Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

 

జరిగిన కథ : మిట్టమధ్యాహ్నం వేళ....నాగాల స్థావరంలో తాంత్రిక క్షుద్రవిద్యా ప్రయోగం ఒజో నిర్వహించబడుతూంటుంది...ఆ తర్వాత....

అప్పటికే జరుగుతున్నదంతా కుతూహలంగా చూస్తున్నారంతా. నాగానందుడు తన కంచర గాడిద దిగి అంతర్ వృత్తంలో ధనుంజయుని ప్రతి రూపానికి ప్రణామం చేస్తున్నాడు.

సరిగ్గా ఇదే సమయంలో`

చర చర మంటూ ఏదో పాకి వస్తున్న శబ్ధం ఆలకించి తలతిప్పి అటు చూసాడు నాగ కేసరి. అతి పెద్దదైన ఒక సర్ప సుందరి అటుగా పాకుతూ రావటం కన్పించింది. విచిత్రమైన నాగ సుందరి. సుమారు పది ధనువుల పొడవుంటుంది. ఆమె నడుం వరకు మానవ స్త్రీగా వుంది. నడుం నుండి కింది భాగం సర్ప రూపం.

ఆమె వయసు ఎంతో చెప్పటం కష్టం.

ఎందుకంటే ఆమెలో ఎక్కడా వార్ధక్య ఛాయలు కన్పించటం లేదు. నవ యవ్వనిలా వుంది. నడుం వరకు సహజమైన మానవ కాంత, దిగువ భాగం నాగాకారం. అందమైన ముఖ వర్ఛస్సు, కరి మబ్బులా విర బోసిన నల్లలని కురులు, ఆరోగ్యంతో మిస మిసలాడే లేత గులాబి మేని ఛాయ, తామర తుండ్ల వంటి చక్కని చేతులకు దంతం గాజులు ధరించింది. సమున్నతమైన వక్షోజాలకు అడ్డంగా ఒక నార వస్త్ర భాగాన్ని ఆచ్ఛాదనగా కట్టుకుంది. ముఖాన బొట్టు, చెరగని మందహాసంతో ఆమె రూపం విచిత్రం గాను ముగ్ధ మనోహరం గానూ వుంది. ఆమె స్థానిక నాగాలకు సుపరిచితురాలే. అందుకే ఎవరూ ఆమెను వింతగా చూడరు. అప్యాయంగా పలకరిస్తారు. ఆమెను చూసిన గూడెం దొర నాగ కేసరి పలకరింపుగా నవ్వాడు.

‘‘రా తల్లీ శంఖు పుత్రీ. నీవింకనూ ఈ దినము రాలేదేమిటాని అనుకొంటిని. వచ్చినావు. ఇలా కూచో’’ అన్నాడు.

నాగ సుందరి పడగ విప్పినట్టుగా మరి కాస్త పైకి లేచి జరుగుతున్న హోమాన్ని పరిసరాల్ని కలియ జూసింది.

‘‘నాయకా... ఏమి జరుగుతున్నదిచట? ఓజో ప్రయోగమా? నేను కూడ తిలకింప వచ్చునా? ఏమి విశేషము?’’ అంటూ, పాకుతూ ముందుకెళ్ళింది. అంతా తనకు తెలిసినట్టే. కులగురువు చెంతనున్న డబ్బీలోని నల్లని పదార్థాన్ని కొద్దిగా తన చూపుడు వేలితో తీసి రెండు కనులకు కాటుకగా అద్దుకొని వెనక్కి వచ్చి నాగ కేసరి పక్కనే తన శరీరాన్ని చుట్టు చుట్టుకొని లేచి కూచుంటూ ఎదురుగా వృత్తాల్లోకి చూసింది.

ఇప్పుడు ధూమనాళికలోని దృశ్యాలు ఆమెకు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కదం తొక్కుతున్న శ్వేతశ్వం, అశ్వం మీది ఆజాను బాహుడు, సుందరాకారుడైన పురుషుడ్ని చూసింది. యువ కిశోరంలా వున్న ధనుంజయుని గాంచగానే ఆశ్చర్య సంభ్రమాలతో కొద్ది లిప్తల పాటు, శంఖుపుత్రిగా పిలువబడే ఆ నాగ సుందరికి నోట మాట రాలేదు. విప్పారిన కనులతో అలాగే చూస్తుండిపోయింది. పాలిండ్లు ఉబికి శ్వాస బరువై మోహ పరవశంతో కను రెప్పవాల్చటం మర్చి పోయింది.

