Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

గతసంచికలో ఏం జరిగిందంటే...  http://www.gotelugu.com/issue139/391/telugu-serials/vedika/vedika/

“మీరు చెప్పేది కరెక్టే మామయ్యా.  నా మీద ఆ కుటుంబానికున్న అభిమానం, నమ్మకం ఎక్కువేనని అర్ధమయింది.  రాణి వల్ల ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితికి తోడు, అంకుల్ ఇప్పుడు అనారోగ్యంతో కూడా బాధ పడుతున్నారు.   చేతనైన సాయం చేయాలి కదా మామయ్యా! అదీకాక ముందు నుండీ ఆయన పట్ల నాకు ఎనలేని గౌరవం అని మీకూ తెలిసిందే కదా,” సౌమ్యంగా నచ్చజెప్పే ధోరణిలో జగదీష్...

నాన్న మౌనంగా తలాడించారు.

“అయినా .. అసలు సమస్యంతా మన చంద్రకళ వల్లే  మామయ్యా.   చంద్రతో పోటీ పడుతూ, లేస్తూ అలా మొండిగా తయారయింది రాణి...,” అని నవ్వేసాడు జగదీష్...

‘వింటున్నావు కదూ’ అన్నట్టుగా నా వంక చూసాడు...

వింటున్న నాన్న, అమ్మ కూడా నవ్వేసారు.

“ఇకపోతే, మామయ్యా,  గత పదేళ్లగా మీరు పడ్డ శ్రమ, చంద్ర కన్న కలలు నిజమవ్వబోతున్నాయి.... మీ మొట్టమొదటి వరల్డ్ కల్చరల్ టూర్ కి ఎల్లుండే ప్రయాణం. అందరం ఈ సమయాన్ని ఎంజాయ్  చేయాలి.  కాబట్టి ఇప్పుడు భూషణ్ గారి విషయంగా మీరెవ్వరూ బెంగ పెట్టుకోవద్దు.  మీకు నా మనసు తెలుసు... నా నడవడి తెలుసు,” అన్నాడు.

“అంతేరా, తమ్ముడూ, జగదీష్ అనేది నిజమే.  అతని మనసు వెన్న.  రేపు డాక్టర్ అయ్యేవాడు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని, మరి సాయం చేసే జాలి గుండె ఉంటుంది కదా!.  మీ డాన్స్ ట్రిప్పులన్నీ అయ్యాక,  మన చంద్ర కల్యాణం జగదీష్ తో జరిపించేయండి... అంతా బాగుంటుంది...శుభం,” అంది కోటమ్మత్త.

**

ప్రయాణానికి ముందు రోజు సాయంత్రం, జగదీష్ తో  షాపింగ్ చేసాక, కాసేపు పార్క్ లో కూర్చున్నాము. 

నా చేయి తన చేతిలోకి తీసుకుని, “ఐ లవ్ ఓన్లీ యు, నీవెటువంటి భయాలు పెట్టుకోవద్దు,” అంటూ నన్ను దగ్గరకి తీసుకున్నాడు.

అతని భుజం మీద తలానించి, “ఇప్పుడు మనసు కుదుటపడిందిలే.  థ్యాంక్స్,” అన్నాను.

**

ఇంటికి వెళ్ళేప్పటికి అమ్మ మా కోసమే హాల్లో వెయిట్ చేస్తుంది...

“ఏమర్రా,  ఇంత ఆలస్యం? నాన్న గాభరా పడుతున్నారు... తెలారుజామునేగా ఫ్లైట్....ఇంతకీ మీరు భోజనం చేస్తారా? బయట తినేసారా?” అమ్మ ప్రశ్నిస్తూనే ఉంది.

ఇంతలో పక్కనే ఉన్న నా రూములో నుండి  ఫోన్ రింగవడం వినబడింది. 

