Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అమృత

amruta

అబ్బా.. ఇంకెంత దూరం..

ఇలా అనుకోవడం ఇప్పటికి ఇరవై సార్లు.

చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్యలో మెలికలు తిరిగిన తారు రోడ్డుపై బస్సు వెళుతోంది. కిటికీ నుంచి చెట్లు చేమలు కొండలు గుట్టలు అలా కదలిపోతున్నాయి. అయినా కదులుతోంది బస్సే కదా.. వాటె సిల్లీ డౌట్. చిన్నగా నవ్వుకున్నాను. ఎన్నో ఏళ్ళ తరువాత అమృతను చూడబోతున్నాను. ఈ భావనే చాలా అద్భుతం అనిపిస్తోంది. తనను చూసి దాదాపు అయిదేళ్ళు దాటుతోంది. రెండు నెలల కిందట డిగ్రీ స్నేహితులందరూ అపురూపంగా అలమ్నయ్(పూర్వం విద్యార్ధుల సమావేశం) చేసుకున్నాం. ఉద్యోగరీత్యా ఢిల్లీలో వున్నా కేవలం  ఈ కార్యక్రమం కోసమే నాలుగు రోజులు సెలవు పెట్టుకుని మరీ వచ్చాను. దాదాపు అందరూ కలుసుకున్నాము. అమృత తప్ప. కార్యక్రమం జరుగుతున్నంత సేపూ తన గురించి ఎంక్వయిరీ చేస్తూనే వున్నాను. బిజీగా వున్నందున రాలేకపోయిందని వెంకట్ చివర్లో చల్లగా చెప్పాడు.

"ఆహా ఇక్కడ మనకేమో పనీపాట లేదాయే.. "నా గొంతులో కోపం, వెటకారం కలగలసి ధ్వనించాయి.

" అది కాదురా మాధవ్ రెండ్రోజుల ముందే అమృత ఇన్ ఫార్మ్ చేసింది. నువ్వు డిసప్పాయింట్ అవుతావేమోనని మేమే చెప్పలేదు. " వెంకట్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

" అది కాదురా నెల నుంచే ప్లాన్ చేసుకున్నామా. వస్తుందని అనుకున్నా, సర్లే ఏం చేద్దాం " నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. అమృత అడ్రస్ అడగాలనిపించినా ఎందుకో అడగలేక పోయా, రెండు రోజుల కిందట వున్నట్టుండి అమృత నుంచి ఉత్తరం .

ఎందుకు రాలేకపోయానో క్లుప్తంగా వివరిస్తూ మన వాళ్ళని చాలా మిస్ చేసుకున్నా ఓ రకంగా దురదృష్టవంతురాలిని సారీ అంటూ రాసింది. నీలి రంగు కాగితంపై ముత్యాల్లాంటి అక్షరాలు చూడగానే గత స్మృతులు తరంగంలా గుండెను మెత్తగా తాకాయి. లెటర్ వెనుక ఫ్రం అడ్రస్ చూసాక మనసు నిలవలేదు. ఎలాగైనా సరే అమృతను చూడాలని నిర్ణయించుకున్నాను. తనకు చెప్పకుండా వెళ్ళి సర్ ప్రైజ్ చేయాలన్న కుతూహలం కూడా తోడయ్యింది. ఫలితం .. ఇదిగో ఈ ప్రయాణం. బస్సు కుదుపుతో ఆగింది. నా ఆలోచనలకూ బ్రేక్ పడింది. బ్యాగు సర్దుకుని కిందకు దిగాను. మారుమూల పల్లెలో వుంటోందని తెలిసింది కానీ మరీ ఇలా అడవి మధ్యలో వుంటుందనుకోలేదు. ఎవరినైనా అడిగితే తప్ప ఊరు చేరుకోవడం కష్టమే. ఇంతలో ఓ మనిషి నా వైపే వస్తున్నాడు. మాసిన గడ్డం, భుజం పై తువాలు, నన్ను ఎగాదిగా చూసి " మాధవ సారూ అంటే మీరేనా " అడిగాడు. ఆశ్చర్యం వేసింది. ఇంత అడవిలో నా కోసం ఓ దూత.

" నా పేరు నర్సిమ్మ. మిమ్మల్ని తోడ్కొని రమ్మని అమృతమ్మ పంపింది సార్. తెల్లారు నుంచి ఈడనే వున్నా పదండి " నా బ్యాగు అందుకున్నాడు. వద్దని వారించినా వినేలా లేదు.

