Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటిఫణిబాబు

 

సాధారణంగా  ఏదైనా సరే, “ అతి” అయితే, మొహం మొత్తుతుంది కదూ. ఉదాహరణకి, ఏదో పదార్ధం తియ్యగా ఉందని , ఊరికే దొరికిందికదా అని  తినడం మొదలెడితే, ఏమౌతుందో అందరికీ తెలిసిందే. మళ్ళీ తీపి పదార్ధం, ఛస్తే తినకూడన్నంత మొహం మొత్తుతుంది. అలాగే , ప్రతీ విషయమూనూ. ఏదో బావుంది కదా అని , ప్రతీ సినిమా ఎక్కువసార్లు చూడలేముగా. ఏదో ఏడాదిలో ఒకటి రెండు సార్లైతే పరవాలేదు కానీ, మన  టీవీ చానెళ్ళవాళ్ళు,  భాషతో నిమిత్తం లేకుండా, ప్రతీ భాషవారూ, ఏవో నాలుగైదు సినిమాలని, కనీసం నెలలో ఒకసారో, రెండుసార్లో వేస్తూంటారు. పైగా ఈ చానెళ్ళ వారు , తమకున్న ఒక్క చానెల్ తో సరిపెట్టుకోరు, అదే యాజమాన్యం వారు, తలో పేరూ పెట్టి,  రెండుమూడు చానెల్స్ నడుపుతున్నారు. ఆతావేతా జరుగుతున్నదేమిటంటే, ఒకే సినిమాని, , నెలకి కనీసం నాలుగుసార్లు చూడాల్సొస్తోంది. పైగా వీటికి సాయం, వ్యాపార ప్రకటనలోటీ. రెండున్నర గంటల సినిమానీ, జీడిపాకం లా  మూడున్నరగంటల పాటు భరించాల్సొస్తోంది. అంత బోరు కొట్టేస్తూంటే, చూడ్డం మానేయొచ్చుగా అనొచ్చు. చివరకి చేయాల్సిందదే అనుకుంటాను..

ఇది వరకటి రోజుల్లో, వార్తాపత్రిక చదవడం అనేది, ఓ అలవాటుగా ప్రారంభించి, చివరకి ఓ వ్యసనం లా మారిపోయేది. ప్రొద్దుటే, టిఫినైనా మానేసేవారు కానీ, వార్తాపత్రిక ఒక్కసారి చూడకుండా ఉండలేకపోయేవారు. ఎంత పనుండనీయండి, వార్తా పత్రిక చూడకుండా, రోజెళ్ళేది కాదు. కర్మం కాలి, ఆరోజు పత్రిక రాకపోతే, ఇంట్లో వాళ్ళందరిమీదా చిరాకు పడిపోయేవారు, ఆ ఇంటి పెద్ద. కారణం, ఆ రోజుల్లో  వార్తా పత్రికలూ, వాటిలోని విశేషాలూ, అంత ఆసక్తికరంగా ఉండేవి. పైగా కొన్ని ప్రాంతాల్లో, అంటే రవాణా వ్యవస్థ అంత సదుపాయంగా లేని ప్రదేశాల్లో,  ఉదయం బదులు, సాయంత్రాలు వచ్చేది. ఆ పత్రికేమో, అంతకు ముందురోజు అర్ధరాత్రి  దాకా వచ్చిన వార్తలే ఉండేవి. అంటే, సాయంకాలాలు వచ్చిన వార్తాపత్రికలో రెండురోజుల క్రితం జరిగిన విశేషాలన్నమాట. అయినా సరే, పత్రిక చదవాల్సిందే.  ఇంక జాతీయ, అంతర్జాతీయ ఆటల  విషయానికొస్తే, రేడియోలో కామెంటరీలు వినడం ఓ పెద్ద వ్యసనం లా ఉండేది..  వాటి  చిత్రాలు ఫిల్మ్స్ డివిజన్ వారు, వారంవారం  ఓ డాక్యుమెంటరీగా చూపించడం,  వాటిని  చూడడంకోసమైనా, తప్పని సరిగా ఏదో సినిమాకి వెళ్ళేవారు.  కాలక్రమేణా, టీవీ లు వచ్చేక, ఆ డాక్యుమెంటరీలు అటేక్కేశాయి.  ఈరోజుల్లో, ఎక్కడ చూసినా క్రికెట్ మాచీలే. వాటికోసం ప్రత్యేక చానెళ్ళు.  ఏదో ఏడాదికోమాటు, బయటిదేశాలనుండి వచ్చిన జట్టుతో, ఓ అయిదు టెస్టుమాచీలు ఆడడం. అదీ  సంక్రాంతికి మెడ్రాసు లోనూ, కొత్తసమవత్సరానికి కలకత్తాలోనూ తప్పని సరిగా  ఉండేవి. కానీ ఇప్పుడో… తుమ్మితే క్రికెట్టు, దగ్గితే క్రికెట్టు. ఓ వేళా పాళా లేకుండా, క్రికెట్టు పిచ్చి పట్టేసింది మనవాళ్ళకి, ఆ ఆటగాళ్ళేమో, డబ్బులకి కక్కూర్తి పడి, ఆ మ్యాచ్చీలను ఫిక్స్ చేయడం. అందరికీ తెలిసేకూడా, వెర్రివెంగళప్పలవడం.

