Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ఇదివరకటి రోజుల్లోలాగ ఇప్పుడు పెంకుటిళ్ళు , బంగాళాలూ,  ఏదో కొన్ని పట్టణాలలోనూ, గ్రామాల్లోనే దర్శనం ఇస్తున్నాయి.  అవికూడా, ఏదో ఇంకా పాతతరం వారు బతికే ఉండబట్టి. ఎక్కడ చూసినా, డెవెలొప్మెంటు పేరుతో, ఎవడికో అమ్మేయడం, వాడిచ్చిన డబ్బుకితోడు, ఒకటో రెండో ఫ్లాట్ట్లు తీసేసికోడమూనూ. చేతులు దులిపేసికోడం. ఈరోజుల్లో, ధర పెరగబట్టి డబ్బులూ ఎక్కువే వస్తున్నాయి. కానీ, ఆ పాత ఇల్లు కట్టడానికి, ఆ ఇంటి యజమాని ఎంత కష్టపడ్డాడో మాత్రం గుర్తుకి రాదు. ఆరోజుల్లో, పెళ్ళికి కట్నంతో పాటు, కొద్దిగా స్థలంకూడా, స్త్రీధనంగా ఇచ్చేవారు, అల్లుడు ఎప్పటికో అప్పటికి ఇల్లు కడతాడూ, పిల్ల సుఖపడుతుందీ అని. పాపం ఆ అల్లుడుగారు కూడా, తనకొచ్చే బొటాబొటీ జీతంలోనే, కొంత మిగిల్చి, మొత్తానికి ఓ ఇల్లు తయారుచేసేవారు. అదికూడా, ఏదో మామూలుగా ఉండడం కాదు, సర్వహంగులతోనూ,  కుటుంబసభ్యులందరికీ విడివిడిగా గదులతోనూ. పైగా ఆరోజుల్లో, ఒక్కో కుటుంబంలో ఎంత ఎక్కువగా పిల్లలుంటే అంత శుభం అనుకునేవారు. ఓ నలుగురు మగా, ఒక ఆడపిల్లా ఉంటేనేకానీ, సంతృప్తి పడేవారు కాదు. కాలక్రమేణా, ఆ కుటుంబాలూ లేవు, అలాటి ఇళ్ళూ లేవు. చివరకి మిగిలినవి అగ్గిపెట్టెల్లాటి ఎపార్ట్మెంట్లు మాత్రమే.

నగరాలూ, పట్టణాలూ, పెరిగిన జనాభా ధర్మమా అని, ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడే ఆకాశ హర్మ్యాలు కట్టేస్తున్నారు. ఖాళీ లేకపోయినా ఫరవాలేదు, ఓ చెరువులాటిది కనిపిస్తే, దాన్ని కప్పెట్టేసి మరీ కట్టేయడం.  ఈ పట్టణాలూ, గ్రామాలూ మొదట్లో ఏర్పడ్డప్పుడు, ఆనాటి పాలకులు,  ఉన్న జనాభాకి సరిపడేటట్టు , రోడ్లూ, చెరువులూ, మురుగునీరుపోవడానికి మార్గాలూ, వ్యవసాయానికి కాలవలూ ఏర్పాటు చేశారు, ప్రజలు సుఖంగా ఉండాలని. కానీ, చివరకు జరిగిందేమిటయ్యా అంటే, డబ్బాశతో, ఈనాటి నాయకులు, వీలైనన్ని ఖాళీస్థలాలు కబ్జా చేసేసి, కోట్లు సంపాదించారు.. అదికారంలో ఉన్నారు కాబట్టి,   బిల్డింగులు కట్టడానికి కావాల్సిన అనుమతులకి కూడా ధోకా లేకుండా పోయింది.. అయినా అనుమతనేది ఓ లెక్కా ఏమిటీ? ఎప్పుడుకావాల్సొస్తే అప్పుడే తీసికోవచ్చు, వడ్డించేవాడు మనవాడైతే, ఇదో పెద్ద సమస్యా ఏమిటీ? ముందర, అమ్మబోయేవాటికి గిరాకీ తెచ్చుకోడం ముఖ్యం. వాళ్ళు కట్టే  గేటెడ్ కమ్యూనిటీల గురించి, ఏ పనీ, పాటా లేని ఓ ప్రముఖుడిచేత, పబ్లిసిటీ ఇప్పించేయడం. తన ఫీజు తనకి ముట్టినప్పుడు, ఎవరు మాత్రం ప్రచారం చేయరూ?  వీళ్ళని నమ్మి, కొనుక్కున్నవాడు ఏ గంగలోకి పోతే మనకేమిటీ?. ఇవి కొత్తగా టీవీల్లోనూ హోరెత్తించే  గేటెడ్ కమ్యూనిటీల విషయం.

నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, ఊరికి  మొదలూ, మధ్యా, చివరా ఎప్పుడో గాల్లోకి కలిసిపోయాయి. ఇదివరకు శ్మశానాలు ఊరికి చివరగా, ఏ నది ఒడ్డునో కట్టేవారు. ఆ నది ఎప్పుడో ఎండిపోయింది. ఇప్పుడు మిగిలినవి ఆ శ్మశానాలు మాత్రమే.. పైగా వాటికి చుట్టూరా, ఉండడానికి ఇళ్ళొచ్చేశాయి.. మీ ఇల్లెక్కడా అంటే, ఇదివరకటిరోజుల్లో, ఏదో ఒక కొండ గుర్తు చెప్పేవారు. అలాటిది, ఈవేళ ఫలానా శ్మశానం పక్కనా, అని చెప్పాల్సిన రోజులొచ్చాయి. వీటికి సాయం, ఏ తలమాసిన నాయకుడికో ఆలోచనొస్తుంది—మరీ శ్మశానం ఖాళీగా ఉందే, అంత జాగాలో ఎన్ని సొసైటీలు లేపొచ్చో అని. వెంటనే, వాడి వందిమాగధులతో ఓ ఉద్యమం లేవతీస్తాడు… శ్మశానం వలన  తన వార్డులో ప్రజలు భయపడిపోతున్నారూ, వెంటనే ఊరికి దూరంగా మార్చేయాలీ అని. వాడి ప్రాపకాన్నిబట్టి సాధిస్తాడుకూడా.

ఇవన్నీ ఒకవైపయితే, మురుగునీరు పోవడానికి కట్టిన డ్రైనేజీలకైతే  దిక్కే లేదు.అసలు అలాటివి  ఉన్నట్టే గుర్తులేదు . మురుగు నీరూ, వర్షాలొచ్చినప్పుడు వచ్చిన నీరూ, ఎక్కడకి వెళ్ళాలో తెలియక, పాపం, ఇళ్ళల్లోకి చేరిపోతున్నాయి. దానితో  పెద్ద వర్షం వచ్చినప్పుడల్లా, నీరు ఎక్కడిదక్కడే నిలిచిపోతోందని ఏడుపెందుకో అర్ధం అవదు.  వరదలూ, వర్షాలూ వచ్చిన ఓ రెండురోజులకి , ఆ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడో, మంత్రో రావడం, నెత్తీనోరూ బాదుకున్నట్టు ఫొటోలు తీయించుకోడమూ, లాటివి మామూలే.   కొసమెరుపు ఏమిటంటే, మాయమైపోయిన డ్రైనేజీ ల గురించీ,  కప్పెట్టబడిన చెరువుల ఆచూకీ తెలిసికోడం కోసం, ఓ విచారణ కమెటీ వేయడం. వాడికీ తెలుసు, అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని కబ్జాలు చేశాడో. ప్రస్తుతం మనదేశంలో, ఏ ప్రాంతానికి వెళ్ళినా కనిపించే దుస్థితి.

సర్వేజనా సుఖినోభవంతూ..

మరిన్ని శీర్షికలు
sree bhallalesvara ganapati