నేను వస్తున్నట్టు అమృతకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పి వుంటారు? ఎంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్ధం కాలేదు. హూ.  సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటే తను ఏకంగా షాకే ఇచ్చిందే అనుకుంటూ అతన్ని అనుసరించా.

************

" వేచి వున్నందుకు ధన్యవాదాలు..! "

చిర పరిచిత గొంతు. పుస్తకం లో మునిగి పోయిన నేను చటుక్కున తలెత్తా.

అమృత .. నవ్వుతూ వచ్చి కూర్చుంది. తనను చూడగానే ఒక్కసారిగా ఉద్వేగం గుండెల్లోంచి గొంతులోకి వచ్చినట్టయింది. బహుశ నా జీవితం లో ఎగ్జయిటెడ్ క్షణాల జాబితాలో ఇది ముందు వుంటుందేమో. కాటన్ చీరలో పొందికగా కనిపిస్తోంది. తను ఏం మారలేదు. కళ్ళజోడు వెనుక కళ్ళల్లో ఆ మెరుపు, ఆ చిలిపి నవ్వు, కోటేరు లాంటి ముక్కు, నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టలు... కాకపోతే ముక్కు పుడక కొత్తగా కనిపిస్తోంది. " ప్రయాణం బాగా సాగిందా" ఆప్యాయంగా అడిగింది.

" మామూలుగా కాదులే , ఒళ్ళంతా హూనం. "

అందుకే నిన్ను డిస్టబ్ చేయకూడదని బయటికెళ్ళా. బాగానే నిద్ర పోయినట్టున్నావుగా.

"అంత లేదు. సగం మెలుకువ గానే వుంది. జస్ట్ రెస్ట్ అంతే." " మరి గురక పెట్టావని నర్సిమ్మ అన్నాడే. " నవ్వును పెదాలతో బిగపట్టింది. " అవునా నిజంగానా, " ఆశ్చర్యంగా అడిగా.

" అర్రే .... మరీ అంతలా ఆశ్చర్యపోకు జస్ట్ అలా అన్నా అంతే. మాధవ్ సారీ! రిసీవ్ చేసుకోలేకపోయాను. అర్జెంట్ మీటింగ్ వుంటే వెళ్ళాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. అవునూ ఊరికి దూరంగా ఇల్లేంటి?"  " ఊరికే " మళ్ళీ నవ్వు..

" సాధ్యమైనంత వరకు అన్ని కాలుష్యాలకు దూరంగా వుండాలని " అమృత బదులిచ్చింది.

 " ఎలా వున్నావ్? " నా గొంతులో ఆతృత.

అమృత చిన్నగా నవ్వేసింది

చొరవగా నా చేతిలో పుస్తకం తీసుకుని చూసింది. పెదాలపై చిన్న నవ్వు మెరిసి మాయమయ్యింది.

" ఓహో చలం మైదానమా. బాగుంది, ఇన్ని పుస్తకాలున్నా మళ్ళీ ఇదేనా మంచి పుస్తకం ఎన్ని సార్లయితే ఏముంది" అనాలనుకున్నా అంతలోనే తనే అందుకుంది.  "అవును అయిదేళ్ళ నుంచీ ఈ ఒక్క పుస్తకమే చదువుతున్నావా? లేదా చదవడం మానేసావా. " మాట పూర్తి కాకముందే గలగలా నవ్వు. తనేం మారలేదనడానికి ఇంకేం రుజువులు అక్కర్లేదనిపించింది. చొరవ నవ్వులో స్వచ్చత తను మాత్రమే అందంగా పలికే అరే .. ఓహో అలాగా! అనే ఊత పదాలు అన్నీ సేం టూ సేం. కాకపోతే రంగు మాత్రం కాసింత తగ్గినట్టుంది.

" నీ లైబ్రరీ వండర్ ఫుల్ ఇన్ని పుస్తకాలే.. !"

" థాంక్స్! కానీ అన్నీ చదివేసానని అనుకోకేం, ఈ ప్రయాణం ముగిసేలోగా చదివేయాలని మాత్రం వుంది."

"మనం ఆశా జీవులం కదా! " అంది అమృత తమాషాగా భుజాలెగరేస్తూ " అవును ఇల్లు ఎలా వుంది? తోట చూసావా పద పద " నెక్స్ట్..
ఇద్దరం బయటకి వచ్చాం. చుట్టూ కొండలు, మధ్యాహ్నం ఎర్రగా ఎండ కాస్తున్నా చెట్లు ఉండడంతో వేడి తెలియడం లేదు. కాంపౌండ్ ఆనుకుని వరుసగా కొబ్బరి చెట్లు సరిహద్దు కాపలా కాస్తున్న సైనికుల్లా వున్నాయి.

గులాబి, చామంతి, మందారం, పారిజాతం, నిద్ర గన్నేరు... రకరకాల పూల తీగలు చెట్లు కంటికింపుగా కనిపిస్తున్నాయి. మరో పక్క పచ్చగా పరుచుకున్న ఆకు కూరలు, అక్కడక్కడ గుమ్మడి తీగలు, మధ్యలో నడవడానికి వీలుగా దారి.

పచ్చని తోట మధ్య ఇళ్ళు ఆశ్రమం లా వుంది. అమృత తోట ఎలా పెంచిందో వివరిస్తుంటే బుద్ధిగా వెనకాలే నడుస్తున్నా. " అవును నేనేం బోరు కొట్టించడం లేదు కదా." వున్నట్టుండి అమృత వెను తిరిగింది. " అబ్బే భలే దానివే ఇట్స్ ఇంట్రస్టింగ్ " తడబడుతూ బదులిచ్చా.

గంట తరువాత..

" మాధవ్ ఏమాత్రం సిగ్గు లేకుండా, సారీ సిగ్గు పడకుండా తినేయ్." ముసి ముసిగా నవ్వుతూ అంది. "అమ్మూ... స్టాప్ రోటీన్ జోక్స్. .." వెంటనే నాలుక కరుచుకున్నా. అమ్మూ అనేసా.. ఏమనుకుంటుందో..   అప్పట్లో నేనొక్కడ్నే.. అమృతను అమ్ము అని పిలిచేవాణ్ణి. ఆ ఆరాధనకు అదో ట్యాగ్ గా భావించే వాణ్ణి . విచిత్రం ఏమిటంటే.. ఎవర్నీ ఏ విషయం లోనూ ఎంటర్ టైన్ చేయని అమృత నేను అలా పిలిచినా కాదనక పోవడం. అది ఇప్పటికీ వండరే.

కానీ అమృత ఇదేం గమనించినట్టు లేదు.

" సరే సరే ఇక మాటల్లేవ్ ..ఓన్లీ యాక్షన్. సరేనా లాగించు మరి." వంటకాలు చూడగానే ఆకలి ఆవురావురంది. గుమ్మడి కాయ సాంబార్, చింత పచ్చడి, ఆవకాయ, ఆలూ వేపుడు, అప్పడాలు, వడియాలూ వేడి వేడి అన్నం పచ్చని అరటి ఆకులో ఆహ్వానిస్తున్నాయి. అన్నీ నాకూ ఇష్టమైనవే. అసలు ఈ మెనూ చూస్తుంటే చాలా ప్లాన్ డ్ గా చేసినట్టుంది. ఆ క్షణం లో నా డైటింగ్ కెలోరీ లెక్కలు ఏవీ గుర్తుకు రాలేదు. అమృత కొసరి కొసరి వడ్డిస్తుంటే చాలా కాలం తర్వాత తృప్తిగా భోంచేసాను.

" అడగడమే మరిచా.. మరి నువ్వు..."

" ఆహా సారు గారికి ఇప్పుడు గుర్తొచ్చామా.. " నవ్వేసింది. " ఓకేసారి చెప్పను గానీ నేనే సర్వ్ చేస్తా. " " వద్దులే బాబూ, తమరు అలా వసారాలో తీరిగ్గా కూర్చుంటే పది నిముషాల్లో వస్తా." " అవునులే అమ్మాయిలు తాము తింటున్నప్పుడు ఎవరూ చూడకూడదనుకుంటారట. " ఆటపట్టించాను. " ఎక్స్ క్యూజ్ మీ తమరు అలా దయచేస్తారా.." అమృత గట్టిగా అనేసరికి నవ్వుతూ బయటికి నడిచా

*******

రాత్రి 8.00 గంటలు

ఆకాశం అద్భుతంగా వుంది. పిండారబోసినట్లు తళ తళ మెరుస్తూ వెన్నెల గాలికి కదిలే ఆకులపై వెండి కిరణాలు తళుక్కుమంటున్నాయి. పువ్వుల పరిమళాలు మోసుకొస్తున్నాయి. గాలులు శరీరాన్ని అలా నిమురుతుంటే ఏదో తెలియని పారవశ్యం మామిడి చెట్టు కింద చిన్న చప్టా పై ప్రశాంతంగా కూర్చున్నా. నిశ్శబ్ధంగా ప్రవహిస్తోంది. ఇంట్లోంచి ఘంటసాల పాట మనసున మనసై.. గాలి అలలపై తేలాడుతూ చిన్నగా మనసును తాకుతోంది. డాక్టర్ చక్రవర్తి లోని పాట. డిగ్రీ రోజుల్లో ఈ పాటను ఎన్ని సార్లు పాడుకున్నానో. ఫ్రెండ్స్ కలిస్తే చాలు. ఈ పాట పాడమని పట్టుబట్టేవారు. ఆ రోజుల్లో నేనో చిన్న సైజు ఎస్. పీ. ని కానీ గ్రూపులో ఆ పాటే నన్ను ప్రత్యేకం గా నిలబెట్టింది. చుట్టూ తోట మధ్యలో ఇల్లు చూస్తుంటే వెన్నలంతా మేసి ఏరు నెమరేస్తోంది ఏటి కడుపున దాగి తోట నిదురోతోంది అన్న నండూరి వ్యాక్యాలు గుర్తొస్తున్నాయి. అదృష్టమంటే అమృతదే! ప్రతిరోజూ ఇలా ప్రకృతిని మనసారా ఆస్వాదించే చ్హాన్స్ ఎందరికి వస్తుంది? డిల్లీ జనారణ్యం లో ఇరుకిరుకుగా బతికేస్తున్న నాకు ఈ వాతావరణం ఓ అపురూప దృశ్య కావ్యంలా కనిపిస్తోంది. అమృతను చూడాలన్న నా ఆలోచనకు నేనే థాంక్స్ చెప్పుకున్నా. ఒకవేళ ఆ ఆలోచనే రాకుంటే ఇంత చక్కటి ప్రాంతం చూసేవాణ్ణి కాదేమో. ఇంతలో అమృత వచ్చి కూర్చుంది. ఉడికించిన పల్లీల ప్లేటు ముందుంచింది. కొన్ని క్షణాలు గడిచాయి.

"మాధవ్ ఇప్పుడు చెప్పు ఎలా వున్నావ్?"

"అది అడగాల్సింది నేను. ఉదయం నా ప్రశ్నకు బదులివ్వనేలేదు. మీ వారెక్కడ?"

" వాతావరణం చాలా హాయిగా వుంది. మనసుకు ఇష్టమైన మాటలైతే బెటర్ అనుకుంటా " అమృత మాటల్లో ఏదో మార్మికత. అయిదేళ్ళ తర్వాత కలుసుకున్నాం.. " ఎలా వున్నామో తెలుసుకోనక్కర్లేదా? " నిష్టూరంగా అడిగాను. " ఏముంది డిగ్రీ అయ్యాక నా పెళ్ళి . అంతా హడావిడిగా అయిపోయింది. ఆ మరుసటేడే ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడ సంపాదన బాగా వుంటుందటగా" ట కారాన్ని వత్తి పలికింది.

"మరి నువ్వు"

" మాధవ్ అందరి ఆలోచనలు ఒకేలా వుండవు కదా. తనకు డబ్బంటే ఇష్టం.. నాకు ఇలాంటి బతుకంటే ఇష్టం. పొంతన కుదరనప్పుడు ఎవరికేది ఇష్టమో అది చేయడమే మంచిది. " నెమ్మదిగా అంది.

"ఆయన ఇండియా వస్తుంటారా."