“విక్రమ్ అయ్యుంటాడు.  నీతో మాట్లాడాలని, ఇప్పటికి నాలుగు సార్లు ఫోన్ చేసాడు.  ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళావుగా.  నీ తమ్ముడు కూడా నీ రూములోనే, నీ కోసం వెయిటింగ్.   ...ఇప్పుడు నిద్రకి పడుంటాడు కూడా,” అంది అమ్మ.....

“మేము బయట తినేసామత్తయ్యా.. ఇంకేమీ వద్దు..

కొద్దిసేపు అందరూ రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్,” జగదీష్ తన రూము వైపు నడిచాడు.

“విక్రమ్ కి నేను కాల్ చేస్తాలేమ్మా. నన్ను విష్ చేయడానికే చేసుంటాడు.  వినోద్ ని నా గదిలోనే ఉండనీ.  వాడితోనూ మాట్లాడుతానులే,” అటుగా కదిలాను. 

**

మాకు అభినందనలు తెలిపి, వీడ్కోలు పలకడానికి, తెల్లారుజామున కూడా అభిమానులు, రాణి ఫాన్స్ వచ్చారు.  పూలహారాలతో మమ్మల్ని ముంచెత్తారు..

ముత్తురామన్ సార్, సంస్కృతీ టి.వి ప్రొడ్యూసర్, మూర్తిగారు మాకు సెండాఫ్ పలికారు..

ఎయిర్ పోర్ట్  లో, జగదీష్ చేయి విడువకుండా, అతన్ని తన వద్దే ఉంచేసింది రాణి...

అందరం సెక్యూరిటీ లైన్లోకి వెళ్ళేంతమటుకు కూడా అదే పద్ధతి అవలంబించింది..

అతి కష్టం మీద, జగదీష్ తో, కొద్దిక్షణాలు మాత్రం దొరికాయి, వీడ్కోలు చెప్పేందుకు.. 

వినోద్, కోటమ్మత్తకి కూడా చెప్పి అక్కడి నుండి కదిలాను.

**

ఫ్లైట్ లో,  విండో సీట్ దొరకడంతో, డిన్నర్ అయ్యాక, బ్లాంకెట్ కప్పుకుని  పక్కకొరిగాను..  జగదీష్ ని తలుచుకుంటూ, రెండురోజులుగా జరిగిన  సంఘటనలు నెమరు వేసుకుంటూ కళ్ళు మూసుకున్నాను...

జగదీష్ ని విడువకుండా, రాణి అలా వెంటే ఉండడం, సెక్యూరిటీకి వెళ్ళే ముందు గట్టిగా హగ్ చేసి, వీడ్కోలు చెప్పడం, చాలా ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ నా భయాలు నన్ను చుట్టుముట్టాయి.... 

జగదీష్ ని, రాణి అంత ఈజీగా వదిలిపెట్టే రకంగా లేదనిపిస్తుంది.   వేచి చూడాలి. 

ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను....

**

మలేషియాలోని కౌలాలంపూర్ లో అడుగుపెట్టింది మొదలు, ఓ కొత్త ప్రపంచంలో, ఓ కొత్త అధ్యాయంలా కొనసాగము.  ఇనాగురాల్ ప్రోగ్రాం నుండి మొదలుకుని, ప్రతిరోజు ప్రతిపూట నృత్య-సంగీత ఉత్సవంలా జరిగుతున్నాయి ప్రోగ్రాములు.  

అన్ని రకాల అభిరుచులకి సరిపడా, ప్రోగ్రాంలోని అంశాలని పొందు పరుస్తూ, అమ్మ నాన్న రాత్రింబవళ్ళూ శ్రమ పడుతున్నారు. 

సాంప్రదాయ కూచిపూడి, జానపదాల మధ్యలో అన్నమాచారి కీర్తనలు పొందుపరిచి, ప్రోగ్రాం బాగుండేలా ఉత్సాహంగా పని చేస్తుంది అమ్మ.  నాన్నలోని సంతోషం, అమ్మలోని సంతృప్తి తో మరింకేమీ పోటీ పడలేవు’ అన్నట్టుగా జరిగిపోతుంది మా టూర్. 

