Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

పూతరేకుల పండగ - శంకు

poootarekula festival

బాపు పుట్టినరోజున పూతరేకుల పండగ చేసిన ఆత్మీయపురం 
 

అదే మరి. మన బాపు పుట్టిన రోజు పండగతో మన అందరి మనసుల్ని జువ్వున లాగేసేంత గొప్పగా, ఎన్నటికీ మరిచి పోలేనంత హాయిగా, ఎలాంటి వారికైనా డయబిటీసు తెప్పించేటంత అతి మధురంగా జరిపిన బాపురమణ అకాడెమీని, దాన్ని ఆవిష్కరించిన ఆత్రేయపురాన్ని ఇంకెలా అభివర్ణించగలం ?  

ఎపుడెపుడా అని తెలుగు వారంతా ఎదురు చూసే బాపూ గారి పుట్టిన రోజు నాడు, అదే, డిసెంబరు 15 సాయంత్రం, బాపు రమణ అకాడెమీ వారు ఆత్రేయ పురం (తూ.గో) నుంచి  హైదరాబాదుకొచ్చి,  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళా వేదిక మీద కనువిందు చేసిన జంట పురస్కార వేడుక, బాపు రమణల్లాగే, చాలా అరుదైన అద్భుతం.

ప్రత్యేకించి బొట్టెట్టి పిలిచే అవసరం లేకుండానే, హాలు పట్టనంత మంది స్వచ్చమైన బాపు రమణ అభిమాన వర్గమంతా ఆబాల గోపాలంగా, సభారంభవేళకు ముందే, బిలబిలమంటూ విచ్చేశారు. ఐనా చాలా మందికి సీట్లు దొరక్క, నడక బాటలో నిలబడక తప్పలేదు.  
వచ్చిన వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి, వారి నోళ్ళనూ తీప్తీపి ఆత్రేయపురం స్పెషల్ బెల్లం పూతరేకులతో సత్కరించారు. అంతే కాదు. ఈ శుభ వేడుకకు ఆహ్లాదకర స్వాగత రవళిగా, బాపూ రమణల చిత్రాల నుంచీ, విశ్వనాథ్‌ గారి సంగీత ప్రధాన చిత్రాల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేసిన పాటలతో స్వరమాధురి వర్ధమాన గాయనీ గాయకుల సినీ సంగీత విభావరి వీనుల విందుగా ఆకట్టుకొంది. ప్రత్యేకించి విజయ్‌ తీర్థ ఆలపించిన ఏకస్వర యుగళ గీతాలు విశేషాకర్షణ కావడంతో కొందరు ప్రముఖుల ఆగమన జాప్యం తెలియకుండా కవరైపోయింది.  
ఈ బృహత్ కార్యక్రమానికి సంకల్పించిన ఆత్మీయ పురానికి.... అదే ఆత్రేయపురానికి మనందరినీ ఓ క్షణంలో రివ్వున తీసుకెళ్ళిపోయి, ఆత్రేయ పురం అందచందాలన్నీ మనసుకి హత్తుకు పోయేలా చేసిన వారి లఘు చిత్ర ప్రదర్శన ఓ విలక్షణాకర్షణ. ఇప్పుడు మనం చూసిన శ్రీమంతుడు సినిమా కాన్సెప్టుని, ఓ దశాబ్దం కిందే అమలు జరుపుతూ, తమ స్వగ్రామానికి వన్నె తెచ్చే విధంగా తామేమేం చేశారో ఆ గ్రామపెద్దలు, బాపూరమణ అకాడెమీ సంస్థాపకులు శ్రీ వేగిరాజు సుబ్బరాజు గారు ప్రకటించిన విధానం ఆసక్తి కరంగావుంది.  ఆ తదనంతరం జరిగిన సభలో, శ్రీ కే.వి రమణాచారిగారు మాట్లాడుతూ,ఈ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వేవేల గ్రామాలవారూ, తమ గ్రామాల్లోని విశిష్ట వ్యక్తుల సత్కారంతో ముందుకొచ్చే స్ఫూర్తిని కలిగించిన బాపూరమణ అకాడెమీని ఘనంగా అభినందించారు. వారీ విధంగా నెల్కొల్పిన ఉన్నతాదర్శానన్ని గొప్పగా శ్లాఘించారు.  

ఈ కార్యక్రమంలో ఘనమైన గౌరవ పురస్కారాన్ని అందుకోడానికి వచ్చిన కళా తపస్వి విశ్వనాథ్ గారిని వారి చిత్రాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్లిప్పింగుల ఆవ్ షోతో, అలాగే, వానల్నీ, వరదల్నీ దాటుకొనీ అయోమర్గంలో సతీసమేతమగా చెన్నై నుంచి వచ్చిన డా.జయదేవ్‌ బాబుని వారి కార్టూన్ కదంబ మాలిక ఆవ్ షో తో పరిచయం చేసిన విధానం అందరినీ ఆనందోల్లాసాలతో కట్టి పడేసింది.
ఆద్యంతం తన ముచ్చటైన వ్యాఖ్యానంతో, కమ్మర్షియల్ కలరు సోకని చెణుకులతో, మన యాంకర్ ఝాన్సి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం అద్వితీయంగా కొనసాగింది. ఈ సభకు అధ్యక్ష్హత వహించిన సారిపల్లి కొండలరావుగారు, ముఖ్య అతిధి కె.వి. రమణాచారిగారు, విశిష్ట అతిధి, పద్మభూషణ్ డా.వరప్రసాదరెడ్డి గారు, వక్తలుగా వచ్చిన ఆత్రేయ పురం ఆడబడుచు, ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాసా ప్రభావతిగారు, ఆ గ్రామ ప్రముఖులు శ్రీ రామక్రిష్ణగార్లందరూ తమ తమ ఆరితేరిన అద్భుత ప్రసంగ చాతుర్యాలతొ సభను అత్యద్భుతంగా రక్తి కట్టించారు.

బాపూరమణ అకాడెమీ వివిధ కళారంగాల్లోని విశిష్ట ప్రముఖుల్ని సత్కరించాలని సంకల్పించి, ఆ సత్కార్యానికి ప్రప్రధంగా ఎంచుకున్న తెలుగు చలనచిత్ర నిష్ణాతులు శ్రీ కె.విశ్వనాథ్‌గారిని, తెలుగు వ్యంగ్య చిత్ర ప్రముఖులు శ్రీ జయదేవ్‌ బాబు గారిని సన్మానించిన తీరు ఎంతో చూడ ముచ్చట అనిపించింది. ముందుగా చందనమాలతో, పుష్పగుచ్చంతో, తదనంతరం దుశ్శాలువతో, సత్కరించి, కిరీటాన్ని ధరింప జేసి, ఆప్యాయంగా వారిని శ్లాఘించిన సన్మాన పత్రంతో అభినందించి, వారికి అందమైన మెమెంటోతో బాటు పూతరేకుల్నీ, నగదు పారితోషికాన్నీ అందించి అకాడెమీవారు తమ ఘనమైన అభిమానాన్ని, సంస్కారాన్ని చక్కగా ప్రదర్శించారు.

తమకందిన సత్కారానికి ఈ ప్రముఖులిద్దరూ స్పందించిన తీరు అమోఘమనిపించింది. బాపూ గారి దగ్గర ఒక్కసారైనా అసిస్టెంటు డైరెక్టరుగా పని చెయ్యాలనుకున్న తన చిరకాల వాంఛ తీరక పోయినా, వారి పేరున వస్తున్న ఈ పురస్కారాన్ని ప్రప్రధమంగా అందుకోడం తనకెంతో సంప్తృప్తినిచ్చిందని శ్రీ విశ్వనాథ్ అన్నారు. ఈ పురస్కారాన్నందుకోడంతో తన జన్మ ధన్యమైందని శ్రీ జయదేవ్‌ బాబు ఆర్ద్రత నిండిన స్వరంతో చలించిపోయారు.  శ్రీ బాపూ కేవలం తెలుగు నాటే కాక, యావద్భారతావనికే సుప్రసిద్ధ కళాకారులని, అద్వితీయ సృజనాత్మక శక్తిగల బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఓ విధంగా యుగ పురుషుడనీ స్తుతించారు. ముక్తాయింపుగా అప్పటికప్పుడు అల్లుకున్న ఓ కవితను వల్లిస్తూ, ఆ మహా విష్ణువుది బ్రహ్మ కడిగిన పాదమూ, బాపూ గీసిన పాదమూ.. అంటూ ప్రస్తుతించడం అందరినీ కదిలించింది.

ఈ సభ కొనసాగినంత సేపూ, కార్యక్రమ నిర్వహణతీరుతో ముగ్ధులైన ప్రేక్షక జనాలు తడవ తడవకూ నిలబడి తమ హర్షధ్వానాలు ప్రకటిస్తూ మైమరిచిపోయారు.  ఇన్ని సార్లు ప్రేక్షకులు పదే పదే స్టాండింగ్ ఒవేషన్ అందించిన సభను, నా జీవితంలో ఎప్పుడూ చుడలేదు. ?

అసలీ కార్యక్రమాన్నంతటినీ తనదైన శైలిలో రూపొందించి, నిర్వాహకులకు వెన్నుదన్నుగా నిలబడి ఇంతటి ఘనమైన విజయాన్ని కొట్టేసిన త్రివిక్రముడు, వామనుడైన బ్నిం ఆద్యంతం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అనక తప్పదు.  " ఇందులో ఏ పొరబాటు దొర్లినా అది నావల్లే, ఏ విజయం దక్కినా అది నిర్వాహకులదే" అంటూ తన విశాల హృదయంతో బ్నిం ప్రకటించిన తీరు అందరి మన్ననలూ పొందింది.

ఈ కార్యక్రమానికి తమ తమ సహకారాల్ని, తడుముకోకుండా అందజేసిన 'గో తెలుగు.కాం', బాపూరమణ లోగిలి, హాస్యానందం సంస్థల చొరవకు నిర్వాహకులు ఘనమైన నీరాజనాలందించారు.  ఇన్ని గొప్ప కారణాలున్న ఈ వేడుక అరుదైన అద్భుతం కాక మరింకేమిటి?- దీనికి హాజరు కాగలిగిన వారు ధన్యులు. నిర్వహించిన వారు పూజ్యులు. వీరి సత్కారాన్నందుకున్న వారు చిర స్మరణీయులు.

-శంకు

మరిన్ని శీర్షికలు
dr . c. narayana reddy award for rajendranath rehabar