Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

సాధారణంగా కొంతమందికి, తమ  వస్తువులని కానీ, విషయాలనికానీ, ఇంకోరితో పంచుకోవడం ఇష్టం ఉండదు. ఇప్పుడంటే ప్రతీదీ బజారులో దొరుకుతోంది, అవసరాన్ని బట్టి కొనుక్కునే స్థోమత కూడా, పెరగడంతో, మరీ ఇతరుల వస్తువులు ఎరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు అంతగా ఉండడంలేదు ఈ రోజుల్లో. కానీ ఇదివరకటి రోజుల్లో, ఇద్దరిమధ్యా  ఉండే సంబంధాలనుబట్టి, ఏదో ఒకటి “ అప్పు” గానో, తిరిగిచ్చేసే పధ్ధతిలోనో, ఇచ్చిపుచ్చుకోడాలు ఉండేవి.ఓ గ్లాసుడు పాల దగ్గరనుండి, పెళ్ళి చూపులకొస్తున్నారని, నగల దాకా  ఒకరి దగ్గర నుండి ఇంకోరు తీసికునేవారు. సరుకు ఏదనే పనే లేదు. మనకి అవసరం, పక్కవాడి దగ్గర ఉందీ, ఇవ్వక ఛస్తాడా అని.. ఏ  దూరప్రయాణాలకెళ్ళే టైములోనో, అవసరార్ధం ఓ హోల్డాలో, సూట్ కేసో తప్పనిసరిగా అడిగేవారు. నిచ్చెన్లూ, బూజుదులుపుకునే కర్రలూ అయితే సరేసరి.. కొంతమందైతే చిత్రంగా, పట్టు చీరలు కూడా అడిగేవారు.  పిల్లలకి  స్కూల్లో ఏ సాంస్కృతిక కార్యక్రమమో ఉందంటే చాలు, మన పిల్లలకి, ఏ  పుట్టినరోజుకో కుట్టించిన బట్టలు బలైపోయేవి. అదృష్టం బాగుండి, ఈరోజుల్లో ఏ వస్తువు కావాల్సినా “ అద్దె” కు కూడా దొరుకుతున్నాయి. అయినా ఈరోజుల్లో, అవసరాన్ని బట్టి, ఏ వస్తువైనా కొనే స్థితిలోనే ఉన్నారనుకోండి.



ఇదివరకటి రోజుల్లో, అడగడానికి కూడా మొహమ్మాటపడేవారు కాదు.  ఎంతవిలువైనదైనా సరే, నిస్సిగ్గుగా అడిగేసేవారు. ఓ కెమేరా ఉందనుకోండి, ఎంత స్నేహమైనా, మరీ ఇంకోరికి వాడుకోడానికి ఇవ్వలేముగా. అయినా సరే అడిగేవాడు అడుగుతూనే ఉండేవారు.. అలాగే వాహనాలు.. ఓసారి అలా బజారుదాకా వెళ్ళొస్తాను, నీ  సైకిలోసారి ఇస్తావేమిటీ లోంచి, నీ స్కూటరు/బైక్కు లోకి దిగేది.. కొంతమంది మొహమ్మాటం లేకుండా చెప్పేసేవారు, “ నా సరుకు ఇంకోరికి ఇవ్వడం ఇష్టముండదూ..” అని. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మంచిదని. అలాటివారిగురించి, ఆ  ఎరువు అడిగినవాడు, యాగీచేసేవాడనుకోండి, అది వేరే విషయం.

కొంతమందుంటారు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, లేని చనువుతీసికుని, ప్రతీ వస్తువూ కెలుకుతూంటారు. ఆ ఇంటివారికి ఈ పెద్దమనిషి ఉన్నంతసేపూ, ముళ్ళమీద కూర్చున్నట్టుగా ఉంటుంది.  ఏదో తమ ఇల్లే అనుకున్నట్టు, వెళ్ళిన ఇంటి బెడ్ మీదకూడా పడుక్కుంటారు. పడుక్కోవచ్చు, దానికీ ఓ పధ్ధతి ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ పడుక్కుంటే, అసహ్యంగా ఉంటుందని  వీళ్ళకి ఛస్తే తట్టదు. కొంతమందికి, ఆ ఇంట్లో ఉన్న ఫ్రిజ్ తెరుచి, అక్కడున్నవి తీయడం ఓ దరిద్రపు అలవాటు.  తల్లితండ్రులు వారి పిల్లలకీ, పిల్లలు వారి తల్లితండ్రులకీ, ఎవరి స్పేస్ వారికి ఉంచి, వారి ప్రైవసీని అతిక్రమించకుండా చూసుకునే  రోజుల్లో, బయటివారు, ఎంత స్నేహితుడైనా, ఇలా ప్రతీదాంట్లోనూ వేలెడుతూంటే చూడ్డానికి రోత పుడుతుంది. ఇంక టీవీల విషయానికొస్తే, ఎవరైనా వచ్చినప్పుడు, వెంటనే టివీ ఆపేయడం ఉత్తమం.. పోనీ ఆపేశారని, ఆ వచ్చినవాడు కూర్చుంటాడా, అబ్బే.. రిమోట్ తీసికుని ఎడాపెడా కెలుకుతాడు.

 ఈ రోజుల్లో, ప్రతీవారిదగ్గరా మొబైల్ ఫోన్లూ, ఇంటర్ నెట్లూనూ.  బ్రాడ్బ్యాండు లేని ఇల్లు లేదంటే ఆశ్చర్యం లేదు.  అదుంటే, వైఫై ఉంటుందేకదా. మళ్ళీ దానికో పాస్ వర్డూ. ఇదివరకటిరోజుల్లో, ఎవరైనా అతిథులొస్తే, తాగడానికి ముందుగా మంచినీళ్ళిచ్చేవారు. కానీ, ఈరోజుల్లో అవసరాలు మారేయి. కొంతమంది, వైఫై ఉందాండీ, పాస్ వర్డ్ చెప్తారా అని అడగడం ఓ ఆనవాయితీగా మారిపోయింది. దానితో, ఈ ఇంటివారుకూడా, మంచినీళ్ళమాట దేవుడెరుగు, ముందర ఆ పాస్ వర్డ్ చెప్పేస్తే స్థిమితంగా కూర్చుంటారనే పరిస్థితికి వచ్చింది. ఎలాగూ, ఆ ఇంట్లో ఉన్నంతసేపేకదా ఉపయోగించేదీ,, అయినా సరే, ఆ మాయదారి పాస్ వర్డ్ వచ్చినవారికి చెప్తే, తమ సొమ్మేదో పోయినంతగా బాధపడిపోతారు కొంతమందైతే…  లేదండీ.. మా అబ్బాయి పెట్టించాడూ, ఎవరికీ చెప్పొదన్నాడూ, అని తప్పించుకుంటూంటారు.. వాళ్ళ అస్థేదో దోచుకుపోయినంతగా బిల్డప్పు ఇస్తారు..

ఇంకోరకం ఉంటారు… వాళ్ళు  తాము పేపర్లో చదివిన వార్త.. ఉదాహరణకి ఆరోజు నీళ్ళు రావని , లేదా పిల్లలకి స్కాలర్ షిప్పు పరీక్షలున్నాయనీ లాటి వార్తలు ఛస్తే ఇంకోరికి చెప్పరు. వాళ్ళు బాగుపడిపోతే.. అమ్మో…అయినా ఇంకొరికి తెలిసిన వార్తలు తెలిసికోడానికి మాత్రం నానా యాతనా పడ్డం మానడు.

కొంతమందైతే, తమకు తెలిసిన విషయాలని మరొకరితో పంచుకోపోతే అసలు నిద్రే పట్టదు. ఒక్కొక్కప్పుడైతే, ఇంకోరితో చెప్పినప్పుడు, “ ఓహో..అదా.. మాకు తెలుసులెండి..” అన్నప్పుడు మాత్రం, కొద్దిగా నిరుత్సాహపడతాడు.. అయినా పంచుకోవడం మాత్రం మానడు.

అంతే కదండీ, ఏదైనా సరే మరొకరితో పంచుకోవడంలో ఉండే ఆనందం, సంతోషం ఎలస ఉంటుందో అందరికీ తెలియదుగా…

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
vastu vastavalu