Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Under Eye Circles | కంటి కింద వలయాలు | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

తిరుప్పావై - వనం వెంకట వరప్రసాద రావు

tiruppaavai

11.
కత్తు క్కఱవై క్కణం గళ్ పలకఱన్దు 
శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం 
కుత్త మొన్ఱిల్లాద కోవలర్ దమ్ పొఱ్కొడియే 
పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్ 
శుత్తత్తు తోళిమారెల్లారుం వందు; నిన్ 
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ 
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ 
ఎత్తు క్కుఱఙ్గుమ్ పొరుళే లోరెమ్బావాయ్

లేగదూడలను కలిగినవి, దూడలవలె ఉన్నవి ఐన ఆవుల మందలను ఎన్నింటినో  పాలు పితుక గలవారు, శత్రువులను ఎదిరించి యుద్ధము చేయగలిగిన బలవంతులు, ఏ విధమైన దోషములూ లేని వారునూ అగు గోపాలుర వంశములో మొలిచిన ఓ బంగారు తీగా! పుట్టలోని పాముపడగవలెనున్న పిరుదులు కలిగినదానా! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశముతో కళకళలాడుతున్న దానా! రమ్ము! చుట్టములు, చెలికత్తెలు మొదలైన వారందరూ వచ్చినారు. నీ ముంగిట చేరినారు. నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్ననూ నీవు ఉలకక, పలుకక ఉన్నావేమిటి? ఓ సంపన్నురాలా! నీ నిద్రకు అర్థమేమిటో తెలుపుము.

దూడలుగల గోవుల వెను
కాడక వేలను పిదికెడి ఘనులును రణమున్
వీడక రిపులను గెలిచెడి
వేడుక గల యదుకులమున వెలసిన వెలదీ!   

పుట్టలవలె పిరుదులమర 
చుట్టలుగొను సర్పమొ యన సుందర వేణిన్
నట్టడివిన పురివిప్పిన
నట్టువ నెమలివి నటనల నడకల సొబగుల్

సిరిగల ఇంటికి సిరియౌ
తరుణీ వేగముగ రమ్ము తగదిక తడయన్
సరివారలు బంధువులె
ల్లరు వాకిట జేరినారు లలనా పాడన్

అభినవ జలధర శ్యాముని
శుభనామములెలమి పాడుచుండగ వినకన్
నభములకెగసెడి నాదము
నిభగమనా! కదలమికగు నిందే వ్యవధల్?     

12.

కనైత్తిళఙ్గత్తెరుమై కన్ఱుక్కిరఙ్గి,
నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర 
ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తఙ్గాయ్
పనిత్తలైవీళ నిన్ వాశల్ కడై పత్తి 
చ్చినత్తినాల్ తెన్నిలఙ్గై క్కోమానై చ్చెత్త 
మనత్తుక్కినియానై పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్తానెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్ 
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్

పాలుపితుకువారు లేక, ఆవులు లేగదూడలను తలచుకుని, ఆ దూడలే వచ్చి తమ పొదుగులలో తలలు దూర్చినట్లు తలచి, పొదుగులనుండి పాలు కారిపోయి, వాకిలి అంతయూ బురదమయమగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా! మంచు తలపై పడుచుండగా నీ వాకిట నిలిచియుంటిమి. నీ యింటి ద్వారపు పైకమ్మీ పట్టుకుని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణదిక్కున ఉన్న లంకకు అధిపతి ఐన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీ రాముని గానము చేయుచుంటిమి. అది విని ఐననూ నీ నోరు తెరువవా? ఇంకనైననూ మమ్మేలుకొనవా? ఏమి ఈ గాఢ నిద్ర? ఊరివారందరకూ నీ విషయము తెలిసిపోయినది. మేల్కొనవమ్మా! దూడలు గల గేదెలరచి