".. నా కాపురం ఎలా వుంది? ఎంత మంది పిల్లలు? ఏం చేస్తున్నారు? ఇవేగా నువ్వడగాలనుకున్న ప్రశ్నలు. పెళ్ళయిన ఏడాదికి ఆయన , నేను చెరోదారి అయ్యాం. డైవోర్స్ కాలేదు గానీ.. ఎవరి బతుకు వారిదే. తను దుబాయిలో, నేను ఇక్కడ. బీయెడ్ చేశాక ఈ ఊళ్ళో టీచర్ గా చేరాను. ఇక్కడ పేదల బతుకులు, అందులోనూ చిన్నారుల జీవితాలు చూసాక నా శక్తి మేరకు ఏదైనా చేస్తే బాగుంటుందనిపించింది. వాత్సల్య పేరిట సేవా సంస్థ ప్రారంభించా. మన క్లాస్ మేట్ రమేష్ యూ.ఎస్ లో వున్నాడు. నీకు తెలుసుగా తను అక్కడి ఎన్నారైలతో నా ప్రోగ్రాం లను స్పాన్సర్ చేయిస్తున్నాడు. టీచర్ గా వున్నప్పుడు ఈ పల్లెను చాలా దగ్గరగా పరిశీలించాను. పల్లెల్లో పిల్లల ఎదుగుదల, చదువు ఎంత కష్టమో తెలిసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్డే మీల్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఫలితం అంతంత మాత్రమే. పథకాలు మంచివే. డెలివరీ లో ఎన్నో లోపాలు. అదేదో అంటారే.. ఇచ్చే చేతులు పుచ్చుకునే చేతుల మధ్య మరిన్ని చేతులో అని , అలా వుంటుంది వ్యవహారం.

ఈ పిల్లలే నా ఉపాధి మార్గం అవుతున్నప్పుడు వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. అప్పట్లో నా వంటరితనం కూడా కారణం కావచ్చు. కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ ఆర్గనైజేషన్ నిర్వహించాను. కానీ రెండు పడవలపై ప్రయాణం కష్టమనిపించింది. అందుకే పూర్తిగా దీనికే అంకితమయ్యా, నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనే తాపత్రయం లేదు కాబట్టి స్వచ్చందంగానే నడిపిస్తున్నా. దేశం , సమాజం ఉద్దరిస్తున్నానన్న భారీ డైలాగులు కొట్టలేనుగానీ, చేతనైన సాయం చేస్తానన్న తృప్తి మాత్రం వుంది. అన్నిటికీ మించి ఊరి వాళ్ళు నన్ను నమ్మారు. ఇదిగో ఈ ఆశ్రమం పిల్లలూ ఇవే నా ప్రపంచం. అమృత మాటల్లో తన ఆలోచనల్లో సీనియారిటీ సీరియస్ నెస్ బాగా నచ్చింది. మునుపటికన్నా తనపై అభిమానం పెరుగుతున్న ఫీలింగ్. అంతేకాదు, నేను వస్తున్నట్టు అమృతకు ఎలా తెలిసిందో కూడా అర్ధమయింది. రమేష్ తో ఎఫ్.బీ లో చాట్ చేస్తూ చెప్పాను. బహుశా తను ఇన్ ఫార్మ్ చేసి వుంటాడేమో.  

అమృత మాటలు కొనసాగిస్తూ..

"...ఇక నా వైవాహిక జీవితమంటావా.. ఏడడుగులు పెళ్ళిలో నడిచామే గానీ ఆ తరువాత అడుగులు కలవలేకపోయాయి. తప్పెవరిదని వాదించడం కన్నా ఎవరంతట వారుండడమే మేలనుకున్నాం. తనూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఇది నా ప్లాష్ బాక్ "అమృత ఆగింది. కాసేపు నిశ్శబ్ధం.

మరీ ఈ విషయం కనీసం నాకు తెలపాలనిపించలేదా. క్షణం నా వైపు చూసి మెల్లగా నవ్వేసింది.  

" ఏంటి మాధవ్ చెబితే ఏమవుతుంది. ప్రాబ్లమే కాదనుకున్నప్పుడు క్యాజువల్ గా తీసుకోవడమే మంచిదేకదా. అప్పుడు మీరందరు భాధ్యతల్లో మునిగి తేలుతున్నారు. నిజం చెప్పాలంటే అసలు నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. అయినా ఇదో ముగిసిన సంఘటన. మొదట్లో ఒంటరితనం కాస్త బాధనిపించింది. అప్పుడప్పుడు మన వాళ్ళు కొందరైనా గుర్తొచ్చేవారనుకో."

" ఆ లిస్ట్ లో నా పేరు వుందా."

