Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

గతసంచికలో ఏం జరిగిందంటే...  http://www.gotelugu.com/issue139/392/telugu-serials/death-mystery/death-mistery/

పది నిముషాల ప్రయాణం తర్వాత పాడుపడిన ఓ బంగ్లా ఆవరణలోకి దుండగుల కారు వెళ్లింది. అయితే, సిద్దార్థ మాత్రం తన కారును ఫర్లాంగు దూరంలోనే ఆపేసాడు. తేజా, సిద్దార్థ కార్లోంచి దిగారు. లోపలేం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆత్రుత ఇద్దరిలోనూ ఉంది. ఆ ఇద్దరూ ఎవరికీ కనిపించకుండా నెమ్మదిగా లోనికి నడిచారు. ఆవరణలో ఏ ఒక్కరూ కనిపించలేదు. పరిసరాల్ని సునిశితంగా పరిశీలిస్తూ అడుగుల సవ్వడి కాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగారు. లోపల ఓ గదిలో జెస్సికాను కట్టిపడేసారు.

‘‘నన్నెందుకు కిడ్నాప్‌ చేసారు? మీకేం కావాలి? నన్నొదిలి పెట్టండి. ఒకవేళ వదిలిపెట్టలేదో... బయటకొచ్చాక మీ అంతుచూస్తాను’’ అరుస్తోందామె.  ఆమె చుట్టూ చేరిన దుండగులు ఎగతాళిగా నవ్వుకుంటున్నారు. 

‘‘ఆ అమ్మాయి పరిస్ధితి చూస్తే దారుణంగా ఉంది. ఏం చేద్దాం?’’ అడిగాడు తేజ.

‘‘ఇప్పటికిప్పుడు ఏం చేయలేం. కారణం... ఏం చేసినా ప్రధాన నిందితుడు తప్పించుకుపోతాడు. మన టార్గెట్‌ ఫణిభూషణరావే. తెరవెనుక ఉన్న ఆ వ్యక్తిని బయటకి తీసుకొస్తే అసలు నిజాలు తెలుస్తాయి. అంత వరకూ మనం ఆగాల్సిందే’’

తను కల్పించి చెప్పిన కథ కళ్లెదురుగా జరుగుతుంటే అంతులేని ఆశ్చర్యానికి లోనవుతున్నాడు తేజ. ప్రతిమలా కనిపించే ఓ అమ్మాయి రహస్యం తెలుసుకోవాలనే ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని అడ్డం కోతలు కోసాడు. తీరా... అదే నిజమనిపించేలా వరుస సంఘటనలు సాగుతున్నాయి. అంటే... జరుగబోయే తదుపరి కథలో ఫణిభూషణరావు ఎంట్రీ తప్పనిసరిగా ఉంటుంది. ఇదే రహస్య స్ధావరానికి అతడూ వచ్చి... ఈ కథకో క్లైమాక్స్‌ ఇచ్చి తీరుతాడు. దాంతో పాటు ఇన్నాళ్లూ మిస్టరీగా మారిన ప్రతిమ డెత్‌ సీక్రెట్‌ కూడా వెలుగుచూస్తుంది. పోలీసులు ఛేదించలేని ఓ కేసు రహస్యం క్రయిం రిపోర్టర్‌గా తను ఛేదిస్తున్నాడు... సిద్దార్థ చూడకుండా తన భుజాన్ని తనే చరచుకుని  ‘శభాష్‌...’’ అనుకున్నాడు తేజ.

ఇంతలో... బయట అలికిడైంది. ఏదో వెహికిల్‌ వచ్చిన చప్పుడది. దుండగుల్లో కదలిక మొదలైంది. అందులోంచి ఒక్కడు ఆదరాబాదరాగా బయటకి కదిలాడు. ఓ అయిదు నిముషాల తర్వాత వాడితో పాటు ఫణి భూషణరావు కూడాలోనికి ప్రవేశించాడు. పాడుపడిన ఆ బంగ్లా లోపల విశాలమైన ఆ గదిలో ఉన్న జెస్సికా దగ్గరికి వచ్చాడతడు.

‘‘మీరు చెప్పినట్లే అంతా జరిగింది’’ అన్నాడొకడు.

‘‘ఇలాగే జరగాలని నేను కోరుకోలేదు. కానీ... జరక్క తప్పలేదు. చేసుకున్న ఖర్మ అంటారు కదా!’’ అన్నాడు ఫణిభూషణరావు. తర్వాత నెమ్మదిగా జెస్సిక దగ్గరగా నిల్చుని... ‘‘ఏం సాధించావ్‌? చావుకి చాలా దగ్గరగా వచ్చావ్‌. నన్నుకలిసిన మొదటి రోజునే నిన్ను హెచ్చరించాను. కదిలిస్తే కాలనాగునవుతానని చెప్పాను. అయినా, మాట వినకుండా ఇంత దూరం తెచ్చుకున్నావ్‌’’ కోపంగా అన్నాడు.

‘‘ఇంత దూరమే కాదు... ఎంత దూరమైనా వెళ్తా. నీ మెడలు వంచి నిజం కక్కిస్తా. నేనూ నీ రక్తం పంచుకుని పుట్టిన దాన్నే. నీకున్న మొండితనం, తెగువనాలోనూ పుష్కలంగా ఉన్నాయి. నిన్ను కలిసిన మొదటి రోజునే చెప్పాను. చేసిన తప్పుకి లెంపలువాయించుకుని నీ కూతురిగా అంగీకరించమని. వినలేదు...’’  అంది జెస్సికా.

‘‘ఎవరికీ తెలీకుండా ఎబ్రాడ్‌లో ఎక్కడో కక్కుర్తిపడ్తందుకు ఈ లోకం లోకి వచ్చిన నువ్వు నన్ను బెదిరిస్తావా?  నిన్ను చంపుతానేమో కానీ... కూతురిగా అంగీకరించేది లేదు. ఆ సంగతి ఎన్నిసార్లు స్పష్టం చేసినా వినలేదు’’

‘‘నీ ఆస్తి కోసమో... పేరు ప్రతిష్టల కోసమో నీ జీవితంలోకి కూతురిగా రావాలనుకోవడంలేదు.  నాదీ గౌరవ ప్రదమైన పుట్టుకే అని లోకానికి తెలియజేసేందుకే ఈ నా ప్రయత్నం. మా అమ్మ ఏ తప్పుచేయలేదని... జీవితంలో నీ ఒక్కడితోనే గడిపిందని... తను వెలయాలు కాదని, ఇల్లాలేనని అందరికీ చెప్పాలనే నా తపన, తహ తహ. ఏం... నన్ను నీ కూతురిగా ఒప్పుకుంటే నీకొచ్చే నష్టం ఏంటీ?’’

‘‘పరువు. నిన్ను నా కూతురిగా ఒప్పుకుంటే నా పరువుకి నష్టం వాటిల్లుతుంది. ఇన్నాళ్లూ ఎంతో గౌరవంగా తిరిగిన ఇక్కడ నేను నీ వల్ల తలెత్తి తిరగలేని పరిస్థితి వస్తుంది. తట్టుకోలేను. నాకో రహస్య జీవితం ఉందని... ఆ జీవితంలో నువ్వూ ఉన్నావని ఎప్పుడో మరిచిపోయాను. కానీ, నువ్వొచ్చి గుర్తుచేసావు’’

‘‘ఔను...గుర్తుచేసాను. ఎందుకంటే... మా అమ్మనీ,  నన్నూ వంచించిన నిన్ను మరిచిపోతే కదా! పరువు కోసం ప్రాణాలు తీసే కసాయివని ఇప్పుడే తెలుస్తోంది నాకు. ప్రాణం పోయినా సరే... నాకు నువ్వెవరో ఈ లోకానికి చెప్పి మరీ చస్తాను’’