దూడలకై జాలిగొనుచు దుగ్ధపు ధారల్
వీడక గురియుచునుండగ
దూడలు పొదుగులను తలలు దూర్చిన భ్రమలన్ 
వాకిలి నా పాలజలధు
లాకరణిని గురియ బురదలౌ సిరి గల యో
సోకుల అన్నకు చెల్లెల
వేకువ మంచుల తడియుచు వేచితిమమ్మా!
వాకిటి పై కమ్మిని గొని
నీకొరకై వేచినాము నీరజ నేత్రీ!
భీకరముగ కోపముగొని
యా కడలిని దాటి కెరలి యా ఖలు నసురున్ 

దక్షిణ దిక్కున లంకకు
రాక్షసులకు నాథుడైన రావణు నీచున్
శిక్షణగొని రక్షించిన
అక్షయ సుగుణముల పేటి హరియవతారున్

మనసున కానందము నిడు
ఘనుడగు కోదండరాము ఘన శుభ నామున్
మనవారలు పాడెడి సడి
వినబడదటె? మౌనమునిక వీడుము లలనా! 
వీడవ పెనునిదురల నిక  
గూడవ మనవార లలన కుందరదన ఈ
వాడల గల వారలు నీ
వీడని నిదురల తెలిసిరి విడ్డూరములన్ 

13.

పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్ 
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్బుక్కార్ 
వెళ్లియెళున్దువియాళముఱఙ్గిత్తు,
పుళ్ళుమ్ శిలుమ్బిన గాణ్ పొదరి క్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్,
కళ్ళమ్ తవిర్ న్డు కలన్దేలో రెమ్బావాయ్. 

మాయపక్షిగా వచ్చిన బకాసురుని నోటిని చీల్చి తనను తాను కాపాడుకుని మనను కాపాడిన శ్రీకృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పదితలలను లీలగా చివుళ్ళను తుంచినట్లు తుంచిన శ్రీరాముని గానము చేయుచూ పోయి మన తోటి పిల్లలందరునూ వ్రత క్షేత్రమును చేరినారు. తుమ్మెదలను లోపల ఉంచుకున్న తామరపూవులవంటి కన్నులున్నదానా! లేడివంటి చూపులుగలదానా! శుక్రుడు ఉదయించుచున్నాడు. గురుడు అస్తమించుచున్నాడు. పక్షులు కూయుచున్నవి. శ్రీకృష్ణుని విరహతాపము తీరునట్లు చల్లగా చల్లబడునట్లు స్నానము చేయక పాన్పుపై పడుకుని ఉండుట ఎలా? 

ఓ సుకుమార స్వభావురాలా! ఈ శుభదినమున నీవు కపటమును వీడి మాతో కలసి 
ఆనందమును అనుభవింపుము.  

నటనల బకమును చీల్చియు  
కుటిలుని పది తలలు గిల్లి కూల్చియు ధరణిన్
అటమటముల తొలగించిన
ఘటికుని స్మరణలు భజనలు గానము గొనుచున్  

తానములాడగ రేవుకు
మానిని మనవారు జనిరి మగ తేఁటులకున్
పూనిక నెలవై దనరెడు   
తేనెలకమలముల కనుల దెరువగ దగునే  

మృగనయనా! నభమున అసు
రగురు డుదయ ప్రభల గొనెను రమణీ! యదె దే
వగురుడు ప్రభలడగ మరలె 
ఖగముల సడులెగసె దిసలఁ కాంతులు మొలచెన్  

చల్లగ నుల్లము చల్లగ 
ఝల్లన తానములనాడ జాణలు విరహం
బెల్లయు చెల్లుట దెల్లము 
నల్లనిమేఘపు జలముల నందుట నగుటన్ 

కావున నో మానవతీ!
నీవును నీ కపటములగు నిదురలు విడువం
గావలయును, శుభదినమిది, 
రావలయును, సఖులగూడఁ రస స్నానములన్!  

14.
ఉఙ్గళ్ పుళైక్కడైత్తోట్టత్తు వావియుళ్ 
శెఙ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు ఆమ్బల్ వాయ్ కూమ్బినకాణ్ 
శెఙ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్ 
తఙ్గళ్ తిరుక్కోయిల్ శఙ్గిడువాన్ పోగిన్ఱార్ 
ఎఙ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్ 
నఙ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
శఙ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్ 
పఙ్గయక్కణ్ణానై ప్పాడెలో రెమ్బావాయ్   

ఓ పరిపూర్ణురాలా! నీ పెరటి తోటలోని దిగుడుబావిలోని ఎఱ్ఱని తామరలు వికసించాయి. 
నల్లకలువలు ముకుళించుకుంటున్నాయి. మేల్కొనవమ్మా! ఎఱ్ఱని కాషాయములను 
ధరించిన, తెల్లని పలువరస కలిగిన సన్యాసులు తమతమ ఆలయములలో ఆరాధన 
చేయుటకు వెళ్ళుచున్నారు, లెమ్ము! ముందుగనే  మేల్కొని వచ్చి మమ్ములను 
లేపెదనని వాగ్దానము చేసి మరిచిపోయినావా? ఓ లజ్జా విహీనురాలా! లెమ్ము! ఓ 
మాటకారీ! శంఖచక్రములను ధరించినవాడు, ఆజానుబాహుడు ఐన పుండరీకాక్షుని 
మహిమను గానము చేయుటకు లేచి రమ్ము!

నీ పెరడున వనమున గల
వాపినరుణ తామర లతివా విరిసిన తా
మోపక తా మసిత కలువ
లాపగిదిన ముడుచుకొనుట లట వేకువనన్ 

యోషా! లేవవె కనవే
కాషాయపు వల్కలములు గల యతి గణముల్
ఓషధులకు పతి యోటమిఁ   
దూషితుడగునటుల దంత తుందిల ప్రభలన్  

తమ దేవళములకును పయ
నముగొనుటలు గొలువనెంచి నారాయణునిన్
మము లేపుట కరుదెంతువ
ని మనంబున నమ్మినాము నీ వచనంబుల్ 
 
మరచితివే మానరహిత! 
వెరువకుడీ లేపెద మిము వేకువననుచున్
కురిసిన వాగ్దానములను
పొరబడియును పిదప తెలివి పొందితిమమ్మా!

మాటలు నేర్చిన దానవు
మేటి సుదర్శనధరు నిక  మేలగు శంఖిన్
మేటి పొడవు బాహుల నే
నాటికి పాడెదమిక మదనాగమ రావే!

15.
ఎల్లే ఇళఙ్గిళియే ఇన్నముఱఙ్గుదియో 
శిల్లెన్ఱళై యేన్మిన్ నఙ్గైమీర్ పోదరుగిన్ఱేన్ 
వల్లై యున్ కట్టురైకళ్ పణ్డేయున్ వాయఱితుమ్
వల్లీర్ కళ్ నీఙ్గళే; నానేదానాయిడుగ
ఒల్లై నీపోదాయ్ ఉనక్కెన్న వేరుడైమై 
ఎల్లారుమ్ పోన్దారో పోన్దార్ పోన్దెణ్ణిక్కొళ్ 
వల్లానైకొన్ఱానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై, మాయనై ప్పాడేలో రెమ్బావాయ్   

‘ఓ లేత చిలుకవంటి కంఠమాధుర్యము గలదానా! అయ్యో! యిదేమిటి? ఇంకనూ 
నిదురించుచున్నావా?’ ... 
‘పరిపూర్ణులగు గోపికలారా! చిరాకు కలుగునట్లు ఖంగున పిలువకండి. యిదిగో! 
వస్తున్నాను’..
‘నీవు చాలా మాటనేర్పరివి. నీ మాటలలోని మాధుర్యము, కాఠిన్యము మాకు ముందే 
తెలుసును!’..
‘మీరే నేర్పరులు, నేనే కఠినురాలను, పోనిండు!’...
‘నీ ప్రత్యేకత ఏమిటి? అలా ఏకాంతముగా ఉండెదవెందుకు? వేగముగా బయటకు 
రావమ్మా!’...
‘గోపికలు అందరూ వచ్చినారా?’...
‘వచ్చినారు! నీవు వచ్చి లెఖ్ఖించుకొనుము!’...
‘సరే! నేను వచ్చి ఏమి చేయవలెను?’...
‘కువలయాపీడము అనే బలిష్ఠమైన ఏనుగును చంపినవాడు, శత్రువుల దర్పమును 
అణిచివేసినవాడు, మాయావియు ఐన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయవలెను, రమ్ము!’...
   
‘శుకశాబమ! నిదుర విడుము!’
‘యిక మీరలె సుగుణవతులు యిదె వచ్చెదనే!
ఒకతీరున ఖంగున అరు
వకుడీ! ఒక నిముషమైన వదరక నిలుడీ!’

‘నీ గడసరిదనము దెలిసె
నాగుము, నెరజాణ! పలుకు నటనలు కులుకుల్
బాగుగ నేర్చిన దానవు!
జాగును సేయకు వెడలుము, జగడము లేలా?’

‘నేనటె గడుసును? మీరే
మైనను తక్కువలటె? క్షణమైనను యుగమే?
ఔననుకొందుము, సరి! సరి !
మౌనము సుగుణము, కలహము మానుట మేలౌ!’ 

‘సరి, సరి, పద, పద! వడిగా’
‘సరి! మరి కూరిమి సఖియలు చనుదెంచితిరో?’
‘సరి! గణ’నము గొనుము, శుభము
లరయగ ప్రత్యేకత లిటు లతివరొ ఎటులౌ?

మదగజ సూదనుని ఘనుని
కదనములను రిపులనడచు కడు భుజబలునిన్
ముదమున పొగడగ వెడలిరి 
సుదతీ! మనవారు, వెడల శుభమగు మనకున్! 

16.
నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ 
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ 
వాశల్ కాప్పానే! మణిక్కదవం తాళ్ తిఱవాయ్,
ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱై పఱై 
మాయన్ మణివణ్ణన్ నేననలే వాయ్ నేర్ న్దాన్;
తూయోమాయ్ వన్దోమ్ తుయలెళ పాడువాన్,
వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ 
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్

‘అందరికీ నాయకుడైన నందగోపుని భవన రక్షకుడా! లోనకు పోనిమ్ము! జెండాలతో, 
తోరణములతో ప్రకాశిస్తున్న ద్వారమును కాపాడు ద్వారపాలకుడా! మణులు పొదగబడిన
సుందరములైన తలుపులను తెరువుము!  మాయావియు, మణివర్ణుడును అగు  శ్రీకృష్ణ 
పరమాత్మ ధ్వని చేయు ‘పర’అను వాద్యమును యిచ్చెదనని నిన్ననే గోపబాలికలము ఐన
మాకు వాగ్దానము చేసినాడు. మేము వేరే ప్రయోజనమును ఆశించి వచ్చినవారము కాము. 
పరిశుద్ధభావముతో, శ్రీకృష్ణుని మేల్కొలుపుటకు, గానము చేయుటకు వచ్చితిమి. స్వామీ! 
ముందుగ నీవే ‘కాదు’ అనకుము. దగ్గరగా, ఒకదానిని ఒకటి ప్రేమతో చేరి బిగిసిన 
తలుపులను నీవే తెరిచి మమ్ములను లోనకు పంపవలయును.

ఏలికయగు మా నందుని
మేలి భవన రక్షకభట! మేలగునయ్యా,
తాలిమిఘన ధ్వజములు చిరు
గాలికి కదలాడు ద్వార ఘనరక్షకుడా !

