Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 25th december to 31st december

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

           

 

              అప్పర్ పెనిన్సిలా-2 


మెకినా సిటీకి చేరి, ఫ్రెష్ అప్ అయ్యాక ఊరు చూడటానికి బయల్దేరామని చెప్పాను కదా.  అక్కడనుంచి లేక్ సైడ్, మెకినో బ్రిడ్జ్ పూర్తిగా చూడవచ్చు.  చాలా చలిగా వున్నది.  వణుక్కుంటూనే అక్కడ ఫోటోలు తీసుకుని మిగతా ఊరంతా కారులోనే తిరిగాము.  ఊరు చాలా చిన్నది.  ఒక చిన్న మ్యూజియం వున్నది, మెకినా బ్రిడ్జి గురించి.  అది చూశాము.

తర్వాత పాప్ కార్న్ ఫేక్టరీ అనే షాప్ కి వెళ్ళాము.  ఈ మధ్య మన దగ్గరా పాప్ కార్న్ లో కొన్ని వెరైటీస్ చూస్తున్నాంగానీ, అప్పుడు పాప్ కార్న్ లో ఒకే వెరైటీ తెలుసు మాకు.  అందుకనే అదో వింత.  అక్కడ 42 రకాల పాప్ కార్న్ ..  ప్రూట్స్ వెరైటీ కూడా.  కొన్ని టేస్టు చూసి కొన్ని కొన్నాము.  సరదాగా ఫోటోలు కూడా తీసుకున్నాము.

తర్వాత ఇటాలియన్ రెస్టారెంట్ నానో లో,  ఆ రెస్టారెంటు లోపల చాలా బాగుంది.  ఫోటోలు చూడండి.  ఫుడ్ కూడా బాగానే వున్నది.  అక్కడనుంచి వచ్చి ఇంక ఆ రోజుకు రెస్టు తీసుకున్నాము.

మర్నాడు ఉదయం అందరం తెమిలేసరికి 8 గం.లయింది.  హోటల్ లో కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ వున్నది.  అక్కడికెళ్ళాము.  కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్.  బ్రెడ్, సిరియల్, డౌనట్స్ (షుగర్ పౌడర్ తో అద్ది ఒక రకం, ప్లైన్ ఒక రకం) వున్నాయి.  ఇంకో స్పెషల్ ఏమిటో తెలుసా  వేఫుల్స్.  ఆ రోజే చూశాను.  గోధుమ పిండిట.  పలచగా కలిపి డిస్పోజబుల్ గ్లాసుల్లో పోసి పెట్టారు.  పక్కనే దాన్ని కాల్చేది, టోస్టర్ లాంటిది వున్నది చూడటానికి పెనం మూసినట్లు వుంది..లోపల అంతా లోతు గళ్ళు గళ్ళు వున్నాయి).  మూత తీసి, కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి, దానిమీద గ్లాసులో వున్న పిండి పోసిమూత పెట్టాలి.  వేఫుల్ రెండు నిముషాల్లో రెడీ.  అక్కడే షుగర్ సిరప్ వున్నది.  అది వేఫుల్ మీద వేసుకుని తింటే బాగున్నది.  నిధి మొదటిది వేస్తే, చూసి నేను రెండోది వేశాను.  బాగా వచ్చింది.

10 గం. లకి బయల్దేరి ఫెర్ర్రీ పాయింట్ కి వెళ్ళాము.  అక్కడనుండి మెకినా ఐలెండ్ ఫెర్రీలో (3 అంతస్తులు) వెళ్ళి రావటానికి మనిషికి 25 $ టికెట్.  10-30 కి బయల్దేరే ఫెర్రీలో ఐలెండ్ కి వెళ్ళాము.  ఫెర్రీ దిగిన చోటునుంచే కేరేజస్ వున్నాయి.  వాటిని రెండు గుఱ్ఱాలు లాగుతున్నాయి.  వాటిని ఎక్కువగా లేడీసే నడుపుతున్నారు.  మనిషికి 23 $ టికెట్ తీసుకుంటే 2 గం. లు ఐలెండ్ లో తిప్పారు.  మేము కొందరం ఒక కేరేజ్ లో వెళ్ళాము.  పిల్లలు సైకిల్స్ తీసుకుని తిరగగలిగినంత ప్రదేశం తిరిగారు.  ఈ పధ్ధతి నాకు చాలా నచ్చింది.  అక్కడే సైకిళ్ళు అద్దెకిస్తారు.  అక్కడివారికి సాధారణంగా సైకిల్ వచ్చే వుంటుంది.  అలాంటివారంతా చక్కగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ, సైకిల్ మీద తిరగచ్చు.  అప్పుడే డిసైడ్ చేసేసుకున్నా...ఈ మారు అమెరికా వచ్చేలోపల సైక్లింగ్ నేర్చుకుని రావాలని .. ఏం చేద్దాం!!...ఇప్పటిదాకా  ఆ డెసిషన్ క్షేమంగా అలాగే వున్నది!!!

సరే టాంగాలో తిరిగామన్నానుకదా.  టాంగా నడుపుతున్న అమ్మాయే అక్కడి విశేషాలని చెప్పింది.  టాంగాలు నడుపుతున్న అమ్మాయిలంతా చాలా అందంగా, హుందాగా, చక్కని ఫ్లూయన్సీతో ఇంగ్లీషు మాట్లాడుతున్నారు.  (మనకి పరాయిభాష, కష్టపడి నేర్చుకోవాలిగానీ, వాళ్ళకి కాదుగా). 

టాంగా ట్రిప్ లో ముందు బటర్ ఫ్లై మ్యూజియం దగ్గర ఆగాము.  ఆ మ్యూజియంలో 400 రకాల బటర్ ఫ్లైస్ వున్నాయన్నారు.  పెద్ద హాలులో కొన్ని చెట్లు, వాటిమీద స్వేఛ్ఛగా తిరుగుతున్న బటర్ ఫ్లైస్.  ఆ మ్యూజియం నాకంత ఆకర్షణీయంగా కనిపించలేదు.  పైగా అక్కడికెళ్ళేసరికి నా కెమేరా ఫుల్ అయిపోయింది.  ఫోటోలు కూడా ఎక్కువ తియ్యలేకపోయాను. 

బయటకొచ్చాక వేరే కేరేజ్.  3 గుఱ్ఱాలది, ఇంకా పెద్దది.  అలాంటివి అమెరికాలోనో, ప్రపంచంలోనో 13 కేరేజ్ లు మాత్రమే వున్నాయిట.  అందులో 12 ఆ ఐలెండ్ లోనే వున్నాయిట.  దోవలో గవర్నర్ బంగళా కేరేజ్ లోంచే చూపించి, శిలా తోరణం దగ్గర 10 ని. లు ఆపారు. 

టాంగా రైడ్ అయిపోయాక ఒక మెక్సికన్ రెస్టారెంట్, ముర్రే హోటల్ లో లంచ్.  టోకో సలాడ్ (వెజిటబుల్ సలాడ్, చిప్స్), క్వెసిడిల్లా (చపాతీలో చీజ్) తిన్నాము.  బాగున్నాయి.  అవే ఇక్కడ తినమంటే, సవాలక్ష వంకలు పెడతాంగానీ, వేరే దేశం పేరు, అందంగా అలంకరించే సరికి సుబ్బరంగా తిన్నాము.  మనలో మన మాట, రుచి కూడా బాగున్నదిలెండి.

అక్కడినుంచీ, 2. గం లకున్న ఫెర్రీలో తిరిగి వచ్చి, తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము.  రాత్రి 7 గం. లకు ఇంటికి చేరాము. ఈ ప్రయాణంలో అన్నీ ఎంజాయ్ చేశాము.  సూ లాక్స్, పెద్ద పెద్ద షిప్స్, బోట్ షైరు, టాంగా రైడ్, కొత్త రకాల ఆహారం, ఆబ్బో...ఎన్నో.

వచ్చేవారం నయాగరా ఫాల్స్ చూపిస్తా మీ అందరికీ.

మరిన్ని శీర్షికలు
cartoon exhibition