‘‘చావే... నీ నుదుట రాసుంటే అంతకంటే నువ్వేం చేస్తావ్‌. నీకో సంగతి తెలుసా? నా పరువు కోసం నా కన్న కూతురు ప్రాణాలే తీసిన వాడిని. అదీ నీ లాగే ప్రేమ... ప్రేమ అంటూ పూటకు ఠికాణా లేని వాడి చుట్టూ తిరిగింది. వద్దని వారించాను. మన స్టేటస్‌ కి తగ్గవాడితో నీ పెళ్లి జరిపిస్తానని చెప్పాను.  వినలేదు. అంతే... ఓ రోజు ఎవరికీ తెలీకుండా మా ఆఫీసు ఏడో అంతస్తు నుంచి ఆమె నితో సేసి అనుమానాస్పద మృతిగా చిత్రీకరించాను.  ఇప్పటికీ ఆమెది హత్యో,  ఆత్మహత్యో ఈ లోకానికి తెలీదు. నా పరువుకి భంగం వాటిల్లితే కన్న కూతురినైనా ఉపేక్షించని వాడిని... ఎక్కడో నాకున్న కూతురినంటూ వచ్చిన నిన్ను ఉపేక్షిస్తానని ఎలా అనుకున్నావ్‌?’’ అంటున్నాడు ఫణిభూషణరావు.

‘‘చూసావా!  ఫణిభూషణరావు విశ్వరూపం’’ నెమ్మదిగా అన్నాడు తేజ. ఇంతలో సుకుమార్‌ కూడా తన టీంతో అక్కడికి చేరుకున్నాడు.

‘‘ఇక,  మనం ఉపేక్షిస్తే లాభం లేదు. జెస్సికా ప్రాణాలు దక్కవు. ఆ దుర్మార్గుడు అన్నంత పనీ చేస్తాడు’’ అన్నాడు సిద్దార్థ.

 ‘‘ఇక, లాభం లేదు. ఎక్కడో న్యూయార్క్‌లో పుట్టిన అమ్మాయికి ఇక్కడ ఈ పాడుపడిన బంగ్లాలో నూకలు చెల్లినట్లున్నాయి. ఏ మాత్రం కరుణ,  జాలీ చూపించకుండా చంపేయండిరా!’’ అని గట్టిగా అరిచాడు ఫణిభూషణరావు. పరిస్థితి చేయి జారిపోతోందని అంచనా వేసిన సుకుమార్‌ తన టీంని అలర్ట్‌ చేసి హుటా హుటిన రంగంలోకి దిగాడు`‘‘ఫణిభూషణరావూ! ఇక, నీ ఆటకట్టు’’ అంటూ గట్టిగా అరిచి చెలరేగిపోయాడు. సుకుమార్‌ వెంట వచ్చిన పోలీసులు ఫణిభూషరావు చుట్టూ వలయంలా ఏర్పడ్డారు.

‘‘ఇదేంటీ ఇలా జరిగింది?  హఠాత్తుగా పోలీసులు రావడం ఏంటీ?’’ అమాయకంగా అన్నాడు ఫణిభూషణరావు.

‘‘ఖర్మ కాలితే... ఇట్లాగే జరుగుతుంది..’’కౌంటరేసాడు సుకుమార్‌.

‘‘ఏ కథలోనైనా క్లయిమాక్స్‌లో రావడం పోలీసుల ఆనవాయితీ’’ అన్నాడు సిద్దార్థ జోక్‌ చేస్తూ.

‘‘పోలీసులు వచ్చారంటే శుభం కార్డు పడ్డట్టే’’ అన్నాడు తేజ.  ఆ తర్వాతి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇండస్ట్రీయిలిస్ట్‌ ఫణిభూషణరావు అరెస్ట్‌ వార్త సంచలనం సృష్టించింది. జెస్సికా ఆయన మరో కూతురనే విషయం లోకానికి తెలిసిపోయింది. అలాగే,  ప్రతిమ డెత్‌మిస్టరీ కూడా వీడిపోయింది. ‘‘పరువు హత్యలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయనీ...పరువు కోసం కన్న కూతుళ్లనూ చంపేస్తున్న కసాయి తండ్రులు నానాటికీ పెరిగిపోతున్నారని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.

 

‘‘హ్యాట్సాఫ్‌ తేజా!’’ అభినందించాడు నరిసింహం.

‘‘ఖాకీలు కనుగొనలేని ప్రతిమ డెత్‌మిస్టరీని ఛేదించావు.  క్రయిం రిపోర్టర్‌గా నువ్వు పరిణతి సాధించావు. ఔనూ! ఫణిభూషణరావే హంతకుడని నువ్వెలా కనుగొన్నావ్‌?’’ ఆసక్తిగా అడిగాడతడు. ఆ సమయంలో సిద్దార్థ కూడా నరిసింహం చాంబర్‌లోనే ఉన్నాడు.

‘‘ఆ ఒక్కటీ అడక్కండి సార్‌’’అన్నాడు తేజ సిగ్గుపడుతూ.

‘‘ఇందులో సిగ్గు పడడానికే ముంది? ఈ కేసులో ఫణిభూషణరావే నిందితుడని ఎవ్వరూ ఊహించలేదు. అయితే, నువ్వా కోణాన్ని పట్టుకుని పరిశోధించడంతోనే చిక్కుముడి వీడిరది. అంతేకాదు, ఫణిభూషణరావు ఆగ్రహానికి ప్రతిమలా జెస్సిక బలి కాకుండా కాకుండా ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగావు’’అన్నాడు నరసింహం.

‘‘ఏదో... అలా జరిగిపోయింది. ఫణిభూషణరావు అభ్యర్ధన మేరకు సిద్దార్థ జెస్సిక గురించి వివరాలు తెలుసుకుంటాడని నాకు తెలుసు. అతడి దగ్గర్నుంచీ ఆ వివరాలు తెలుసుకోవడానికి నే నాడిన అబద్దాలే ఈ కేసులో నిజాలయ్యాయి. అంతకు మించి ఇందులో నా పరిశోధనంటూ ప్రత్యేకంగా ఏం లేదు’’ అన్నాడు తేజ నవ్వుతూ. 

‘‘అంటే... నీ అబద్దాలతో నన్ను బకరా చేసావన్నమాట’’ సిద్దార్థ సరదాగా కోపగించుకున్నాడు.

ఆ తర్వాత `‘‘పరిశోధనంటే అంతే. చీకట్లో నల్ల పిల్లిని వెతకడం. ఆ పని నువ్వు బాగా చేసావ్‌’’ అభినందించాడు సిద్దార్థ. ఆ తర్వాత రెండ్రోజులకే చానెల్‌ సిక్స్‌టీన్‌లో  ‘నిఘా...’ పేరుతో సరికొత్త క్రయింబులెటెన్‌ స్టార్టయింది. మొదటి ఎపిసోడ్‌లో ప్రతిమ డెత్‌మిస్టరీ ఛేదిస్తూ ఆసక్తికరమైన కథ నంప్రసారమైంది. టీవీ తెరపై వెన్నెల్లా నవ్వుతూ కనిపించిన ప్రతిమని చూస్తే తేజా గుండె ద్రవించి పోయింది.

‘‘అందమైన అభం శుభం తెలీని ఈ అమ్మాయిని చంపేందుకు ఆ రాక్షసుడికి చేతులెలా వచ్చాయో?’’ అనుకున్నాడు భారంగా.

‘‘ఆడపిల్లల అర్ధాంతరపు చావులు లేని సమాజం ఎప్పటికైనా సాధ్యమా?’’ తనని తాను ప్రశ్నించుకుంటున్నాడు తేజ. ఆ ప్రశ్నకి సమాధానం ఎవరిస్తారు? ఎప్పుడిస్తారు? ఏమో? ఎవరికెరుక? 

......శుభం........

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam