Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kitchen

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

చికాగోలో హిందూ దేవాలయాలు


చికాగోలో డౌన్ టౌన్ నుంచి బయల్దేరేముందు అక్కడి మిలినియమ్ పార్కు చూశాము.  దీనిలో వున్న ధియేటర్ లో 4000 ఫిక్స్డ్ సీట్లేకాక బయట లాన్లలో 7000 మంది కూర్చుని అక్కడ ప్రోగ్రామ్ చూడవచ్చు.

అక్కడే  ఎటి. & టి. ప్లాజాలో వున్న క్లౌడ్ గేట్ పిల్లా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సందర్శించే ప్రదేశం.  ఇక్కడ వున్న స్టైయిన్ లెస్ స్టీలు ఆకృతి 23 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మింపబడింది.  10 x 20 x 13 మీటర్ల సైజువున్న దీని బరువు 100 టన్నులు.  దీని తయారీకి 168 స్టైయిన్ లెస్ ప్లేట్లు వెల్డింగ్ చేశారుట.  బయటకి ఈ అతుకులు ఏమీ కనబడవు.  పైగా అత్యద్భుతంగా పాలిష్ చెయ్యబడిన ఈ ఆకారం (దాదాపు గోళాకారం) లోపలకెళ్తే చిన్న పిల్లలకి, ఫోటోగ్రాఫర్లకి పండగే. వారిని వారు అనేక ఆకృతులలో, భంగిమలలో చూసుకోవచ్చు.  

మర్నాడు ఆలయ దర్శనం.  స్వామి నారాయణ ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం చూద్దామని పొద్దున్న మూడు కార్లల్లో బయల్దేరాము.

మనవారందరూ అమెరికా వెళ్ళి అర్జంటుగా అమెరికన్లయిపోవటంలేదండోయ్.  ఎన్ని సంవత్సరాలనుంచో అక్కడ నివసిస్తున్నవారు కూడా, మన సంప్రదాయాలూ, పూజలూ, భక్తీ ఏమీ వదిలిపెట్టలేదు.  అన్నీ సంప్రదాయబధ్ధంగా జరుపుకుంటున్నారు.  (ఇంకా ఇక్కడివారే ఏదో ఒక వంకతో చాలామటుకు మన పధ్ధతులనే మార్చేస్తున్నారు).

అయితే మన పూజలు చేసుకోవటానికి అమెరికావాళ్ళు మనకోసం గుళ్ళూ గోపురాలూ ఏమీ కట్టించి పెట్టలేదు కదా.  అందుకే అక్కడ స్ధిరపడిన మనవారు కొందరు వాటిని వారికోసమేగాక, భావి తరాలవారందరికీ ఉపయోగపడేటట్లు నిర్మించుకుంటున్నారు.  వాటిలో  చికాగో రాష్ట్రంలో వున్న రెండు దేవాలయాలకి మావాళ్ళు తీసుకెళ్లారు.  వాటిని వీక్షిద్దామిప్పుడు.

స్వామినారాయణ ఆలయం, చార్ట్లెట్

ఆర్లింగ్టన్ హైట్స్ లోని మావాళ్ళింటినుంచి 30 మైళ్ళ దూరంలో (అక్కడ అన్నీ మైళ్ళేనండీ, కిలోమీటర్లు లేవు) వున్నదీ ఆలయం.  విశాలమైన ప్రదేశంలో అద్భుత కళాకౌశలంతో నిర్మింపబడిన ఆలయం దూరంనుంచే సందర్శకులను ఆకర్షిస్తుంది.

ఇక్కడి ఆలయాలకు నేటి చరిత్రలే తప్ప స్ధల పురాణాలుండవండీ.  ఎందుకంటే ఇక్కడ ఇదివరకు ఏ మునులూ తపస్సు చేసుకున్న దాఖలాలు లేవు.  ప్రాచీన భారత దేశ శిల్పకళా నైపుణ్యాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో మేళవించి నిర్మించిన  ఈ అద్భుతమైన మందిరం స్ధానికులనేకాక, వివిధ దేశాలనుంచి వచ్చే సందర్శకులను సైతం అమితంగా ఆకర్షిస్తోంది.  ఈ అద్భుత  ఆలయ నిర్మాణం కేవలం 16 నెలలలో పూర్తయిందంటే దానికి కారణం 1700మంది పైన సంయం సేవకుల కృషి.

ఇందులో వున్న ..  అండర్ స్టాండింగ్ హిందూయిజమ్ .. అనే ప్రదర్శనద్వారా హిందువుల ఆచార వ్యవహారాల గురించి, భారత దేశ సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకోవచ్చు.

సంవత్సరం పొడుగూ ఏదో ఒక ఉత్సవ జరిగే ఈ ఆలయం ప్రజల జీవిత విలువలను పెంచే విద్య, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికపరమైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

ఆలయ సమయాలు .. ప్రతిరోజూ ఉదయం 9 గం. ల నుంచీ రాత్రి 7 గం.ల దాకా.

ఇక్కడ వున్న కేంటీన్ లో గుజరాతీయుల ఆహార పదార్ధాలతోబాటు వివిధ రకాల ఆహార పదార్ధాలు లభిస్తాయి.  అక్కడ పూరీ, చపాతీ, పానీపూరీ, దోశ వగైరా ఎవరికి కావలసినవి వారు తిని, అక్కడనుంచీ 10 మైళ్ళ దూరంలో, అరోరాలో వున్న బాలాజి ఆలయానికి బయల్దేరాము.

మరిన్ని శీర్షికలు