"హా..హ్హా.."

"అనుకున్నా ఇంకా అడగలేదేంటా అని. తమర్ని ఎలా మర్చిపోతాం సార్. అంది.. " ఓకే ఇప్పుడు నవ్వు  ..హాపీ కదా..  క్వైట్ హాపీ.. ఐయాం  లీవింగ్ ఇన్ మై ఓన్ వరల్డ్." అమృత అలా అనడంతో కాస్త మనసు కుదుటపడింది. "మాధవ్ వాతావరణం ఎంతో ప్లజంట్ గా వుంది. అనవసర కబుర్లు ఎందుకు. నీ పాట విని ఎన్నేళ్ళయింది. అప్పట్లో నీ పాటకు వీరాభిమానిని. అందులోనూ కిశోర్ "ముసాఫిర్ హూమే యారో" నీ గొంతులో మ్యాజికల్ గా పలికేది. ఒక్కసారి పాడవా ప్లీజ్. అమృత అడగుతుంటే కాదనలేకపోయా.. గొంతు సవరించుకున్నా. పాట కాగానే అమృత చిన్నపిల్లాలా వావ్ అంటూ అరిచింది.

సిల్సిలా   కభీ కభీ , చిత్ చోర్ లో జబ్ దీప్ జలే బాలూ మెలోడీలు మధు మాస వేళలో , పూచే పూల లోన పాటలు పట్టుబట్టి పాడించుకుంది. డిగ్రీ రోజుల్లో రోజూ పాటల సెషన్ నడిపే వాళ్ళం. నేను, రాజూ, మాధురీ పాడుతుంటే అమృత రమేష్ లు అద్భుతంగా పాటను వివరించేవారు. అదో అందమైన అనుభవం. వెన్నెల రాత్రిలో పాటలతో జ్ఞాపకాలపై కప్పుకున్న పరదాలు నెమ్మదిగా తొలుగుతున్నాయి. చివరిగా కరుణశ్రీ పుష్ప విలాపం పాడగానే అమృత చప్పున నా చేతులు పట్టుకుంది.

అద్భుతంగా పాడావు. మనసుకు ఎంత రిలీఫ్ గా వుందో తెలుసా. అంటూంటే తన కళ్ళల్లో ఊరిన చెమ్మ ఆ వెలుగులో ముత్యం లా మెరిసింది. చూస్తుండగానే రాత్రి పదిగంటలు అయింది.

" ఓకే మాధవ్ జీ ఈ వెన్నెల రాత్రిని సుమధుర సంగీత విభావరిగా మార్చినందుకు ధన్యవాదములు. " నాటకీయంగా నమస్కరించి ఫక్కున నవ్వేసింది.

*************

పడుకున్నానన్న మాటే గానీ ఓపట్టాన నిద్రపట్టడంలేదు. తల విదిలించి లేచి బయటకు వచ్చి కాసేపు వసారాలో పచార్లు చేసా. పక్క గదిలో అమృత ప్రశాంతంగా నిద్ర పోతోంది. కిటికీలోంచి కనిపిస్తున్న ఆ మనోహర దృశ్యాన్ని అప్రయత్నంగా చూస్తుండి పోయాను. తెలీకుండానే గది గుమ్మం దాకా అడుగులు పడ్డాయి. చూస్తున్న కొద్దీ కొత్త అందం ఏదో అమృతలో కనిపిస్తోంది. ఒక్కసారి చూస్తే గుర్తుండి పోయే రూపం తనది. అన్నిటికీ మించి పెదాలపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు. కిటికీలోంచి వెన్నెల కిరణాలు తనపై పడుతుంటే పోత పోసిన శృంగార శిల్పం లా వుంది... పరవశంతో  కూడిన మైకం కమ్ముకొస్తుంటే మనసు వశం తప్పుతోంది. అలా ఎంతసేపున్నానో నాకే తెలీదు. అమృత మరో వైపు తిరిగింది.....................................

ఆ తర్వాతేం జరిగింది?

వారి మధ్యనున్న స్నేహబంధం ప్రణయానుబంధమై...పరిణయానికి దారి తీసిందా? మాధవ్ లోని మోహావేశానికి అమృత నుంచి అనూహ్య స్పందనెదురైందా?

ముగింపు వచ్చేవారం........

మరిన్ని కథలు
chinta teerchina chitrpatam