శంఖు పుత్రి భూలోక వాసి కాదు. సాక్షాత్తూ నాగలోకానికి చెందిన స్త్రీ. నాగ లోకంలో నాగుల రేడైన ప్రభువు నాగరాజుకి అత్యంత ఆప్తుడైన శంఖు చూడుడను అనుచరుని కుమార్తె. కాబట్టి అంతా ఆమెను శంఖుపుత్రి అనే పిలుస్తారు. కాని ఆమెకో పేరుంది. మధూలిక అసలు పేరు. ప్రస్తుతం ఆ పేరు ఎవరికీ గుర్తు లేదు. అందుక్కారణం ఆమె నాగ లోకం నుండి బహిష్కృతురాలు గావటమే.

ఇది సుమారు నూటయాభై సంవత్సరాల క్రితం నాటి మాట.

అప్పట్లో యుక్త వయసు లోని నాగకన్య మధూలిక అత్యంత సౌందర్య రాశిగా భాసిల్లేది. ఆమెకు ప్రకృతి సౌందర్యమంటే ఇష్టం. తరచూ భూలోకం వచ్చి ఒంటరి గానే వన వివాహారం చేసేది. ఒక్కోసారి సుదూర ప్రాంతాలక్కూడ వెళ్ళి వచ్చేది.

ఒకసారిలాగే మాళవ రాజ్యంలోని సుందర వన ప్రాంతాలకు వెళ్ళింది. అక్కడ కుప్పించి దూకే తుంటరి జలపాతాలకు కొదువ లేదు. ఉరుకులు పరుగులు తీసే కొండ వాగు, తామరపూలతో నిండుగా ప్రశాంతంగా మైమరపించే తామర మడుగులు, గుంపులుగా తిరిగే లేళ్ళ సమూహాలతో కూడిన పచ్చిక మైదానాలు, ఫవృక్షాలు, ఎటు చూసినా చిన్న చిన్న కొండలు, గుట్టలతో రమణీయమైన ప్రాంతం ఆ సుందరవనాల అటవీ ప్రాంతం. ఓసారిలాగే మధూలిక సుందర వనాల్లో మానవ కన్య రూపంలో విహరిస్తుండగా అదే ప్రాంతాల్లో వేటకు వచ్చిన మాళవ రాజ కుమారుడు బిల్వుడనే వాడు ఆమెను చూసి మోహించాడు. అంద గాడయిన అతడ్ని మధూలిక వరించింది. ఆమె నాగకన్య అని తెలిసాక కూడా ఆమెనే కోరుకున్నాడతను. ఇరువురూ ప్రేమ బంధంలో చిక్కుకున్నారు. కానీ`

ఈ విషయం తెలుసుకున్న నాగ రేడు కోపంతో మండి పడ్డాడు. నాగలోక వాసుకు మానవులతో సంబంధాలు ఆయనకిష్టం లేదు. నాగ సంతతి వర్ణ సంకరం జాతి కారాదన్నది ఆయన అభిమతం.

ఒకప్పుడు నాగరాజు కుమార్తె అయిన ఉలూచి, పాండవ మధ్యముడైన అర్జునుని ప్రేమను అంగీకరించిన అప్పటి నాగరేడయితే. మధూలిక ప్రేమ ఫలించేదేమో. కాని ప్రస్తుత రేడు ఆయన కాదు.

ద్వాపర యుగం చివరి ప్రాంతాల నుండి కలియుగారంభంలో కొంతకాలం వరకు నాగలోక అధిపతిగా వున్న నాగరాజు తర్వాత తన వారసుడైన మహా పద్ముడనే అతడ్ని నాగరాజుగా పట్టాభిషిక్తుడ్ని చేసి తను తపస్సుకు పాతాళ లోకానికి వెళ్ళి పోయాడు. ప్రస్తుతం నాగరాజు మహా పద్ముడు. ఇతడిది తండ్రి అంతటి విశాల హృదయం కాదు. అందుకే మధూలిక బిల్వుల ప్రణయం అతనికి కంటగింపయింది. దాంతో అధినాయకుడి ఆజ్ఞను కాదని మధూలిక బిల్వుడి కోసం భూలోకం వెళ్ళిపోవాలనుకుంది. ఈ విషయం తెలిసి కోపంతో మండిపడ్డాడు నాగరాజు. మాళవ యువరాజుని ఒక కులీన సర్పం చేత కాటు వేయించి చంపించాడు. అంతే కాదు, తన ఆనతిని ధిక్కరించిన మధూలికకి శాశ్వతంగా నాగ లోకం నుండి బహిష్కృతి శిక్ష విధించాడు. ఈ విషయంలో మధూలిక తండ్రి శంఖ చూడుడు నిస్సహాయుడయ్యాడు.
ఆ విధంగా నాగ లోకం నుండి వెలి వేయ బడిన నాగ సుందరి మధూలిక పుట్టెడు దుఖ్ఖం, ప్రియుని వియోగంతో నాగాటవి అయిన మర్మభూమికి చేరుకుంది. క్రమంగా నాగ జాతి మనుషులకు దగ్గరయింది. నాగులదిబ్బ ఆమె నివాసమైంది. గూడెంలోకొచ్చినప్పుడు యిలా సగం స్త్రీ రూపం కలిగిన సర్పంలా సంచరిస్తుంది. సహజమైన తన అహార అన్వేషణకు గట్టు దిగి అడవిలోకి పోయేప్పుడు పూర్తిగా సర్ప రూపం ధరిస్తుంది. కోరిన రూపం ధరించగల శక్తివంతురాలామె. కాని నాగ లోకం విడిచిన తర్వాత తన సహజమైన అద్భుత సౌందర్యంతో కూడిన నాగ కన్యగా ఎవరికీ కన్పించలేదు. ఆమె చరిత్ర గూడెంలో ముఖ్యులయిన కొందరు పెద్దలకు మాత్రమే తెలుసు. నాగా నాయకుడైన నాగ కేసరికి కూడ తెలుసు. అందుకే శంఖు పుత్రీ అంటూ ఎంతో ఆత్మీయంగా పిలుచుకుంటాడు. అతని వయసుకు రెట్టింపు ఆమె వయసంటే ఆశ్చర్యమే.

అటువంటి నాగ సుందరి మధూలిక తన్మయంతో అక్కడ ధూమ నాళికలోని ధనుంజయుని ప్రతి రూపాన్ని చూస్తూ ఆలోచిస్తోంది. ఇంతలో మేఘ ఘర్జనలా` ‘‘ఓజో ప్రయోగం అర్థాంతరముగా విఫలమవుతోంది. ఏం జరుగుచున్న దచట...’’ అంటూ విన్పించేసరికి ఒక్కసారిగా మధూలిక ఆలోచనలు చెదిరి పోయాయి.

ఎదురుగా ధూమ నాళికలోని ప్రతిరూపాలు లీలగా కదిలి చెదరి పోతున్నాయి. పొగ తేలి పోతోంది. ఒక్కసారిగా గందరగోళం నెలకొందక్కడ.

*******************************

తన మచ్చల గుర్రం మీద ధనుంజయుడి సమీపంలోకి రాగానే అపర్ణుడు ఏదో మంత్రాన్ని పఠించి రెండు చేతులూ చేర్చి మూడుసార్లు బిగ్గరగా చప్పట్లు చరిచాడు గదా` దాని ఫలితం వెంటనే కన్పించింది.

శ్వేతాశ్వం గరుడ మీది యువరాజు ధనుంజయుడు ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎదురుగా తనేం చూస్తున్నాడో తెలీలేదు.

ఎక్కడికక్కడ ప్రకృతి మసక బారుతున్నట్లనిపించింది. ఎక్కడివక్కడ యథాతథంగా వున్నాయి. కాని కంచర గాడిదతో వెళ్తున్న వృద్ధ నాగా నాయకుడు నడుస్తూ నడుస్తూనే అస్పష్టం కాసాగాడు. చుట్టూ అతని నాగా మనుషులూ చెరిగి కరిగిపోతున్న బొమ్మల్లా కదులుతున్నారు. చూస్తుండగానే వాళ్ళంతా కరిగిపోతున్న పిండి బొమ్మల్లా, అలల తాకిడికి కదలాడే నీటి మీది దృశ్యంలా అలలు అలలుగా కదలాడుతూ క్రమంగా గాలిలో అదృశ్యమైపోయారు. ఒక్కరూ మిగల్లేదు. ఇప్పుడు తనను చుట్టి నాగాలు లేరు. వారి కదం తొక్కే తోడాల శబ్ధం గాని, హుంకరించే పాము బుసలుగాని లేవు. పోరు తప్పదనుకున్న స్థితిలో అంతా కలలా చెదిరిపోయింది. అంతా భ్రాంతి సదృశంగా వుంది.
ఎప్పుడైతే నాగాలంతా అదృశ్యమయ్యారో అప్పుడు బాహ్య స్పృహలోకి వచ్చాడు యువరాజు ధనుంజయుడు. ఒక కల నుంచి బయటపడినట్టు విభ్రాంతుడై చుట్టూ చూసాడు. అప్పుడు కన్పించింది ఎదురుగా తన వైపు వస్తున్న మచ్చల గుర్రం. ఆ గుర్రం మీద నిండా పద్దెనిమిది వత్సరాలయినా ఉంటాయో లేదో అన్పించే లేత వయసు అతి సుందరుడైన బాల యువకుడ్ని చూసాడు. ఎవడితడు? ఎన్నడూ చూసిన గుర్తులేదే. ఇంత సమీపం లోకి వచ్చే వరకు ఆ అశ్వాన్ని తను ఎందుకు గమనించలేక పోయాడు? కనుబొమ్మలు ముడిచి మంత్ర ముగ్ధుడిలా అతన్నే చూడసాగాడు.

యువరాజును సమీపిస్తూనే`

వినయ పూర్వకంగా చెంగున తన అశ్వం దిగాడు అపర్ణుడు.

‘‘అశేష రత్నగిరి రాజ్య భావి సామ్రాట్టులు అనంగుని ధిక్కరించు అతులిత రూపసుందరులు, మానినీ చిత్తచోరులు, వీరాధివీరులు, రణరంగధీరులు, దయాహృదయులైన యువరాజు శ్రీ ధనుంజయుల వారికి జయము జయము. ఏలిన వారికి ఈ అపర్ణుడి ప్రణామములు’’ అంటూ వంగి వంగి నమస్కరించాడు.

అపర్ణుడి వినయ విధేయతలకి వాక్చాతుర్యానికి ముగ్ధుడవుతూ ధనుర్భాణాలను యధా స్థానంలో వుంచి అశ్వం దిగి అపర్ణుడి ముందుకొచ్చాడు ధనుంజయుడు. నిశితంగా అతని ముఖాన్ని గమనిస్తూ` ‘‘నీవు అపర్ణుడవా?’’ అనడిగాడు.

అంతటి ఎండలో కూడ యువరాజు చూపు తాకిడికి అపర్ణుడి బుగ్గలు  గులాబి మొగ్గల్లా ఎర్ర బారాయి.

‘‘అవును ప్రభూ! నన్ను అపర్ణుడంటారు.’’ అన్నాడు.

అపర్ణుడి రూపం, ఆ గొంతు, నడకతీరు యువరాజు ధనుంజయకు ఏవో కొన్ని సందేహాలకు కారణమయ్యాయి. కాని వాటిన్నిటిని పక్కపెట్టి సందిగ్ధంగా చూస్తూ` ‘‘మనకు గత పరిచయం వున్నట్టు లేదే!’’ అనడిగాడు.‘‘మనకు పరిచయం లేదు గాని మీరు నాకు పరిచయస్థులే యువరాజా’’

‘‘ఎలా? నేను నీకు అంతగా తెలుసా?’’

‘‘తెలుసు.’’

‘‘ఎలా తెలుసు? నీవు రత్నగిరి వాసివేనా?’’

‘‘రత్నగిరి నివాసినే ప్రభూ. ఇక మీరు ఎలా తెలుసునంటే ఏం చెప్పగను. లోకమున సూరీడు తెలీని వారుందురా? రత్నగిరి రాజ్యమున యువరాజు ధనుంజయుల వారు తెలీని వారుందురా? అందునా నేను మీ అభిమానిని ప్రభూ. అందుకే మీ గురించి సర్వం తెలుసుకుంటూ ఉంటాను. రోజంతా ప్రభాకరుని తన్మయంగా చూస్తూ సూర్యకాంత పుష్పం తల తిప్పదా? కోకిల వసంతం వెంట పరుగులు పెడుతూ కమ్మటి పాటలు ఆలపించదా? నేనూ అంతే! మీ పట్ల అంతటి అభిమానం వున్నవాడ్ని. విశ్వాసపాత్రడ్ని.’’ అన్నాడు సవినయంగా అపర్ణుడు.
తలపంకించాడు ధనుంజయుడు.

‘‘నీ పలుకులు కడు విచిత్రములు. రూపము పరమాద్భుతం. ఇంతటి మా వీరాభిమానితో ఇంత దనుక పరిచయం లేకపోవుట మా దురదృష్టమే’’ అన్నాడు దరహాసం చేసి.

‘‘అంత మాట వలదు ప్రభూ. నన్ను మీ మిత్రునిగా తలచిన చాలును’’ అన్నాడు అపర్ణుడు.

‘‘మంచిది. నీ కోరిక మన్నిస్తున్నాం. ఇక నుండి నీవు మా అంతరంగిక మిత్రుడివి. చాలునా? విషయం ఏమన` ఇంత క్రితం చాలా సేపటిగా ఇక్కడే ఒక విచిత్ర సంఘటన జరిగినది...’’

‘‘తెలుసు ప్రభూ’’ అన్నాడు వెంటనే అపర్ణుడు.

‘‘తెలుసునా?’’

‘‘తెలుసు. క్షణం క్రితం వరకు మీరు నాగాలు ప్రయోగించిన ఓజో తాంత్రిక విద్య మాయలో వున్నారు. భ్రమలో పడ్డారు. మీ లక్ష్యం నెరవేరకూడదని అవరోధం కల్పించి వెనక్కు పంపించాలని చూసారు. ఆ పరిస్థితి రాకూడదని నేనే వారి ప్రయోగాన్ని తిప్పికొట్టి  భ్రమ నుంచి మిమ్మల్ని బయటకుతెచ్చాను.’’‘‘నీకా ఓజో తాంత్రిక విద్య తెలుసునా? చూచినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? నీ వద్ద అదీ ఇంత పిన్న వయసులో అద్భుత మంత్ర శక్తులేవో వున్నట్టున్నాయి.’’

‘‘లేదు లేదు ప్రభూ...’’ అంటూ నవ్వేసాడు అపర్ణుడు.

‘‘నా వద్ద గొప్ప మంత్ర శక్తులేవీ లేవు. మంత్ర శాస్త్రంలో కొద్దిగా పరిజ్ఞానం వుంది. అది సమయానికి ఉపయోగ పడింది. అంతే! కాని ప్రభూ, అసలు ప్రమాదం మీ వెనకనే తరుముకొస్తోంది. అది మీరు గమనించలేదు.’’

‘‘అసలు ప్రమాదమా...?’’

‘‘అవును. అసలు ప్రమాదమే. ఓ  సారి పరిసరాల  మీద దృష్టి సారించండి. మీకే అర్థం కాగలదు.’’

అప్పుడు గమనించాడు ధనుంజయుడు.

కొండ దిగువ నుండి అనేక అశ్వాలు శర వేగంతో దూసుకొస్తున్న పదగిట్టనల ధ్వని. వింటూనే వడివడిగా కొండ వంచకు నడిచి బాట మీదకు దృష్టి సారించి విభ్రాంతి చెందాడు.

అశ్విక దళం దుమ్ముతెరలు రేపుతూ పిడుగుపాటులా కొండశిఖరం మీదికి దూసుకొచ్చేస్తోంది. అది తమ రత్నగిరి అశ్విక దళమే. వెళ్ళినంత వేగం గానూ తిరిగి అపర్ణుడి ముందుకొచ్చి అతడ్ని ఆశ్చర్యంగా చూసాడు.

‘‘వాళ్ళు మా సైనికులే. నా కోసమే వస్తున్నారు కదూ?’’ సంశయ నివృత్తి కోసం అడిగాడు.

‘‘అవును. మీ కోసమే. కారణము నా కన్నా మీకే బాగా తెలుసు. మీరు వాళ్ళ కంట బడకుండా తప్పించాలని వచ్చాను. కాని ఆలస్యమైపోయినది. వాళ్ళు వచ్చేస్తున్నారు. తప్పించుకోను అవకాశమూ లేదు’’ అన్నాడు నిరుత్సాహపడుతూ అపర్ణుడు.

‘‘రానిమ్ము. సమస్యకు భయపడి పారిపోవు భీరుడు కాదీ ధనుంజయుడు. తప్పదంటే సొంత సైన్యంతోనే తలపడి తేల్చుకుంటాను గాని నా లక్ష్యం నుండి మారుట కల్ల’’ అన్నాడు ఆవేశంగా ధనుంజయుడు.

అంతలో అశ్వాలు కొండ పైకి రానే వచ్చాయి. దూరం నుంచే ధనుంజయుని బాట మీద గమనించిన సైనికులు అశ్వముల వేగాన్ని తగ్గించారు. అవి వచ్చిన వేగానికి ఎర్రటి ధూళి మేఘంలా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ధనుంజయునికి ఇరవై ధనువుల దూరంలో అగ్ర భాగంలోని రత్నగిరి పతాకపూన్చిన సైనికాశ్వం నిలువగా దాని సరసనే దళపతి అశ్వం వచ్చి నిలిచింది. వాటి వెనకే సుమారు నూరు అశ్వాలు అయిదు వరుసల్లో క్రమశిక్షణతో నిలిచాయి. అశ్వ సైనికులంతా సుశిక్షితులై యుద్ధానికి సిద్ధంగా ఆయుధాలు ధరించి వున్నారు.
అందర్నీ ఉన్నచోటే నిలవమని చెప్పి దళనాయకుడు తన అశ్వం దిగాడు. సైనిక పద్ధతిలో ముందుకొచ్చి ధనుంజయకు సైనిక వందనం చేసి జయ వాచకం పలికాడు.