గుణవంతుడ! దయ గనుగొని
మణిమయములు తలుపులనిక మాకై తీయన్
ఋణపడి యుండెదమన్నా!
క్షణమైనను తాళలేము క్షణమొక యుగమౌ!

నిన్ననె వెన్నుడు గోకుల
కన్నెలమగు మాకు ‘పర’ను గంభీర ధ్వనుల్
మిన్నులకెగసెడు దానిని
సన్నుతులకు మురిసి యిత్తు సందియమేలా  

యనుటల నిట కొచ్చితిమిక
పనుపుమయా లోనకు మము పరిశుద్ధులమౌ
వనితల మా గానములను
తన ఘనమగు నిదురలనిక తలఁగగ జేయన్    

మునుముందుగ నీవే కా
దనుటలు లేదనుటలు దగదయ్యా దృఢమౌ
పెను తలుపులు తెరిచి దయను
గనుమిక మము లోనికి జన కరుణింప నగున్

17.
అమ్బరమే; తణ్ణీరే; శోరే; అఱమ్ శెయ్యుమ్ 
ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళున్దిరాయ్;
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివుఱాయ్;
అమ్బర మూడఱుత్తోంఙ్గి యులగళన్ద 
ఉమ్బర్ కోమానే! ఉఱఙ్గాదె ళున్దిరాయ్!
శెమ్పొఱ్కళ లడిచ్చెల్వా! బలదేవా!
ఉమ్బియుమ్ నీయు ముఱఙ్గేలో రెమ్బావాయ్  

వస్త్రములను, మంచినీటిని, అన్నమును దానము చేయు నందగోపాలా! మా స్వామీ! 
మేలుకొనుము! ప్రబ్బలి చెట్లవంటి సుకుమార శరీరులైన స్త్రీలలో లేత చిగురువంటి దానా!
మా వంశమునకు మంగళదీపమువంటిదానా! మా దొరసానీ! యశోదా! మేలుకొనుము! 
ఆకాశమధ్యమును చీల్చుకుని పెరిగి, లోకములన్నిటినీ కొలిచిన త్రివిక్రమా! ద్వాదశ
నిత్యసూరులకు నాయకుడా! నిదుర వలదు! మేలుకొనుము! కాలికి స్వచ్ఛమైన, కాల్చిన 
బంగరు కడియమును ధరించిన బలరామా! నీవు, నీ తమ్ముడూ మేలుకొనవలెను! 

అంబరములు నీరును కడు
సంబరముగ అన్నములను సకలమునిడు ఓ
యంబరముల కెదిగిన ఘన!
యంబరమణి యరుగు దెంచె యామిని బారెన్!

ఖిలమఖిలము కలువల కళ
నలువను గన్నయ్య నయన నళినదళంబుల్
చెలువముగొని విరియవలయు
కలరవములు చెలగె దిసల కాంతులు వెలిగెన్!

చిరుబోడీ! మాకులమున
సిరి మంగళ దీపకళిక! చిలుకల కొలికీ!
అరుణకిరణములు మొలచెను
తరుణముగద మేలుకొనవె తరుణి యశోదా!

ఆకసమును చీల్చి పెరిగి
లోకములను కొలిచిన సిరి లోలుప కృష్ణా!
చీకటులిక తొలగెను గద
నీ కపటపు నిదుర విడుము నిఖిలశరణ్యా!

ద్వాదశ సూరుల కేలిక!
నీదయ గలుగుటనుగాదె నిఖిలము కలుగున్
పాదములను బడయవలయు 
వేదవనవిహారి హారి వేగమె లెమ్మా!

యాదవ కులభూషణుడవు,   
ఆదివి, బలరామ! శరణు, ఆగమనుత! భా
నూదయమయె మేలుకొనుము! 
పాదపు బంగరు కడియము భాస్కరు గెలువన్

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
sahiteevanam