Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

                                                                       అప్పర్ పెనిన్సిలా

ఒక రోజు (31-5-2008) పొద్దున్న 6 గం. ల కల్లా మేము నలుగురం, ఇంకా మా అమ్మాయి స్నేహితురాళ్ళు ఇంకో ఇద్దరు కలిసి అప్పర్ పెనిన్స్ లా కి బయల్దేరాము.  అది మిచిగన్ రాష్ట్రానికి నార్త్ మోస్ట్ టిప్.  దోవలో ఒక సరస్సు మీద (మేపెల్ కౌంటీ రివర్) సూర్యోదయం చూశాము.  8-10 కి గ్రేలింగ్ కి మూడు మైళ్ళ ఇవతల వున్న రెస్ట్ ఏరియాలో ఆగి, మేము తీసుకు వెళ్ళిన ఇడ్లీ తిని, కాఫీ తాగాము.  మళ్ళీ ప్రయాణం మొదలు.


ఉదయం 10-25కి లేక్ సుపీరియర్ (సరస్సు కాదండీ బాబూ, చిన్న సైజు సముద్రంలాగా వుంది) మీద వున్న మేకినాక్ బ్రిడ్జ్ మీదనుంచి వెళ్ళాము.  ఆ అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేము.  బ్రిడ్జికి అటూ ఇటూ అంతా నీరు.  ఆ నీరు కనబడకుండా దట్టమైన పొగమంచు.  ఎంత దట్టంగా అంటే, కారు హెడ్ లైట్లు వేసినా ముందేమున్నదో తెలియటం లేదు.  బ్రిడ్జ్ పక్కన వుండే ఇనప దూలాలు, కింద వున్న నీళ్ళు ఏమీ కనబడటం లేదు.  కనిపించేదల్లా దట్టమైన పొగమంచు.  పక్కన ఏమున్నదో తెలియదు, ముందేమున్నదో తెలియదు. 

ఆ బ్రిడ్జ్ పొడుగు మూడు మైళ్ళు.  మధ్యలో ఒక మైలు సస్పెన్షన్, అంటే కింద ఏమీ ఆధారం లేకుండా!!  గుండె గుప్పిట్లో పెట్టుకు కూర్చున్నా, చాలా ధ్రిల్లింగ్ గా అనిపించింది.  తిరిగి వెళ్ళేటప్పుడు పొగమంచు లేదు.  అప్పుడు చూశాము ఆ సముద్రంలాంటి సరస్సును.  అమ్మ బాబోయ్, ఈ నీళ్ళపైనుంచా మనం అంత కనబడని దోవలో వెళ్ళామని అప్పుడు భయపడ్డాను. సర్లెండి..ఇంకా విచిత్రం చెబుతాను వినండి.

ఉదయం 11-20 కి మొత్తానికి అప్పర్ పెనిన్సిలాలోని సాల్ట్  మేరీ (Sault Sailte (Ste.) Mary) కి చేరుకున్నాము.  అక్కడ చూసిన విచిత్రం .. సూ లాక్స్.  రెండు లేక్స్ మధ్య అనుసంధానమీ సూ లాక్స్.  లేక్ సుపీరియర్ ఎత్తుగా (ఎత్తు ప్రదేశంలో) వున్నది.  లేక్ హ్యూరన్ పల్లంలో వున్నది.  ఈ రెండు లేక్స్ లో ఫ్రైట్ షిప్స్ తిరగాలి.  మరి ఎలాగా?  దాని కోసమే ఈ సూ లాక్స్ ని నిర్మించారు.  అంటే ఈ రెండింటి మధ్య సన్నటి పొడవాటి కాలువ అటూ, ఇటూ నీళ్ళని ఆపటానికి గేట్లు.

లేక్ హ్యూరన్ నుంచి షిప్ ఈ  లాక్ లోకి వచ్చాక ఇటువైపు లాక్ మూసి, లేక్ సుపీరియర్ వైపు లాక్ తేరుస్తారు.  లేక్ సుపీరియర్ ఎత్తులో వుంటుంది కదా.  ఆ నీరంతా ఈ కెనాల్ లోకి వచ్చి షిప్ లెవల్ పెరుగుతుంది.  అప్పుడు లేక్ సుపీరియర్ వైపు తేలికగా వెళ్ళగలుగుతుంది.  ఆలాగే ఆటునుంచి వచ్చేటప్పుడు షిప్ ఆ కెనాల్ లోకి రాగానే లేక్ సుపీరియర్ వైపు లాక్ మూసి కెనాల్ లోని నీరు లేక్ హ్యూరన్ లోకి వదులుతారు.  దానితో నీటి మట్టం తగ్గి, ఈ లేక్ లెవల్ కి రావటంతో షిప్ తేలికగా లేక్ హ్యూరన్ లోకి వస్తుంది.  ఆగండాగండి, నాలాంటి వాళ్ళుంటారని నాకు తెలుసు...మీ ప్రశ్నా నాకు తెలుసు...ఆ నీళ్ళతోబాటు పల్లమేకదా, ఆ షిప్ కొట్టుకురాకుండా అక్కడే ఆగుతుందా అంటారు.  దానికోసం వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారండీ.  మనం హాయిగా షిప్ లో కూర్చుని కెనాల్ లో నీళ్ళు పెరిగితే షిప్ లెవల్ పెరగటం, తగ్గితే తగ్గటం చూసి ఎంజాయ్ చేద్దాం.

ఇక్కడ రెండు డెక్ లు వున్నాయి.  డెక్ 1 నుంచి బోట్ రైడ్ కి వెళ్ళాము.  మధ్యాహ్నం 1 గం. నుంచి, 3 గం. ల దాకా ..  ఒక్కొక్కరికీ 21 $.  కెనాల్ లో బోట్ (పెద్ద సైజ్ లాంచీ) ఆపి నీటిమట్టం పెంచటం, నీరు పెరుగుతున్న కొద్దీ బోట్ పైకి లేవటం, అలాగే తిరిగి వచ్చేటప్పుడు నీటి మట్టం తగ్గించటం పక్కనే వున్న రాతి గట్టువల్ల స్పష్టంగా గమనించగలిగాము.  బోట్ లో లేక్ సుపీరియర్ లో తిప్పి తీసుకువచ్చారు.

వేలీ షిప్ మ్యూజియం

సాయంత్రం 3-15కి బయటకొచ్చి దోవలో వున్న వేలీ షిప్ మ్యూజియంకి వెళ్ళాము.  మనిషికి 10 $ టికెట్.  షిప్ లో క్రూ కేబిన్స్, మెషినరీ కార్గో ప్లేస్, లేక్స్ లో తిరిగిన షిప్స్ లో వస్తువులు కొన్ని, ఆ లేక్స్ లో వుండే ఫిష్ పెట్టారు.

5-20 కి బయల్దేరి, దోవలో ఫడ్జ్, కేరెమెల్ కార్న్ తీసుకుని మేకినో సిటీకి బయల్దేరాం.

సాయంత్రం 6-05 కి మేకినో బ్రిడ్జ్ మీదకొచ్చాం.  పొద్దున్న పొగమంచువల్ల సరిగా కనబడలేదు.  ఇప్పుడు చాలా బాగుంది.  తిరిగి వస్తున్నప్పుడు కుడివైపు లేక్ మిచిగాన్, ఎడమవైపు లేక్ హ్యూరాన్ ..  ఈ రెండూ కలిసి కనిపించినంతమేరా నీరు ఒక సముద్రంలా వున్నది.

సాయంకాలం 6-30 కి హోటల్ క్వాలిటీ ఇన్ కి వచ్చాము.  అంతకు ముందే మా అమ్మాయి అక్కడ రూమ్ బుక్ చేసింది.  పెద్ద హాలు, పక్కనే ఇంకో చిన్న బెడ్ రూమ్, ఎటాచ్డ్ బాత్ రూమ్, 3 క్వీన్ బెడ్స్ .. బాలా బాగున్నది.  వెళ్ళిన ఆరుగురం చాలా కంఫర్టబుల్ గా వున్నాము దానిలో.

రూమ్ లో ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్, కాఫీ మేకర్ వున్నాయి.  ఫ్రిడ్జ్ లో ఏమీ లేవుగానీ, కాఫీ తయారు చేసుకోవటానికి కాఫీ పౌడర్, క్రీం, షుగర్ అన్నీ వున్నాయి.  స్పా, స్విమ్మింగ్ పూల్, ఇంకా చాలా సదుపాయాలున్నాయిగానీ, మాకు సమయం లేక ఏమీ చూడలేదు.వున్న కొంచెం సమయం ఊరు చూడాలని, ఫ్రెష్ అయి మళ్ళీ బయట పడ్డాము.  ఒకే సారి అన్ని కబుర్లూనా!?  వచ్చే వారానికి కొన్ని దాచి పెడతాను.

మరిన్ని శీర్షికలు
Bendakaya-Kodiguddu Curry