ఆ దళపతి పేరు కరివీరుడు.

మనిషి ఏడడుగుల  పైగా ఎత్తున విశాలమైన ఛాతీతో దృఢంగా బలిష్టంగా వున్నాడు. నడివయసుంటుంది. గుబురు మీసాలతో ఎప్పుడూ గంభీరంగా వుంటాడు. ప్రభువు ధర్మతేజ మహారాజుకు ఎంతో నమ్మకమైన వాడు కరివీరుడు. చక్కని వ్యవహారదక్షుడు. ఏ విషయంలోనూ తొందరపడని మనిషి. కరివీరుని తన కోసం పంపించుటలో తన తండ్రి సరైన నిర్ణయమే తీసుకున్నాడనిపించింది ధనుంజయునికి.

‘‘దళపతీ! ససైన్యంగా మీ రాకడకు అర్థమేమి?’’ సైనిక వందనం స్వీకరించి, హుందాగా ప్రశ్నించాడు ధనుంజయుడు.కరివీరుడు ఓ సారి అపర్ణుడి వంక సందేహంగా చూసాడు. అది గమనించి ధనుంజయుడు కల్పించుకుంటూ` ‘‘మా మిత్రడు! సందేహింపక వచ్చిన పని చెప్పుము’’ అన్నాడు.

‘‘ఇది ప్రభువు ఆనతి యువరాజా. సరిహద్దులు దాటక ముందే మిమ్మల్ని కలుసుకొని వెనక్కి తీసుకురావసిందిగా ఆజ్ఞాపించినారు. ఈ లేఖను మీ కోసం పంపించినారు.’’ అంటూ కరివీరుడు ఒక లేఖను అందించాడు.

ఆ లేఖలో స్పష్టంగా యిలా వ్రాయబడి వుంది.

ప్రియ కుమారా ధనుంజయా`

మీకింకనూ స్వయం నిర్ణయాధికారం సంక్రమించలేదు. మా అనుమతి లేకుండా మీరిలా కోట విడిచి వెళ్ళుట మాకు సమ్మతము కాదు. మీరు పంపించిన లేఖ సారాంశము అర్థమైనది. అయినను స్వక్షేమము కన్నా రాజ్యక్షేమమే ప్రభువులకు ముఖ్యమని మీకు తెలియదా? ఆ శాశ్వతమగు శరీరము గురించి గాని శరీర బాధ గురించి గాని మాకు చింత లేదు. రాజ దంపతులుగా మా చింత ఎల్లప్పుడును మీ గురించే. మా ఏకైక కుమారునిగా సువిశాల రత్నగిరి రాజ్యలక్ష్మికి వారసునిగా మా తర్వాత రాజ్య భారం వహించవలసిన బాధ్యత మీకున్నది.
ఆ బాధ్యతను విస్మరించి మీరిలా అడవుల  గ్రుమ్మరించుచూ యిడుముల బడి ఎద్దియో సాధించి మమ్ముద్ధరింప బూనుట మాకు సమ్మతము కాదు. వృధా ప్రయాస. మీరు కోటకు తిరిగి వచ్చి మా సమక్షమునే ఉండవసిందిగా ఆనతిస్తున్నాము. ఈ లేఖను చదివిన తక్షణమే కరివీరుని వెంట కోటకు మరలి రావసిందిగా ఆజ్ఞాపిస్తున్నాము. రాకున్న మన సైనిక దళం వదలదు.  స్వసైన్యంతోనే తలపడిన అపఖ్యాతిని మూట కట్టుకొని సాటి రాజన్యుల ముందు తలవంపులు తీసుకురారని ఆశిస్తున్నాము. మీ రాక కోసం ఎదురు చూసే మీ తండ్రిగారు.

ధర్మతేజ ప్రభువు.

ధనుంజయుడు ఆ లేఖ చదివే లోపలే పక్కనున్న అపర్ణుడు ఓరకంట సాంతం చదివేసాడు. అతడి పగడాల పెదవుల మీద మృదు దరహాసం విరిసింది. అటు దళపతి కరివీరుని గాని ఇటు యువరాజు ధనుంజయకు గాని ఇది ఒక అగ్నిపరీక్షయే. ఎవరి ధర్మానికి వారు కట్టుబడి వున్నప్పుడు సమస్యకు పరిష్కారం లభించదు. దీని పర్యవసానం యుద్ధమా! కాకపోవచ్చు.

లేఖను ఒకటికి రెండు మార్లు చదివిన ధనుంజయుడు దాన్ని తిరిగి కరివీరునికే ఇచ్చి వేసాడు` ‘‘ఇది నీకు అవసరం పడొచ్చు. నీ వద్దనే వుంచు’’ అన్నాడు.

‘‘కాని... మీరు మా వెంట రత్నగిరికి రాక తప్పదు యువరాజా’’ లేఖను భద్రం చేసుకుంటూ స్థిరంగా పలికాడు కరివీరుడు.

‘‘దళపతీ మీకు తెలుసు. ఒక నిర్ణయం తీసుకున్నాక అడుగు వెనక్కు తీసే అలవాటు నాకు లేదు. నాకో విషయం చెప్పండి. పితృ ప్రేమ ఎప్పుడూ బిడ్డల క్షేమం కోరుట సహజమే గదా?’’

‘‘అవును యువరాజా. ఎవరు కాదనగలరు?’’

‘‘అదే విధముగా పితృ రుణం తీర్చుకొనే బాధ్యత కూడ పుత్లరుదే గదా?’’

‘‘ఆ మాట నిక్కము.’’

‘‘నా మీది వాత్స్ల్యంతో నన్ను వారించే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి గారు. కాని సమర్థుడనై వుండి చేతులు ముడుచుకుని వారి చెంతనే ఉండి వారి బాధను వేదనను చూస్తూ భరించలేను గదా. ఆలోచించు. నా కర్తవ్యం నేను పాటించ నివ్వండి. కొద్ది దినాలు నన్ను వదిలేస్తే విజయంతో తిరిగి వచ్చి పితృ రుణం తీర్చుకుంటాను.’’

‘‘మీ పలుకులు సత్యములు యువరాజా. ప్రభువులది కన్న ప్రేమ. మీది పితృ మమకారం. కాని మాది వృత్తి ధర్మం. ప్రభు భక్తి పరాయణులం. మంచిచెడులు ఎంచకుండా రాజాజ్ఞను పాటించటం మా ధర్మం. ఆ ధర్మాన్ని పాటించక తప్పదు. మీరు మా వెంట కోటకు రాక తప్పదు.’’

‘‘వచ్చుట లేదు. పోరుకైనా సిద్ధమే గాని రత్నగిరికి వచ్చుట అసాధ్యం’’

‘‘మేమును పోరుకు సిద్ధపడే వచ్చినాము యువరాజా. మీరు రాకుండా మేము వెనుతిరుగుట అసంభవం. మీరు అసహాయశూరులని తెలిసి కూడ వచ్చినాము. రాజాజ్ఞ అట్టిది. మా కర్తవ్య పాలన తప్పదు గదా. మా అశ్విక దళాన్ని ఓడించి మా శవాల మీదుగా మీరు యధేచ్చగా పోవచ్చును’’ అన్నాడు స్థిరంగా కరివీరుడు.

అతడి మాటల్లో స్థిర నిశ్చయం ధ్వనిస్తోంది.

‘‘ఇదే మీ నిర్ణయమా?’’ ఆఖరి సారిగా అడిగాడు ధనుంజయుడు.

‘‘అవును యువరాజా’’

‘‘సరి. మన ఇరువురి ధర్మ పరిపాన కోసం అనవసరంగా ఇందరు వీరులను బలిపెట్టుట ధర్మం కాదు గదా. ఇంత కన్నా ఉచితమగు నిర్ణయం గైకొనుట మంచిది’’

‘‘చెప్పండి. ఏమా నిర్ణయం?’’

‘‘మనమిరువురము ద్వంద్వ యుద్ధం సలుపుదము. అప్పుడు స్వసైన్యంతోనే పోరాడినామన్న మచ్చ మాకు ఏర్పడదు. సైనిక నష్టమూ వుండదు. మన పోరాటంలో మీరు గెలిచిన నేను మారాడక మీ వెంట రత్నగిరికి వచ్చెదను. ఒక వేళ నేను గెలిచిన మీరంతా క్షేమంగా వెనుతిరిగి నేను చెప్పిన భంగి నడుచుకోవలె. ఇది మీకు సమ్మతమైన ఇక ద్వంద్వ యుద్ధం ఆరంభించెదము.’’
యువరాజు నిర్ణయం దళపతి కరివీరుడ్ని ఒకింత ఆలోచనలో పడవేసింది. ధనుంజయతో ద్వంద్వ యుద్ధమంటే ఎలా వుంటుందో కరివీరునికి తెలీని విషయం కాదు. యుద్ధంలో ప్రభంజనంలా విజృంభించే యువరాజు ముందు ఎవరూ నిలవలేరు. ఎందుకంటే, చేతిలో ఆయుధం ఏదయినా అలవోకగా చెలరేగి ప్రత్యర్థిని మట్టికరిపించుటలో దిట్ట. ఒకటి కాదు రెండు కాదు, అనేక విధములైన వీర విద్యల్లో నిష్ణాతుడతను. అలాంటి వీరుని తను ఒంటిగా జయించుటా... అసాధ్యమే. కాని తప్పదు. యువరాజు ఒక్కడే గావచ్చు. కాని అతడి ముందు తమ అశ్విక దళం నిలువలేదనుట సత్యము. అతడి పరాక్రమాన్ని గతంలో అభీరులతో జరిగిన యుద్ధంలో స్వయంగా చూసినవాడు తను. అర్ధజాములో రెండు వందల మంది దుండగులను కడతేర్చిన సాహసి. అయినప్పటికీ ఒక్కని కోసం మొత్తం దళాన్ని బలిచేయటం కన్నా యువరాజు చేతిలో తను మరణించినా అది సంతోషమే.

ఈ విధంగా ఆలోచించిన కరివీరుడు చివరకు తను ద్వంద్వ యుద్ధానికి సమ్మతి చెప్పాడు.

అయితే పరిస్థితి యుద్ధం వరకు దారి తీయటం పక్కనున్న అపర్ణుడికి నచ్చలేదు. ఒక్కనితో చేసినా వంద మందితో చేసినా యుద్ధం యుద్ధమే. అదీ దళపతితో యుద్ధం చేయటమంటే ఆ దళం మొత్తం మీద దాడి చేసినట్టే. స్వసైన్యం మీద దాడి. ఆ పరిస్థితి తెచ్చి సాటి రాజన్యులలో మచ్చ తేవలదని మహారాజు ధర్మతేజడు తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు. కాబట్టి ప్రస్తుతం సమస్యకు పోరు పరిష్కారం కాదు.

ఉన్నట్టుండి కదిలాడు అపర్ణుడు. ద్వంద్వ యుద్ధానికి కత్లుతు దూయబోతున్న వీరులు ఇరువురి మధ్యకు వచ్చి చేతులు చాపి వారించాడు.
‘‘మిత్రమా అపర్ణా. ఇది మా సమస్య. నీవు పక్కకు తొలుగుట మంచిది.’’ తన కరవాలం పిడి మీద చేయి వేస్తూ హెచ్చరించాడు ధనుంజయుడు.

‘‘సమస్య మీదే గాని మీరిలా ద్వంద్వ యుద్ధానికి తలపడుట సమస్యకు పరిష్కారం కాదనిపిస్తోంది. దళపతి మీద మీరిలా కత్తి దూయటం కూడ ప్రభువుకు సమ్మతం కాదు. ఆ విషయం లేఖలో స్పష్టంగా వుంది. మరిచారా?’’ అంటూ గుర్తుచేసాడు అపర్ణుడు.

‘‘మరి సమస్యకు పరిష్కారం?’’ దళపతి కరివీరుడు సందిగ్ధంగా అడిగాడు.

‘‘ఉంది. మధ్యవర్తిగా కత్తులు కలపకుండానే దీనికో పరిష్కారం నేను చెప్తాను. అదీ నా మీద నమ్మకం వుంచి మీరు సమ్మతిస్తేనే సుమా!’’

‘‘ముందు అదే ఉపాయమో చెప్పు చూద్దాం.’’ అన్నాడు ధనుంజయుడు. గొంతు సవరించుకుని కరి వీరుని వైపు చూసాడు అపర్ణుడు.

‘‘దళపతి కరివీరులు ధీమంతులు, శౌర్య ప్రతాపాల్లో సాటిలేని వారని విన్నాను. కార్యదక్షులు, ఆలోచనాపరులనీ, నిండుగా దేశభక్తి, రాజభక్తి కలవారని, న్యాయధర్మాలు తెలిసిన వారని కూడా విన్నాను. మీ దర్శనం నాకు సంతోషం కలిగిస్తోంది.’’ అంటూ ముందుగా కరివీరుని స్తుతించాడు అపర్ణుడు. ఆ పొగడ్తకు మెత్తబడని వారుండరు. ఇంకా ఏం చెప్తాడాని ముగ్ధుడవుతూ చూసాడు కరివీరుడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్