర్ల ముందు ఆడియన్స్‌ క్యూ కట్టేలా చేశాయి. ఓవరాల్‌గా సినిమా ఓకే అనిపించుకుంటుంది. ప్రమోషన్‌ ఇంకా బాగా చేస్తే, సక్సెస్‌ రేంజ్‌ పెరగొచ్చు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
అనుష్క కష్టానికి హేట్సాఫ్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 3/5
మరిన్ని సినిమా కబుర్లు
nandita likes mahesh