 ఇంక మన చానెళ్ళవాళ్ళ వార్తల విషయానికొస్తే, రోజుకొ విషయం పట్టుకోవడం, దానిగురించి, చూపించిందే చూపించి, మన ప్రాణాలు తీయడం. లేదా వారానికో సారి ఏ తలమాసిన నాయకులనో స్టూడియోలకి పిలిచి, వారిచేత నానా చెత్త మాటలూ మాట్టాడించడం.  దేశ విదేశాలలో జరిగే ప్రతీ సంఘటనమీదా మన మేధావులు చర్చించడమే. కానీ, ముఖ్యమైన రైతు ఆత్మహత్యలలాటివి మాత్రం పట్టవు. ఏదైనా అంటే, “ ప్రభుత్వం ఉందికదాండీ వాటిని చూసుకోడానికీ.. “ అని సమర్ధన. అసలు ఈ నాయకులనేవారికి పనేమీ ఉండదా అనిపిస్తూంటుంది. ఔనులెండి, వాళ్ళేమైనా మనలా రైతు బజార్లకెళ్ళాలా, పిల్లల్ని స్కూళ్ళకి తీసికెళ్ళాలా, బస్సులకోసం  గంటల తరబడి క్యూల్లో నుంచోవాలా? అయినా రోజులెళ్ళిపోతున్నాయి..

 అసలు సిసలు కామెడీలు చూడాలంటే మాత్రం, మన రాష్ట్రశాసనసభ, పార్లమెంటు లో జరిగే ప్రత్యక్షప్రసారాలు చాలు. ఏదో ఒక విషయం మీద జుట్టూ జుట్టూ పట్టుకోడం మాత్రం మానరు. నిజంగా, స్పీకరు సీటులో కూర్చున్నవారి ఓపిక్కి మెచ్చుకోవాలి. అబ్బ.. ఎంత సహనమో… వాళ్ళు చూపించే సహనంలో, ఓ పాతిక శాతం మిగిలినవారికి ఉంటే చాలు… “ అసహనం “ పేరుతో జరుగుతున్న అల్లరి ఆగుతుంది. తిన్న తిండరక్క బహుమతులు , బిరుదులూ తిరిగిచ్చేసేవాళ్ళు కొందరైతే, “దేశం విడిచి వెళ్ళిపోతానంటోందీ మా ఆవిడా…” అనేవాడింకోడూ.. అసలు ఇలాటి వారందరినీ భరించే ఓపికా, సహనమూ, ఇంకో దేశంలో ఎక్కడైనా ఉంటాయంటారా?

సర్వేజనా సుఖినోభవంతూ..

మరిన్ని శీర్షికలు
pounch patas