Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chinta teerchina chitrpatam

ఈ సంచికలో >> కథలు >> పారని పథకం

paarani pathakam

పిసినారి పాపయ్య గా పేరు గాంచిన పాపయ్య పట్నానికి వెళ్లి రామపురానికి తిరుగు ప్రయాణమయ్యాడు. రామపురానికి పట్నానికి మధ్య ఒక బాడుగ బండి తిరుగుతుంది. పాపయ్య ఎంత దూరం అయినా నడిచి వెళతాడు గాని బాడుగ బండి మాత్రం ఎక్కడు. అనవసరం గా ఐదు వరహాలు వృధా అని పాపయ్య భావన. సాయంత్రం దాటి చీకట్లు ముసురుకుంటున్నాయి. దానికి తోడు ఆకాశమంతా మబ్బులు పట్టి సన్నగా వర్షం ప్రారంభం అయ్యింది. సరిగ్గా అదే సమయానికి ఒక బాడుగ బండి రామాపురం మీదుగా వెళ్తోంది. నడిచి వెళుతున్న పాపయ్యను “పాపయ్య! వర్షం పెద్దది అయ్యేలా వుంది. ఈ చీకట్లో తడుస్తూ.. ఇబ్బంది పడే బదులు బండి ఎక్కు, తొందరగా ఇల్లు చేరుకోవచ్చు.” బండి లోనుండి కేక వేసాడు పాపయ్య మిత్రుడు. మొండిగా ఈ వర్షం లో నడిచి వెళితే వచ్చే ఇబ్బంది గమనించి ఇక తప్పదన్నట్టు బండి ఎక్కాడు పాపయ్య.

బండి ఎక్కాడనే మాటే గాని “ఐదు వరహాలు” పోతున్నాయ్యానే బెంగ ఎక్కువయింది పాపయ్యకు. వర్షం పెద్దది అయింది. బండిలో అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే.. పాపయ్య మాత్రం “ఐదు వరహాలు” బాడుగ ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలో మనసులోనే ఒక పథకం వేసుకున్నాడు. రామాపురం సమీపిస్తుందనగా పాపయ్య బండి నుండి దూకి కావాలని బొక్క బోర్లా పడ్డాడు. బండి నడిపేవాడు కంగారుగా బండి ఆపి పాపయ్య దగ్గరికి వెళ్ళాడు.

పాపయ్య కుంటుకుంటూ లేచి బండి వాని చొక్కా పట్టుకుని “కాళ్ళు విరగ్గొట్టావు కదరా! పదా గ్రామాదికారి వద్దకు“ అని పెద్దగా అరిచేసరికి బెంబేలు పడిన బండి వాడు “క్షమించండి! పిల్లలు గల వాణ్ని నన్ను వదిలేయండి“ అని బ్రతిమాలేసరికి పాపయ్య బండి వాడిని వదిలేసాడు. పాపయ్య పెద్ద మనసుకి బండి లోని వారందరూ ప్రశంసించారు. బండి వాడు ఐదు వరహాలు బాడుగ అడగకుండా తన దారిన తను వెళ్ళాడు. ఐదు వరహాలు మిగలడం తో పాటు, పైగా తనది దయార్ద్ర హృదయమని పేరు కూడా రావడం తో.. తన పథకం పారిందని సంతోషం తో ఇల్లు చేరిన పాపయ్యకు గుండె గుభేల్ మంది. బండి నుండి దూకే సమయంలో తన సంచిని బండిలో వదిలేసాడు. అందులో “యాభై వరహాలు“ వున్నాయి. అందుకే “లోభికి ఖర్చు ఎక్కువ“ అని పెద్దలు అంటుంటారు.

మరిన్ని కథలు