Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 గతసంచికలో ఏం జరిగిందంటే.. http://www.gotelugu.com/issue140/394/telugu-serials/vedika/vedika/
 

ఒక్క క్షణం మౌనం తరువాత, విషయం చెప్పసాగారు మూర్తి. 

“మీరు లండన్ వెళ్ళిన నాలుగో రోజున, రాణి మేడమ్ చాలా బోల్డ్ - స్టెప్తీసుకుని, ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాథర్ పై పోలీస్ కంప్లైంట్ చేసి, సివిల్, క్రిమినల్ కేసులు పెట్టారు మేడమ్.   భూషణ్ సార్ ఓ రోజంతా పోలీస్ ఇంటారిగేషన్ లో గడిపి, చాలా ఇబ్బంది పడ్డారు. 

రెండు రోజులు హాస్పిటల్లో కూడా ఎడ్మిటయ్యారు.  మన జగదీష్ బాబు ఢిల్లీ నుండి వచ్చి, భూషణ్ సార్ కి, రాణి మేడమ్ కి రాజీ కుదిర్చి వెళ్ళారు.   పరిస్థితి ఇప్పుడు సద్దుమణిగినట్టే మేడమ్.  సార్ మాత్రం  కోలోకోలేనంత కుంగిపోయారు..,” ఆగాడు మూర్తిగారు.

వింటూ ... అమ్మ, నేను కూడా అవాక్కయిపోయాము.  నాన్న వంక చూసాము.

“అవునమ్మా,  ఇదంతా చాలా దురదృష్టకరం...నాకు అప్పుడే ఈ వార్త తెలిసి, భూషణ్ తో మాట్లాడాను. టూర్ లో ఉన్న మీకు, చెప్పి డిస్టర్బ్చేయవద్దన్నాడు.   ఆ టైంలో ఎప్పటికప్పుడు భూషణ్ తోనే  కాక, ఇదో మా అక్కతో  మాట్లాడుతూనే ఉన్నాను,”  అని వివరించారు నాన్న...

“అసలు కారణం ఏమిటి? తండ్రితో ఇటువంటి విరోధం దేనికి? పోలీసులు, కోర్ట్ కేసులు ఎందుకు?  పాపం నీరూ ఏమయిపోయింది ఈ గొడవలకి,”  బాధపడుతూ అమ్మ.

“ఎంతో కష్టపడి, హుందాగా కెరియర్ప్లాన్ చేసుకుని, వృద్దిలోకి వచ్చాడు భూషణ్.  అతని పేరు, పరపతిని  పతనం చేసేసింది ఆ అమ్మాయి.  కన్నతండ్రిని అలా అప్రతిష్టపాలు చేసేటంత ద్వేషానికి కారణం తెలియడంలేదు.  అంటూ వాపోయారు నాన్న.

అంకుల్ పట్ల సానుభూతితో, ఆపుకోలేని దుఃఖం వచ్చింది. వినోద్ వచ్చి నా పక్కన కూర్చుని, భుజంపై చేయి వేసాడు.  “నీవిక్కడ లేకపోవడం నయమయింది అక్కా.  ప్రతిపూట అంకుల్, రాణి ల గురించే న్యూస్... నువ్వు ఉండుంటే, బాగా  అప్సెట్ అయ్యేదానివి... ఇప్పుడిక వాళ్ళ న్యూస్ తగ్గిందిలే... అంకుల్ ఇప్పుడు ‘ఓకే’ అంట,” అన్నాడు, నన్ను సముదాయిస్తూ.  

ఏమనలేక, మౌనంగా ఉండిపోయాను. 

“మరి నేను రేపు వచ్చి కలుస్తాను, సార్,” అని మూర్తిగారు సెలవు తీసుకున్నారు. అత్త లేచొచ్చి అమ్మ పక్కన కూర్చుంది. 

“జరిగిన విషయం చెప్పనలవి కానిదంటే నమ్ము తల్లీ.  ప్రతి పూట టి.వి లో ఆ పిల్ల వీరంగం చూసి నేనే విలవిల్లాడి పోయాను.  భూషణ్ గారు, నీరూ ఎలా భరించారో, ఎంత బాధ పడ్డారో  పాపం,” అని వాపోయింది కోటమ్మత్త.

“అసలు కారణమేంటి అత్తా,” అడిగాను...

“ఆ సంగతికే వస్తున్నా. వాళ్ళ నాన్న తనకి బలవంతపు పెళ్లి చేయడానికి, ఇంట్లో నిర్భందించాడని, తన స్వేచ్చని హరించి, చంపుతానని బెదిరించి, మానసికంగా, శారీరకంగా హింసకి గురి చేస్తున్నాడని పోలిసుకి ఫిర్యాదు చేసింది, రాణి.

ఇక తండ్రి నుండి, తనకి రక్షణ కావాలని పోలీసు కమీషనర్ కి అర్జీ పెట్టుకుంది.....

ఇంకా ముందుకి సాగి, భూషణ్ గారినుండి ఆస్థి పాస్తులు కోరుతూ ఒక కోర్టులో కేసు వేసి, తండ్రికి  శిక్ష  పడవలసిందేనని  మరో కోర్ట్ కేసు వేసింది,” క్షణం ఆగింది అత్త.

“అసలు సంగతి మరోటి ఉందమ్మా.  ఈ గొడవకి ముందు, కన్నడ  హీరో ఉదయచంద్ర తో నిశ్చితార్దం  జరిపించడానికి, భూషణ్ గారు మాట ఇచ్చిపుచ్చుకున్నారని కూడా చెప్పారు,” అందామె మా వంక చూస్తూ....

“ఇంత జరిగిందా?” ఆశ్చర్యంగా అమ్మ.

“ఇదంతా టి.వి లో విన్న న్యూస్ శారదా, టి.వి లో డైలీ సీరియల్ లాగా నడిపింది ఆ రాణి మహాతల్లి.  ఆమె దెబ్బకి పాపం హాస్పిటల్లో కూడా చేరారు భూషణ్ గారు.  అప్పుడు వచ్చాడమ్మా మన జగదీష్.   మొత్తానికి ఆ తండ్రికి, బిడ్డకి రాజీ కుదిర్చి, ఆ రాణమ్మని వాళ్ళింటికి చేర్చాడు.  జగదేష్ ఇక్కడున్నప్పుడు ఓ తడవ వాళ్ళని పలకరించి వచ్చాము నేను. వినోద్,” ముగించింది ఆమె.

అసలు నమ్మలేకపోయాను.  ఏమనాలో తోచక అమ్మ వంక చూసాను.

“ఆ కన్నడ హీరో మంచి పేరున్న కుటుంబం వాడు.  ఏమైనా, సంబంధం ఎంత మంచిదైనా ఇష్టం లేకపోతే, వద్దంటే పోయేదిగా......ఇదంతా చూస్తుంటే, దేనికోగాని ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న మీద విపరీతమైన కోపం వచ్చి, ఇలా ఆయన్ని శిక్షించిందనిపిస్తుంది,” అంది అమ్మ.

నాలోనూ అదే సందేహం కలిగింది.  కోపం వచ్చినప్పుడల్లా, అంకుల్ వాళ్లకి  గుణపాఠం నేర్పించాలన్న ధోరణిలో, రాణి, వాళ్ళని బాధించడం తెలిసిన సంగతే... కాని, అసలు ఏమి జరిగుంటుందోనని ఊహించలేకపోతున్నాను.. నిస్పృహగా అనిపించింది...

విన్న విషయాలు కలిచివేస్తుంటే, ఎవరి ఆలోచనల్లో వాళ్ళం అచేతనంగా ఉండిపోయాము...

**

ఇంతలో, ఫోన్ రింగయితే, పక్కనే ఉన్న అమ్మ తీసింది...

“హలో,  ఆ, జగదీష్ బాబు, ఎలా ఉన్నావు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు?” అంటూ సంభాషణ కొనసాగించింది అమ్మ.  చాలా మటుకు భూషణ్ అంకుల్ కి వచ్చిన కష్టం గురించే సాగింది...

“అసలు రాణి సంగతి ఏమిటి? ఎందుకలా చేసిందో తెలిసిందా?” అన్ని అమ్మ అడిగిన దానికి, అటునుండి జగదీష్ ఏమి చెబుతున్నాడో కాని, ఇటునుండి అమ్మ ‘ఊ’ కొడుతూ వినడం మాత్రమే తెలుస్తుంది.

మరి కొద్ది సేపటికి,  ”అలాగే, చంద్రకి చెబుతాను.  అమ్మ వాళ్లకి, నేను రేపు ఫోన్ చేస్తానని చెప్పు,” అని ఫోన్ పెట్టేసింది.

“తన పనయ్యాక నీకు ఫోన్ చేస్తాడట,” నాకు చెప్పి మౌనంగా ఉండిపోయింది....

“రాణి విషయంగా, ఏమంటున్నాడు?” అడిగారు నాన్న.

గట్టిగా ఊపిరి తీసుకుంది అమ్మ. 

“తనకి విషయం పూర్తిగా తెలియదంట.  హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక, భూషణ్ గారే ఫోన్ చేసి, సమస్య  వివరించి సాయం అడిగితే, హుటాహుటిన బయలుదేరి వచ్చాడట. 

రాణి విషయంగా కూడా సహాయం చేయమంటేనే, ఆ అమ్మాయితో మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చేలా మాత్రం చేయగలిగాడట.  రాణి నుండి, వివరాలు కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదట. 

ఇకపోతే, తనిక్కడ ఉన్నప్పుడు  భూషణ్ గారికి మైల్డ్-హార్ట్- ఎటాక్ వచ్చిందట కూడా.  అయన పరిస్థితి కుదుటపడ్డాక, మూడో రోజున తిరిగి వెళ్ళిపోయాడట.  భూషణ్ గారికి, ఆ సమయంలో, కాస్తైనా సహాయం చేయగలిగినందుకు  తృప్తిగా ఉందన్నాడు,”  ముగించింది అమ్మ.

**

మరునాడు పొద్దుటే వెళ్లి అంకుల్, ఆంటీ వాళ్ళని చూసాము.   

ఇద్దరూ ఎంతో నీరసంగా, జబ్బు పడి లేచిన వాళ్ళల్లా అయ్యారు. బయటకి మామూలుగా మాట్లాడుతున్నా,  కోలుకోలేని దెబ్బతిన్నట్టు కనబడుతుంది. 

మా లండన్ టూర్ గురించి అడిగి, బాగా జరిగిందని తెలుసుకొని, సంతోష పడ్డారు.

వారితో కలిసి, భోజనం చేసాక గాని మమ్మల్ని తిరిగి వెళ్ళనివ్వలేదు.

**

టూర్ నుండి తిరిగి వచ్చిన రెండోరోజు నుండి ,  తలమునకలుగా పనిలో మునిగిపోయాను... ఎల్లోరాలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న డాన్స్ ఫెస్టివల్లో, ఇనాగురల్ ప్రోగ్రాం ఒప్పుకున్నాను. 

అక్కడ నృత్య ప్రదర్శన చేయాలని ఎప్పటినుంచో నా కోరిక. 

‘ఆలయనాదాలు’ అనే ఓ కాన్సెప్ట్, నేనే రాసి, కోరియోగ్రఫీ చేసి ప్రెజెంట్ చేయబోతున్నాను...

ఎంత బిజీగా ఉన్నా, నిత్యం అంకుల్, ఆంటీ నా మనసులో మెదులుతూనే ఉన్నారు.  వారు ఎదుర్కున్న క్లిష్ట పరిస్థితి మనసు నుండి చెరగడం లేదు. 

నా పట్ల స్వచ్చమైన ప్రేమ వాత్సల్యాలతో మెలిగిన మనిషి, నన్ను కళాకారిణిగా ఇంతటి స్థాయికి తెచ్చిన మనిషి, అమ్మానాన్నల్ని ఆదుకొని, మంచి జీవితాన్నిచ్చిన భూషణ్ అంకుల్, ఇలా దెబ్బతిన్న పులిలా అయిపోవడం నన్ను విపరీతంగా బాధిస్తుంది....

తీరిక దొరికినప్పుడల్లా, అంకుల్, ఆంటీలతో కాసేపు గడిపి కబుర్లు చెప్పి వస్తున్నాను.  అప్పుడప్పుడు వాళ్ళింట ఎదురుపడే రాణిని పలకరించి, మాట్లాడుతుంటాను.

**

దేవాలయాల ప్రాకారాల పైని అందమైన శిల్పాలు – ఒకానొక పర్వదినాన, అర్ధరాత్రి దాటిన పిదప, సజీవ మూర్తులుగా మారి, సూర్యోదయం వరకు దైవ సన్నిదిలో నృత్యం చేసి, తిరిగి వాటి స్థానాల్లో  ప్రతిమలవుతాయన్న కథాంశాన్ని  ‘వేదిక’ మీద ఓ కళాఖండంగా సమర్పించాలన్న ఆలోచనే  - నా ‘ఆలయనాదాలు’ కాన్సెప్ట్.

అజంతా ఫెస్టివల్ ప్రోగ్రాముకి, ఈ  ఇతివృత్తాన్నే నృత్య నాటికగా రూపొందించాలని,  నిర్విరామంగా కృషి చేయసాగాను. 

అవకాశం దొరికిన ప్రతి ఇంటర్వ్యూలో ‘ఆలయనాదాలు’ కాన్సెప్ట్ గురించి ప్రస్తావించాను. సంస్కృతి టి.వి వారికి ప్రత్యేక కార్యక్రమంగా ‘ఆలయనాదాలు’ ఇతివృత్తాన్ని ఓ నృత్యాంశంగా ప్రెజెంట్ చేసాను కూడా.... 

***

నెలలపాటు ‘ఆలయనాదాలు’ బృందంలోని మేమంతా, అమ్మ అజమాయిషీలో తర్ఫీదు, ప్రాక్టీసులు  సాగించాము. ప్రదర్శన  రోజు రానే వచ్చింది...

అమ్మా నాన్నలతో, మా నృత్య బృందంతో, ఎల్లోరా చేరాను....

మేమున్న స్థావారాల్లోనే, ఎందరెందరో నృత్య కళాకారులు, సంగీత విద్వాంసులు, కవులు విడిది చేస్తున్నారు... ఉన్న రెండు రోజుల్లోనే, చాలా మందితో పలకరింపులు, పరిచయాలు ఏర్పడ్డాయి.

వారి వారి స్థావరాల బయట, అందమైన పూలమొక్కలు, చెట్ల నడుమ తివాచీలు పరుచుకుని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, వాయిద్యకారులు అభ్యాసన చేయడం...మరింత బాగుంది..

ప్రదర్శనలకి ఏర్పాటయ్యే ‘వేదిక’ గురించిన కబుర్లు కూడా అందరిలో మరింత ఉత్సాహాన్ని నింపాయి.. 

ప్రదర్శన రోజున కాస్త ముందుగానే, ‘వేదిక’ వద్ద చేరాము....

అతి సుందరమైన ఎల్లోరా గుహల పరిసరాలని బ్యాక్ డ్రాప్ గా ఏర్పాటయిన అక్కడి ‘వేదిక’ కళాకారులకి, కవులకి కూడా ఓ  ధురానుభూతిని అందిస్తుందనడంలో సందేహమే లేదు....

ఇంత గొప్ప అవకాశానికి ... కళామతల్లికి శతకోటి వందనాలు చెప్పుకున్నాను.

మా నృత్యనాటిక లోని సునిశితమైన అంశాలని,  అక్కడి సాంకేతిక బృందం వారి సహకారంతో, నే కోరుకున్న స్థాయిలో ప్రదర్శించాము. ..

కళా రంగంలోని అన్ని వర్గాల నుండి, నేను రచించిన తొలి నృత్యనాటికకి మంచి ప్రశంసలు దక్కాయనే చెప్పొచ్చు.

***

ఎల్లోరా నుండి తిరిగి రాగానే, ఎగ్జామ్స్ దగ్గర పడడంతో, చదువుతో బిజీ అయిపోయాను...

“ఏమ్మా, చాలా కష్టపడి చదువుతున్నావుగా .... సంతోషం... ఎగ్జామ్స్ అయ్యాక ఓ వారం రోజులు అన్నిటికీ సెలవు పెట్టేయి,” అన్నారు నాన్న, ఎగ్జామ్స్ మొదటి రోజున, నన్ను కాలేజీ వద్ద డ్రాప్ చేస్తూ....”

“ఎగ్జామ్స్ అయ్యాక, శుక్రవారం నుండి సోమవారం వరకు ఎలాగూ సెలవే నాన్నా... అది చాలు.  ‘సంస్కృతి’ వర్క్  చాలా ఉంది,” అంటూ కారు దిగాను...

** 

ఆదివారం నాడు, భూషణ్ అంకుల్, ఆంటీల ఇరవైఐదవ  వెడ్డింగ్ యానివర్సరీ లంచన్ కి  బయలుదేరాము.  చేతుల్లో పూలదండలు,  స్వీట్స్ పుచ్చుకుని,  వాళ్ళింట అడుగుపెట్టాము. 

హాల్లో మాకోసమే వెయిట్ చేస్తున్న వారిరువురికీ  అభినందనలు తెలిపి, వాళ్ళచేత పూలమాలలు మార్పించి, స్వీట్స్ తినిపించారు అమ్మావాళ్ళు. 

నేను శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నాను. 

“ఈ ఆదరణ, ఆప్యాయతలు చాలనే మరి, మా ఈ ప్రత్యేక పెళ్లిరోజుకి మీరు మాత్రమే మా అతిధులు, సత్యం,” అన్నారు అంకుల్ నాన్నతో...

“అవును, మీ అందరికీ ఇష్టమైన వంటకాలు దగ్గరుండి చేయించాను.  భోంచేద్దాము పదండి,” అంటూ నీరూఆంటీ  డైనింగ్ వైపు నడిచింది.

**

వడ్డన మొదలు పెడుతుండగా మాత్రం మా అందరి మనస్సుల్లో ఉన్న ప్రశ్నని, కోటమత్త అడిగేసింది.  “రాణి, కనబడదే? భూషణ్ గారు?” అని.

“వారం రోజుల కోసం, ఢిల్లీ వెళ్ళింది, రాణి,” అనేసి వడ్డన సాగించింది ఆంటి.

నా పక్కనే ఉన్న అమ్మ ఉలిక్కిపడింది.  అత్త ఇక కిమ్మనలేదు. 

రాణి ఢిల్లీకి వస్తుందని, జగదీష్ చెప్పంగా, నాకు మాత్రం, తెలిసిన విషయమే....

అందరి మౌనం నడుమ, అంకుల్ కల్పించుకున్నారు.  “ఈ సమయంలో మానుండి దూరంగా ఉండడమే ధ్యేయంగా అలా ఢిల్లీ వెళ్ళిపోయింది. తన తోటివాడు, జగదీష్,  ఊళ్ళో ఉండడని తెలిసినా, మణిగారితో సమయం గడుపుతుందట,” అంటూ పేలవంగా నవ్వారు అంకుల్. 

నీరూ ఆంటీ ముఖం పక్కకి తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది.

వాళ్ళెంత  బాధపడుతున్నారో అర్ధమయి నా గుండెలు పిండేసినట్టయ్యింది.  అందరూ భోంచేస్తున్నారే గాని, వాతావరణం గంభీరంగా ఉంది.

ఎలా తేలిక పరచాలా అని క్షణం ఆలోచించాను....

“అంకుల్, ఆంటీ, మీ కోసమే ఈ రోజంతా నేను ఫ్రీ పెట్టుకున్నాను.  ఇవాళ ఏం చేయాలనుందో  చెప్పండి.  ఎక్కడికన్నా వెళ్ళాలంటే, నేనే మీ డ్రైవర్ని,” అన్నాను.  “పైగా నన్ను మీరు వెళ్ళమనేంత వరకు ఇక్కడే, మీతోనే నా రాత్రి భోజనం కూడా,” నవ్వుతూ ముగించాను.

“అవును మరి, నువ్వు నా కూతురుతో సమానమేనని నీ చిన్నప్పుడే చెప్పానుగా కళా.  సుఖంగా, సంతోషంగా ఉండమ్మా,” అన్నారు అంకుల్...

“అది సరేగాని, ప్రోగ్రాం అయి నాలుగు నెల్లయినా,  ఎల్లోరాలో నీవు చేసిన ‘ఆలయనాదాలు’ గురించి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయిగా! ఇందాకే ఇండియా టైమ్స్ మాగజీన్ లో  చదివాను... చాలా గర్వంగా ఉందమ్మా,” అన్నారు.

నాన్న కలగజేసుకున్నారు...

“సమయానికి గుర్తొచ్చిందోయ్ భూషణ్... సెల్వన్ గారి ఫిలిం చేసే ఆసక్తి లేదంట కళ కి.  వాళ్ళు పంపిన స్క్రిప్ట్ కూడా అలాగే ఉంది.  అదేమో, నీ ద్వారా వచ్చిన ఫిలిం ఆఫర్ కదా! నీతోనే మాట్లాడమన్నాను,” అన్నారు నాన్న విషయం గుర్తు చేస్తూ...

“తప్పక మాట్లాడుదాము,” అన్నారు అంకుల్.“అయినా, చంద్రకళ విషయంలో, ఎన్నెన్నో అవకాశాలు వాటంతటవే నడచి వస్తున్నాయి.  మన కళని అతిత్వరలో అమెరికా పిలిపించాలని కూడా,  తేజశ్విని గారు ఆలోచిస్తున్నారట కదా!  ఏమైనా, చంద్రకళ ఓ మేటి కళాకారిణి మాత్రమే కాదు, మంచి పరిణతి ఉన్న యువతి.  అన్ని నిర్ణయాలు స్వయంగా తీసుకోగలదు, సత్యం,” గర్వంగా అంకుల్...

“అంతా గాడ్స్ గ్రేస్. అవును, అమెరికా విషయంగా తేజశ్విని గారు పంపిన సమాచారం, ఆ పేపర్స్ ఇవాళ పొద్దున్న చూసాను,” అన్నారు నాన్న...

**

భోజనమయ్యాక, ఆంటీ చేయించిన స్వీట్స్ రుచి చూస్తూ సిటింగ్ లో కూర్చున్నాము.   నాన్నతో నవ్వుతూ మాట్లాడుతున్న అంకుల్ వంక చూసాను.  నాలుగునెల్లల్లో పదేళ్ళు పైబడ్డట్టుగా  అయ్యారాయన.  ఇదివరకులా హంగామాగా మాట్లాడ్డం, హడావిడిగా వ్యవహరించడం పూర్తిగా తగ్గిపోయింది.  ఇంటిపట్టునే ఉంటున్నారు. 

వారి స్టూడియో వ్యవహారాలు, ఇప్పుడు,  మరింతగా నాన్నే చూస్తున్నారు. 

రాణి విషయంగా కొంతైనా మనశ్శాంతి దొరికితేనే, వాళ్ళ పరిస్థితి మెరుగవుతుందని, జగదీష్ కూడా చెబుతుంటాడు.

**

కాసేపటికి, టీ కూడా తాగి, అమ్మావాళ్ళు వెళ్ళిపోయాక,  నేను వెళ్లి నీరూఆంటీ పక్కనే కూర్చున్నాను......

“అన్న ప్రకారం ఈ రోజంతా నేను మీతోనే ఆంటీ....చెప్పండి ఏం చేద్దాం?  శనివారం కదా! నన్నడిగితే, గుళ్ళో అర్చన చేయించాక, కాసేపు మీ కిష్టమైన గీతబోధ కూడా విందాము.  అటునుంచి కాసేపు పార్క్ లో వాకింగ్ చేసాక, మీ పార్లర్ కి వెళ్లి ఐస్క్రీం తిందాము. ఇంటికొచ్చి ఏదన్నా మూవీ చూద్దాము.  మీకు నిద్ర వస్తున్నప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను,” అన్నాను... 

నవ్వుతూ నేను చెప్పిందంతా విన్నది ఆంటీ...

“చూడండి, ఎంత బాగా ప్లాన్ చేసిందో చంద్రకళ! మరి మీకు ఓకేనా?” పక్కకి తిరిగి అంకుల్ ని అడిగిందామె... 

ఉలుకు పలుకు లేకుండా, ఆయనేమో, మౌనంగా తల వంచుకుని ఏదో ఆలోచనలో ఉన్నారు...

ఆయన మౌనం వీడాలని, నేనే  కల్పించుకున్నాను. ”అంకుల్, పదండి మరి, మేము రెడీ,” అన్నాను.

తన కళ్ళజోడు తీసి, కళ్ళు తుడుచుకుంటున్న ఆయన్ని చూసి, ఇక భరించలేకపోయాను.  లేచి వెళ్లి ఆయనకెదురుగా కింద నేల మీద కూచున్నాను. 

“మిమ్మలింత నిస్సహాయంగా చూడలేను అంకుల్ .. అందరికీ కొండంత అండగా ఉండే మీరే ఇలా బలహీనపడిపోతే,  ఎలా చెప్పండి,” నాకళ్ళల్లోనూ నీరు తిరిగింది.

“మీరు త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాము... అందుగ్గాను  నేనేమి చేయగలనో చెప్పండి,” అని వేడుకున్నాను.. ఆంటీ అందించిన టిష్యూతో కళ్ళు తుడుచుకుని ఫక్కున నవ్వారు....”ఏం లేదు కళా,  నీకు మాపైనున్న అభిమానంలో ఒక్కవంతైన మా కన్నబిడ్డకి ఉంటే,  నన్నింత దెబ్బ తీసేదా?   నా పరువు ప్రతిష్టలని ఇలా పనిగట్టుకుని నాశనం చేసేదా? చెప్పు,” నవ్వుతూనే నా వంక సూటిగా చూసారు...

ఉబికివస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ తల దించుకోడం మినహా నా వద్ద జవాబు లేదు...

“ఛ, అలా తలదించుకోకమ్మా.  కన్నీళ్లు తుడుచుకో.  నీతో పార్క్ లో వాకింగ్ కి, ఐస్క్రీమ్ ట్రీట్ కి మేము సిద్దమే... కాని ముందు కాసేపు మన గార్డెన్-హౌజ్ లో కూర్చుని,  టీ తాగుతూ  నీతో కొన్ని విషయాలు మాట్లాడి, నేను తేలిక పడ్డాక వెళదాము,” అంటూ పైకి లేచారు...

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్