Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope11th december  to 17th december

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - sahiteevanam

sahiteevanam

ఆముక్తమాల్యద 

(గతసంచిక తరువాయి)

శ్రీకారి కృపార్ద్రేక్షణ!
వైకుంఠ! యకుంఠ భక్తవరద! పదాబ్జా
స్తోకమరందాయితగం
గా!కాకోదరనగోదయస్థపతంగా!

శ్రీకరమైన, కృపారసంచేత ఆర్ద్రమైన చూపులుగలవాడా! నిరంతరాయంగా భక్తులకు వరములిచ్చేవాడా! నీ పాదమనే  కమలముయందు అంతులేని, సమృద్ధమైన గంగానది అనే  మకరందాన్ని నింపుకున్నవాడా! శేషశైలము అనే ఉదయగిరి  మీద ఉన్న, ఉదయించిన సూర్యునివంటివాడా! వేంకటేశా! వినుమయ్యా! అని ఆముక్తమాల్యదా ప్రబంధం లోని చివరిదైన  ఆరవ ఆశ్వాసాన్ని ప్రారంభించాడు శ్రీకృష్ణదేవరాయలు.భారతీయ సాహిత్యంలో అత్యున్నత స్థాయిని పొందిన, అత్యుత్తమమైన సందేశాన్ని యిచ్చిన  సాహిత్యం ఈ ఆశ్వాసము. భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలకు నిర్వచనాన్ని  యిచ్చిన ఆశ్వాసం యిది. 'ప్రపంచ సాహిత్యంలో ఇలాంటిది ఎక్కడా లేదు' అని విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రశంసించిన ఆశ్వాసము యిది. కవిత్వ స్థాయి పరంగా అన్నారు ఆ మాట  అన్నారు విశ్వనాథ. సందేశం పరంగా, నీతి పరంగా ఇలాంటి కథలు కోకొల్లలు భారతీయ వాజ్గ్మయంలో. ప్రతీకాత్మకంగా చూస్తే, సాహితీ ప్రాంగణంలో పాకడం కూడా యింకా సరిగా చేతగాని అర్భకుడైన ఈ వ్యాసకర్త దృష్టిలో మాత్రం యింతటి అత్యున్నత సందేశాన్ని యిచ్చినది యిలాంటిది కథ  మరొక్కటే ఉంది. దీనికీ దానికీ మూలకర్త వేదవ్యాసులవారే, ముందు ముందు మరింత వివరంగా తెలుసుకుందాం!   

విష్ణుచిత్తులవారు తన కుమార్తె అవస్థను చూసి 'యిదేమి పూజ? యిదేమి ఆరాధన? యిదేమి  వ్రతము? యిదేమి తపస్సు? ఏమీ అర్థం కావడంలేదు స్వామీ! నీక తెలియనిది లేదు కదా! నా కుమార్తెకు ఈ అవస్థ ఏమిటి స్వామీ?' అని అడిగాడు. నారాయణుడు నవ్వి, చెప్పడం  ప్రారంభించాడు.  

కలఁ డొకరుండు పేరుకొనగాని కులంబు మదీయ భక్తుఁ డి
య్యిల మును వాఁడు వామనత నే వసియించిన పుణ్యభూమియం
దుల కొక యోజనత్రయపు దూరపుటూర వసించి బ్రాహ్మవే
ళలఁ జనుదెంచి పాడు మము లాలస మంగళనామకైశికిన్ 

తన కుమార్తె అవస్థను గురించి అడిగితే కథను చెప్పడం మొదలెట్టాడు కమలాక్షుడు. 'అనగనగా.. నా భక్తుడు ఒకడు ఉన్నాడు. వాడిది నిమ్నకులం. నేను వామనావతారంలో ఈ భూమిమీద నివసించిన  చోటికి ఒక మూడు యోజనాల దూరంలో నివసించేవాడు. బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి కోరికతో, ప్రేమతో  మంగళకైశికీ రాగంలో నన్ను స్తుతిస్తూ కీర్తనలు పాడేవాడు. 

జాత్యుచిత చరిత్రమ మ
త్ప్రీత్యర్థం బూఁది తనదు హృదయము శుచితో 
నిత్యంబుగఁ దత్తనుసాం
గత్యము మసిపాఁత మానికంబై యొదుఁగున్

నాకు ప్రీతికరంగా ఉండడం కొరకు, తన జాతికి తగిన నడవడికతో, హృదయాన్ని అంటే, మనసును శుచిగా ఉంచుకుని, మసిగుడ్డలో కట్టిన మాణిక్యంలాగా ఉండేవాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః  పరధర్మాత్స్వనుష్ఠితాత్.. అని నేను చెప్పినదే గీతావాక్యం కనుక, అలా తన స్వధర్మనిర్వహణ  చేస్తూ, మనస్సును శుచిగా ఉంచుకునేవాడు. పవిత్రమైన అంతఃకరణంతో నేన్ను కీర్తించి సేవించేవాడు. 'మనశ్శౌచం జన్మశౌచం కర్మశౌచంచ భారత శరీరశౌచం వాక్శౌచం, శౌచం పంచవిధం స్మృతం,పంచశ్వేతేషు మనశ్శౌచం విశిష్యతే' అని ఆర్షవాక్యం. మనసుకు సంబంధించినది, జన్మకు  సంబంధించినది, కర్మకు(చేసేపనికి)సంబంధించినది, శరీరానికి సంబంధించినది, వాక్కుకు సంబంధించినది.. అని శౌచం అంటే శుచి అంటే పరిశుద్ధంగా ఉండడం ఐదు రకాలు. వీటన్నిటిలోకీ మనస్సు పరిశుద్ధంగా ఉండడమే విశేషమైనది, ఉన్నతమైనది అని అర్థం. మనస్సు కుళ్ళుతో, బురదతో కంపుగా ఉండి, జన్మ, వృత్తి, శరీరము, పలుకులు ఎంత ఉన్నతంగా  ఉన్న, అందంగా ఉన్న, నాజూగ్గా నాగరికంగా ఉన్నా, నీచమే, నికృష్టమే అని భారతీయుల ఉవాచ! ఆ గీతాచార్యుని పలుకులను, ఈ ఆర్ష వాక్యాన్ని ధ్వనించాడు రాయలవారు యిక్కడ. చండాలుడు  అయినా, తన కులధర్మాన్ని పాటిస్తూ, పరిశుద్ధమైన మనసు కలవాడు కనుక నాకు ప్రీతిపాత్రుడు  అంటున్నాడు సాక్షాత్తూ దేవాదిదేవుడు!

చమురైన తోల్కుబుసంబు టెంకియును ని 
త్తళి శంఖ చక్ర కుండలము లమర
దివెదారికొమ్ముదోల్తిత్తియు జోడమ్ము 
మెడమీది మొగలాకుగొడుగు దనర 

మత్పాదరక్షయు మావు పెన్వెరక గు
ట్టిన యోటి తిపిరిదండెయును మెరయ 
జిటితాళములు సంక పుటిక నొక్కొకమాటు
గతిరయంబున దాకి కలసి మొరయ 

వలుద వనమాలకంటెయు మలినతనువు 
బట్టెతిరుమన్ను బెదరు గెం పుట్టు జూపు 
బసుపుబొడితోలు పల్లంబు నెసక మెసగ 
వచ్చు సేవింప సురియాళు వైష్ణవుండు 

చమురు అంటిన చర్మము, కుళ్ళాయి కట్టుకుని, చెవులకు ఇత్తడి శంఖ చక్రాకార కుండలాలు పెట్టుకుని, భజనల్లో వెలిగించే దీపపు సెమ్మెను పట్టుకుని, తోలుతిత్తిని బాణంలాంటి పదునైన ఆయుధాన్ని  వెంటబెట్టుకుని, మెడ మీదకు ఆనిన మొగిలి ఆకుల గొడుగును ఉంచుకుని, ఒక భుజాన నా పాదరక్ష వ్రేలాడుతుండగా, మరొక భుజాన గుర్రపు వెంట్రుకలు తీగలుగా ఉన్న ఓటి సొరకాయ బుర్రను వీణగా  చేసుకుని, వేగంగా ఆత్రుతతో వస్తున్నపుడు చంకలో వ్రేలాడుతున్న చిటితాళాలు ఒకదానికి ఒకటి తగిలి ఖంగుమని మోతలు చేస్తుండగా, తులసిమాలను ధరించి, మాసిన శరీరముతో, దేహాభిమానం  లేకుండా, తిరుమళి పట్టెవర్ధనాలు తీర్చి దిద్ది, ఎర్రని కళ్ళతో బెదురుచూపులు చూస్తూ, పసుపు బాగా పట్టించిన తోలు జందెమును ధరించి, యిలా కళకళలాడుతూ నన్ను సంకీర్తనతో సేవించడానికి  వచ్చేవాడు ఆ మాలదాసరి. చిత్రకారుడు కుంచెతో సృష్టించినట్లు మాలదాసరిని అతని వృత్తికి,ప్రవృత్తికి, నిరాడంబరతకు, అమాయక గ్రామీణ జీవనశైలికి తగినట్లుగా రూపు పోసి కనులముందు  కవితాకృతిని సాక్షాత్కరింపచేశాడు శ్రీకృష్ణదేవరాయలు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
namaskara puraskaram