పబ్లిక్ రిలేషన్స్ , మీడియా  ఇంటర్వ్యూలు, పబ్లిసిటీ విషయాలు చూసుకోడంతో భూషణ్ అంకుల్ బిజీగా ఉంటే, లైట్ మ్యూజిక్ అంశాలు, రాణి కాస్ట్యూమ్స్ కూర్చడంలో మునిగిపోయింది, ఆంటీ.

ప్రాక్టీసులు, సైట్-సీయింగ్ లు,  ప్రోగ్రాములతో సరదాగా గడిపేస్తున్నారు, ఆర్కెస్ట్రా వాళ్ళు.

వేలాది ప్రేక్షకుల నుండి, పొందుతున్న మెప్పు, మీడియా వారి నుండి అందుతున్న ప్రోత్సాహాలతో, మేఘాల మీద విహరిస్తున్నట్టు, హరివిల్లు పై నాట్యం చేస్తున్నట్టు, మనసు పరుగులు తీస్తుంది...అలపన్నదే తెలియడంలేదు.

“ఈ ప్రపంచంలోని దేశదేశాల్లో ఉన్న సాంస్కృతిక  సభలు నీ నృత్యానికి  ‘వేదిక’ లవ్వాలి.  నీలోని ఈ కళకి, కళాభిమానుల హృదయాలు ఉప్పొంగి పోవాలి,” అన్న నాన్న మాటల్ని పదేపదే గుర్తుచేసుకుంటూ, ప్రతిరోజు, ప్రతి ప్రోగ్రాం రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నాను.

‘కౌన్తాన్’ నగరంలోని  మహారాజ ప్యాలెస్ వారి ఆహ్వానం పై,  అక్కడ, నృత్య ప్రదర్శన చేసే ఓ అరుదైన అవకాశం కూడా లభించింది నాకు. 

నెల రోజుల టూరులో దాదాపు ముప్పై ఐదు ప్రోగ్రాములు చేసాము.  అటు తెలుగు సభలకి, ఇటు చెన్నై సాంస్కృతిక విభాగం వారికి అనుకున్న దానికంటే ఎక్కువగానే నిధులు సమకూరాయన్నారు.   తమిళ సంఘం వారి పేద విద్యార్ధుల స్కాలర్ షిప్పులకి సైతం నిధులని కేటాయించడాన్ని –నాన్న, అంకుల్ సమర్ధించారు.

**                                    

అదంతా ఒక ఎత్తైతే, భూషణ్ అంకుల్ – నీరూఆంటీ – రాణీ ల గురించి, కొత్త విషయాలు తెలుసుకోడం మరో సంగతే. 

రాణి అంటే ఆమె తల్లితండ్రులకి ఎంతటి ప్రేమ, వాత్సల్యం ఉన్నాయో, ఆమె మాట కాదనలేని  అంతటి  బలహీనత కూడా ఉందని గమనించాను.. 

షాపింగ్ – సినిమాలకి, విడిగా, రాణికి ఒక ప్రైవేట్ టాక్సీ  పెట్టారు...

అంతగా గారాబం చేస్తారు రాణిని.

అన్నిటా తన మాట సాగాలన్న రాణి మొండితనం కూడా బయట పడింది...

ప్రోగ్రాముల వరస తన ఇష్ట ప్రకారమే ఉండాలనడం, తనకిష్టమైన వరసలో పాట అంశాలని ఉంచమని మొండికేయడం లాంటి చేష్టలతో అమ్మని ఇబ్బంది పెట్టింది.

పోతే, మా ఎదుటే జగదీష్ కి ఫోన్ చేసి మాట్లాడ్డం, అమ్మానాన్నా కూడా సహించలేకపోయారు. త్వరలోనే జగదీష్ తో నా నిశ్చితార్దం జరిపించి,  రాణి వైఖరికి ముగింపు తేవాలని కూడా నా ఎదుటే  అనుకున్నారు. 

ఏమైనా, ప్రోగ్రాముల విషయంగా మాత్రం బోలెడంత ఉత్సాహాని, సంతోషాన్ని మూటగట్టుకుని టూర్ ముగించి సింగపూర్ నుండి  బయలుదేరాము.

**

ఇల్లు చేరిన మరునాటి నుండే, చెన్నై డాన్స్ ఫెస్టివల్ కి, యాంకర్ గా వ్యవహరించడంలో బిజీ అయిపోయాను. 

వారం రోజుల పాటు, మహా సరదాగా గడిచిండి ఫెస్టివల్...

వెనువెంటనే,  సంస్కృతీ టి.వి ఇరవయ్యో వార్షికోత్సవంతో ఊపిరి సలపనంతగా బిజీ అయ్యాను... ఇరవై ప్రత్యేక నృత్యాలు, ఇరవైమంది కళాకారుల సన్మానాల ఏర్పాట్లు స్వయంగా ప్లాన్ చేసే బాధ్యత తీసుకొన్నాను. 

రెండువారాలు ఆప్రిపరేషన్ తరువాత, ఒక వారం షూటింగ్. తరువాత వేదిక పై ప్రదర్శన....రాత్రింబవళ్ళు  ఉత్సాహంగా పనిచేస్తున్నాను...

**

రెండు వారాలనుకున్న పని మూడు వారాలకు సాగి, మొత్తానికి చక్కగానే ముగిసింది.

వార్షికోత్సవానికి సంబంధించిన షూటింగ్ పని ముగించుకుని, ఇల్లు చేరేప్పటికి, అమ్మా నాన్న, కోటమత్త కబుర్లు చెప్పుకుంటూ, టీ తాగుతున్నారు...

“రామ్మా,  కూర్చో, హార్లిక్స్ కలిపి తెస్తానుండు,”   అంటూ అత్త లోనికెళ్ళింది..

చైర్ లో కూలబడి, ఆటమన్  మీదకి కాళ్ళు చాపుకున్నాను....

ఎదురుగా టేబిల్ మీద లావుపాటి రెడ్ కలర్ ఫైల్ కనబడింది.... ప్రోగ్రాముల వివరాలు ఎప్పటికప్పుడు అందులోనే రాస్తుంది, అమ్మ....

అమ్మా, మన లండన్ ప్రోగ్రాం ప్లానింగ్ అయిందా?” అడిగాను.

“నీకు చెప్పవలసిన కొత్త విషయాలు ఉన్నాయి,  బిజీగా ఉన్నావని డిస్టర్బ్  చేయలేదు,” అంది జవాబుగా. ఏమిటన్నట్టు చూసాను. 

“లండన్ టూర్, తనకి వద్దని డిసైడ్ అయింది రాణి. అదే టైములో ఓ తమిళ సినిమాకి ప్లే బ్యాక్ పాడబోతుందట,”  సంగతి చెప్పింది.......

లేచి వెళ్లి, అమ్మ పక్కనే కూర్చుని, ఆమె భుజాల చుట్టూ చేయి వేసాను...

“...నీవేమీ నర్వస్  అవ్వకమ్మా ... రాణి బదులు నీవే చక్కగా పాడవచ్చు... అసలు మనకి ఇది ఓ మంచి అవకాశం ... మా అమ్మ ఎంతటి ప్రతిభావంతురాలో ప్రపంచానికి తెలియడానికే,”  వివరించాను...

అత్త హార్లిక్స్ తెచ్చి నాకందించి, మాకెదురుగా కూర్చుంది....

“ఈ టూర్  అయ్యాక నిశ్చితార్దం ఏర్పాటు కూడా వేగిరం చెయ్యాలి,  సత్యం,” కోటమ్మత్త నాన్నతో....

“ఏముందక్కా,  అందరితో మాటలయ్యాయి.   ఆరునెల్ల తరవాతే, జగదీష్ కి  సెలవు దొరుకుతుందట.  నిశ్చితార్దం అయ్యాక, ఓ వారం వెకేషన్ తీసుకొని మనందరితో నార్త్ ఇండియా టూర్ వెళదామంటున్నాడుగా. 

పోతే, ఇక ఈ నిశ్చితార్థం విషయం, వీలయినంత త్వరలో భూషన్ వాళ్లకి తెలియజేస్తాను,” అన్నారు నాన్న, టీ కప్పు టేబిల్ మీద పెడుతూ. 

... పెద్దవాళ్ళని నార్త్ ఇండియా టూర్ చేయిద్దామని’ జగదీష్ అనడం  గుర్తొచ్చి, నాలో నేను నవ్వుకున్నాను.  పెద్దవారి గురించి ఆలోచిస్తాడు...... నిస్వార్ధంగా మెలుగుతాడు.  మంచివాడు నా జగదీష్’ అనుకుంటూ ఖాళీ హార్లిక్స్ కప్పుని ట్రేలో ఉంచాను.

“మర్చేపోయాను..,” అంది అమ్మ నా వంక చూస్తూ....”మేము వెళ్లి  అంకుల్ ని కలిసొచ్చాము చంద్రా.  మన ప్రయాణంకి ముందు నువ్వు కూడా వాళ్ళని కలిసి, ఆశీర్వాదాలు తీసుకో.  ఈ లండన్ టూరుకి ఆయన ఎంతగానో శ్రమించారు,” గుర్తు చేసింది అమ్మ.

“స్టూడియోలో  నాకు పొజిషనివ్వడమే కాక, ఇలా పెయిడ్ వెకేషన్స్ కూడా  ఇస్తున్నాడు భూషణ్,” అంకుల్ గురించి నాన్న......

“నీ పాలిట మహానుభావుడే ఆ భూషణ్,” మెచ్చుకుంది అత్త...

**                                                          

నెలరోజుల పాటు జరిగిన లండన్ ట్రిప్ కూడా ఎంతో తృప్తిగా ముగించుకొని, విజయోత్సాహంతో చెన్నై చేరాము.

“వెల్కం బ్యాక్ మేడమ్,” సంతోషంగా మమ్మల్ని ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నాడు మేనేజర్ మూర్తి గారు... ఆర్కెస్ట్రా వాళ్ళని రెండు వెహికల్స్ లో పంపించేసి, మేము ఇంటిదారి పట్టాము.

“లండన్, పారిస్ లలో మీ పేరు మారుమోగిపోయిందని మేజర్ సార్ మాకు, పోయిన వారమే సమాచారమిచ్చేసారు మేడమ్.  చాలా సంతోషం మేడమ్,” ముందు సీటులో కూర్చున్న మూర్తిగారు  మాతో...

ఆయనకి థ్యాంక్స్ చెప్పి, సీటులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను...

అలసటగా ఉన్నా,  ఆనందోత్సాహాలతో నా మనసు ఆకాశాల్లో విహరించేస్తుంది...

నా కలలు ఎంత అందమైనవో, అవి సాకారమవుతున్న తీరు అంతే పసందుగా ఉంది... నా ఊహలు ప్రాణం పోసుకొని అందంగా నాట్యం చేస్తున్నట్టు, నా కలలు నిజమై నన్ను కౌగలించుకున్నట్టు,  పట్టలేని ఆనందం... జరిగిన మా టూర్ గురించిన ఆలోచనలు నన్ను కమ్మేశాయి...

అంత బాగా జరిగాయి మా లండన్, పారిస్, ఇటలీ ప్రోగ్రాములు... ఒక్కోరోజు రెండేసి ప్రోగ్రాములు కూడా చేసాము.   ఊపిరాడనంత బిజీగా గడిచింది...

ప్రోగ్రాములకి వేల సంఖ్యల్లో హాజరయిన ప్రేక్షకుల మెప్పు, మన్నన – అసలు నేనేనా? నాకేనా? అనిపించింది.  

అమ్మ పాటకి అందిన గొప్ప స్పందన, మాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది...

ఆమె పాటకి ముగ్దులైన సంగీతప్రియులు అమ్మకు నీరాజనాలు పట్టారు.

అమ్మకి దక్కిన ఆ ఆదరణ, తనకి ఎంతో తృప్తి, ఆనందం కలిగించాయన్నారు నాన్న.

*                                                          

హారన్ కొడుతూ, మా కాంప్లెక్స్ గేట్ లోకి కార్ టర్న్ తీసుకున్న శబ్దానికి, కునుకు తీస్తున్న అమ్మ, కూడా గబుక్కున లేచి కూర్చుంది..........

కారు దిగి, వాకిట్లోకి అడుగు పెడుతుండగానే, కోటమ్మత్త ఎదురొచ్చి దిష్టి తిప్పేసింది,.

కళ్ళు నులుముకుంటూ వచ్చిన వినోద్, మా వంక తేరిపార చూసాడు. “అక్కా, ఒక్క నెల రోజులకి నాకంటే సన్నగా అయిపోయావు.  నీకక్కడ ఫుడ్ లేదా?” అంటూ పెద్దగా నవ్వసాగాడు. 

“తెల్లారలేదుగా! నువ్వింకా మొద్దు నిద్రలోనే ఉన్నావేమోరా,  నేనేమీ సన్నబడలేదు,” వాడి చెవి పట్టుకున్నాను.

లగేజ్ ఇంట్లో పెట్టించాక మా వద్దకు వచ్చారు మూర్తిగారు.

“మీరు ఫ్రెష్ అయి రండి మేడమ్,  నేను వెయిట్ చేస్తాను.  మీతో మాట్లాడి వెళతాను,” అన్నారాయన.

**

కాఫీ సిప్ చేస్తూ, “చెప్పండి మూర్తి గారు, ఏమిటి విషయాలు,” అడిగింది అమ్మ, ఎదురుగా కూర్చున్నాయన్ని.

“మేడమ్,  సంస్కృతి టి.వి వాళ్ళ కాంట్రాక్ట్ రిన్యూవల్ కి పంపారు.  అరడజను ఇంగ్లీష్, తెలుగు, తమిళ మాగజిన్స్ మీ టూర్ విశేషాలు, ఇంటర్వ్యూ కోసం డేట్స్ అడిగారు...పోతే, మన భూషణ్ గారి ద్వారానే ఒక మూవీ ఆఫర్ వచ్చింది. 

ప్రాజెక్ట్ కి ఆరునెలల టైం ఉన్నా, భూషణ్ సార్ వొత్తిడి వల్ల, ఇంత ముందే స్క్రిప్ట్ కూడా పంపారు,” అంటూ తన బ్రీఫ్ కేస్ నుండి ఫైల్స్ తీసి కాఫీ టేబిల్ మీద ఉంచారు...

“పోతే మరో సంగతి మేడమ్, మన భూషణ్ సార్....,” ఆగి టేబిల్ మీద నుండి మంచి నీళ్ళ గ్లాస్ అందుకున్నాడాయన......

“అవును, అదే అడగబోయాను.... భూషణ్ సార్, ఫ్యామిలీ ఎలా ఉన్నారు?  మేమివాళ సాయంత్రం ఎలాగూ వెళతామనుకోండి,” అంటూ అమ్మ ఓ ఫైల్ చేతిలోకి తీసుకొంది.

“మనం ఇంటికొచ్చేసామని, అంకుల్ కి ఫోన్ చేసి చెబుతాను,” ఫోన్ చేతిలోకి తీసుకున్నాను....

‘కొంచెం ఆగండి మేడమ్.  ముందు భూషణ్ సార్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి,” ఆగి నాన్న వంక చూసాడాయన.

“కానివ్వు మూర్తి,  విషయం చెప్పండి...,” అన్నారు నాన్న.  

వినోద్, అత్త కూడా హాల్లోకి వచ్చి కూచున్నారు. 

నాకు, అమ్మకి కాస్త ఆదుర్దాగానే ఉంది...

“ఏమయింది, చెప్పండి. వాళ్ళంతా  బాగున్నారుగా,” అడిగిందమ్మ.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery