Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

కొత్త ద‌ర్శ‌కుల‌తో రిస్కే... కానీ వాళ్లే బెట‌ర్‌  - సుధీర్‌బాబు

హీరో ఇమేజ్ కంటే.. క‌థే గొప్ప‌ది
బ‌డ్జెట్  కంటే - క‌థే గొప్ప‌ది

ట్విస్టుల కంటే - క‌థే గొప్ప‌ది

ఈ నిజాన్ని గ్రహిస్తేనే మంచి సినిమాలొస్తాయి. సుధీర్ బాబు కూడా ఈ మాటే చెబుతున్నాడు. త‌న ప్ర‌యాణంలో క‌థ‌ని న‌మ్మి చేసిన సినిమాలే  అన్నీ అంటున్నాడు. అదీ నిజ‌మే. ఎస్‌.ఎమ్‌.ఎస్ నుంచి మోస‌గాళ్ల‌కు మోస‌గాడు వ‌ర‌కూ... సుధీర్ 'క‌థ‌' విష‌యంలో త‌ప్ప‌ట‌డుగు వేసింది త‌క్కువే. పైగా.. కాన్సెప్ట్ క‌థ‌ల‌కు ప్రాణం పోస్తున్నాడు సుధీర్‌. తాజాగా తాను న‌టించిన భ‌లే మంచి రోజు కూడా అలాంటిదే. ఈ చిత్రం - శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సుధీర్‌బాబుతో గో తెలుగు చేసిన ఇంట‌ర్వ్యూ

* హాయ్ సుధీర్‌..
- హాయ్‌

* సినిమా రిలీజ్ అవుతోంది.. టెన్ష‌న్ ఏమైనా ఉందా?
- సాధార‌ణంగా నా సినిమా రిలీజ్‌కి ముందు టెన్ష‌న్ ఉంటుంది. సినిమా ఎలా వచ్చిందా?  ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారా అనిపిస్తుంది. ప్రేమ‌క‌థా చిత్రమ్ రిలీజ్‌కి ముందు కూడా బాగా టెన్ష‌న్ ప‌డ్డాను.  అయితే  భ‌లే మంచి రోజు విష‌యంలో ఎలాంటి టెన్ష‌న్ లేదు. సినిమాపై అంత న‌మ్మ‌కం ఉంది. చాలా బాగా వ‌చ్చింది. ఖ‌చ్చితంగా ఈ సినిమా హిట్ట‌వుతుంద‌న్న కాన్ఫిడెన్స్ తో ఉన్నా.

* అంత న‌మ్మ‌కం ఏమిటి?
- క‌థ కొత్త‌గా ఉంది. ఏ స‌న్నివేశం కూడా మ‌నం ఊహించం. నేను కూడా క‌థ వింటున్నప్పుడు 'త‌రువాతి సీన్ ఇది' అనుకొంటుంటా. కానీ.. నా అంచ‌నాల‌కు భిన్నంగా శ్రీరామ్ క‌థ చెప్పాడు. అప్పుడే అనుకొన్నా ఈ సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని. షూటింగ్ కూడా చాలా బాగా జ‌రిగింది.. లొకేష‌న్లో ఈ సినిమాపై న‌మ్మ‌కం మ‌రింత బ‌ల‌ప‌డింది.

* ఇంత‌కీ క‌థేంటి?
- ఓ రోజు జ‌రిగే క‌థ ఇది. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయింత్రం 6 గంట‌ల‌లోపు ఓ యువ‌కుడికి ఎదురైన ప‌రిణామాలు?  వాటి వ‌ల్ల త‌న జీవితం ఎలా మారింది అన్న‌దే క‌థ‌. అందుకే ఆ టైటిల్ పెట్టాం.

* కొత్త ద‌ర్శ‌కుడు ఆదిత్య మీ న‌మ్మ‌కాన్ని నిలుపుకొన్నాడా?
- నూటికి నూరుపాళ్లు. చాలా టాలెంటెడ్ కుర్రాడు. అంత‌కు ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది చూసి ఆశ్చ‌ర్య‌పోయా. ద‌ర్శ‌కుడిగా అంత‌కు మించిన అనుభ‌వం లేదు. కానీ క‌థ చెప్పిన విధానం చూసి.. అవ‌కాశం ఇచ్చేశా.

* కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డం రిస్క్ అంటారు క‌దా?
- అవును రిస్కే. కానీ.. వాళ్ల ద‌గ్గ‌రే మంచి క‌థ‌లు దొరుకుతున్నాయి. కొత్త కొత్త కాన్సెప్టుల‌తో వ‌స్తున్నారు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవాళ్ల‌లో చాలామంది 25 యేళ్ల‌లోపువాళ్లే. వాళ్ల ఆలోచ‌న‌కు ఒక్కోసారి షాక్‌కి గురిచేస్తున్నాయి. వాళ్ల‌కో అవ‌కాశం ఇవ్వ‌డం త‌ప్పులేద‌నిపిస్తుంటుంది. క‌చ్చితంగా శ్రీ‌రామ్‌.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకొంటాడు. భ‌లే మంచి రోజు త‌ర‌వాత‌... అత‌ని రోజులు మొద‌ల‌వుతాయి.

* ఈ సినిమా మ‌హేష్ చూశారా?
- ఇంకా లేదు.. ప్ర‌భాస్‌కైతే కొన్ని స‌న్నివేశాలు చూపించాం. ఆయ‌న‌కు ఈ క‌థ ముందే తెలుసు.. మేం ఏం చేయ‌బోతున్నామో కూడా తెలుసు. కొన్ని విలువైన సూచ‌న‌లు కూడా ఇచ్చారు. అవ‌న్నీ ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. 

* ఈ సినిమాతో సుధీర్ స్టార్ అయిపోతాడ‌ని మ‌హేష్ చెప్పారు..
- అదంతా నాపై త‌న‌కున్న న‌మ్మ‌కం. ఒక్క హిట్టుతో స్టార్లు అయిపోరు.. వ‌రుస‌గా నాలుగైదు ప‌డాలి. మ‌హేష్‌లాంటోళ్లు పుట్టుక‌తోనే స్టార్స్‌. 
క‌థ‌ని న‌మ్మి జ‌ర్నీ చేస్తుంటాను. ఓ మంచి క‌థ దొరికితే... దానికి స్టార్లు అవ‌స‌రం లేదు. గొప్ప గొప్ప టెక్నీషియ‌న్లు లేక‌పోయినా.. అనుకొన్న‌ది అనుకొన్న‌ట్టు తీస్తే... సినిమా క‌చ్చితంగా ఆడుతుంద‌ని నా నమ్మ‌కం.

* ఓ సినిమా చేసేట‌ప్పుడు మీ మార్కెట్‌, గ‌త సినిమా వ‌సూళ్లు ప‌ట్టించుకొంటారా?
- త‌ప్ప‌కుండా.. ఎందుకంటే నిర్మాత సేఫ్‌గా ఉండ‌డం చాలా అవ‌స‌రం. ఈ సినిమా విష‌యానికొస్తే.. నిర్మాత‌లు నా క్లోజ్ ఫ్రెండ్స్‌. అయితే విచ్చ‌ల విడిగా ఖ‌ర్చు పెట్ట‌లేదు. కొంచెం చూసుకోని డ‌బ్బులు పెట్టండి అనేవాడ్ని. మొత్తానికి ఈ సినిమా అనుకొన్న బ‌డ్జెట్‌లోనే క్వాలిటీగా తీశాం.

* బాలీవుడ్‌లోనూ న‌టిస్తున్నారు క‌దా..
- అవును. అక్క‌డ భాగి అనే చిత్రం చేస్తున్నా. జాకీఫ్రాఫ్ త‌న‌యుడు టైగ‌ర్ ష్రాఫ్ క‌థానాయ‌కుడు.. నేను విల‌న్‌ని.

* తెలుగులో హీరోగా చేస్తూ..
- త‌ప్పేంటి?  బ‌ల‌మైన పాత్ర ప‌డిన‌ప్పుడు వ‌దులుకోకూడ‌దు. నిజానికి భాగిలో నా పాత్ర చాలా బాగుంటుంది. నేను హీరోగా చేసిన సినిమాల్లోనూ నా క్యారెక్ట‌ర్ అంత స్ట్రాంగ్‌గా లేదేమో. నా లుక్‌, బాడీ లాంగ్వేజ్ కొత్త‌గా చూపించిన సినిమా ఇది.

*  తెలుగులోనూ అలాంటి అవ‌కాశాలొస్తే చేస్తారా?
- త‌ప్ప‌కుండా.. కానీ నా ష‌ర‌తు ఒక్క‌టే క‌థ‌, అందులో నా పాత్ర బాగుండాలి. 

* మీ కెరీర్ విష‌యంలో మహేష్ ఏమైనా స‌ల‌హాలిస్తుంటారా?
- త‌న‌కు స‌ల‌హాలివ్వ‌డం న‌చ్చ‌దు. అయినా నా సినిమాల గురించి త‌న‌తో ప్ర‌స్తావిస్తుంటా. త‌న అభిప్రాయాల్ని చెబుతుంటాడు.

* కొత్త‌గా ఒప్పుకొన్న సినిమాలేంటి?
- నిజానికి ఏం లేవు.. కొన్ని క‌థ‌లు విన్నా. కానీ.. ఫైన‌ల్ చేయ‌లేదు. భ‌లే మంచి రోజు త‌ర‌వాతే.. ఆలోచిస్తా.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ...


- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
who is the charan